ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-9

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“కా[/dropcap]ని నీకలా అనిపించలేదు. నువ్వు అలా చెయ్యలేదు. నా సాన్నిహిత్యం, నా స్నేహం భరించ లేకపోయేవాడివని అప్పుడు తెలుసుకోలేక పోయాను. నీలో ఏదో లోపించింది. అది నీ జీన్స్‌లో ఉందా. లేకపోతే ఇక్కడి వాతావరణంలోంచి పుట్టినదా, మనుషులు నీతో ప్రవర్తించిన తీరా, ఎందుకంటే మనిద్దరం వెళ్తూంటే ఎదురొచ్చినవాళ్ళు నన్ను చూసి, పలకరింపుగా నవ్వేవారు, మాట్లాడేవారు, ఇవన్నీ నీలో ఈర్ష్యని పెంచాయా, లేకపోతే నీలో అసూయ అనేది నీలో అప్పుడే మొదలైందా.

ఇన్నేళ్ళూ నేను ఒంటరిగా ఉన్నాను. ఈ ఒంటరితనం నాకు ఓ విధమైన జ్ఞానాన్ని ఇచ్చింది. ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళు దేవుడికి ప్రీతిపాత్రులు అవుతారు. ఇవన్నీ చెప్పి, నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలనుకోవడం లేదు.

ఈ రోజు నాకు నిజం కావాలి. తెలియాలి. ఈ అంతర్మథనానికి ఇంక ముగింపునివ్వాలి.

నానుంచి అన్నీ తీసుకున్నావు. నన్ను వదిలేసి వెళ్ళేవరకు నిన్ను నేను నమ్మాను.

నేను గతాన్ని మాట్లాడుతున్నాను. ఈనాటి మన మాటలలో ఓ చచ్చిపోయిన మనిషి పాత్ర కూడా వస్తుంది. అందుకే ఎవరికీ హాని కలగని విధంగా, హాని చేయని విధంగా మాట్లాడుతున్నాను.

నువ్వు వెళ్లిపోయాక నా అద్భుతమైన బాల్యం మెల్లమెల్లగా మాయం అవడం మొదలైంది. మన మధ్య ఉన్న బంధం సంబంధం మెల్లిగా చల్లారడం మొదలైంది. ఇంత కన్న బాధాకరమైన విషయం ఏం ఉంటుంది.

ఎందుకిలా జరిగింది. ఇద్దరు మొగవాళ్ళ మధ్య ఉండే స్నేహం నిస్వార్థమైనది. నేను ఏ త్యాగాలు కోరలేదు. మన మధ్య ఉండే బంధాన్ని నిలుపుకోవాలని నా ప్రయత్నం ఫలించలేదు. ఆ భావన ఇద్దరి నుంచి రావాలి. నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేదా అని నాకు అనిపించినప్పుడు కొంచెం గిల్టీగా ఉంటుంది.

నీ గురించి నువ్వు పూర్తిగా నాకు చెప్పలేదనిపిస్తోంది. తల్లి లేదన్నావు. అయ్యో అనుకున్నాను. తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడని అన్నావు. పాపం అనిపించింది. నీ గురించి ఆలోచించే వాళ్ళు లేరని నేను బాధపడ్డాను. నీ చదువుకి కావలసిన డబ్బు అదీ నీకు పంపించడం కుదరదని, వచ్చి, తనకి సాయంగా వ్యాపారం చూసుకోమని అన్నాడని అంటే నీ చదువు ఆగిపోకూడదని మా నాన్నగారికి పరిచయం చేసాను, మా ఇంట్లో ఉంచుకున్నాను. మా ఎస్టేట్‌లో పెద్ద జీతంతో ఉద్యోగం ఇచ్చాను.

కాని నాకు పూర్తిగా ఇంతకు మించిన నీ విషయాలు ఏవీ చెప్పలేదు. నేను కూడా ఎప్పడూ అడగలేదు. నేను తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. ఆ వయసులో నాకు ఒక్కటే నా మనసులో ఉంది. అదే నీకు అన్ని విధాలా ఆదుకోవాలని, సాయం చేయాలని మాత్రమే అనుకున్నాను. ఆ విషయాన్ని నువ్వు కూడా అంగీకరించాలి. నీ తెలివి తేటల్ని నేను గౌరవిస్తాను. మన స్నేహం ఎన్నో ఏళ్ళది. నేను సూర్యుడికి ఎదురుగా వెళ్తూంటే నా నీడలో నడవడానికి నువ్వు ఇష్టపడేవాడివి…”

శివరామ్ తన అర చేతిని కొంచెం ఎత్తాడు.

“మధ్యలో అడ్డు వస్తున్నానని అనుకోకు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు, నువ్వు ఆరోజు వేట గురించి మాట్లాడుతున్నావు. దాని గురించే మాట్లాడు.”

గత జీవితపు తొలి అనుభవాలని వినడం ఇష్టం లేక తప్పించుకునే ప్రయత్నం చేసాడు శివరామ్.

“అవును, నేను ఆరోజు వేట గురించి మాట్లాడుతున్నాను. ఇదంతా అందులోని భాగమే. ఓ మనిషిని తన స్నేహితుడు చంపడానికి ప్రయత్నిస్తూంటే, ఆ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఓ అందమైన బంధంలో ఉండి, పెద్దయ్యాకా ఆ బంధంలోని ముళ్ళు విడిపోతూంటే, ఆ స్నేహంలో బీటలు వస్తుంటే, ఆ అందమైన బాల్యం పోయినట్లే కదా. అందుకని దాని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకిలా జరిగిందో తెలుసుకోవాలి కదా, అందుకని దీని గురించి మాట్లాడుకోవాలి.

మనం స్నేహితులం అని నేననుకున్నాను. నువ్వనుకోలేదు. అందుకే నా వైపున తుపాకీ గురిపెట్టావు.

ఓ మనిషిని చంపడానికి ప్రయత్నిస్తుంటే, ఏం అనుకోవాలి, ఏ ప్రయత్నం చేయకుండా గన్‌లో ఉంచిన గుళ్ళు అలా వచ్చేయదు కదా, నీ మనసులో ఏదో ఉండీ ఉండాలి, ఓ ఆయుధం తెచ్చి, మనిషిని చంపాలని అనుకుంటే దాని అర్థం ఏంటో తెలియాలి కదా. ఇప్పుడు ఆ అర్థం, ఆ నిజం నాకు తెలియాలి.

తప్పు చేసానన్న భావం మొదటి నుంచి ఉంటే ఈ బంధం తెగిపోతుంది. అప్పుడు అది నిజమా కాదా అన్నది తెలుసుకోవాలి.

మనిద్దరం డిఫరెంట్ అని అనుకోలేదు. మనిద్దరం ఒకటే. అది మన స్నేహం వల్లనే వచ్చింది. ఇది చాలా అపురూపం. ఈ స్నేహప్రపంచం నాకెన్నో ఇచ్చింది. నాకెంతో ఇచ్చింది. ఏదో నేర్పించింది. అది నీకు లేదు. అయినా మనం స్నేహితులమే. నువ్వు లండన్‌లో ఉన్నా, మరెక్కడున్నా మనం స్నేహితులమే. అర్థం అయిందా స్నేహం అనే ఈ పదానికి అర్థం నీకు తెలుసు. ” గట్టిగా అన్నాడు.

“మనం ఏదో అపరిచితులం కాదు. రహదారిలో కలుసుకున్నవాళ్లం కూడా కాదు. మన బంధానికి ఏ పదం సరిపోదు. దానికి మరో పర్యాయం లేదు.

మనం స్నేహితులం కాక పోతే నేను నీ ఇంటికి పిలవకపోయినా వచ్చే వాడిని కాను కదా. నీ ఇంటికి రావడానికి నాకు ఓ ప్రత్యేకంగా పిలుపు కావాలా, నాకు ఫార్మాలిటి అదీ ఎందుకు అనుకున్నాను. మనం స్నేహితులం అని అనుకున్నాను కాబట్టి నీ ఇంటికి నువ్వు రమ్మని అనక పోయినా వచ్చాను.

అసలు విషయం లోకి వస్తాను.

ఆ బుధవారం, ఆ రోజున వేటకెళ్ళినప్పుడు మనం స్నేహితులం. నా వైపు తుపాకీని గురి పెట్టావు. ఆ సంగతి మనిద్దరికీ మాత్రమే తెలుసు. అదే రహస్యం. అది మనిద్దరికీ తెలుసు. అది మన మధ్య విషబీజం నాటింది.

ఆనాటి, అప్పటి సీన్ కళ్ళ ముందు కనిపిస్తోంది. అది ఓ మర్డరర్, ఓ క్రిమినల్ ఇద్దరూ నీలో ఉన్న సీన్. అది తలుచుకుంటేనే జరిగింది నిజమేనా అనిపిస్తోంది. మోసం చేసావు, కుట్ర చేసావు. ఇది నన్ను చాలా బాధ పెట్టింది. లోతైన గాయాన్ని, ఎప్పటికీ మానిపోని గాయాన్ని చేసింది.

ఇన్ని ఏళ్ళ తరవాత ఇక్కడికి ఎందుకొచ్చావో నాకు తెలీదు. కారణం నేనడగను. కాని నాకు నిజాలు కావాలి. ఇంక ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి. అది నమ్మదగ్గ విషయం కాకపోయినా వినాలి. నేను చూసింది చెప్పాలి. నాలో అలజడి రేపినది, అయినా మనం స్నేహితులమే.

మనం ఎప్పుడూ అనుకుంటాం బయటి శక్తులు మానవ సంబంధాలని మార్చేస్తాయని, కాని మన విషయంలో కాదు. ఎక్సటెర్నల్ ఫోర్సెస్ ఏవీ కారణం కావు. మన సంబంధాన్ని, దానిని నువ్వే చంపేసావు. నా జీవితాన్ని మానసికంగా నాశనం చేసావు. కాని మనం స్నేహితులమే.

నా వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని అన్నీ కూడా నీ అసూయ కోణంలోంచి చూసి నాకు దూరం అయ్యావు.

ప్రపంచం పట్ల జాగ్రత్తగా, స్పష్టంగా ఉన్నానని అనుకున్నాను కాని, నా పట్ల, నా ఆలోచనల పట్ల చాలా అస్పష్టంగా ఉన్నాను, నా లోపలి ప్రపంచాన్ని శ్రద్ధగా డిజైన్ చేసుకోలేదనిపిస్తోంది.

స్నేహం అన్నది మానసికంగా చేసుకున్న ఓ డీల్ కాదు. కాంట్రాక్ట్ కాదు. అది ఓ చట్టం లాంటిది. దానిమీద మన సంస్కృతి నిలబడుతుంది.

వేట తరవాత ఏం జరిగిందన్నది, నువ్వు చెప్పాలి., ఆ తరవాత జరిగిన దాని గురించి నేను తెలుసుకోవాలి.

ఆ రోజు, బుధవారం.

ఇంకా చీకటి ఉండగానే మనం తయారయిపోయాం. బ్రేక్ ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా ఆ అడవిలోనే. ఇదంతా ముందునుంచి ప్లాన్ చేసిన ప్రోగ్రాం. ఆ సరంజామా, అన్ని తయారు చేయడానికి మనుషులు మనకన్నా ముందే వెళ్ళిపోయారు.

అది ఆరోజే మొదటి సారి కాదు. అంతకు ముందు నాన్నగారు కూడా ఇలాంటి వనభోజనాలు జరిపించే వారు. అందుకని పని వాళ్ళకి ఏవిధమైన కన్‌ఫ్యూజన్ లేకుండా అరేంజ్‌మెంట్లు చేసెస్తారు. ఆ సంగతి నీకు కూడా బాగా తెలుసు.

ఆ రోజు ఉదయాన గాలి విపరీతంగా వీస్తోంది. దానితో చలి కూడా ఎక్కువగా ఉంది.

వెలుగు ఎక్కువ లేకపోవడంతో చెట్లన్నీ నల్లగా మారాయి. ఏ విధమైన కాలుష్యం లేని పరిసరాలు. ఆ దట్టమైన చెట్ల మధ్య నుంచి సన్నటి దారి స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే తొలి వెలుగు చెట్ల కొమ్మల్లోంచి, ఆకుల సందుల్లోంచి మెల్లిగా వస్తోంది.

కావేరికి వేట అంటే ఇష్టం లేకపోయినా, ప్రకృతిని చూసి ఆనందించడానికి వస్తుంది. పనివాళ్ళు అందరూ ఎవరి దారుల్లో వాళ్ళున్నారు.

నేను నీకన్నా కాస్త ముందుగా నడుస్తున్నాను. నువ్వు నా వెనకాల ఉన్నావు. మన పాదాలు, కింద ఉన్న ఎండిపోయిన ఆకుల మీద పడినప్పుడల్లా శబ్దం అవతోంది. ఆ శబ్దాలు ఒకసారి నీది, ఓసారి నాది లయగా వినిపిస్తోంది. కాస్సేపయ్యాక నేను ఆగాను. నా పాదాల శబ్దం ఆగింది. వెంటనే నీ పాదాల శబ్దం కూడా ఆగింది. నేను ఆగాను, ఎందుకంటే దూరంగా ఓ జింక కదలకుండా బొమ్మలా నుంచుని ఉంది. దాని అందానికి మంత్ర ముగ్ధుడినైయ్యాను. అలాగే దాన్నే చూస్తూ నుంచుండి పోయాను. మరి నువ్వు మెల్లగా తుపాకీని చేతిలోకి తీసుకున్నావు. జింకని వేడాడడానికి అని అనుకున్నాను. క్లిక్ శబ్దం. సరి అయిన శబ్దం. గుర్తుందా నీకు.”

శివరాం తల ఊపాడు గుర్తుందన్నట్లు

“అది ఓ బ్రహ్మాండమైన క్షణం. ఓ విధమైన శబ్దం. క్లిక్ మన్న శబ్దం. అది మూడువందల అడుగుల నుంచి. నిశ్శబ్దంగా ఉన్న ఆ తెల్లవారు ఝామున.

నువ్వు కదలడం నీ తుపాకీని తీయడం అన్నీకూడా నేను నా కళ్ళచివర నుంచి గమనిస్తున్నాను. ఆ విషయం నీకు తెలుసు. అది చిన్న విషయమే కావచ్చు. నువ్వు నా వెనకాల నుంచున్నావు. ఓ అర క్షణం నువ్వు గన్ ఎత్తడం తెలిసింది. గురి చూస్తున్నావు. ఓ కన్ను మూసి చూస్తున్నావు. నాకు అన్నీ తెలుస్తున్నాయి.

నేను, ఆ జింక ఒకే లైన్‌లో ఉన్నాం. మా రెండింటి మధ్య ఎక్కువ దూరం లేదు. రెండు టార్గెట్లు. నీ చేయి వణకడం నాకు తెలుస్తోంది. నువ్వు జింకని టార్గెట్ చేస్తున్నావని నేననుకోను. నిజంగా జింకనే టార్గెట్ చేయాలంటే మెల్లిగా సైగ చేసి నన్ను పక్కకి వెళ్ళమనేవాడివి.

జింక మూడువందల అడుగుల దూరంలో ఉంది. నా వెనకాల నువ్వు. అర సెకండు తీసుకున్నావు. నీకు గురి సరిగా చూడడం రాదని తెలుసు. నువ్వు మంచి వేటగాడివి కాదు అని కూడా తెలుసు. కాని, నువ్వు గనక పేలిస్తే, నా శరీరంలో ఎక్కడో ఓ చోట తగులుతుంది. బులెట్ ఏదో చోట దూసుకెళ్తుంది. ఎందుకంటే నేను నీకు ఎదురుగా ఉన్నాను. పైగా కదలడం లేదు. నా తలని కాస్త పక్కకి వంచితే బుల్లెట్ నా చెవి పక్క నుంచి వెళ్ళి, ఆ జింకను చంపవచ్చు. నేను కదలలేనని నాకు తెలుస్తోంది. కదిలితే నువ్వు పేలుస్తావు. నా బతుకు నా చేతుల్లో లేదనిపించింది.

నేను అలాగే నుంచున్నాను. గన్ లోంచి వచ్చే శబ్దం కోసం ఎదురుచూస్తున్నాను.

మరి కాస్సేపటికి గన్ లోంచి వచ్చే బుల్లెట్ నీ స్నేహితుడి తలలోంచి, కాకపోతే మరోచోట నుంచి దూసుకెళ్తుంది. వెళ్తుంది. అది ఓ విషాదకరమైన ప్రమాదం అని అందరూ అనచ్చు, లోకం నమ్మచ్చు. అదే విధంగా పేపర్లలో వార్తగా వస్తుంది.

సగం క్షణం గడిచింది. అయినా గన్ పేలలేదు. హటాత్తుగా జింక రాబోయే ప్రమాదాన్ని గమనించింది. ఒక్కసారిగా పరిగెత్తింది. క్షణంలో మాయమైంది.

అయినా మేము కదల లేదు. ఆ క్షణాన్ని చూడలేదు. పేలిన శబ్దం వినిపించలేదు. నాకు తెలుసు నేను నీ గన్‌కి ఎదురుగా ఉన్నానని. ఆ గన్‌ని మెల్లిగా దించావు. ఆశ్చర్యం ఏమిటంటే నువ్వు నన్ను సులభంగా చంపచ్చు. ఎందుకంటే సాక్ష్యాలు లేవు, సాక్షులు ఏవరూ లేరు. కేసు పెడితే ఏ జడ్జీ కూడా నిన్ను పట్టుకుని శిక్ష వేయలేడు.

నువ్వు నన్ను చంపి ఉంటే, అందరూ నీతో పాటే బాధ పడేవారు. అది ఎంత విషాదం.

ఓ స్నేహితుడిని మరో నమ్మకస్తుడైన స్నేహితుడు చంపడం అన్నది జరగదు. ఎక్కడో రాజవంశాల్లో, అధికారం కోసమో డబ్బు కోసమో స్త్రీ మీది ఉన్న ప్రేమ కోసమో చేస్తారు. ఇవేవి నీలో లేవు. అందుకని నువ్వు కావాలని చేసావని ఎవరూ అనుకోరు. పైగా నీకు నామీద కోపం పగ, కక్ష ఉందని ఎవరూ అనుకోరు.

నువ్వు తుపాకిని నువ్వు పేల్చలేదు. ఎందుకు. ఆ జింక వెళ్లిపోయింది. ఆ క్షణంలో నీకేమైంది.

నీ ప్లాన్ సరి అయినది కాదు. జింక ఉండాలి కాని లేదు. అందుకని దృశ్యం చెదిరి పోయింది. నీ గన్‌ని దించావు.

నిజం ఏమిటంటే ఆరోజు ఉదయాన జరిగినది ట్రయల్ అని అనుకుంటే నన్ను చంపాలన్న ఉద్దేశం నీకు ఉన్నట్లే కదా!

జింక వెళ్ళిపోయింది. మనిద్దరం కదల్లేదు. నేను వెనక్కి తిరిగి చూడలేదు. తిరిగి ఉంటే చూడగలిగే వాడిని. ఆ ధైర్యం చేయ లేదు. పక్షవాతం వచ్చినట్లుగా అయింది.

ఒకలాంటి బాధ, సిగ్గు, అవమానం, కలిగింది. ఓ స్నేహితుడిని చంపాలనుకుంటున్న వాడిని చూడడం. ఒకవేళ నేను గనక కేసు పెడితే నేను నెగ్గుతాను. జరిగినది నేను కోర్టులో రుజువు చెయ్యగలను. కాని నా మనసు ఒప్పుకోదు. నువ్వు నా స్నేహితుడివి, ఎలా, ఎందుకు నిన్ను కోర్టు కీడుస్తాను?”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here