ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-5

1
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]శి[/dropcap]వరామ్ ఇక్కడికి వచ్చాడు. ఈ బంగళాలో ఎన్నో ఏళ్ళున్నాడు. కవల పిల్లలు కాక పోయినా కవలపిల్లల్లాగే పెరిగారు.

జీవితంలో ఎన్నో అనుభవాలని ఇద్దరూ కలిసి పంచుకున్నారు. ఒకరి కలలు మరొకరికి తెలుసు. ఒకరి శరీరాలు మరొకరికి తెలుసు. రాత్రింబవళ్ళూ ఒకే చోట ఉండడం వలన వచ్చిన బంధం అది.

ఒక ఏడాదా రెండేళ్ళా ఇరవై ఏళ్ళు. ఒక్క చోట చదువుకున్నారు. ఒక ఇంట్లో ఉన్నారు. అలాంటి శివరామ్ ఓ రోజున ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు.

ఇన్ని ఏళ్ళ తరవాత, వచ్చాడు. ఎందుకు తలుచుకుంటే అతనికి ఆశ్చర్యంగా ఉంది. శివరామ్ ఇక్కడికి రావడం ఏంటీ, మళ్ళీ వస్తాడని అనుకోలేదు. ఇది ఊహించలేదు. ఇన్ని ఏళ్ళ తరవాత ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?

పాతవి ఎన్నో గుర్తొస్తున్నాయి. ఆ జ్ఞాపకాలలోంచి అన్నీ ప్రశ్నలే వస్తున్నాయి.

శివరామ్ వెళ్ళిన తరవాత, ఒంటరిగా ఉన్నప్పుడు గడిచి పోయిన జీవితం అంతా పోగేసి, ఎన్నింటినో తయారు చేసుకున్నాడు. ఇలాంటి సమయం కోసం ఎదురు చూసాడు.

మొదట మానిపోని మందు లేని గాయం, తరవాత అందులోంచి వచ్చిన కోపం, కక్ష. అందుకోసం సమయం కోసం ఎదురు చూడడం,.

పగ తీర్చు కోవాలని ఉంది. కాని, ఇన్ని ఏళ్ళల్లో కరిగిన కాలం ఎన్నింటినో దాచేసింది. డైల్యూట్ చేసింది. ఎన్నింటినో ఆపింది, పగలోని పవరు కూడా తగ్గింది. రాను రాను పాతబడి పోయింది. అవి నలుపు తెలుపు సినిమాల్లోని దృశ్యాల్లాగా తేలిపోతున్నాయి. జ్ఞాపకాలు కూడా అలాగే తేలి పోతున్నాయి.

ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకాలు అన్నీ పోగయ్యాయి. అందులోంచి లేచిన ప్రశ్నలు.

సీతమ్మ వెళ్ళిపోయాక కిటికీకి వీపు నానించి, ఎదురుగా గోడకి ఉన్న నిలువెత్తు తైలవర్ణ చిత్రాన్ని చూస్తుండిపోయాడు. అది అతని తండ్రిది. పెద్ద మీసాలు, చెవులకి పోగులు, భుజాల వరకు సాగిన ఉంగరాల జుట్టు, మెళ్ళో ముత్యాల వరసలు, పచ్చల హారం, జేబులోంచి బయటికి వచ్చిన గడియారం, భుజాల మీద నుంచి వచ్చిన జరీ కండువా, మెరుపుల షేర్వాణీ, చేతికి కంకణాలు, వేళ్ళకి ఉంగరాలు, పొడుగాటి పెండ్యులంతో ఉన్న పాతకాలం నాటి గడియారం, పక్కన ఠీవిగా నుంచున్న తండ్రి. ఆ వెనక బంగారంతో తాపడం చేసిన కిటికీ, దానికి ఉన్న పల్చటి తెర అన్నీ కూడా ఎంతో నైపుణ్యంతో పెయింట్ చేసాడు చిత్రకారుడు. దాని పక్కనే మరో తైలవర్ణ చిత్రం. నల్ల సూట్‌లో బంగారు గొలుసు పెద్ద లాకెట్ నున్నగా దువ్విన చిన్న జుట్టు, హిట్లర్ మీసాలు. ఇంగ్లీషు వేషధారణలో నాన్న.

తండ్రి గురించి అమ్మ చెప్పినది కొన్ని గుర్తున్నాయి. తండ్రి పై చదువులు ఇంగ్లాండులో చదివాడు. అక్కడి నుంచి వచ్చాక నవాబుల దగ్గర కన్‌స్ట్రక్షన్ కంపెనీలో చేరాడు. ఎన్నో భవంతులు డిజైన్ చెయ్యడంలో, కట్టించడంలో సూపర్‌వైజ్ చేసాడు, సాయపడ్డాడు. ఆ సమయంలోనే గోల్కొండ దగ్గర పాతిక ఎకరాల స్థలం ఈనాంగా ఇస్తే పెద్ద భవంతిని కట్టాడు. ఆ సమయంలో రోమ్, గ్రీస్ దేశాలు పాలరాతి విగ్రహాల కోసం, పెయింటింగ్‌ల కోసం వెళ్ళడం వలన తన ఇంటికి రోమా అని, ఆ స్థలానికి రోమా ఎస్టేట్స్ అనిపెట్టాడు. ఆ భవంతి కట్టినప్పుడు అక్కడంతా కొండలు, గుట్టలూ, దట్టంగా చెట్లు. జంతువులు ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూండేవి. వేటాడడం కోసం స్నేహితులు వస్తూండేవారు. అది ఓ ఆట విడుపు. ఓ జమీందారీ స్థాయిలో బ్రహ్మాజీ జీవితం గడిచింది.

ఎప్పుడూ కన్‌స్ట్రక్షన్ పనులు, సైట్ దగ్గరికి, జీపులో ప్రయాణాలు, హైదరాబాదులో ఉన్న గొప్ప కుటుంబాలతో పరిచయాలు, వాళ్ళ ఇళ్ళు అవీ కట్టించడం, బయటి వాళ్ళతో డిన్నర్లు, పార్టీలు, రాత్రిళ్ళు ఇంటికి ఆలస్యంగా రావడం. ఇంక సెలవు దినాల్లో అయితే ఉదయాన్నే ఓ గన్ను పట్టుకుని వేటాడడానికి సిద్దంగా ఉన్నట్టుంటారుట. దానికి తగ్గట్టుగానే ఎవరో స్నేహితులు వేట కోసం వస్తూంటారుట, వాళ్ళతో వేటకి వెళ్లి గంటలకొద్దీ సమయం ఆ చుట్టు పక్కల గడిపేవారుట. తన తల్లికి ఇలాంటివి వేటలు, జంతువుల్ని చంపడాలు అసలు ఇష్టం ఉండేది కాదుట. వీటిని నిషేధించింది. అందుకని ఆ బంగాళాకి పక్కగా మరో చిన్నగా అధునాతనంగా, అన్ని సౌకర్యాలు ఉన్న బిల్డింగ్ కట్టించారుట. అది ఎప్పుడైనా వేటాడడానికి వచ్చే వారికోసం. ఇక్కడే ఈ భవనంలోనే బ్రహ్మాజీ తండ్రి విశ్రాంతి తీసుకునేవారు. ఇంట్లో వాళ్ళు భోజనాల సమయంలోనే అతన్ని చూసేవారు. బ్రహ్మాజీ తండ్రిని అప్పుడప్పుడు సాయంత్రాలు, రాత్రుళ్ళు కూడా చూసేవాడు.

ఎత్తైన మెత్తటి సోఫాల్లో కూచుని టీ తాగేవారు. తండ్రికి కుడివైపున తల్లి కూచునేది. ఏవో మాట్లాడుకునేవారు. అన్ని కూడా ఎంతో శ్రద్ధగా అమర్చి ఉంచేవారు. పనివాళ్ళు ఆ ఛాయలకి కూడా వచ్చేవారు కాదు. కాని పిలిస్తే మాత్రం వెంటనే వచ్చేసేవారు.

ఎన్నో విషయాలు గుర్తొస్తున్నాయి. ఇంత వరకు వాటి గురించి మాట్లాడడానికి చర్చించుకోడానికి ఎవరూ లేరు. ఇప్పుడు శివరామ్ వచ్చాడు. తండ్రితో తన సాన్నిహిత్యం, గడిపిన రోజులు అన్ని కూడా శివరామ్‌కి తెలుసు. వాడితో చెప్పుకోవచ్చు.

ఆ మాటలు మాట్లాడుకుంటూంటే ఇప్పుడు అదే దగ్గరితనం అప్పటి లాగే ఉంటుందా! తను పాత వాటిని మర్చిపోయి మామూలుగా ఉండగలడా!

డూన్ స్కూల్లో కొన్ని ఏళ్ళు చదివాడు. సెలవలకి వచ్చినప్పుడు, సాయంత్రాలు, రాత్రి మాత్రమే తండ్రి కనిపించేవాడు. తల్లి ఆరోగ్యం బాగాలేదని తెలిసింది. చూడాలని ఉంది అని అంటే, హైద్రాబాదు వచ్చి, ఇక్కడే చదివాడు, అక్కడే శివరామ్ కలిసాడు. తండ్రికి పరిచయం చేసాడు. ఆ స్నేహం చాలా ఏళ్ళు కొనసాగింది.

తండ్రి యూరోపులోని చాలా దేశాలు తిరిగాడు. అక్కడి రాజులు, ఆ దేశాల చరిత్రలు, ఆ కథలు అన్నీ తెలుసు. ప్రపంచంలోని ఎన్నో విషయాలు తనకి శివరామ్ కి చెప్పేవాడు.

అవన్ని శివరామ్‌కి గుర్తుంటాయా! గుర్తు లేనట్లుగా నటిస్తాడా! ఎందుకో ఇప్పుడు నాన్న గుర్తొస్తున్నారు. ఆయన మాటలు కూడా.

“చూడు కన్నా, మనం గొప్పవాళ్ళం, ఎవరైనా మన చుట్టూ చేరచ్చు. కాని అందరూ నీ మంచి కోరేవారు కాకపోవచ్చు. అందుకే ఎవరు నీ వాళ్ళో, కారో చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. వయసు వెరుగుతున్న కొద్ది, నాటకాలాడే వాళ్లు మన చుట్టూరా ఉండకుండా చూసుకోవాలి. మన పక్కన మనల్ని సంతోషపరిచేవాళ్ళు మాత్రమే ఉండాలి” అనేవారు. శివరామ్‌ని ఎంచుకోడంలో తప్పు చేసాడు. నాటకాలాడాడు. ఇప్పుడు అతని రాక సంతోషంగా లేదు.

తండ్రి ఎప్పుడూ అనేవాడు.

“జీవించడానికి రెండు దార్లుంటాయి. ఓ దార్లో ఎంతో మంది మనుషులుంటారు. వాళ్ళల్లో మనకి నచ్చినవాళ్ళు, నచ్చనివాళ్ళు ఉంటారు. ఫాషన్, ఆనందాన్ని కలిగించే విషయాలు, పూలు, ముళ్ళు, రాళ్ళూ రప్పలూ, ఎగుడూ దిగుడూ రోడ్లుంటాయి. ఈ దార్లోంచి చాలా మంది వెళ్తారు.

మరో దార్లో ఏదీ ఉండదు. ఏమీ ఉండదు. నిర్మానుష్యంగా ఉంటుంది. పంచుకోడానికి ఎవరూ ఉండరు. ఆ దారి పేరు ఒంటరితనం. ఏ దారి అన్నది నీ విజ్ఞత మీద ఉంది. ” అన్న తండ్రి ఎప్పుడూ గుర్తుంటాడు.

నిజానికి ఆయన ఎన్నో విలువైన మాటలు చెప్పారు, కాని అవి విలువైన మాటలు అని నేను తెలుసుకోకపోవడం నా దురదృష్టం అని, అనుకున్నాడు బ్రహ్మాజీ.

ఈ రెండో దారి ఎంచుకుని ఇన్నాళ్ళూ ఒంటరితనంలోనే నడిచాడు.

శివరామ్ రాకతో ఇప్పుడు ఓ ముళ్ళ కంప ఆ దార్లో పడుతోంది. అది గుచ్చుతుంది. ఇర్రిటేట్ చేస్తుంది. ఓ కత్తిలా జీవితాన్ని కోస్తుంది.

శివరామ్ ఫోన్ చేసాడు

“నేను ఓ ముఖ్యమైన పని బయటికి వెళ్తున్నాను, సాయంత్రం వస్తాను” అన్నాడు.

“ఎప్పుడు వెళ్ళినా, బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళు. పంపిస్తాను.”

“సరే. పది గంటలకి వెళ్తాను.”

“రామయ్యతో పంపిస్తాను.”

సీతమ్మతో చెప్పి, కాఫీతో పాటూ పాలు కార్న్ ఫ్లేక్స్, బ్రెడ్ వెన్న, రెండు రకాల జ్యూస్‌లు, రామయ్యతో పంపించాడు. ఇంకా ఏదైనా కావాలేమో కనుక్కోమని అన్నాడు..

మరో అరగంటకి శివరామ్ ఫోన్ చేసాడు.

“థాంక్యూ. బ్రేక్‌ఫాస్ట్ బావుంది. లంచ్‌కి రాను. డిన్నర్‌కి వస్తాను.”

“అలాగే” అని పెట్టేసాడు.

మళ్ళీ శివరామ్ ఆలోచనలు. సందేహాలు, ప్రశ్నలు. శివరామ్‌ని అడగాల్సినవి మరోసారి మననం చేసుకున్నాడు.

శివరామ్ ఆలోచనలో ఉన్నప్పుడే భోజనం తెప్పించుకుని తిన్నాడు. తినాలని లేకపోయినా సీతమ్మ బలవంతం మీద కాస్త తిన్నాడు.

అటూ ఇటూ తిరిగాడు. ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు. మొదలు పెడితే ఎక్కడనుంచి మొదలు పెట్టాలి.

అసలు ఇక్కడికి ఎందుకు వద్దామని అనుకున్నాడు. ఎందుకు వచ్చాడు. అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు.

సాయంత్రం అవుతూండగా రాజయ్య శివరామ్‌ని తీసుకొచ్చాడు

శివరామ్ డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చాడు. ఏర్పోర్ట్ లో చూసింది చాలా తక్కువ సేపే. ఇప్పుడు పరీక్షగా చూసాడు.

ఏం మారలేదు. వయసు తెచ్చిన మార్పులు తప్ప అప్పటి లాగే ఉన్నాడు. తన వయసే డెబ్భైదాటింది..

అతనిని చూడగానే పాత కక్ష, పగ, కోపం ఏదీ గుర్తుకు రాలేదు. అన్నీ వెనక్కి వెళ్లిపోయాయి..

ఇరవై ఏళ్ళు కలిసి ఉన్న సాంగత్యం లోని ఆనందం ఒక్కటే గుర్తొచ్చింది. అందుకే సంతోషంగా మనస్పూర్తిగా ఆహ్వానించాడు. ఇదివరకూ ఎప్పుడూ కూచునే గదిలోకి తీసుకెళ్ళాడు. చలికాలం మూలంగా ఐదు గంటలకే చీకటి పడిపోయింది. అందుకే అన్ని లైట్లు వేసారు.

“గుర్తుంది కదా, మా తండ్రిగారు మనకి ఇక్కడ కూచుని ఎన్న విషయాలు చెప్పేవారు. ఓసారి ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్ అంటూ డికెన్స్ నవల గురించి కాకుండా, జర్మని తూర్పూ పడమర జర్మనీలుగా విడిపోయినప్పుడు అక్కడి పరిస్థితులు చెప్పారు, మళ్ళా అదే జర్మనీ కలిసిపోయినప్పుడు మాట్లాడుకోడానికి నాన్నగారు లేరు. ఉంటే యునైటెడ్ జర్మని గురించి ఎన్నో కథలు చెప్పేవారు. మనం దాని గురించి మాట్లాడుకుందామనుకున్నా నువ్వు ఎక్కడో మరో దేశంలో ఉన్నావు.

అదే కాదు, మన దేశనాయకుల గురించి, హైదరాబాదు చరిత్ర, కట్టడాల గురించి ఇలా ఎన్నో చెప్పేవారు. అన్నీ కూడా కథలు కథలుగా వినాలనిపించేలా చెప్పేవారు.” ఇవన్నీ కూడా చెప్పుకుంటూ మరోసారి గుర్తు చేయాలనుకున్నాడు..

“యూరోపులో చదవడం వల్ల కవిత్వం ఇంగ్లీషు కవుల గురించి, అక్కడి చరిత్ర గురించి, హైదరాబాదులో నిజాం ప్రభువుల దగ్గర పనిచేయడం వలన ఇక్కడి ఉర్దూ కవుల గురించి ఇలా ఎన్నో విషయాలు చెప్పి, మనల్ని ఎన్నో విధాలుగా ఎడ్యుకేట్ చేసారు. దురదృష్టం ఆయన మనతో ఎక్కువ కాలం గడపలేదు.

నా పెళ్ళి కూడా చూడలేదు. ఆయనే ఉంటే పరిస్థితులు మరోలాగా మారేవి. అందులో నీ విషయం కూడా.” ఇవన్నీ చెప్పాలనుకున్నాడు.

కాని చెప్పలేక పోయాడు. ఏదో గొంతులో అడ్డుకుంది. అన్ని పదాలు అక్కడే ఆగిపోయాయి.

“ఇది మనం ఎప్పుడూ కూచునే గది. నువ్వు ఆ వైపు కూచుంటే, నేను ఈ వైపున కూచుంటే మన మధ్య కావేరి కూచునేది,”  శివరామ్‌ని చూస్తూ అన్నాడు.

బ్రహ్మాజీ వాతావరణం మామూలుగానే ఉందనడానికి ఏదో అన్నాడు కాని మాటలు ఫ్రీగా రాలేదు. ఏదో అడ్డు వచ్చింది. మళ్లీ మాటలు లేవు.

శివరామ్ ఏం అన లేదు. కాని అవునన్నట్లుగా తల ఊపాడు.

“కాఫీ తాగుదామా, మనం ఈ టైములో తాగే వాళ్ళం గుర్తుందా!”

శివరామ్ జవాబు కోసం ఎదురుచూడలేదు.

బెల్లు నొక్కాడు. వీరయ్య వచ్చాడు. వీరయ్యని చూడగానే కాఫీ అని సైగ చేసాడు.

వీరయ్య లోపలికి వెల్ళాడు. మరో రెండు నిమిషాలకి కాఫీ ట్రాలీ తోసుకుంటూ ఓ మనిషి వచ్చింది. ఆమె కాఫీ కలిపితే, బ్రహ్మాజీ శివరామ్‌కి ఒకటి అందించి, తను ఒకటి తీసుకున్నాడు. ఇద్దరూ నిశ్శబ్ధంగా ఉన్నారు.

శివరామ్‌ని అడగాల్సినవి జ్ఞాపకం ఉన్నాయి. కాని ముందే వాటిని మొదలు పెట్టడం ఇష్టం లేదు. ఏం మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో బ్రహ్మాజీకి తెలీడం లేదు.

“నువ్వు అమ్మతో ఏదో ఆట ఆడేవాడివి, అది ఏం ఆటో గుర్తుందా.” ఏదో అడగాలని అడిగాడు.

“లేదు.”

మళ్లీ నిశ్శబ్దం. ఇద్దరూ ఫైర్ ప్లేస్‌ని, మండుతున్న చితుకుల్ని చూస్తున్నారు.

ఒక్కసారి బలమైన గాలులు వీచాయి. షాండీలియర్ అటూ ఇటూ ఊగుతోంది. ఉరుములు, అదిరిపోయే లాంటి శబ్ధాలతో, మధ్యమధ్య మెరుపులు ఆ గదిలోకి వచ్చినట్లుగా అనిపిస్తోంది. గాలి విపరీతం అవడంతో కరెంటు పోయింది. దీపాలు ఆరిపోయాయి.

ఫ్రెంచి కిటికి తలుపులు శబ్దంతో కొట్టుకున్నాయి. గబగబా పనివాళ్ళు, అతికష్టం మీద తలుపులు మూసారు.

ఒక్కసారిగా నిశ్శబ్దం. చీకటి. ఆ చీకట్లోనే వాళ్ళిద్దరూ కూచున్నారు.

“జెనరేటర్ వెయ్యనా” అంటూ రామయ్య వచ్చాడు. వద్దన్నాడు.

ఆ చీకట్లో, మండుతున్న చితుకులని చూస్తూ చీకట్లో కూచోడం కావేరికిష్టం. అదే బ్రహ్మాజీకి కూడా ఇష్టం. అందుకే కొవ్వొత్తులనే వెలిగించి తెమ్మంటాడు. అందుకే ఎప్పుడు కరెంటు పోయినా ఏమాత్రం కన్‌ఫ్యూజన్ లేకుండా కొవ్వొత్తులు వెలిగించి, స్టాండుల్లో ఉంచి తెస్తారు. ఇప్పుడు కూడా పనివాళ్ళు కొవ్వొత్తులు వెలిగించి తీసుకొచ్చారు.

“అటు వైపు వెళ్దాం.” అంటూ డ్రాయింగ్ రూం వైపు నడిచారు.

 అక్కడ ఓ పెద్ద పియానో ఉంది. దాని మూత తీసి పైకి పెట్టి ఉంది. కొన్నాళ్ళు వసుంధర నేర్చుకుంది. అమ్మకి ఇంగ్లీషు నేర్పిన బ్రిటీష్ లేడి ఇంగ్లాండ్ వెళ్ళిపోతూ అమ్మకి బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోయింది. అమ్మ వాయిస్తున్నప్పుడు తను నాన్న ఒళ్ళో కూచుని వినేవాడు.

ఆ తరవాత కావేరి నేర్చుకుంది. ఆమె వాయించేప్పుడు శివరామ్ కూడా కూచునేవాడు. తనతో పాటు వినేవాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here