Site icon Sanchika

ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-13

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఆ[/dropcap]మె వస్తూంటే ఓ వెలుగు నడుస్తున్నట్లుంటుంది. చిన్నపిల్లలా సంతోష పడుతుంది. నాకు ఆమె మొహం తెలుసు, బాగా గుర్తు. ఇన్ని ఏళ్ళైనా ఆమె నాకు అలాగే కనిపిస్తుంది.

టీ తాగుతున్నప్పుడు, భోంచేస్తున్నప్పుడు, ఆమె నా పక్కనే ఉన్నట్లనిపిస్తుంది.

ఒక్కొక్కప్పుడు ఆమె మొహం, ఆ నవ్వు మగతగా ఉన్నప్పుడో, ఆ తోటలో ఉదయాలు నడుస్తున్నప్పుడో నా కళ్ళ ముందుకి వస్తూంటుంది. ఆమె చనిపోయినా నాకు జీవించి ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకుంటున్నాం. మనిద్దరికీ ఆమె తెలుసు. నలభై మూడేళ్ళ క్రితం ఆమె ఎలా ఉందో అంతే స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తూంటుంది.

ఏమీ అనుకోకు, నీకు అన్నీ వరసగా చెప్పలేక పోతున్నాను. ఎందుకంటే ఇవి ఎప్పుడో జరిగినవి కదా, సరిగ్గా అదే విధంగా, ఒకదాని వెనక మరొకటి చెప్పడం కష్టం.

ఆ రోజు సాయంత్రం నీకు గుర్తుందా, ఎప్పటి లాగానే ఆ రోజు కావేరి మనిద్దరి మధ్య కూచుంది. ఆ రోజు ఆఖరి సాయంత్రం. అదే ఆఖరు మీరిద్దరూ కలిసి భోంచేయడం, అలాగే మనం ముగ్గురం కలిసి భోంచేయడం కూడా.

ఆరోజున ఉదయం వేట మొదలుకొని మన మధ్య ఎన్నో జరిగి పోయాయి. నువ్వు వెళ్ళిపోయావు.

నీ ఇంట్లో కావేరిని చూసాను. ఇంటికొచ్చాను. ఆమెతో మాట్లాడలేదు. అడగాలనుకున్నవి నా పెదవుల మధ్య ఉండిపోయాయి.

కావేరిని అడిగి నన్ను నేను తక్కువ చేసుకోదలుచుకోలేదు. ఆమె తనంతట తానుగా చెప్పాలి. అంత వరకు నేను దీని గురించి మాట్లాడకూడదని అనుకున్నాను.

తరవాత నేను కావేరిని అడగలేదు. మాట్లాడుకోలేదు. అసలు ఆమెని చూడలేదు. ఆమె ఉన్న గదిలోకి వెళ్ళలేదు. నేను ఓ ఇంట్లో ఉన్నాను. అలా మేం విడి విడిగా ఎనిమిదేళ్ళున్నాం. నేను ఆమెని కలుసుకో లేదు. అంటే నేను ఆమెతో విడిగా ఉండడం మొదలు పెట్టాకా, ఆమె ఎనిమిదేళ్ళు బతికింది. తెలుసా ఈ ఎనిమిదేళ్ళూ మేమిద్దరం ఒకరినొకరం చూసుకోలేదు. మాట్లాడుకోలేదు.”

చాలా ప్రశాంతంగా అన్నాడు.

“నాకు దగ్గరైన వాళ్ళందరూ వెళ్లిపోయారు. ఒకరు చెప్పకుండా ఎప్పుడో వెళ్ళిపోయారు, మరొకరు ఈ లోకం విడిచి వెళ్ళి పోయారు. అది నేను చూడలేదు.

నీకు తెలుసు గదా, ఈ భవంతి పెద్ద పెద్ద చెట్ల మధ్య ఉంది, ఈ చెట్ల కింద మనం ఆటలు ఆడుకున్నాం. పాడుకున్నాం, చదువుకున్నాం, అది అప్పుడు. నీ సంగతి సరే, నేను నా చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూనే ఉన్నాను. ఇందులో చాలా విరిగి పోయాయి. గాలీవానకి కొన్ని పడిపోయాయి. కాని కొన్ని కొత్త చెట్లు కూడా వచ్చాయి. ఇదంతా నేను చూసాను. ఇది ప్రకృతి సహజం. మనుషులైనా, చెట్లైనా అంతే. పుట్టడం, పెరగడం, చావడం సహజం. కావేరి అయినా, నేనైనా అంతే. అందుకే అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. అన్నింటినీ అంగీకరించాను.

ఒకప్పుడు ఈ భవనంలో అమ్మా నాన్నగారు నేను సీతమ్మ ఉండేవారం. అమ్మ లేదు. నాన్న లేరు. అప్పుడు నువ్వూ, నేను, సీతమ్మా ఉన్నాం. మధ్యలో కావేరి వచ్చింది. ఆ తరవాత నేను సీతమ్మ ఇక్కడ ఈ భవనంలో, నువ్వు అక్కడెక్కడో దూరాన. కావేరి పైలోకంలో. గతంలోకి జారిపోయిన మనుష్యులు గతంలోకే మిగిలి పోతారు. మరో దారి ఉండదు. అవునా!” అని శివరామ్‌ని చూసాడు.

శివరామ్ ఏం అనలేదు. ఏదో ఆలోచనలో ఉన్నట్లుగా కనిపించాడు.

“ఈ భవనంలో నేను ఒక్కడిని. ఒంటరిగా కూచోడం, నా లోపల ఏం జరుగుతోందో ఆలోచించడం, గమనించడం, ఓ రకమైన అన్వేషణ. మెల్లిగా అర్థం అయింది. ఎవరో ఉన్నారని అనుకోడం అన్నది అర్థం లేని మాట. ఎంతో మంది మన చుట్టూ ఉన్నా చివరికి మిగిలేది మనమే. ఒంటరిగా ఉండిపోడమే. అసలు నేను అన్నది ఎంత అర్థం లేని మాటో మనిషికి అర్థం అవుతే జీవితాన్ని చూసే కోణంలో మార్పు వస్తుందేమో.” అని ఆగిపోయాడు.

బ్రహ్మాజీ చాలా సేపు మాట్లాడలేదు.

అతని నిశ్శబ్దం చూసి, శివరామ్ ఏదో అనబోయాడు.

“జరిగిన దాని గురించి చెప్పడానికి నువ్వు వస్తావని నీ కోసం ఎదురు చూసాను. అది నా వెర్రితనం కావచ్చు. అమాయకత్వం కావచ్చు. కాని ఆశ్చర్యం నువ్వు వచ్చావు, అప్పుడు కాదు, ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తరవాత. నలభై మూడేళ్ళ క్రితం ఏం జరిగిందో చెప్తావని అప్పుడు అనుకున్నాను. కాని ఇప్పుడు జవాబు కావాలి.”

బ్రహ్మాజీ ఆగాడు.

శివరామ్ రెప్పలార్ప కుండా చూస్తున్నాడు.

“ఇవి మన జీవితాలు, జరిగినవి మనకి సంబంధించినవి. ఇందులోంచి వచ్చినవి నా సందేహాలు. మన జీవితాలకి సంబంధించిన ప్రశ్నలు, వాటి జవాబులు మాత్రం నాకు దొరకలేదు. నా ప్రపంచం ముగిసి పోతుందేమో, ఏదీ తెలుసుకోకుండా జీవితం అయిపోతుందేమో, వెళ్ళిపోతానా అని అనిపించింది కాని ఇన్ని ఏళ్ళ తరవాత నువ్వు వచ్చావు,. ఇందు కోసమే నేను ఎదురు చూస్తున్నాను.

మనిద్దరం జీవితంలోని మలి దశలో ఉన్నాం, ఏ రోజునైనా ఏమైనా కావచ్చు. ఏ క్షణంలోనైనా మనిద్దరం పోవచ్చు. ఇటువంటి సమయంలో నేను నీ జవాబుల కోసం జీవితం అంతా ఎదురు చూడడం వెర్రితనం అనుకున్నాను. కాని వచ్చావు, సమాధానాలిస్తావని అనుకుంటున్నాను.

ఈ ఇల్లు, ఈ వాతావరణం, ఈ భోజనాలు ఈ మాటలు అన్నీ గతానికి సంబంధించినవి. ఇప్పుడు మన గతాన్ని వర్తమానం లోకి తీసుకురావాలి.

ఇప్పుడు, ఈ సమయంలోనే ఆనాటి మనంలా మారిపోవాలి, అంటే నలభై మూడేళ్ళ క్రితం లాగా ఉండాలని అన్న మాట. మనం మనలోకి తొంగి చూసుకోవాలి. ఏం కనిపిస్తుంది. శతృత్వం. అంతే.

ఇప్పుడు నువ్వు నేను, ఈ వయసులో, జీవితానికి చివరి మలుపులో ఉన్నాం. ఇప్పుడు మనకి ఈ పగలూ, శతృత్వాలు కావాలా! ఎవరి మీద ఇదంతా! మన మధ్య లేని వాళ్ళ జ్ఞాపకాల మీదనా! మళ్ళీ ప్రశ్నలు పుడుతున్నాయి. అయినా నా గుండెల్లో మంట చల్లారడం లేదు. అలాంటప్పుడు మనం ఇంకా మంచి ప్రపంచం కావాలని ఎందుకు అనుకోవాలి.

ఈ నలభైమూడేళ్ళల్లో నేను ఎన్నోసార్లు జబ్బు పడ్డాను. ఓసారి ఈ పక్క గోడ ఓ పెద్ద వర్షానికి కూలింది. నామీద పడలేదు. రెండు సార్లు కారు యాక్సిడెంట్ దెబ్బలు తగిలాయి. చావు తప్పింది. బతికి పోయాను. ఎందుకు బతికాను. ఎందుకంటే పగ తీర్చుకోడం కోసం బతికి ఉన్నాను. ఎలా అని నువ్వనుకోవచ్చు. ఏం ప్రతీకారం అని నువ్వనుకోవచ్చు. నువ్వు చేసిన దానికి. నా మాటలు నీకర్థం అయ్యాయి, అందుకే నీ మొహంలో ఎన్నో కనిపిస్తున్నాయి.

ఇంకా ఈ వయసులో ఈ ప్రతీకారం అది ఎందుకు అని నువ్వనుకోవచ్చు.

దానికి నా జవాబు సిద్ధంగా ఉంది. నేను జీవించి ఉన్నది దానికోసమే. ప్రతీకారం తీర్చుకోడం కోసమే.

ఓ సమయంలో నేను ఇవన్నీ ఎందుకు అనిపించింది, ఆ సమయంలో ప్రతీకారం గుర్తొచ్చింది. నేను నా మనసుని చంపుకోలేదు. అందుకు దేవుడికి కృతజ్ఞతలు.

నేను ఎలా ఊహించానో, ఎలా ఉండాలని అనుకున్నానో, అలాగే నా ప్రతీకారం, పగ తీర్చుకునే సమయం వచ్చింది. ఇప్పుడు నాకు జవాబు కావాలి. నువ్వు ఇవ్వాలి.”

ఆఖరి పదాలని చాలా మెల్లిగా అన్నాడు.

శివరాం కాస్త ముందుకి వంగాడు. ఆ పదాలు వినడానికి.

కొవ్వొత్తుల్లో వెలుగు బాగా తగ్గిపోయింది.

గడియారం ఐదు గంటలు కొట్టింది. ఉదయం గాలి తీవ్రంగా ఉండడంతో కొవ్వొత్తులు ఆరిపోయాయి.

గది ఒక్కసారి చీకటిగా అయింది.

“నువ్వన్నది నిజం. నేను జవాబునివ్వచ్చు. నీకు జవాబులు కావాలి. నేను ఇస్తాను. ఇన్ని ఏళ్ళల్లో ఎంతో ఆలోచించి, మదనపడి, నువ్వు ప్రశ్నలని తయారుచేసుకున్నావు. కాని నేను జవాబులకి తయారవక్కర్లేదు.” అని అన్నాడు శివరాం స్పష్టంగా.

ఆశ్చర్యంగా చూసాడు బ్రహ్మాజీ .

“ఇక్కడ రెండు ప్రశ్నలున్నాయి. వాటికి నువ్వు జవాబులు ఇవ్వాలి.” అతనికి వినపడేంత మెల్లిగా అన్నా అందులో ఆత్మవిశ్వాసం తొంగిచూస్తోంది.

“సరే అడుగు. జవాబులిస్తాను.” అన్నాడు శివరామ్.

“ఇవి నేను ఎన్నో ఏళ్ళ క్రితమే తయారు చేసుకున్నాను. నీకోసం ఎదురు చూస్తున్నాను. దానికి జవాబులు నువ్వే ఇవ్వగలవు. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా, నా ఆలోచన సరి అయినదేనా, ఇది చెప్పు,

మొదటి ప్రశ్న, ఆరోజున వేటకి వెళ్ళిన రోజున, నిజంగా నన్ను చంపుదామని అనుకున్నావా, అది నా ఊహ మాత్రమేనా, ఇది నాకు తెలుసుకోవాలని ఉంది.

మరో ప్రశ్న. నువ్వు కావేరిని ప్రేమించావా! ఆమె లవర్‌వా! నువ్వు నన్ను మోసం చేసావా? దాన్నే కాస్త పొడిగిస్తే, నువ్వూ, కావేరి, కలిసి నన్ను మోసం చేసారా?

ఈ రెండు ప్రశ్నలకి జవాబులు మీ ఇద్దరూ కూడా మీ రీతిలో సమాధానం ఇచ్చారు. నువ్వు ఆ మర్నాడే వెళ్ళిపోయావు, కాలం కూడా ఇచ్చింది. కావేరి కూడా తనదైన రీతిలో జవాబిచ్చింది.

నువ్వు టౌన్‌కి పారిపోయావు. అదే నీ జవాబు అనుకుంటాను.

నిన్ను నేను ఏమీ అనను. నిన్ను చూసి జాలి పడ్తాను. నీ గురి తప్పింది. కాని ఆలోచిస్తే అవి ఎంతటి భయంకరమై క్షణాలు. ఓ గన్ తీసుకుని యెంతో దగ్గరైన మనిషిని చంపాలనుకోడం,

నా ఊహకి తగిన జవాబులు నేను ఇచ్చుకున్నాను. కాని ఇప్పుడు నాక్కావల్సింది నీ జవాబులు. అవి కావాలి. ఇప్పుడు చీకటిగా ఉంది. నీ మొహం సరిగా కనిపించడం లేదు. వేరే కొవ్వొత్తులు తెచ్చి పెట్టమని అనను. ఎందుకంటే ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. ముఖాముఖగా మాట్లాడుకునే సమయం ఇది.

మనం కలిసి ఎన్నో ఏళ్ళున్నాం. ఎప్పుడూ కూడా నీమీద నాకు రవంత అనుమానం కూడా రాలేదు. నువ్వు నన్ను చంపగలవని, అంత అసూయ ఉందని అనుకోలేదు. నిజానికి నిన్ను చూసి జాలిపడే వాడిని. ఒకవేళ నీ స్థానంలో ఉంటే నేను కూడా నీలాగే ప్రవర్తించే వాడినేమో. కాని నువ్వు వెంటనే వెళ్ళిపోయావు.

నీలో ఉన్న భయంకరమైన ఆలోచన అర్థం అయింది. నీ మనస్సు తెలిసింది. దీనిని పోలీసు కేసు చేయించచ్చు. కాని చెయ్యలేదు. ఎన్నో చెప్పాలి. అవి చెప్పాలంటే నా గుండెని దిటవు చేసుకోవాలి. అలా చేసుకునే ధైర్యం నాకు లేదు.

నేను నిన్ను కోర్టుకి లాగాలని హత్యానేరం, అడల్ట్‌రీ గురించి నిజం నీతో చెప్పించవచ్చు.

ఆ జ్ఞాపకాలు, ఆ అపార్టుమెంటులో కదిలిపోతున్న దృశ్యాలు, వెలుగు నీడల్లాంటి జ్ఞాపకాలు, ఓ చనిపోయిన ఆమె గురించి, ఆమెతో నీవు అవన్ని చెప్పాలి అంటే ఎంత బాధ. తను ప్రేమించిన భార్య గురించిన విషయాలు అందరి ముందు అడగడం, చెప్పించడం అనేది ఎంతటి విషాదకరం.

ఇప్పుడు అది కాదు నాకు కావలసినది, నిజం కావాలి. ఎప్పుడో జరిగినది, ఇప్పుడు కావేరి లేదు. చనిపోయింది. మట్టిలో కలిసి పోయింది. ఓ భర్తగా నేను, ఓ ప్రేమికుడిగా నువ్వు మిగిలి ఉన్నాం, నువ్వు ఎక్కడ ఎప్పుడు, ఎలా మొదలైందో చెప్పాలి. ప్రేమ, అసూయ, నిన్ను ఏ స్థితికి తీసుకొచ్చాయో చెప్పాలి. ఆమె గురించి చెప్పచ్చు, కాని ఏం లాభం, అన్నీ అయ్యాక చూస్తే అంతా ఎంతో సింపుల్ గా అనిపిస్తుంది. అంతా దుమ్మూ, ధూళి.

ఒకప్పుడు గుండెల్ని మండించి చావడమో చంపడమో వరకూ వచ్చింది. నేను అర్థం చేసుకోగలను. నువ్వు వెళ్ళిపోయాకా సరిగ్గా అలాంటి భావాలే కలిగాయి. అర్థం లేదు. మన మధ్య లేని ఆ శరీరాన్ని గురించి ఏం చెప్పుకుంటాం.

కావేరి నీ అపార్టుమెంటులో నుంచి వెళ్ళిన క్షణమే నేను చేసి ఉండేవాడిని.

ఆరోజున నేను అలాగే నీ అపార్టమెంటులో నుంచున్నాను. అన్నీ డీటెయిల్డ్‌గా నేరం జరిగినదాని గురించి ఆలోచించాను. చుట్టూ చూసాను.

ఆ ఫర్నిచరు, మంచం, కావేరి శివరాం, ఇద్దరూ కలిసి దగా చేసారా? మనసు ఆ తరవాత మరో అడుగు వేయదలుచుకోలేదు.”

(సశేషం)

Exit mobile version