Site icon Sanchika

ఎంత చేరువో అంత దూరము-14

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[జాహ్నవికి నగలు కొనడానికి బంగారం షాపులో ఉండగా, ఆనంద్‍కి ఫోన్ వస్తుంది. మైసూర్ నుంచి శ్రీనివాస్ చేస్తాడు. సంభాషణ ముగిసేసరికి ఆనంద్ గంభీరంగా మారిపోతాడు. మాలతి స్ట్రెస్ ఫీలవుతోందని, జానూని వెంటనే పంపమని ఆ ఫోన్ కాల్ సారాంశం. ఏవో ఆలోచిస్తూ ఇల్లు చేరుతారు ఆనంద్, ఊర్మిళ. తండ్రి తనకి నగలు కొనితేవడం జానూకి సంతోషం కలిగిస్తుంది. ఇంటికెళ్ళాకా, డ్రెస్ వేసుకుని, నగలు ధరించి ఫోటీ తీసి పంపిస్తానంటే, ఇక్కడే ఆ పని చేయమంటాడు ఆనంద్. అక్కకి కొన్న నగలను చూసి, అక్కకు పెళ్ళా అని అడుగుతాద్డు చిన్నోడు. అందరూ నవ్వుతారు. తాను పెళ్ళి చేసుకోననీ, అడ్వకేట్‍నవుతానని అంటుంది జానూ. ఎందుకు అని ఆనంద్ అడిగితే, ఒక వేళ డైవోర్స్ అయితే పిల్లల్ని బాధపెట్టడం ఇష్టం లేదంటుంది. జాహ్నవికి పెళ్ళి పట్ల విముఖత ఏర్పడుతుందేమోనని భయపడుతుంది ఊర్మిళ. తానిక్కడ ఎంత సంతోషంగా ఉంటే, అక్కడ తల్లి అంత ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటుందని గుర్తు చేసుకుంటుంది జానూ. మర్నాడే బుజ్జిగాడి బర్త్‌డే. కానీ అనుకోకుండా ఆనంద్ ఊరెళ్ళాల్సి రావటంతో పుట్టినరోజు వేడుక వాయిదా పడుతుంది, దాంతోపాటు జానూ ప్రయాణం కూడా. ఈ విషయం తల్లికి చెప్పాలని ఆమెకు ఫోన్ చేసి, ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని తలచి, వెంటనే కట్ చేసేస్తుంది జానూ. కాసేపయ్యాకా, తాతగారికి ఫోన్ చేసి జరిగినదంతా చెప్తుంది. ఆయన మెల్లిగా మాలతికి చెప్తారు. ఆ రాత్రి అన్నం తినదు మాలతి. భద్రం గారు మాలతికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు. తాను హైదరాబాద్ వెళ్ళి జానూని తీసుకొస్తానని అంటుంది. మాలతి మొండిగా ఉంటే, కంచంలో అన్నం పెట్టుకొచ్చి, తినకబోతే తన మీద ఒట్టే అని ఆయన అనబోతుంటే, చప్పున ప్లేట్ తీసుకుని తినడం మొదలుపెడుతుంది. మాలతిని సముదాయించడం తన వల్ల కాదని భావించిన భద్రం గారు రాధమ్మ గారిని వెంటబెట్టుకు రమ్మని భూషణంగారికి ఫోన్ చేస్తారు. అదే సమయంలో హైదరాబాద్‍లో ఊహించని ఘటన జరుగుతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 14

[dropcap]ఊ[/dropcap]ర్మిళ అస్సలు ఊహించలేదు.

నాని గాడి డ్రెస్ మీది నెక్కర్ కనిపించడం లేదు. కామన్ బాత్ రూమ్‌లో ఏమన్నా విప్పాడేమోనని కాలు అలా పెట్టిందో లేదో సర్రున జారింది.

హాండ్ వాష్ బాటిల్ మూత పెట్టి లేనట్టుంది. ఏమి తగిలి క్రిందపడిందో.. బాత్ రూమ్‌లో కాలు పెడుతూనే సర్రున జారింది ఊర్మిళ. బ్యాలన్స్ కంట్రోల్ చేసుకునే క్రమంలో కాలు మడత పడి, కాలు పై బరువు పడింది.

నిన్నటి నవ్వుల రాణి నేడు నొప్పి తట్టుకోలేక విలవిల లాడుతూంది. కళ్ళ వెంట నీళ్ళు ధార గా కారి పోతున్నాయి, ఊర్మిళకు.

శబ్దం విని పరిగెత్తుకు వచ్చిన జాహ్నవి పిన్నిని అలా చూసి కంగారు పడి పోయింది. నీళ్ళ బకెట్ మీదకు ఒరిగి చీర అంతా తడిసి పోయింది. “అయ్యో!” అంటూ చేయి ఊతమిస్తూంటే, “జాగ్రత్త జానూ! ఇక్కడ అంతా జారుతోంది” అంది ఊర్మిళ.

మెల్లిగా లేపి కూర్చో బెట్టింది జాహ్నవి. ఆఫీస్ బెల్ నొక్కింది.

వేణు ఇంటర్‌కమ్లో మాట్లాడాడు.

“పిన్ని బాత్రూంలో స్లిప్ అయ్యింది. నాన్నకు చెప్పండి” అంది.

ఆనంద్, వేణు వెంటనే క్రిందకు పరిగెత్తుకు వచ్చారు.

మోకాలు బాగా ఎర్ర బడింది.

వేణు కారు స్టార్ట్ చేసి ఉంచాడు.

ఊర్మిళను రెండు చేతులతో ఎత్తుకుని కార్లో కూర్చోబెట్టాడు ఆనంద్.

“నేను రావాలా, నాన్నా!” అన్న జాహ్నవితో

“నువ్వు తమ్ముళ్ళను చూసుకోమ్మా!” అన్నాడు ఆనంద్.

స్కానింగ్, ఎక్స్‌రే అన్నీ అయి రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది. దిగులు మొఖాలతో జాహ్నవి, పిల్లలు ఇంట్లో ఉండి పోయారు.

అప్పుడే పని మనిషి అన్నపూర్ణమ్మ పనికి వచ్చింది.

“పిన్ని ఏదీ?” అంది.

జాహ్నవి జరిగింది చెప్పింది.

“అయ్యో, బంగారం అట్లాంటి తల్లి! ఏమంటరో ఏమో డాక్టర్లు” అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.

సాధారణంగా కామన్ బాత్రూం లోకి అడుగు బెట్టే అవసరం లేని ఊర్మిళ ఆ రోజు ఖర్మ కొద్దీ వెళ్ళినట్టుంది.

***

ఊర్మిళకు తొంటి ఎముకలో, మోకాలికి ఫ్యాక్చర్స్ ఉన్నాయి.. కట్టు కట్టారు. రెండు వారాలు హాస్పిటల్ లోనే ఉండాలన్నారు. డాక్టర్స్ ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారు.

ఊర్మిళ లేక ఇల్లంతా బావురన్నట్టు ఉంది. నాన్నతో వెళ్ళి పిన్నిని చూసి వచ్చింది జాహ్నవి.

అన్నమ్మ వంట చేస్తోంది.

పిల్లలిద్దరికీ జాహ్నవి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చింది..

ఆనంద్ ఆఫీస్ వర్క్, ఇటు హాస్పిటల్‌కు తిరగడంలో బిజీగా ఉన్నాడు.

మనసు బాగోలేక ఫ్రెండ్స్‌తో మాట్లాడుదామని ఫోన్ చేసింది, మాటల్లో ఫ్రెండ్స్ చెప్పారు.

స్వర్ణ మ్యారేజ్ అయ్యిందట. వాళ్ళ నాన్న, అమ్మనే పెళ్ళి పీటల మీద కూర్చున్నారట.

“వెరీ నైస్” అంది జాహ్నవి, సంతోషంగా.

స్వర్ణ కోసం ఓ మెట్టు దిగిన వాళ్ళ వాళ్ళను మెచ్చుకోవాలి అని అన్నారట, వినుత వాళ్ళమ్మ గారు.

***

ఇంకేవో రిపోర్ట్స్ అంటున్నారు డాక్టర్స్ అని హాస్పిటల్‌కు వెళ్ళాడు ఆనంద్.

పిన్ని ఉంటే తెలీలేదు కానీ, వీళ్ళసలు కంట్రోల్ కారు. ఇరువురి పోట్లాటలు తీర్చలేక పోతూంది. అందుకే కాలనీ పార్క్‌కు తీసికెళ్ళింది పిల్లలను. చీకట్లు ముసురుతూంటే, పిల్లలని తీసుకొని వస్తూండగా ఓ ఆకారం అడ్డగించింది.

“నువ్వు ఆనంద్ రావు మొదటి భార్య బిడ్డవట గదా!” అంది.

జాహ్నవి విసుగ్గా చూసింది.

ఆనంద్ రావు బిడ్డవూ, అంటే సరిపోదా! మొదటి భార్య అని కూడా అనడం అవసరమా! అనుకుంది.

నేను ఎన్నో భార్య బిడ్డనవుతే నీకెందుకు అనేదే కానీ, కాలనీ వాళ్ళతో ఎందుకు? వాళ్ళు ఎవరో, ఏమో నాకు తెలియనప్పుడు అనుకుంది. నాన్నకు వీళ్ళ ఫ్యామిలీతో ఎలాంటి రిలేషన్ ఉందో అని ఊరుకుంది.

పిల్లలతో నాలుగడుగులు ముందుకు వేయగానే, ఆవిడ వెనుక నుండి పిలిచింది.

“మీ పిన్ని ఇంటికి రావడానికి ఇంకా వారం పడుతుందట కదా! నీకు తోడు మీ అమ్మను రమ్మనక పోయావా!” అంది.

జాహ్నవి ఆవిడ మాటలకు అవాక్కయింది.

“ఇది చెప్పడానికా పని గట్టుకు పిలిచారు.”

నిగ్రహం అరువు తెచ్చుకుని, కోపంగా చూసి పిల్లలిద్దరి చేయి పట్టుకొని ఇంటికి దారి తీసింది.

***

అన్నమ్మ అప్పుడప్పుడు తన కోడలిని పనికి సహాయం తెచ్చుకుంటుంది.

ఇద్దరుపని వాళ్ళ ముచ్చట్లు కిచెన్‌లో తమ్ముళ్ళకు పాలు కలిపేందుకు వచ్చిన జాహ్నవి చెవిలోకి ప్రయత్నం లేకుండానే దూరాయి.

“గామె గంతనే. ఏడ ముచ్చెట్లు గామెకే గావాలె. బాతురూమ్‌ల షాంపు గా పిల్ల ఎందుకు పోసుద్ది. ఊర్మిలమ్మ గెప్పుడు గండ్లకు పోనే పోదు.”

జాహ్నవి నిటారుగా అయ్యింది.

మై గాడ్! ఏమి మనిషి! ఆమెను వదిలేదే లేదు.

మరో మారు తమ గురించి నోరెత్తకుండా నాన్నతో కలిసి వెళ్ళి గట్టి వార్నింగ్ ఇచ్చి వస్తుంది అనుకుంది.

మనుషులు కొందరు అలా ఉంటారు.

ఎదుటి కుటుంబాల్లో అగ్గి రాజేసి వినోదం చూడాలనుకుంటారు.

***

తమ్ముళ్ళ మధ్య పడుకుని ఆలోచిస్తూంది జాహ్నవి. నీలం రంగు బెడ్ లైట్‌తో రూమ్‌లో వెలుతురు మసకగా ఉంది. పొద్దునవన్నీ రీళ్ళలా తిరుగుతున్నాయి.

పిన్ని లేని ఇల్లు ఎలాగో ఉంది. పాపం! నీళ్ళ బకెట్ మీద పడి, తడిసి పోయింది. క్షణాల్లో జరిగిపోయింది అంతా!

నాన్న పిన్నితో ఫన్నీగా మాట్లాడుతూ ఉంటే, పిన్ని చిరుకోపంతో విసుక్కుంటూంటే – తనకప్పుడు అమ్మ గుర్తొచ్చేది. ఈ సమయంలో అమ్మ ఇక్కడ ఉంటే నాన్న మాటలకు ఎలా రియాక్ట్ అయ్యేదో అన్న ఊహ తన ప్రమేయం లేకనే మది లోకి వచ్చేది. అది ఊహ మాత్రమే! కానీ నిజంగా అమ్మ ఇక్కడకు రావాలన్న భావం తనకెప్పుడూ రాలేదు ఎందుకో! కానీ ఎలాంటి మనుషులు ఉంటారు. పనిమనుషులను పిలిచి మరీ, పక్క వాళ్ళ ముచ్చట్లు అడిగే కాలనీ ఆవిడ,

తన వినోదం కోసం పారేసిన ఉచిత సలహా, ఆమె జోక్యం అసహనం తెప్పిస్తూంది జాహ్నవికి. తాను బాత్ రూమ్‌లో షాంపు కావాలని పోసిందా, ఒకవేళ తనకే ఆ పరిస్థితి వస్తే పిన్నిని అంటారేమో! ఎలా మాట్లాడుతారు ఇలా!

ఇలా ఎదుటి వాళ్ళ పర్సనల్ లైఫ్‌ల్లోకి దూరి ఎలా సలహాలిస్తారు? ఆదర్శ్‌నగర్ లాంటి పాష్ ఏరియాల్లో కూడా ఇలా బిహేవ్ చేస్తారా! ఎక్కడైనా చీప్ బుద్ది గల వాళ్ళు ఉంటూనే ఉంటారేమో!

ఎవరితోనైనా మాట్లాడి మనసు తేలిక చేసుకోవాలనిపించినా, ఇద్దరు తమ్ముళ్ళు చెరొక చేయి మీద పడుకుని ఉన్నారు. వాళ్ళను డిస్టర్బ్ చేయొద్దు అనుకుంది.

పిన్ని ఇలా పడిందని తాతగారికి చెప్పాలా వద్దా! చెపితే బర్త్‌డే ఎలాగూ జరగట్లేదు వచ్చేయమంటుందేమో అమ్మ! ఈ కొన్ని రోజులయినా తమ్ముళ్ళకి తోడుగా ఉండొచ్చు. తాతగారికి చెప్పి, అమ్మకు చెప్పొద్దు అనడం ఇలాంటివి ఎందుకు! అనుకుంది.

మెల్లిగా నిద్ర లోకి జారుకుంది జాహ్నవి.

***

మాలతికి జాహ్నవి వెళ్ళాక టి.వి. చూడడం అలాబాటుగా మారింది. సీరియల్స్ చూస్తుంది. రకరకాల ఆడ పాత్రలు – విలనిజం గుప్పిస్తూంటాయి. చీప్ ట్రిక్స్‌ప్లే చేస్తుంటాయి. మానవత్వం మంట గలపడంలో ముందుంటాయి. స్త్రీ జాతి పై గౌరవం నశింప జేస్తాయి. అయినా వాటిని కూడా ఎంజాయ్ చేసే ఆడవాళ్ళు ఉంటారు.

మాలతికి జాహ్నవి వెళ్ళాక అంతా ఖాళీయే! జీవితంలో ఇంకేమీ లేనట్టు అనిపిస్తోంది. ఒక పిల్ల ఉంటే ఎంత ఆరాటం. స్కూల్‌కు బాక్స్ కట్టాలి. సాయంత్రం టిఫిన్ కేమి చేయాలో ఆలోచించాలి. ఇప్పుడవేవీ లేవు. చాలా మంది ఆడవాళ్ళ దినచర్య తమ కోసం కాక, ఎదుటి వాళ్ళ అవసరాలకు అనుగుణంగానే ఉంటుంది. ఈ క్రమంలో తమ బ్రతుకే ఎదుటి వాళ్ళ కోసం అన్న మనస్తత్వం వచ్చేస్తుంది. ఇంత వరకు బాగానే ఉంటుంది కానీ, తీరిక దొరికిన మిగిలిన జీవితంలో కూడా ఈ పాశాలు వదలవు. మాలతి తీరిక సమయం సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ ఆమె ప్రాధాన్యతలు వేరే అయ్యాయి. టి.వి. సీరియల్స్ లోని కొన్ని నెగెటివ్ క్యారెక్టర్‌లలో ఊర్మిళను పరకాయ ప్రవేశం చేయిస్తుంది. ఇలాంటి మనుషులు ఉంటారు కనుకనే ఇలాంటివి తీస్తారు అనుకుంటుంది. ఒకమ్మ సగం జ్ఞానంతో సీరియళ్ళు చూసి ఏకంగా ప్లాస్టిక్ సర్జరీనే చేయించింది అంటే ఇంక వాటి గొప్పతనం చెప్పతగునా!

మాలతి ఇలా సమయం వృథా చేసుకుంటూ తానే ఓ నెగెటివ్ క్యారెక్టర్‌గా మారింది. ఆలోచించే శక్తి కోల్పోయింది.

ఓ రోజు టి.వి. చూస్తున్న మాలతి ఆవేదన, ఆవేశం పట్టలేక పెద్దగా అరిచింది. “ఏమైంది మాలమ్మా!” అన్నారు తాత గారు రూములో నుండి ఇవతలికి వచ్చి. “ఆ న్యూస్ చూడండి నాన్నా!” అంది.

ఆ వార్త ఆయన్ని కూడా కలవరపరిచింది. “ఒక స్త్రీ, ఒక తల్లి చేయవలసిన పని కాదు” అంటూ రూములోకి వెళ్ళారు. ఆమె అలా చేసిందంటే, ఇందులో వాళ్ళ తప్పు కూడా ఉంది అనిపించింది మాలతికి. మొదటి భార్య బిడ్డలను గాలికి వదిలేసి, రెండో భార్యకూ ఆమె పిల్లలకూ సర్వ సౌఖ్యలు ఆమె కళ్ళ ముందే అందిస్తోంటే ఆ స్త్రీ మనసు ఎలా ఉంటుంది? ఏదయినా ఒక తల్లి ఇలా చేయకూడదు. ఆ పసి బిడ్డ ఫోటో చూస్తూ మాలతి కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి.

‘మనుషులు అప్పుడప్పుడు యోగులుగా మారిపోవాలి. కర్మ సిద్ధాంతం మనకు ఉన్న గొప్ప వరం.’ అనుకున్నారు తాతగారు.

‘క్షమయా ధరియిత్రి’ అన్నారు. ఆవేశకావేశాలతో ఘోరాలకు పాల్పడితే, ఆవేశం తగ్గాక మిగిలేదేమి ఉండదు. చెరసాల తప్ప! తాను ఎన్నో కేసుల్లో చూసారు.

‘మనసును జయించే మార్గాలు పెద్దలు ఎన్నో చెప్పారు. దేవుడు ఇచ్చిన జీవితం జాగ్రత్తగా బాధ్యత వహించి నడపాలి.’ అనుకున్నారు ఆయనే మళ్ళీ! ఒక్కోసారి మాలతి ప్రవర్తన కూడా భయం పుట్టిస్తుంది ఆయనకు. అప్పుడంతా నిర్వేదం – ఇప్పుడు అంతా ఆవేశం!

మాలతి మాలతిలా లేదు. మాలతిలో మాలతి లేదు.

ఒంటరి తనపు అశోక వృక్షం క్రింద బేల ఆ మాలతి.. ఇప్పుడు తోక తొక్కిన తాచు, దెబ్బ తిన్న ఆడపులి.

‘ఎలా మాలతిని మాములుగా చేయడం? జానమ్మ కంటబడే దాకా ఇంతేనేమో! ఆనంద్‌కు ఫోన్ చేసి చెప్పించినా ఫలితం లేక పోయింది’ తాతగారు కాలం మీద భారం వేస్తూ దీర్ఘ నిశ్వాసం చేసారు.

***

మాలతికి నిద్దురలో కూడా మనసు నెమ్మది కోల్పోయింది. ఏదో భ్రమ, మరేదో భ్రాంతి – మస్తిష్కపొరలను తొలుచుకుని, కంటి ముందు కదలాడే దృశ్యాలుగా కలలై, కలతలయి గబుక్కున లేచి కూర్చుంది మాలతి. ఎవరో చిన్న పాప పట్టుపరికిణితో మెడ నిండా నగలతో పరిగెడుతూంది. మరెవరో నీడలా పాపను వెంటాడుతున్నారు. ఆ నీడ ఓ క్రమంలో దగ్గరగా కనిపించి స్త్రీగా మారింది. పాపనేమీ చేయదు కదా! అయ్యో, ఆ చిన్న పిల్లకు అన్ని నగలేసారేమి, పాపను నగల కోసం ఏమైనా చేస్తేనో! మాలతి కొంగుతో నుదుటి పై చెమటలు అద్దుకుంది. మనసేమి బాగా లేదు.

ఏమిటీ కల! అర్థం ఉందా అసలు! ఆ పిల్ల కోసం తాను ఇంత ఎందుకు భయపడింది. అర్థం లేని కల. కాదు అర్థం ఉందేమో! మాలతి కన్న కడుపు పేగుల్లో కదలిక.

జానూ ప్రమాదంలో ఉందా!

కలలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి.

కలలు భవిష్యత్ సూచకాలు అనే వాళ్ళు కూడా ఉంటారు. మన ఆలోచనలూ, భయాలు, గతపు ముద్రలు – ఎన్నో కలలై వెంటాడతాయి. కానీ తన ప్రపంచ పరిధి బిడ్డగానే కుదించుకుపోయిన మాలతికి అంత కంటే వేరు ఆలోచన రాలేదు. తన బిడ్డ ప్రమాదంలో ఉంది తాను వెళ్ళాలి. ఊర్మిళ మంచితనంపై ఆమె కెప్పుడూ ఎక్కువ నమ్మకం లేదు. అలా అని ప్రాణాలు తీసే హంతకిగా కూడా ఆమెపై అభిప్రాయం లేదు. కానీ, వెంటనే వెళ్ళి బిడ్డను తెచ్చుకోవాలి. టి.వి.లో వచ్చిన న్యూస్ ఆమెను అలా ప్రభావితం చేసింది.

ఏది వచ్చినా తాత గారి మెడకే చుట్టుకుంటుంది.

పెద్దప్రాణం మనశ్శాంతి లేక అల్లాడుతుంది.

“నాన్నా! నేను వెళ్ళి జానూను తీసికొస్తాను” అంది.

“అదేమిటి మాలమ్మా! పిల్ల నాలుగు రోజుల్లో వస్తూంటే నువ్వెందుకు వెళ్లడం తల్లీ!”

“నాలుగు రోజుల్లో వస్తుంది కాబట్టే వెళ్ళాలి.”

“అదేమిటమ్మా!”

“ఆ తర్వాత దానినేమీ చేయడానికి ఛాన్స్ దొరక్క పోవచ్చు!”

తాతగారికి మాలతి పై విసుగేసింది. పిచ్చి గానీ ఎక్కదు కదా!

“ఏమి చేయడం ఏమిటమ్మా!”

మాలతి మాట్లాడలేదు.

ఆనంద్ బాగా సంపాదించాడట. జానూకి ఆస్తి పోతుందంటే దాని మనసెలా ఉంటుందో!

మాలతివి ఆధారం లేని ఆలోచనలు. ఊహల పంజరంలో ఆమె బందీ!

తన ఊహల్లోని వాస్తవికతను ఆలోచించడానికి ఆమెకు ఇష్టం ఉండదు. ఆమెకే కాదు ఎందరో తల్లులకు ఇష్టం ఉండదు. బిడ్డను కాపాడుకోవాలన్న భావం ఇచ్చిన తృప్తి తల్లికి మరేదీ ఇవ్వదు. అందుకే అరికాళ్ళలో దిష్టి చుక్కలు, నల్ల దారాలు, ఉప్పు తిప్పుళ్ళు –

మాలతి వీటికి అతీతురాలేమీ కాదు. బిడ్డ సవతి చేతుల్లో ఉందనే భావానికి టి.వి. సీరియల్స్, వార్తల్లో చూపే సంఘటనలు కొత్త జ్ఞానం కలిగించాయి. తాతగారి అభ్యర్థన వినే స్థితి దాటి పోయింది.

“ఇప్పుడు అతను పిల్లను పంపనంటే దెబ్బలాడే స్థితిలో నీ ఆరోగ్యం లేదు మాలమ్మా!” అన్నారు.

మాలతి నుండి సమాధానం లేదు.

వినాలనుకోని వారి ముందు ఎంత గట్టిగా శంఖం పూరించినా లాభం ఏమిటి?

అస్త్రం ముందుగా మాలతి చేతుల్లోకే వెళ్ళింది. “నన్ను ఆపితే నా మీద ఒట్టే!” అంది.

“నేను కూడా వస్తాను అమ్మా! మీ గొడవల్లోకి రాను. ఏ హోటల్‌లో నయినా దిగుతాను.” అన్నారు.

“అవసరం లేదు నాన్నా! మీరు ‘మండ్య’ వెళ్ళండి” అంది.

తాతగారు అలసిపోయారు. భూషణం, రాధమ్మ రాలేక పోయారు, జ్వరాల వల్ల! వస్తే రాధమ్మ గారు చక్రం తిప్పేవారే!

ఇంక విధి లేక ఆయన ఒక మాట అన్నారు.

“మాలా! శ్రీనును అయినా వెంట తీసికెళ్ళు! అతనికి వాళ్ళ కజిన్స్‌ను చూసినట్టు ఉంటుంది. వచ్చేప్పుడు నీకు జాహ్నవి ఎలానూ తోడుంటుంది.” అన్నారు.

ఇల్లు కదలడమే అలవాటు తప్పిన మాలతి ప్రయాణం ఎలా చెయ్యగలదని బెంగ ఆయనకు.

మాలతి తాతగారి మాటలకు ఓ నిముషం ఆలోచించి, తలాడించించింది.

‘హమ్మయ్య!’ అనుకున్నారు, ఇదయినా ఒప్పుకున్నందుకు.

***

బెడ్ మీద ఊర్మిళ కర్మ బందీలా ఉంది. పెయిన్ కిల్లర్స్ ధారాళమై నిస్తేజంగా ఉంది. మోకాలు ఫ్యాక్చర్ అయ్యింది. తుంటి ఎముకలో మైల్డ్ ఫ్యాక్చర్. రెండు వారాలు హాస్పిటల్ లోనే ఉండాలన్నారు. వాళ్ళు చెప్పిన సూప్స్ ససేమిరా వద్దంది ఆమె. ఆమె నుండి ఆ సమాధానం ఆనంద్ ఊహించిందే. మరొక టీచర్ కూడా ఊర్మిళ చేసే స్కూల్లోనే చేస్తుంది. ఆవిడ కూడా ఆదర్శ్‌నగర్ లోనే ఉంటుంది. ఆమె ద్వారా ఊర్మిళ బాత్ రూమ్‌లో జారిపడిన సంగతి స్కూల్ దాకా తెలిసింది. టీచర్స్ హాస్పిటల్‌కు వచ్చి చూసి వెళుతున్నారు.

అలా వచ్చిన వారిలో ఊర్మిళ అత్యంత అభిమాని కూడా ఉంది.

“అయ్యో! పిల్లలు ఇక్కడికి రావడం ఎందుకు?” అంది వాళ్ళమ్మ గారితో.

“రోజీ వినదు మేడం. తెలిసినప్పటి నుండి టీచర్‌ను చూసి రావాలని గొడవ,” అంది వాళ్ళమ్మ అభిమానంతో.

తాను బాబాను ప్రే చేసి తెచ్చిన ఊదీ బొట్టు ఊర్మిళ కిచ్చింది.

రోజీ అభిమానానికి కారణం ఉంది. రోజీ నల్లటి పిల్ల. ఆత్మ విశ్వాసం కొరవడింది.

అందరూ దాని కజిన్ సురేఖనే ముద్దు చేస్తారు. తెల్లగా, అందంగా ఉందని. ఈ పక్షపాత ధోరణిని ఆణువణువునా భరిస్తూ వచ్చిన ఆ పసి హృదయం ముకుళించుకు పోయింది. ఆ మోమున మళ్ళీ చిరునవ్వు విరిసేలా చేసింది, ఊర్మిళా టీచర్. దాన్నిగుండెల నిండా ఇష్టపడుతూ రంగుల కతీతంగా, ప్రేమాభిమానాలు పంచింది. దానిపై శ్రద్ధాసక్తులు చూపింది.

అందుకే ఈ టీచర్ అంటే చాలా ఇష్టం రోజీకి.

ఇద్దరు పిల్లలు కనిపిస్తే ఒక్కరినే హైలెట్ చేయడం, వారి మీదే అటెన్షన్ పెట్టడం లాంటివి పెద్దలు మానివేయాలి.

అందం పిల్లల్లో ఏ మాత్రం ప్రాముఖ్యం కాదు. పువ్వు ల్లాంటి వారి మనసు ముందు అందం దిగదుడుపే.

వాళ్ళు కాస్సేపు ఉండి వెళ్ళి పోయారు.

ఊర్మిళ నిస్సత్తువుగా వెనక్కి వాలింది.

ఇలా ఎవరో ఒకరు రావడం, పట్టే నిద్ర పట్టకుండా పోవడం..

‘పిల్లలు ఎలా ఉన్నారో! జానూకు తమ్ముళ్ళ విషయంలో కేరింగ్ ఎక్కువే’ అనుకుంది.

***

మైసూర్ నుండి ఫోన్.

ఆనంద్ తీయలేదు.

ఆ సమయంలో అతను డాక్టర్స్‌తో మాట్లాడుతున్నాడు. మొన్న ట్యాంక్‌బండ్‌పై ఆ రద్దీ సమయంలో, రణగొణ ధ్వనుల మధ్య మాట్లాడిని ఫోన్ తెప్పించిన ఇరిటేషన్ తక్కువేమి కాదు ఆనంద్‌కు. మాలతి బెంగ పెట్టుకుందని, ఆరోగ్యం బాగా లేదని, జాహ్నవిని వెంటనే పంపమని..

“చ! ఏమి మనుషులు” అనుకున్నాడు.

సహజం గానే ఆనంద్‌కు భద్రం గారంటే ఇష్టం ఉండదు. కుటుంబాల మధ్య బంధం తెంపుకున్నాక అంతే కదా.

అయినా టికెట్స్ కూడా బుక్ అయ్యాయని, రెండు రోజుల్లో వస్తుందని సౌమ్యం గానే చెప్పాడు.

ఎవరో శ్రీనివాస్‌చే చేయించారు.

ఆ కారణం గానే ఇప్పుడు కూడా అతనికి ఫోన్ తీయాలని లేదు. మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది. లిఫ్ట్ చేసాడు.

అతనే శ్రీనివాస్! మాలతి గారు బయలు దేరారని, చాలా స్ట్రెస్‌లో ఉన్నారని, జాగ్రత్తగా హేండిల్ చేయమని భద్రం గారు చెప్పారని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

‘ఇప్పుడు ఈ అస్తవ్యస్త పరిస్థితుల్లో మాలతి వస్తోందా’ ఆనంద్ కళ్ళద్దాలు చేత పట్టుకొని అలాగే కూర్చుండి పోయాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version