Site icon Sanchika

ఎంత చేరువో అంత దూరము-12

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆనంద్ ఇంట్లో – అక్క వచ్చేది రేపే – అని పిల్లలు గెంతులేస్తుంటారు. ఆనంద్‍కీ సంతోషంగా ఉంటుంది కానీ బయట పడడు. జానూ కోసం స్వీట్స్ కొందామని అనుకుని, తనకి ఏమిష్టమో తెలియదే అని ఊర్మిళతో అంటాడు. షాపుకి వెళ్ళి బోలెడు స్వీట్స్ కొనుక్కొస్తారు. ప్రయాణం చేస్తున్న జానూలో భావోద్వేగాలు. తండ్రికి ఫోన్ చేయాలనుకుంటుంది, కానీ చేయదు. ఆనంద్ కూడా ఒకసారి జానూతో మాట్లాడాలనుకుంటాడు. కానీ సంకోచిస్తుంటే ఊర్మిళే ఫోన్ కలుపుతుంది, కానీ సిగ్నల్స్ ఉండవు. మర్నాడు ఉదయం హైదరాబాద్ స్టేషన్‍లో దిగి ఆనంద్‍ని గుర్తుపట్టి నాన్నా అని పిలుస్తుంది జానూ. పార్కింగ్ దగ్గర తన కోసం ఎండలో ఎదురుచూస్తున్న ఊర్మిళని, తమ్ముళ్ళను హాయ్ అంటూ పలకరిస్తుంది. నాన్నతోనూ, తమ్ముళ్ళతోనూ మాట్లాడుతున్న జానూ తనని పట్టించుకోకపోవడం బాధించినా, కొత్త కదా సర్దిచెప్పుకుంటుంది ఊర్మిళ. ఇంటికొచ్చేస్తారు. కాసేపటికే తమ్ముళ్ళకి ఫేవరెట్ అయిపోతుంది జానూ. భోజనాలకి కూర్చున్నప్పుడు – క్రితం రోజు కొన్న స్వీట్స్ అన్నీ కూతురు ముందు పెట్టి నీకిష్టమైనది తియ్యమంటాడు. వాటిని కూతురుకి తినిపిస్తుంటే ఊర్మిళ వీడియో తీస్తుంటూంది. కాసేపటికి ఊర్మిళని ఆగమని చెప్పి తాను వీడియో తీస్తాడు ఆనంద్. ఇందాక చెప్పిన డిష్‍లనే చూపించడంతో ఊర్మిళ వాటినే తినిపిస్తుంది. ఊర్మిళ స్పర్శ, ఆమె ఉనికి జానూకు నచ్చవు. ఆమె మాటలకు పొడిపొడిగా జవాబులు చెబుతుంది. హైదరాబాదులోని బిర్లా మందిర్, జూ పార్క్ చూసొస్తారు. జానూ తననెందుకు కలుపుకోదో అనుకుంటుంది ఊర్మిళ. మాటల్లో పిన్నీ అనే పదం రాకుండా జానూ జాగ్రత్త పడడం ఊర్మిళ గ్రహిస్తుంది. తండ్రి సమక్షంలో ఆనందంగా గడుపుతున్న జానూ ఓ రోజు హఠాత్తుగా ఏడుస్తూంటుంది. ఊర్మిళ అడిగినా కారణం చెప్పదు. ఆనంద్ లోపలికి వచ్చి, కాసేపు ప్రశ్నించి, ‘ఇవాళ అమ్మ బర్త్ డే కదా! మిస్సవుతున్నావా’ అని అడుగుతాడు. తలూపుతుంది జానూ. ఊర్మిళ తెల్లబోతుంది. జానూ దుఃఖాన్ని ఆపాలని టాపిక్ డైవర్ట్ చేసేందుకు సాయంత్రం మళ్ళీ బిర్లా మందిర్‍కి వెళ్దామని అంటుంది. తన కష్టాలన్నీ నాన్నకు చెప్పుకుంటుంది జానూ. పోనీ ఇక్కడే ఉండిపో అని అంటాడు. అక్కడ రెండు ప్రాణాలు నామీదే ప్రాణం పెట్టుకుని ఉన్నాయంటుంది జానూ. ఆనంద్ ఊరెళుతూ పిన్నితో, తమ్ముళ్ళతో ఎంజాయ్ చేయమని చెప్తాడు. ఆనంద్ గదిలో ఉన్న ఓ ఫోటోని తెచ్చి జానూకు చూపిస్తుంది ఊర్మిళ. ఆ ఫోటోలో చిన్నప్పటి జానూని ఊర్మిళ ఎత్తుకుని ఉంటుంది. వివరాలడితే, అప్పుడు జానూ బేబీ కేర్ సెంటర్‍లో ఉండేదని, తాను అక్కడే పని చేసేదాన్నని, తాను జానూని ఆరు నెలలు పెంచానని ఊర్మిళ చెబుతుంది. జానూ పెద్దగా స్పందించదు. తాను ఆశించిన భావాలు జానూ ముఖంలో కనబడక, నిరాశ చెందుతుంది ఊర్మిళ. – ఇక చదవండి.]

అధ్యాయం 12

[dropcap]ఆ[/dropcap] సాయంత్రం జాహ్నవికి ఒళ్ళు వెచ్చబడింది. తలనొప్పిగా కూడా ఉంది. ఎండలు పెరిగాయి. మైసూర్‌తో పోలిస్తే హైదరాబాద్‌లో ఎండలు ఎక్కువేనాయె! తల నొప్పితో, పెద్ద వాంతి అయ్యింది జాహ్నవికి.

చల్లటి నీళ్ళ కోసం కిచెన్ లోకి వెళ్ళబోతూ, భళ్ళున వాంతి చేసుకుంది.

ఆపుకోవడం సాధ్యం కాలేదు. వంటింటి పరిసరాల్లో వాంతి అయినందుకు గిల్టీగా ఫీలయ్యింది. శుభ్రం చేయబోతూంటే మెత్తని చేయి వచ్చి, ఆపింది. ఊర్మిళ చేతిలో మంచి నీళ్ళ గ్లాస్ ఉంది.

“నువ్వు ముందు నోరు కడుక్కో జానూ! అవన్నీ నేను చూసుకుంటాను కదా!” జాహ్నవి వారిస్తే వినలేదు.

జాహ్నవికి చలువ కోసం ఊర్మిళ, టి. వి.లో చెప్పారని సబ్జ గింజలు తెప్పించింది..

ఆమె సౌజన్యం, నిత్య జీవితంలో ఆమె మనో సౌకుమార్యం అప్రయత్నంగానే జాహ్నవి దృష్టికి వస్తున్నాయి. ఈవినింగ్ ఫ్లయిట్‌కు ఆనంద్ వచ్చాడు. జాహ్నవికి జ్వరం వచ్చి, తగ్గిందని చెప్పింది. వాంతి అయింది అని చెప్పింది. తాను శుభ్రం చేసిన మాటా ఎక్కడా చెప్పలేదు.

వగలాడి – మాయ లాడి. ఇవేనా వగలు – ఇవేనా మాయలు.

వంటింటి పరిసరాలు కదా! గట్టు, ఫ్రిజ్ కూడా శుభ్రం చేయవలసి వచ్చింది. పాపం, అనుకుంది, అప్రయత్నంగా.

***

ఆరెంజ్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకొని తయారయ్యింది ఊర్మిళ. కంప్యూటర్ ముందు కూర్చున్న జాహ్నవితో ‘వెళ్ళొస్తాన’ని చెప్పింది. అక్కడే ఉన్న ఆనంద్ “అదేమీ జాన్వీని కూడా తీసుకొని వెళ్ళడం లేదా!” అన్నాడు. ఊర్మిళ జాహ్నవి వంక చూసింది. జాహ్నవి ‘ఎక్కడికి’ అన్నట్టుగా చూసింది.

“బ్రెయిలీ క్లాస్” అంది ఊర్మిళ. తాను వారానికి మూడు క్లాస్‌లు ఫ్రీ గా చెప్తుందని అన్నాడు ఆనంద్.

జాహ్నవిలో కుతూహలం పెరగడంతో ఊర్మిళ వెంట వెళ్లేందుకు సిద్ధపడింది.

కెనెటిక్ హోండాపై ఊర్మిళ వెనుకాల కూర్చుంది జాహ్నవి. రోడ్లు రద్దీగా ఉన్నాయి.

అప్పుడప్పుడు ఊర్మిళ స్పర్శ సుతిమెత్తగా తగులుతున్నది. పిన్నితో ఇంత సన్నిహితత్వం కొత్తగా ఉంది జాహ్నవికి. ఈమె నాన్న కంటే చాలా చిన్నదేమో, అనిపించింది.

నీరెండ కాంతికి ఊర్మిళ శరీరచ్చాయ తళుక్కుమంటున్నది. హ్యాండిల్ పట్టుకున్నందుకే చేతులు కందిపోతయేమో నన్నంత లావణ్యం, సౌకుమార్యం..

అక్కడ అంధ విద్యార్థులను చూసి చలించిపోయింది జాహ్నవి.

‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ మరి. తనకు సహజం గానే అన్ని విషయాల్లో తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. అందుకే అక్కడి విషయాలు కూడా బాగా గమనించింది.

తిరిగి వస్తూంటే మనసు ఏదోలా అయ్యింది.

అప్పటికే సూర్యుడు నడి నెత్తిమీదకు వచ్చాడు. ఊర్మిళ ఒక దగ్గర బండి ఆపింది.

నిలబడిన జాహ్నవిని, అక్కడే ఉన్న చెట్టును చూపిస్తూ, “నీడలో నిల్చో” అంది. ఆ కంఠంలో సహజ సిద్దమైన లాలన!

జాహ్నవికి అర్థం అయ్యింది, ఊర్మిళ అక్కడ ఎందుకు ఆపిందో!

రెండు చేతుల్లో చెరుకు రసం గ్లాస్‌లు పట్టుకొని వచ్చి, “తీసుకో, జానూ!” అంది. జాహ్నవి గ్లాస్ అందుకుంటు ఆమె వంక చూసింది. ఊర్మిళ చిరు దరహాసం చేసింది. దైవత్వపు కొలనులో ఈదుతున్న చేపపిల్లల్లా ఆ కళ్ళ దరహాసం. కాగాడా వేసి వెతికినా కల్మషం కనిపించదేమో! జాహ్నవి తాను కూడా స్మైల్ ఇచ్చింది. ‘నేను ఈమెకు క్లోజ్ అయిపోను కదా!’ అనుకుంది. అలా చేస్తే ఆమ్మ కు ‘భావ ద్రోహం’ చేసినట్టే!

కెనెటిక్ హోండా ఇల్లు చేరింది.

“కారు తీసుకొని వెళ్లుంటే సరిపోయేది” ఎండకు వడలిన వాళ్ళ ముఖాలు చూస్తూ అన్నాడు ఆనంద్.

“అదే అనుకున్నాను. జానూకు ఇంత ఎండలు అలవాటు లేదు కదా!” అంది.

దటిజ్ ఊర్మిళ.

ఆమె మిగిలి పోయిన వంట పని పూర్తి చేసింది.

జాహ్నవి గూగుల్‌లో మరింత సమాచారం కోసం వెదికింది. మైసూర్‌లో ఇలాంటివి ఉండిఉండవు అనుకుంది. ఫ్రెండ్ మెసేజ్ చూసుకొని చాటింగ్ మొదలు పెట్టింది.

ఊర్మిళ అందర్నీ భోజనానికి రమ్మని చెప్పింది.

అన్నం తింటూ, ఇన్‌స్టిట్యూట్‌లో తనకు వాళ్ళను చూస్తే బాధ కలిగిందని చెప్పింది. స్పర్శ, చుక్కలు లాంటి వాటి ద్వారా వాళ్ళు లిపిని నేర్వడం – చాలా ఫీలింగ్ తెప్పించింది తనకు అని చెప్పింది.

“మరి నీకు తెలియని ప్రపంచాన్ని పరిచయం చేసిన మీ పిన్నికి థాంక్స్ చెప్పావా? లేదా?”

“ఉహు! ఆ ఐడియా రాలేదు.”

“నీకు ఇంకో విషయం తెలుసా, తల్లీ! “

“చెప్పండి డాడ్!”

“అక్కడ ఉన్న కొన్ని ఎక్విప్మెంట్స్‌లో మీ పిన్ని హస్తం ఉంది.”

“ఓహ్! నైస్!” అంది జాహ్నవి.

ఆమెకు నిజం గానే సంతోషం కలిగింది.

“ఏమిటీ నైస్! ఇలా చార్టీలతో ఖజానా గుల్ల జేసేసింది.”

జాహ్నవికి అర్థం అయ్యింది, ఇదంతా ఊర్మిళను ఉడికించేందుకేనని. డాడ్ వర్క్ బిజీలో సీరియస్‌గా కనిపిస్తారు కానీ, ఇలా ఫ్రీ టైంలో జోవియల్ మూడ్ లోకి వచ్చారంటే ఇంక అంతే, పిన్ని పని అయిపోయినట్టే!

“నన్నేదో అన్నారు” అంటూ బుంగమూతి పెట్టుకుని వచ్చింది ఊర్మిళ.

“నేను నిన్నేమీ అనలేదు. నీ చారిటీస్ వల్ల జస్ట్ ఇంకో బిల్డింగ్ కొనడం మిస్ అయ్యాను. అంతే!”

జాహ్నవి చిరునవ్వుతో డాడ్‌నే చూస్తూంది. డాడ్ మాట్లాడే తీరు, ఆ మానరిజం ఇష్టం ఆమెకు.

ఊర్మిళ ఇంకా చిరుకోపం గానే ఉండడం చూసి, “నిజం ఊర్మిళా మిస్!” అన్నాడు. “పంచభూతాల సాక్షిగా, ఈ గది గోడలు, కిటికీలు సాక్షిగా, ఇదుగో ఈ రెండు జడల అమ్మాయి సాక్షిగా, ఈ జలుబు చేసిన బుజ్జి గాడి ముక్కు సాక్షిగా.. ”

జాహ్నవి తినడం మానేసి పొట్ట పట్టుకొని నవ్వ సాగింది. జాహ్నవి ఎలా నవ్విందో బుజ్జిగాడు ఇమిటేట్ చేసి చూపిస్తూంటే జాహ్నవి నవ్వు రెట్టింపు అయ్యింది.

అంతా ఆనంద్ జోకులతో, బుజ్జిగాడి చిలిపి చేష్టలతో భోజనం ముగించారు.

జాహ్నవికి హఠాత్తుగా తానొక స్వార్ధపరురాలిని అనిపించింది. అమ్మనూ, తాతయ్యనూ నిశ్శబ్దానికి వదిలి తనకు కావాలిసిన ప్రపంచం తాను వెదుక్కుంది. ఇంకెన్నాళ్లులే, కొన్నాళ్ళయితే గో బ్యాక్ టు మైసూర్ అనుకుంది.

***

ఆ రోజు ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళింది, జాహ్నవి. ఆనంద్ ఫ్రీ గానే ఉన్నానని చెప్పడంతో ఎదురు సీట్లో కూర్చుంది.

“అమ్మా, తాతగారు మండ్య వెళ్ళారట.”

“వై” అన్నాడు కళ్ళతోనే.

“కొన్నాళ్ళు భూషణం తాతగారు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళను రమ్మనమని చెప్పారట.”

“ఓ.కే. అయితే ఇంకేం నీవు పోస్ట్‌పోన్ చేసుకో!”

“—- — — –”

“జానూ! అల్లారు ముద్దుగా పెంచుకునే వాణ్ణి. నా నుండి దూరం అయ్యావు. ఈ వచ్చిన అవకాశంతో నయినా కొన్ని రోజులు ఉండి పో!” నిదానంగా, గంభీరంగా అన్నాడు. జాహ్నవి నుండి నో రిప్లై..

“ఈ అవకాశం ఇచ్చినందుకు మీ పిన్నికి థాంక్స్ చెప్పాలి నేను. నీ లెటర్స్‌కు ఎంత కదిలిపోయినా, సమాధానం ఇవ్వలేకపోయాను. కారణం, నేనొక్కడిని నిర్ణయించ గలిగిన మేటర్ కాదు. ఊర్మిళను అడిగి, ఇబ్బంది పెట్టలేకపోయాను. తానే నీ లెటర్స్ చూసి, నాచే లెటర్ వ్రాయించింది.” చెప్పాలనుకున్న విషయానికి సమయం వచ్చింది, ఆనంద్‌కు.

జాహ్నవి నివ్వెర పోయింది.

లెటర్ వ్రాయించింది పిన్నినా!

ఇంతలో ఆనంద్‌ను కలవడానికి ఎవరో వచ్చారని ప్యూన్ వచ్చి, చెప్పాడు.

జాహ్నవి అక్కడి నుండి బయటకు వచ్చింది.

వచ్చినప్పటి అంత వేగం ఇప్పుడు మెట్లు దిగడంలో లేదు.

పిన్ని వ్రాయించిందా లెటర్.

జాహ్నవి కళ్ళు తెరుచుకుంటున్నాయి.

నాన్నను ఆమె వల్లే కలుసుకోగలిగిందా!

నిశ్శబ్దంగా తన గది లోకి వచ్చి కూర్చుంది.

మౌనంగా ఆలోచిస్తూంది.

నాన్న ఉండిపొమ్మంటే ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. అమ్మ మూడ్ బాగుంటే పర్లేదు.

లేకుంటే తాను మరి కొన్నిరోజులు ఉంటానంటే ఎంత సీన్ అయినా, చేయగలదు. పిన్ని కూడా అనూప్ బర్త్ డే అయ్యే దాకా ఉండిపొమ్మంది. హఠాత్తుగా జాహ్నవికి తనకూ ఆత్మీయులు ఉన్నారనిపించింది.

నాన్న కోసం మాత్రమే వచ్చింది తాను. కానీ ఇద్దరు తమ్ముళ్ళున్నారు.

పిన్నికి పరాయి అన్న భావనే లేదు.

ఇది కూడా తన ఇల్లే.

ఈ ఇంట్లోని పిల్లల్లో తానూ ఒక పిల్ల.

ఇంత స్వీట్ ఫీలింగ్ వచ్చిందీ అంటే, అది పిన్ని వల్లే.

అమ్మను ఇంకొన్ని రోజులు ఉంటానని అడగాలి అనుకుంటుండగా, ఊర్మిళ కిచెన్‌లో నుండి పిలిచింది.

“వస్తున్నా పిన్నీ” అప్రయత్నంగా, అంది.

ఆమె నోటి వెంట ‘పిన్నీ’ అన్న పదం ఆశ్చర్యంగా విన్నది ఊర్మిళ.

***

ఎండలో ఆటలకు వెళ్ళకుండా, తమ్ముళ్ళిద్దరినీ కంట్రోల్ చేసేందుకు రోజూ వాళ్ళతో ఇండోర్ గేమ్స్ ఆడుతుంది జాహ్నవి.

ఆ రోజు పిల్లలిద్దరూ కార్టూన్ ఫిల్మ్ చూస్తున్నారు.

“జానూ! బోర్ కొడితే బుక్స్ ఉన్నాయి, చదువుకో!” అంది ఊర్మిళ.

ఆమె గది లోకి అడుగుబెట్టింది.

నిలువెత్తు రాక్స్‌లో షెల్ఫ్‌ల నిండా పుస్తకాలు.

ఒక్కో బుక్‌నీ వివరిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. జ్ఞానమూర్తినిలా భాసిల్లుతున్న ఊర్మిళని జాహ్నవి ఆశ్చర్యంగా చూసింది. అన్ని బుక్స్ గురించి వింటూ ఏది తీసుకోవాలో అర్థం కాలేదు జాహ్నవికి.

“ఈమె ఫోటో ఇక్కడా..!!?” అంది గోడకు ఉన్న వాల్ పెయింటింగ్‌ను చూస్తూ.

“ఆమె తెలుసు కదా! సినిమా యాక్ట్రస్.. భరత నాట్యం.. అన్నింటిని మించి యానిమల్ వెల్ఫేర్ ఆక్టివిస్ట్,” అంది.

“ఆ ఐరిష్ యువతి మానవత్వం అనే పదానికి అర్ధాన్ని మరో శిఖరంపై నిలిపింది. మూగ జీవాల సంరక్షణనే ధ్యేయంగా బ్లూ క్రాస్ సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తోంది. మనిషికి చేసే సహాయంలో గుర్తింపబడాలన్న స్వార్థం, తిరిగి సహాయం పొందవచ్చన్న ఆశ ఉండవచ్చు కానీ, మూగ జీవులకు చేసే సహాయంలో దైవత్వం మాత్రమే ప్రతిఫలిస్తుంది.” అని ఊర్మిళ చెప్తూంటే శ్రద్ధగా విన్నది జాహ్నవి.

“అపకారం చేసేవయినా, ఉపకారం చేసేవయినా వాటి ప్రవృత్తిని యాజ్ ఇటీజ్‌గా స్వీకరించి, స్పందించిన హృదయంతో సహాయం అందించేందుకు కంకణం కట్టుకున్న వారెవరయినా మహోన్నతులే. అందుకే ఆమె అంటే అభిమానం,” అని కాస్సేపాగి..

“ఆ ప్రేరణ తోనే గాయపడిన జంతువులు, పశు పక్ష్యాదులు కనిపిస్తే వేణు సహాయంతో బ్లూ క్రాస్‌కు తీసుకుని వెళ్తాను. నాన్న నాకెప్పుడూ అభ్యంతరం చెప్పరు,” అంది.

జాహ్నవికి ఈజీగా ఉంటుందని అంతా ఇంగ్లీష్ లోనే చెప్పింది.

జాహ్నవికి అర్థం అయ్యింది పిన్ని లెవెల్ ఎక్కడో ఉంది.

అందుకోవడం అందరికీ సాధ్యం కాదని.

***

అమ్మకెలా చెప్పాలి అన్న ఆలోచన వేధిస్తూంది జాహ్నవిని.

తాను కొన్నాళ్ళు ఆగి వస్తానంటే ఎలా అర్థం చేసుకుంటుందో!

వెళ్ళాలి అంటే ఇన్ని మనసుల అభ్యర్థనను ప్రక్కకు నెట్టాలి.

ముఖ్యంగా బుల్లి తమ్ముడు “అక్కా! నా బర్త్‌డేకు ఉండిపోవా! ” అని అడుగుతుంటే నో చెప్పలేక పోతోంది.

రావడము, వెళ్లడం రెండూ ఆలోచించే విషయాలే, తన ప్రయాణంలో అనుకుంది.

ఆ రాత్రి తన రూమ్‌లో పడుకుని, మాలతికి ఫోన్ చేసి మెల్లనయిన స్వరంతో అడిగింది.

“అమ్మా! నాన్న, నన్ను కొన్ని రోజులు ఉండి బయల్దేరమంటున్నారు,” ధైర్యం చేసి అంది..

మాలతి దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు.

సంతోషించాలా! ఏడ్వాలా!

తన జీవితాన్ని కూల్చిన దాని దగ్గర తన బిడ్డ ఇంకా కొన్ని రోజులంటాను అంటే..

“ఎందుకు” అంది.

“ఊరికేనే, అమ్మా!” అంది.

“కుట్ర, నన్నేడిపించాలని” అంది.

“ఏమీ లేదమ్మ! పిన్ని చాలా మంచిది”

ఆటంబాంబు పడ్డట్టు ఉలిక్కి పడింది, మాలతి.

“ఏమిటీ..?” అంది సాగదీస్తూ.

జాహ్నవికి తన తప్పు తెలిసి వచ్చింది.

చివరికి మాలతి ఉండూ, వద్దూ అని ఏదీ తేల్చి చెప్ప లేదు.

విషయం విన్న తాతగారు, “జానూకు తండ్రితో ఎంత బాండింగ్ ఏర్పడితే, ఆమె భవిష్యత్తుకు అంత మంచిదమ్మా!” అన్నారు.

మాలతి అసహనంగా నుదురు కొట్టుకుంది.

“మంచీ, మంచీ.. ఏమి మంచి చెప్పండి. ఎవరికి మంచి,” అంది.

మాలతి ఎప్పుడూ తనతో ఇలా మాట్లాడదు.

బిడ్డ కూడా దగ్గర లేక, వాళ్ళందరూ సంతోషంలో ఉంటే బిడ్డ, భర్తతో కలిసి తాను పంచుకోవాల్సిన సంతోషం మరెవరో దోచుకుంటున్నారన్న బాధ.

మాలతి ఏమీ బాగా లేదు. చాలా ఫస్ట్రేషన్‌లో ఉంది.

ఈ విషయం జాహ్నవికి చెప్పాలని ఎంత అనిపించినా, పిల్ల సంతోషం పాడు చేయకూడదని మిన్నకుండిపోయారు తాతగారు.

***

తమ్ముడి బర్త్‌డే అయ్యాక వెళ్ళమన్నాడు ఆనంద్. ఫ్లయిట్ టికెట్స్ తీసి ఉంచుతానన్నాడు.

జాహ్నవి సందిగ్ధంలో పడింది.

ఎలాగూ బర్త్ డే దగ్గరికి వచ్చేసింది. తను ఉండనంటే చిన్న బుచ్చుకున్న తమ్ముడి ముఖం చూస్తే బాధగా ఉంది.

అమ్మను, తాతగార్ని చూసి ఎన్నో రోజులయినట్టు అనిపిస్తూన్నా, ముఖ్యంగా అమ్మ హెల్త్ ఎలా మేనేజ్ చేసుకుంటూందో అని బాధగా ఉన్నా, బర్త్ డే డేట్ దగ్గర లోనే ఉంది కనుక సరేనంది.

ఆ రోజు మాలతికి మళ్ళీ చెప్పింది.

“నాలుగు రోజులు ఆగి వస్తాను అమ్మా!” అని.

“నువ్వు ఆ మాట నాలుగు రోజుల క్రితం కూడా అన్నావు” కోపంగా అంది.

“ఫ్లయిట్ టికెట్స్ కూడా బుక్ అయినయి అమ్మా! ఫోర్ డేస్ టైం చాలు.” అంది

“ఎందుకు?”

“తమ్ముడి బర్త్ డే,” అర్థం చేసుకుంటుందని అంది.

అగ్నిలో ఆజ్యం పడ్డట్టు ఆ మాటతో భగ్గుమంది, మాలతి మనసు. జాహ్నవి లైన్‌లో ఉందన్న విషయం మరిచినట్టు అలాగే ఫోన్ పట్టుకొని నిలబడింది.

తమ్ముడు, అవును జాహ్నవికి తమ్ముడే కదా! జానూకు అందరూ ఉన్నారు. ఈ పిచ్చి మాలతికే ఎవరూ లేరు.

“అమ్మా!” అంది మళ్ళీ జాహ్నవి.

మాలతి సంఘర్షణను దిగమింగింది. క్షణక్షణం మనోవేదనను అనుభవిస్తున్నానని చెప్పలేక పోయింది. ఆమె లోని తల్లి మనసు జాహ్నవి అభ్యర్థనను తోసి పుచ్చలేకపోతోంది.

“నీ కెలా బాగుంటే అలా చేయి!” అంది ఫోన్ పెట్టేస్తూ.

జాహ్నవి సందిగ్ధంలో పడింది. ఉండాలా, వెళ్ళాలా అని.

ముందరి కాళ్ళకు బంధాల్లా ఇందరి అభ్యర్థనలు – బుల్లి తమ్ముడి కోరిక – ఈ కొన్ని రోజులే కదా! అనుకుంది. అదే పెద్ద పొరపాటు అవుతుందని జాహ్నవి ఊహించలేక పోయింది.

మాలతి జేవురించిన ముఖంతో శిలా ప్రతిమలా కూర్చుండి పోయింది.

“నాన్నా!” అని పిలిచింది.

“చెప్పమ్మా!” అన్నారు.

“రాధ పిన్ని చెప్పింది. ఒక కేస్‌లో పద్నాలుగేళ్ళు తల్లిని పెంచమని, ఆ తర్వాత బిడ్డ బాధ్యత తండ్రికి అప్పగించారట. నిజమేనా?” అంది.

“చూడు, మాలతీ! అవన్నీ వివిధ పరిస్థితుల ఆధారంగా తీర్పు ఇవ్వబడతాయి. నీవు, ఆనంద్ విడాకులే తీసుకోలేదు. ఇంక అవన్నీ ఆలోచించడం అవసరమా! చూడు, మందులు వాడుతున్నా, బి. పి. కంట్రోల్ లోకి రావట్లేదు. ముందు నీ ఆరోగ్యం చూసుకోమ్మా! మాకు నువ్వు కావాలి తల్లీ!” గద్గద కంఠంతో చెప్తూ,

“ఇంకెంత నాలుగు రోజుల్లో జాహ్నవి వస్తుంది.” అన్నారు నచ్చచెప్పుతూ.

అవునన్నట్టు అదోలా తలాడించింది మాలతి.

***

షాపింగ్‌కు తయారు అవమంటే తనకేమీ వద్దు అంది, జాహ్నవి.

“ఏమ్మా! ఎందుకలా!” అన్నాడు.

ఆ వయసుకు జాహ్నవి అలా మాట్లాడడం ఆనంద్‌కు సరిగా అనిపించలేదు.

“నా తృప్తి కోసం ఒప్పుకో జాన్వీ!” అన్నాడు.

“మీకు పిన్నికి నచ్చినవి నాకు ఓ.కె. డాడ్!” అంది.

ఆమె తల వంచి డ్రాయింగ్ గీస్తూంది.

కళ్ళ అప్రయత్నంగా నిండుకున్నాయి.

“నీకు నచ్చినవి తీసుకోవడం మాకు తృప్తిగా ఉంటుంది” ముందుకు వంగి డ్రాయింగ్ గీస్తున్న జాహ్నవి నిండా నీళ్ళతో తలెత్తి చూసింది. “నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది పిన్నీ! ఇంత కంటే ఏమీ కావాలని లేదు. థాంక్యూ పిన్నీ! థాంక్యూ సో మచ్!” అంది.

మరో రెండు రోజుల్లో ఈవినింగ్ ఫ్లయిట్‌కు అందర్నీ విడిచి వెళ్ళాలి.

ఊర్మిళకు, ఆనంద్‌కు మనసు బరువెక్కింది.

“అయితే ఇప్పుడు వాడికి బర్త్‌డే డ్రెస్ కొనాలి కదా! అందరం కలిసి అటే వెళ్దాం.” అన్నాడు. వాతావరణం తేలిక చెయ్యాలి అనే కాదు, ఉన్న ఆ కాస్త టైం కూతురిని మిస్ అవడం ఇష్టం లేక కూడా.

జాహ్నవి బాధపడడం అతను భరించలేక పోతున్నాడు. జాహ్నవి ఇది అంతా తేలిగ్గా తీసుకుంటే బాగుణ్ణు. ఎలా తీసుకుంటుంది?

ఆడపిల్ల కదా! తనకే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి.

ఏదయినా జాహ్నవి బాధ పడుతున్న విషయం అతన్ని బాగా టచ్ చేసింది.

కారు ఆబిడ్స్ చర్మాస్ ముందు ఆగింది. బుజ్జిగాడి బట్టల సెలక్షన్ అయిపొయింది.

జాహ్నవికి డ్రెసెస్ తీసుకోవాలి అన్న టాపిక్ మళ్ళీ వచ్చింది.

“వద్దు నాన్నా! ఢిల్లీ వెళ్ళినప్పుడు నా కోసం తెచ్చారు కదా! అవే నాకు మార్వలెస్!” అంది. ఆ మాటలు పట్టించుకోకుండా, “నీకు ఏ టైప్ డ్రెసెస్ ఇష్టం జానూ! అంది ఊర్మిళ.

“నా కంటూ ఇష్టాలు ఏమీ లేవు. అమ్మ కోసం గాడిగా వర్క్ చేసి ఉన్న డ్రెసెస్, తాతయ్య గారి కోసం పట్టు పరికిణిలు.”

“మరి నీ కోసం?”

“ఎప్పుడయినా ఏదయినా బాగా నచ్చితే తీసుకుంటాను.”

“ఎందుకీ త్యాగాలు జాన్వీ!” అన్నాడు.

“త్యాగం కాదు డాడ్, అది నా బాధ్యత. వాళ్ళను హ్యాపీగా ఉంచాలి.”

“అందుకు నిన్ను నువ్వు కోల్పోవలసిన అవసరం లేదు జాన్వీ! ఆ తేడా తెలుసుకో!” అన్నాడు. పిల్లలున్నారనీ సంభాషణ ఇంగ్లీష్ లోనే నడుస్తూంది.

జాహ్నవి తండ్రి మాటలు కాసేపు ఆలోచించింది.

“నాన్నా! నాకో సందేహం.” అంది.

“చెప్పు రా!” అన్నాడు.

“నాకెందుకు డాడ్ మీరు అన్నట్టుగా నా గురించి ఆలోచించుకోవాలని పించదు?”

“అందుకు నీ ప్రేమ ఒక్కటే కారణం కాదు జాన్వీ! ఆ ప్రేమ వల్ల వాళ్ళ పరిస్థితులపై విపరీతమైన సానుభూతి, జాలి. వాళ్ళ ఆరోగ్యాల పట్ల విపరీతమైన అభద్రతా భావం.

ఏదయినా ఒంటరిగా ఎదుర్కోక తప్పదనే అంతరంగం లోని భయం -జాన్వీ ఐ థింక్, సిబ్లింగ్స్ ఉంటే షేరింగ్‌లో నీకు ధైర్యంగా ఉండేదేమో!”

జాహ్నవి వింటూంది. నాన్న చెప్పిన మాటలు ఆలోచిస్తూంది.

“ఆ పరిస్థితుల పట్ల జాలి వల్లనే బాధ్యత, బరువులు అంటూ పెద్ద మాటలు.” ఆనంద్ అన్నాడు.

జాహ్నవి తండ్రి భుజంపై తల వాల్చింది. ఇన్నాళ్ల మనోవేదన తీరేలా వెక్కి వెక్కి ఏడ్చింది. “మీరు.. మీరు ఉంటే నేను ఇలా అయ్యేదాన్నా డాడ్!” అంది.

ఆమె మనోవేదన కరిగి పోవాలనీ వారించ లేదు. పిల్లలు అప్పటికే నిద్రలోకి జోగారు.

“లైఫ్‌లో అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. నిన్ను నువ్వు కోల్పోకుండా” అదే మాట మళ్ళీ చెప్పాడు.

“ఓ.కే. డాడ్!” అంది.

నాన్న ముందు అమ్మ పేరు తెచ్చింది. ఇంటి పరిస్థితులు మాట్లాడింది. పిన్ని అక్కడే ఉంది. కూల్ గానే ఉంది. థాంక్ గాడ్! ఈమెకు అమ్మలా గొడవ చేసే మెంటాలిటీ లేక పోవడం ఒక అదృష్టం అనుకుంది.

ఇంక సంభాషణ పొడిగించలేదు ఆనంద్.

కారు ముందుకు సాగింది..

సిటీ లోని ఓ ఖరీదయిన షాప్ ముందు ఆగింది.

జాహ్నవికి బోలెడు బట్టలు తీసి పెట్టి, ఛాయిస్ ఆమెకే ఇచ్చారు..

“జానూ ఏదో ఒకటి తీసుకోండి లాంటి మాటలు నాన్న ముందు, పిన్ని ముందు మాట్లాడవద్దు. నీకేవి నచ్చాయో నీకు తెలియకుండా ఉండదు. కమాన్!” అంది ఊర్మిళ.. ఆ ప్రేమ లోనే ఉన్న ఆజ్ఞాపన అర్థం అయ్యింది జాహ్నవికి.

తనకు నచ్చినవి సెలక్ట్ చేసుకుంది.

“గుడ్! అమ్మాయిలంటే అలా ఉండాలి. నచ్చినవి కొనివ్వమని అలగాలి. గోల చేయాలి. అది మీ పిన్ని క్కూడా నేర్పాలి” అంటూన్న ఆనంద్ మాటలకు అక్కడ నవ్వులు వెలిశాయి.

జాహ్నవికి మూగబోయిన తమ ఇల్లు గుర్తుకు వచ్చింది. తాను కూడా లేక ఇల్లు ఎలా ఉందో! అనుకుంది.

ఊర్మిళతో అరమరికలు లేకుండా కలిసి పోతున్నది జాహ్నవి. నాన్నతో పిన్నినే లెటర్ వ్రాయించిందని తెలిసినప్పటి నుండి పిన్ని పట్ల విముఖత్వం తొలగిపోయింది.

(ఇంకా ఉంది)

Exit mobile version