[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]“థాం[/dropcap]క్స్ సీతమ్మా, నీ మాటలతో నా ఆవేశం కాస్త తగ్గింది. రేపటికి పూర్తిగా తగ్గుతుంది, నువ్వెళ్ళు, నేను నిద్ర పోతాను.”
మజ్జిగ తాగేసి గదిలోకి వెళ్ళి మంచం మీద వాలాడు.
నిద్ర పోతాను అని అన్నాడు కాని, నిద్ర పట్టలేదు. ఎన్నో కళ్ళ ముందు గిర్రున తిరుగుతున్నాయి. ఒక దాని వెనకాల మరొకటి.
అన్నింటికి కారణం శివరామ్. పరోక్షంగా కావేరి.
ఈ మనిషి కోసం ఎదురు చూసాడు. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఎన్నో ఏళ్ళు.
శివరామ్ రాలేదు. తనని కలవలేదు. కాని, ఇప్పుడు అనుకోకుండా ఎదురొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చాడు.
ఇంక ఇప్పుడు ఏం జరగబోతోంది? అన్ని అడిగే ధైర్యం తనకి ఉంటుందా? లేకపోతే దైర్యం తెచ్చుకోవాలి.
ఎన్నో ఆలోచనలతో కలత నిద్ర పోయినా, అలవాటుగా ఐదు గంటలకి లేచాడు. యోగా చేసి, బత్తాయి రసం తాగి , శాలువా కప్పుకుని, కింద తోటలోకి వచ్చాడు.
పూల వాసన, ఆకుల వాసన ఉదయం గాలితో చేరి, తెరలుగా అతడి ముక్కుని తాకింది. సూర్యుడు ఇంకా భూమిని తాకని ఇలాంటి గులాబి రంగు ఉదయాలంటే బ్రహ్మాజీకిష్టం, సన్నటి శబ్దం చేస్తూ ఆకులు కదులుతున్నాయి.
చల్లటి గాలి ఒంటికి తాకుతూంటే కలిగే హాయిని ఒకలాంటి మత్తు అనుభవిస్తూంటే కొత్త ప్రపంచంలోకి తలుపులు తీస్తున్నట్లుగా అనిపిస్తుంది. అదో ఉన్మాదం.
అది అతనికి నచ్చిన సమయం. అంతా నిశ్శబ్దం.
ఆ నిశ్శబ్దం ఏదో నేర్పించింనట్లుగా అనిపిస్తుంది.
ఎన్నింటినో మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది.
ఆ ప్రశాంతతకి తను ఏదో బాకీ ఉన్నట్లనిపిస్తుంది. ఎందుకంటే తనని తాను మరిచిపోయే వాతావరణం అది. ఓదార్పు కోసం, సాంత్వన పదాల కోసం ఎవరిపైపు చూడక్కర్లేదు.
బ్రహ్మాజీ రావు చేతి కర్రతో కింద ఎండి పోయి కింద రాలిన ఆకులని అటూ ఇటూ తోస్తూ తీరిగ్గా తన తోటలో తిరుగుతున్నాడు. అది తోట లాగా ఉండదు. ఓ చిన్నఅడివిలా ఉంటుంది. రోజూ ఉదయం అక్కడ వాకింగ్ చేస్తూంటారు.
తెల్ల మీసాలు, బంగారు ఫ్రేం కళ్ళ జోడు, తెల్ల లాల్చీ, దాని మీద చేతుల్లేని లేత నీలం స్వెటర్, దాని మీద లేత వసుపు రంగు శాలువా, దాన్ని మధ్యలో సవరించుకుంటూ, చెట్లని , ఆకుల మధ్య నుంచి కనిపించే ఆకాశాన్ని చూస్తు నడుస్తున్నాడు.
పుష్యమాసం. చలి బాగా వేస్తోంది. శాలువాని బాగా దగ్గరికి లాక్కుంటూ చుట్టూ చూసాడు. ఒక రకమైన ప్రశాంతత. కాని తన మనసు గజిబిజిగా ఉంది. తోటలో ఉన్న మామిడి చెట్లు బంగారు పూసంత పూతతో నిండి ఉంది. ఉదయం ఆరు అని చేతికున్న గడియారం చూపించింది.
శివరామ్ లేచి ఉంటాడు. తన లాగే ఐదు గంటలకి లేచే అలవాటుంది.
తనని కలుసుకోవాలని అందుకే హైద్రాబాదు వస్తున్నానని అన్నాడు. ఎందుకు వచ్చాడో చెప్పుకోవాలి.
నడుస్తున్న వాడల్లా, ఆగి, ఎందుకో వెనక్కి తిరిగి చూసాడు. ఆగి, చెట్ల కొమ్మల మధ్య నుంచి కనిపిస్తున్న, తన ఇంటి వైపు చూసాడు
ఇంటి ముందు ఉన్నవరండా స్థంభానికి ఆనుకుని ఉన్న రామయ్య కనిపించాడు. అతని చేతిలో ఓ కవరు ఉంది. దానిని పట్టుకుని బ్రహ్మాజీకి కనపడేట్లు చేయి ఊపుతూ, నుంచున్నాడు.
అది గమనించిన బ్రహ్మాజీ ముందుకి నడుస్తూ, రామయ్య వైపు వెళ్ళాడు.
“ఉత్తరం బాబూ, మేనేజరు గారు మీకివ్వమని నాకు నిన్నే ఇచ్చారండి. నిన్న మీరు లేరు కదా, ఇప్పుడు ఇద్దామని వచ్చాను.” అంటూ ముందుకి రాబోయాడు.
“ఉత్తరం వచ్చిందా! అది కూడా ఈ రోజుల్లోనా! ఎక్కడించి వచ్చింది? అయినా ఎవరు రాసి ఉంటారు? సరే, నువ్వు రాకు. నేనే వస్తున్నాను.”
ఆ ఇంటికి, ఎస్టేట్‌కి సంబంధించిన కాగితాలు అవీ అన్నీ ముందు ఆఫీసుకెళ్తాయి. అక్కడ ఉండే మేనేజర్ వాటిని చూసి బ్రహ్మాజీకి పంపిస్తాడు.
ఉత్తరం గురించి ఆలోచిస్తూనే , రెండు పొడుగాటి స్తంభాల మధ్య, ఉన్నఅర్ధ చంద్రాకారంలో ఉన్ననాలుగు మెట్లు ఎక్కి విశాలంగా పొడుగ్గా ఉన్న వరండాలోకి వచ్చాడు. ఉత్తరం తెచ్చిన రామయ్య కదలకుండా అటెన్షన్‌లో నుంచున్నాడు.
“నేను అమెరికా వెళ్ళినప్పుడు, వచ్చినట్టుంది ఇలా ఇవ్వు,” మెల్లిగా అని ఉత్తరాన్ని తీసుకున్నాడు బ్రహ్మజీ.
ఆ ఉత్తరాన్ని అటూఇటూ తిప్పీ కళ్ళు బాగా చిన్నగా చేసి చేతిరాతని చూసాడు. గుర్తు పట్టాడు. గుర్తు పట్టాకా, కనుబొమలు ముడిచి, ముఖం చిట్లించాడు.
ఆలోచిస్తున్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు. కర్తవ్యం బోధపడక అక్కడే మంత్రం వేసినట్లుగా నుంచుండి పోయాడు.
రామయ్య తనని గమనిస్తున్నాడని, మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు, ముఖం లోని భావాలని దాచుకుని చేతిలో ఉన్న ఉత్తరాన్ని లాల్చీ జేబులో వేసుకుని, లోపలికి వెళ్ళాడు.
హాల్లోకి వెళ్లగానే చల్లగా హాయిగా అనిపించింది. దట్టంగా ఉన్న చెట్ల మధ్య ఉన్న పాతకాలం భవనం అవడం మూలానా, ఎత్తుగా ఉన్న కప్పు మూలంగా, ఆ హాలు చాలా చల్లగా ఉంది. తెరిచి ఉన్న పెద్ద, పెద్ద కటికీల్లోంచి చలి గాలి వీస్తోంది.
ఉత్తరం గురించి ఆలోచిస్తూనే, వెనకాలే వచ్చి, పక్కనే నుంచున్న రామయ్యకి శాలువా, చేతి కర్ర ఇచ్చి, మూలనున్న పెద్ద టేబుల్ దగ్గరికెళ్ళాడు, దాని మీద పెన్నులు స్టేషనరీ ఉండే ట్రే పక్కన ఉన్నకళ్ళజోడు కేసులోంచి కళ్ళజోడుని తీసి, కిటికి దగ్గరికి వెళ్లాడు.
గాలికి ఊగుతున్న పలచటి తెరని తప్పించి, వెనీషియన్ బ్లైండ్స్‌ని తెరిచాడు. మరీ ఎక్కువగా లేకపోయినా ఆ వెలుగు చాలు ఉత్తరం చదవడానికి.
ఉత్తరం అక్కడే టేబుల్ పైన ఉంచి, దగ్గరే ఉన్న విశాలంగా ఉన్న లెదర్ కుర్చీలో కూచుని, ఎదురుగా ఉన్న ఉత్తరాన్ని తదేకంగా చూసాడు.
మరోసారి దాన్ని చేతిలోకి తీసుకుని, అటూ ఇటూ తిప్పి ఆ ఉత్తరాన్ని, తన చిరునామాని చూసాడు. అది శివరామ్ చేతి రాతే. ఆ చేతి రాతని ఎలా మరిచి పోతాడు!
స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి, తన పక్కన కూచున్న శివరామ్ రాతని ఎలా మర్చిపోతాడు? ఇంగ్లీష్ బి అక్షరాన్ని అందంగా ఏదో డిజైన్‌లా రాస్తాడు. ఆ తరవాతి అక్షరాలని కుడివైపుకి వంచి రాస్తాడు. తను మర్చిపోలేడు. అది శివరామ్ రాతే..
అయితే ఇప్పుడు ఎందుకు రాసాడు? ఉత్తరం రాసిన మనిషి, తనని కలుసుకోడానికి వస్తున్నట్లుగా ఎందుకు అన్నాడు? అంతా గందరగోళంగా ఉంది.
మరోసారి ఆ ఉత్తరం వైపు చూసాడు. అది శివరామ్ దగ్గర్నుంచి, సందేహం లేదు. ఇన్ని ఏళ్ళ తరవాత రాసాడు.
తన ఫోన్ నంబరు అదీ తెలీదు. కాబట్టి ఫోన్ చెయ్యలేదు. ఈ ఇంటి అడ్రసు తెలుసు. పైగా ఈ ఇంట్లో సుమారు ఇరవై ఏళ్లు పైనే ఉన్నాడు. ఈ ఇల్లు తమ పూర్వీకులది కాబట్టి, ఈ ఇంటిని అమ్మరు, ఈ ఇంటిని వదిలి ఎక్కడికి తను వెళ్ళడని తెలుసు, ఈ ఇంట్లోనే తనుంటాడని తెలుసు. అందుకని ఈ అడ్రస్‌కి ఉత్తరం రాసాడు. అది అందుతుందో లేదో అని కలవాలని వచ్చాడు.
అయితే ఉత్తరం ఎందుకు రాసినట్టు? రాసాక, ఇప్పుడెందుకు వచ్చిన్నట్టు?
అంత ముఖ్యమైన పని, విషయం ఏం ఉంది? ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడు? ఇంకా ఏం మిగిలి ఉంది? ఇంకా ఏం కావాలి? అశాంతిగా అటూఇటూ తిరిగాడు.
సీతమ్మ ఎప్పుడూ అంటూంటుంది. ప్రతీ మనిషి హృదయంలో ఇద్దరు దేవతలుంటారు. ఒకరు జ్ఞాన సరస్వతి, మరొకరు లక్ష్మీదేవి. ఏది కావాలన్నది విచక్షణ మీద ఉంటుంది. సకాలంలో ఏం కావాలన్నది తెలుసుకోక పోతే, ఆ పరిస్థితి నిన్ను మారుస్తుంది. మెంటల్ మేకప్ చేసుకోవాలి అని.
ఎలాంటి విషయాలు శివరామ్ చెప్పినా తను చలించ కూడదు. మనసు అదుపు తప్పకూడదు. తన చదువు కన్న సీతమ్మ అనుభవం గొప్పది. అందుకే జాగ్రత్తగా విచక్షణతో వ్యవహరించాలి.
“రామయ్యా” అని పిలిచాడు.
మరు క్షణంలో వచ్చి, నుంచున్నాడు.
“సాయంత్రం నాలుగ్గంటలకి, మన గెస్ట్ హౌస్‌కి వెళ్ళి, ఓ గెస్ట్‌ని తీసుకురావాలి. అతనిని నువ్వు ఎప్పుడూ చూడలేదు. అతను మనింట్లో చాలా ఏళ్ళున్నాడు. అతను నాలాగే పెద్దవాడు. వయసు. డెబ్భై ఏళ్ళు పైనే ఉంటుంది. అందుకని జాగ్రత్తగా తీసుకుని రావాలి.”
“అలాగే బాబు,” అంటూ యజమాని కళ్ళల్లోకి చూసాడు.
రామయ్య వెళ్ళాక, ఏదో గుర్తొచ్చి కళ్ళు చిన్నగా చేసి తలని పైకెత్తి, అక్కడ ఉన్న పాతకాలం నాటి షాండిలీయర్‌ని ఓ సారి చూసి, మెట్లు ఎక్కాడు.
మొదటి అంతస్తులో ఉన్న తన గదిలోకి వెళ్ళి, పొడుగాటి ఫ్రెంచి కిటికి పక్కన ఉన్న రాత టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అది ఎంతో ఇష్టమైన ప్రదేశం. అక్కడికి గాలీ వెలుతురూ బాగా వస్తాయి. అక్కడే కూచుని ఎన్నో పుస్తకాలు చదివాడు. ఇప్పుడు అక్కడ ఉన్న టేబుల్ లైటు పక్కగా ఉత్తరాన్ని ఉంచి, తల ఎత్తి పొడుగాటి కిటికీలోంచి బయటికి చూసాడు. దట్టంగా ఉన్న చెట్లు ఆకులు రాలిన కొమ్మలు చేతులు చాచినట్లుగా ఉన్నాయి.
ఆ గదిలోనే అటూఇటూ పచార్లు చేసి, చేబుల్ దగ్గరికి వెళ్ళి, మళ్లీ ఉత్తరాన్ని చూసాడు.
చేతులు వెనక్కి పెట్టుకుని ఎదురుగా ఉన్న కాలెండరు వైపు చూసాడు.
పెద్ద పెద్ద నంబర్లున్న కాలెండర్ వైపు చూసినప్పుడల్లా గుర్తొస్తుంది.
గుర్తొచ్చినప్పుడల్లా కడుపు రగిలి పోయేది. జీవితంలో కొన్నింటిని సహించాలి. కొన్నింటిని భరించాలి. ఈ రెండు ఇన్ని ఏళ్ళూ చేసాడు. దీని సమయం వచ్చింది. ఇన్ని ఏళ్ళూ దీనికోసమే వేచి ఉన్నాడు అని. మొదట్లో మర్చిపోయినా ఆ కాలెండర్‌ని చూసినప్పుడల్లా అన్నీ మళ్ళీ గుర్తొస్తాయి. అందులో ఎక్కువగా జవాబుల్లేని ప్రశ్నలు.
ఇన్నేళ్లూ మనసులో ఉండివోయిన ప్రశ్నలకి జవాబులు దొరికే సమయం వచ్చింది. కాని దొరుకుతుందా అన్నది అనుమానమే.
మళ్ళీ కాలెండర్‌ని చూసాడు. అది కొత్తది కాదు. మరీ పాతది. ఓ నలభై మూడేళ్ళ క్రితం నాటిది. రంగు బాగా మారింది. అయినా దాన్ని తియ్యలేదు. అక్కడే అదే గోడకి అలాగే ఉంచాడు.
నవంబర్ ఎనిమిది. 1976. చేతి పిడికిలి అంత అక్షరాలు నంబర్లున్న కాలెండర్ పైన సంవత్సరం, తేదీ దాని కింద ఎర్రటి సిరాతో గీత ఉంది. ఆ పేజీ చింపలేదు. ఆ రోజు నుంచి, అలాగే ఉంది.
లెక్క వేసాడు. నిన్నా మొన్నా కాదు, సరిగ్గా నలభైమూడేళ్ళు అయింది అన్నమాట. సంవత్సరాలు, నెలలు, తేదీలు అన్నీ కలిపి.
ఓసారి కప్పుకేసి చూసి లెక్క వేసాడు. సరిగ్గా నలభై మూడేళ్ళుదాటింది.
ఓసారి గట్టిగా పైకి అన్నాడు. మరోసారి చిన్న పిల్లాడిలా నలభైమూడేళ్ళు దాటిపోయింది అని గొణుక్కున్నాడు. ఓసారి పెదిమలు తడుపుకుని ఆ పెద్ద హాలులో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు.
ఇన్ని ఏళ్ళు, నలభైమూడేళ్ళ నుంచి, అతని దినచర్యలో మార్పు లేదు. ప్రతీ ఉదయం కింద తోటలో తిరిగి, వరండా దాటి, హాల్లోంచి మెట్లెక్కి, తన గదిలోకి వచ్చేవాడు. భోజనం కూడా అక్కడే తీసుకుంటాడు. ఆ సరంజామా అంతా కూడా ఆ గదిలోనే ఉంటుంది. ఆ గదిలోంచి చూస్తూ కాస్త సమయం గడుపుతాడు.
ఇది అంతా ఆ పెద్ద భవంతిలోని ఓ భాగం మాత్రమే. మరో భాగం వైపు , ఎన్నో గదులు అవీ ఉన్నా ఆ పక్కకి వెళ్ళడు. ఆ గదుల తలుపులు అన్నితాళాలు వేసి ఉంటాయి. వాటితో అతనికి పని లేదు.
అందులో ఉన్నవస్తువులు ఇదివరకూ ఎలా ఉన్నాయో చూడలేదు. అందులో ఏం ఉందో చూడాలని అనుకోలేదు.
అతని లోకం అంతా, ఆ గది. ఆ కిటికి, ఆ టేబుల్ మీద పుస్తకాలు.
ఇప్పుడు కూడా అలాగే వచ్చి, ఆ పెద్ద పొడుగాటి ఫ్రెంచి కిటికి దగ్గరనుంచుని బయటికి చూస్తూ గట్టిగా అన్నాడు.
శివరామ్ వచ్చాడు, తను చూసాడు. తనని కలుసుకోడానికి వస్తున్నానని దుబాయ్‌లో అన్నాడు. అది నిజమే అయితే ఇప్పుడు ఎందుకొచ్చినట్టు, ఇంకా ఏం కావాలి?
(సశేషం)