ఎంత చేరువో అంత దూరము-17

12
1

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మాలతి తమ ఇంటికి వచ్చిందని ఆనంద్ చెబితే ఎందుకు అని అడుగుతుంది ఊర్మిళ.  జాహ్నవిని పంపడం ఆలస్యమయినందుకని భర్త జవాబు చెబితే, ఎంత ధైర్యం అని మనసులో అనుకుంటుంది ఊర్మిళ. కొద్ది రోజుల క్రితం షాపింగ్ మాల్ దగ్గర ఉన్నప్పుడు భద్రం గారు శ్రీనివాస్ చేత ఫోన్ చేయించటం, జాహ్నవిని వెంటనే పంపించేయమనడం, తరువాత మాలతి బయల్దేరిందని, చాలా స్ట్రెస్‍లో ఉందని, జాగ్రత్త వహించని మళ్ళీ శ్రీనివాస్‍తో ఫోన్ చేయించి చెప్పారని ఊర్మిళకి చెప్తాడు ఆనంద్. ఎలా వస్తేనేం వచ్చింది, కానీ ఎప్పుడు వెళుతుంది అన్న దానికి సమాధానం లేదని అనుకుంటుంది ఊర్మిళ. కాసేపటికి వేణు ఫోన్ చేసి, డిస్ట్రిబ్యూటర్ ఒకరు కలవాలని అనుకుంటున్నారని చెప్తే మధ్యాహ్నం రెండు తరువాత మీటింగ్ ఎరేంజ్ చేయమని చెప్తాడు ఆనంద్. డ్యూటీ డాక్టర్ వచ్చి ఊర్మిళని చూసి వెళ్లాకా, ఇంటికి వెళ్తాడు ఆనంద్. డైనింగ్ టేబుల్‍పై అన్ని సిద్ధంగా ఉంచుతుంది మాలతి. పెద్దగా మాట్లాడుకోకపోయినా, అతనితో కలిసి తిన్నందుకు మాలతి మనసు నిండుతుంది. ఫ్లయిట్ టికెట్స్ బుక్స్ చేస్తాను వెళ్ళిపోదామని జానూ అంటే, తనకి ఓపిక లేదంటుంది మాలతి. తల్లి ఇక్కడికి రావడం, తమ్ముళ్ళకు తనకూ వంటి పెట్టడం, మధ్యాహ్నం నాన్న భోజనానికి రావడం ఇవన్నీ జాహ్నవికి తెగ నచ్చేస్తాయి. కానీ ఏ మూలో అపరాధ భావం కూడా ఉంటుంది. పనివాళ్ళపై పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం బావుండదేమో అని తల్లి అనేసరికి ఇక ప్రయాణపు ఆలోచనలు మానుకుంటుంది జాహ్నవి. అనూప్ పుట్టిన రోజున పాయసం చేసి పెడుతుంది మాలతి. ఆనంద్, జాహ్నవి పిల్లలతో బర్త్ డే కేక్ తీసుకుని హాస్పటల్‌కి వెళ్ళి ఊర్మిళ సమక్షంలో పిల్లాడితో కేక్ కట్ చేయిస్తారు. డ్యూటీలో ఉన్న సిబ్బందికి స్వీట్స్, కారా పంచుతారు. ఊర్మిళ డిశ్చార్జ్ విషయమై డాక్టర్లతో మాట్లాడాలనుకుంటాడు ఆనంద్. ఓ రోజు అన్నమ్మ ఊర్మిళను చూడడానికి హాస్పటల్‍కి వస్తుంది. ఆమెను చూస్తూనే తెగ ఏడుస్తుంది. ఆమెను ఊర్కోబెడుతుంది ఊర్మిళ. మాలతి గురించి చెప్తూ, ఇల్లంతా తన ఆధీనంలోకి తీసుకుందని అంటుంది. వెళ్తూ వెళ్తూ ఆనంద్ బాబు సరిగా ఉంటే ఇలా జరిగేది కాదంటుంది. ఆనంద్, మాలతిల పరిచయం ఎలా జరిగిందో గుర్తు చేసుకుంటుంది ఊర్మిళ. – ఇక చదవండి.]

అధ్యాయం 17

[dropcap]ఆ[/dropcap]నంద్ గారు సూపర్ మార్కెట్‌కు వచ్చినప్పుడు, త్వరలో స్టాఫ్ తగ్గించాలన్న ఉద్దేశ్యం వల్ల తన జాబ్ పోబోతుందన్న విషయం చెప్పింది. తెలిసిన వాళ్ళకు చెప్పాలి కదా, చెప్పడం మర్యాదగా భావించింది.

అప్పుడు ఆనంద్ గారు అన్నారు – “వెదక బోతున్నఈగ సారీ తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో!”

తను మళ్ళీ నవ్వింది.

చిన్న పరిహాసానికి కూడా కదిలిపోయి నవ్వడం, అప్పట్లో తనకు అలవాటుగా ఉండేది. ఆ నవ్వుల్లోనే తన బాధలు దాచేదేమో!

ఆనంద్ గారు తనకు భరోసా ఇచ్చారు. ఓ బేబీ కేర్ సెంటర్‌లో జాబ్ రెడీగా ఉంటుందని.

‘జాబ్’ అనే మాట తనకో మంత్రం లాంటిది. పీకేసిన కరెంట్, చెల్లించని అద్దె, అడపాదడపా పుణ్యమిచ్చే ఉపవాసాలు.. ఉద్యోగం ఉంటే ఎన్నింటికో చెక్ పెట్టొచ్చు. ఈ భూమ్మీద రెండు కాళ్ళతో నిలబడాలంటే ఉద్యోగం ఉంటే చాలు, అనుకునే రోజులవి.

ఈ జాబ్ పోయినా మరో జాబ్ సిద్ధంగా ఉంది అంటే ఎంత ధైర్యం.

ఫస్ట్‌కు సాలరీ తీసుకుని, ఆనంద్ గారికి ఫోన్ చేసింది.

లిఫ్ట్ చేసింది మాలతి గారు.

“ఈ ఫోన్ నెంబర్ నీకెలా తెలుసు?” అంటూ ప్రశ్నలు కురిపించారు. ఉన్నదున్నట్టుగా చెప్పింది.

ఆ తర్వాత ఆనంద్ గారు తాను చెప్పినట్టే, ఆయన ఫ్రెండ్ భార్య స్టార్ట్ చేసిన క్రెష్‌లో ఉద్యోగమిప్పించారు. క్యూట్ బేబీస్ మధ్య జాబ్ ఎంత బాగుందో!

సంవత్సరం గడిచి పోయింది.

ఓనం పండుగ వస్తోంది. ఎక్కడికి వెళ్ళాలి?

ఎవరున్నారని కేరళ వెళ్ళాలి?

పొదిలి పొదిలి ఏడ్చినా తీరేది కాదు, ఈ బాధ.

ఆనంద్ గారు ఓ క్యూట్ బేబీని తీసుకొని సెంటర్‌కు వచ్చారు. ఆ బేబీని తాను గుర్తు పట్టింది. తను జాహ్నవి.

మాలతి గారు క్యారీయింగట. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఫుల్ బెడ్ రెస్ట్.

ఆనంద్ గారు బేబీ కోసం రోజూ వచ్చేవారు.

ఆయన ఎంత డీసెంట్ పర్సన్ అనేది, ఆ సమయంలోనే తనకు బాగా అర్థం అయ్యింది.

ఆ తర్వాత మాలతి గారికి బేబీని ఇక్కడ ఉంచారని తెలిసింది. ఇక్కడి నుండి బేబీని మార్చేయమని, లేదా సుమిత్ర గారికి చెప్పి తననే మార్పించమని గొడవ చేసారట. ఆ విషయం కేర్ సెంటర్ లోని ఒక కో-వర్కర్ తనకు చెప్పారు.

వేరే దగ్గర బేబీని ఉంచడం ఆనంద్ గారికి ఇష్టం లేదు. సుమిత్ర గారి సెంటర్ నిర్వహణ ఆయనకు బాగా నచ్చేది. తను పిల్లల పట్ల బాగా కేరింగ్‌గా ఉంటుందన్న నమ్మకం కూడా ఒక కారణం అట. మాలతి గారి అభిష్టానికి వ్యతిరేకంగా పాపను ఇక్కడ చేర్చారు. దగ్గర్లో మరొకటి లేదు కూడా! మాలతి గారిది అర్థరహిత అనుమానం. ఎలుకను పట్టే పిల్లిలా ఆవిడ తన కోసం పొంచి ఉండేది. తనను నేరస్థురాలిగా నిరూపించే సి.ఐ.డి. బాధ్యత తీసుకున్నారేమో!

సంసారం గురించి అభద్రతలో ఆమె, బతుకు లోని అభద్రతతో తాను..

రాజీ పడలేని పరిస్థుతుల మధ్య.. కాలం గడుస్తూంది.

సుమిత్ర గారు ఫారిన్ అవకాశం వచ్చి, సెంటర్ మూసి వేయబోతున్నారు.

మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం.

ఉద్యోగం వేట మొదలు..

ఆనంద్ గారు తాను చేసే కంపెనీలో అంచెలంచెలుగా మేనేజర్ స్థాయికి వచ్చారు. అప్పటికి ఇంకా స్వంత బిజినెస్ స్టార్ట్ చేయలేదు.

తమ కంపెనీలో వేకెన్సీలు ఉన్నాయని, సుమిత్ర గారు సెంటర్ క్లోజ్ చేసినా బెంగపడవద్దని అన్నారు. బాధ కలిగించే విషయం ఏమిటంటే ఆనంద్ గారికి పుట్టిన బిడ్డ దక్కలేదట.

ఆనంద్ గారు ఆయన చేసే కంపెనీ లోనే జాబ్ ఇప్పించారు.. చాలా చిన్న స్థాయి ఉద్యోగం.

డిగ్రీ కంప్లీట్ చేయని తనకు అంత కన్నా ఎక్కువ ఆశించే స్థాయి లేదు. త్వరలో వేరే ఉద్యోగం చూసుకొని వెళ్ళాలి.

మాలతి గారికి పొరపాటున తెలిస్తే ఆ కాపురంలో మనశ్శాంతి ఉండదు. ఆనంద్ గారు తన నిస్సహాయ పరిస్థితి ఆమెకు చెప్పినా, లాభం ఉండక పోవొచ్చు. ఇలా తన ఆలోచనలుంటే –

ఒక రోజు ఆనంద్ గారు ఇంతెత్తు పుస్తకాల కట్ట తన టేబుల్ మీద ఉంచి, “ఊర్మిళా! డిగ్రీకి కట్టు. ఖర్చు సంగతి ఆలోచించకు” అన్నారు. “భవిష్యత్తులో చదువే కదా ముఖ్యం” అని ఆయన అంటూంటే తన కళ్ళు చెమర్చాయి. చదువుకోవాలన్న తన కోరిక తీరబోతోన్నందుకా! ఓ వ్యక్తి తన చదువును బాధ్యతగా భావిస్తూన్నందుకా! ఆ నిమిషం తనకే అర్థం కాకుండా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి.

“అలాగే, చదువుకుంటాను కానీ, నాకు ఇంకెక్కడయినా ఉద్యోగం చూపెట్టగలరా!” అంది తను.

ఆనంద్ గారు, “నీ ఇష్టం” అన్నారు.

ఆ మాట అన్నాక ఆలోచించింది.

ఎక్కడైనా ఉద్యోగం అయితే మళ్ళీ కొత్త మనుషులు – కొత్త సంఘర్షణలు. ఇక్కడ తనకు ఎలాంటి టీజింగ్ లేదు.

ఆనంద్ గారున్న ఈ కంపెనీ కాంపౌండ్, తనకు రక్షణ వలయం. కానీ, ఈ కంచె దాటి వెళ్ళాలి. తనకు తానుగా బ్రతకాలి.

ఆనంద్ గారికి చెప్పిందే కాకుండా తన స్వంతంగా కూడా ఉద్యోగ ప్రయత్నం మొదలు పెట్టింది.

రూమ్మేట్ అమ్మణ్ణి కూడా అదే పనిలో ఉంది.

కానీ ఆ మర్నాడే జరిగిందా సంఘటన. ఆఫీస్‌లో ఉండగా తనకు ఫోన్ వచ్చింది అని చెప్పారు.

తనకు ఫోన్ చేసేది ఎవరా అనుకుంటూ వెళ్ళింది. ఒక వేళ అమ్మణ్ణి ఏమైనా, ఎక్కడైనా ఉద్యోగం వచ్చేది ఉంటే, తనని తొందరగా రమ్మని చెప్పడానికి చేయలేదు కదా! తన ధ్యాస అంతా ఎప్పుడూ ఉద్యోగం మీదే అయినందువల్ల నేమో, అలాంటి ఆలోచన తోనే తన సీట్ నుండి లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళింది. అవతల మాట్లాడేది మాలతి గారు.

“నువ్వు ఆయన్ని వదలనే వదలవా!”

“మేడం! అదీ.. ఉద్యోగం.. కోసమని..” అవసరం లేకుండానే తన గొంతు వణికింది.

మాటలు భయంతో తడబడుతున్నాయి.

“బాగా పట్టుకున్నావు ఆయన్ని. ఛీ! ఛీ! అందరూ ఆస్పత్రి లో చేసే నర్సమ్మ వెంబడి పడ్డాడని అనుకుంటే ఎంత పరువు తక్కువ. ఆయన్ని వదలవా, నువ్వు ఇంక.. వెళ్ళు,ఇక్కడి నుండి” అంటూ ఫోన్ పెట్టేసారు.

తన ఆత్మాభిమానం తీవ్రంగా గాయపరిచి, సమాధానం కూడా వినకుండా ఫోన్ పెట్టేయడం ఏమి న్యాయం? తానే సమాధానం చెప్పినా ఆవిడ దృష్టిలో తన మాటకు విలువ ఉండనప్పుడు.. ఏమి చెప్పి లాభం ఏమిటి?

బాధనూ, అవమానాన్ని దిగమింగుకుని తన స్థానం లోకి వచ్చి కూర్చుంది.

మరు రోజు నుండి కంపెనీ మానేసింది.

ఎవరు చెప్పి ఉంటారో కూడా అర్థం చేసుకుంది. క్రింద స్థాయి వర్కర్స్‌లో ఒకావిడ మాలతి గారికి ఇల్లు శుభ్రం చేయడంలో హెల్పింగ్ కోసం వెళుతుంది. ఆవిడ ద్వారా మాలతి గారు సమాచారం లాగి ఉంటారు.

అయ్యిందేదో అయ్యింది. ఏ బంధం శాశ్వతం కనుక. మంచి మనసుతో హెల్ప్ చేయాలనుకున్న వ్యక్తికి దూరం జరగాల్సి వచ్చింది. జీవిత ప్రయాణంలో ఆయనా ఒకరు అని తేలిగ్గా తీసుకోగలిగిన వ్యక్తి కాదు, ఆనంద్ గారు.

మళ్ళీ తానూ – తన ఉద్యోగాల వేట.

మాలతి గారి విషపు కోరలకు దూరంగా వచ్చేసాననుకుంది. కానీ విధి మళ్ళీ ఆనంద్ గారి దగ్గరికే నెట్టి వేసింది.

ఊర్మిళ నిట్టూర్చింది.

ఆనంద్ గారి కంపెనీ నుండి చెప్పకుండా వెళ్ళిపోయిన తన పరుగులు, ఒక దగ్గర మళ్ళీ ఆయన దగ్గరికి చేర్చాయి.

ఏదో ప్రకటన చూసి, ఆ చిన్న ఆఫీస్‌లో జాబ్ సంపాదించినందుకు సంబరపడుతూంటే, అక్కడి పై ఉద్యోగి రెండవ పెళ్ళి చేసుకోమన్న అతని మాట తిరస్కరించినందుకు, ఆఫీస్‌లో డబ్బు అక్రమంగా వాడానని, ఆయనకు తెలిసిన మహిళా కానిస్టేబుల్‌తో తనను స్టేషన్‌కు పంపించాడు. భయపడుతున్న తనని ఇన్‌స్పెక్టర్ అసభ్య పదజాలం తో దూషిస్తూ ఉంటే, అప్పుడు వచ్చారు ఆనంద్ గారు.

ఆ మాటలకు అవమాన భారంతో, సిగ్గుతో తల ఎత్తలేక రోదిస్తూన్న తాను ఆనంద్ గారి దృష్టిలో పడింది.

బాగా తాగి బైక్ నడుపుతూన్న ఇద్దరు మైనర్స్ ఆయన కారుకు గట్టిగా తగిలించారట. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు.

కారుకు డెంట్ పడిందట. వాళ్లిద్దరూ క్రింద పడి దెబ్బలు తగిలాయట.

ఫలానా కంపెనీ అసిస్టెంట్ మేనేజర్‌ను అని పరిచయం చేసుకుని, “ఈ అమ్మాయి మా బంధువుల అమ్మాయి” అన్నారు.

“ఇంకా మేము కేస్ ఫైల్ చేయలేదు, సార్!” అన్నాడు ఇన్‌స్పెక్టర్.

వాళ్ళు ఇంకా ఏమి మాట్లాడుకున్నారో గానీ ఆయనతో బయటకు నడిచింది.

ఇంటికి వెళ్ళేసరికి సమయం ఎంత అవుతుందో!

మ్లాన వదనంతో ఆనంద్ గారు కారు డోర్ తీస్తే ఎక్కి కూర్చుంది.

“ఇల్లెక్కడ” అన్నారు. ఈ రాత్రి వెళితే ఓనరమ్మ నోట ఎలాంటి మాటలు వినాలో! అదే చెప్పింది.

ఆనంద్ గారు కారు తన ఇంటి మలుపు తిప్పారు. అదే జీవితంలో పెద్ద మలుపు అయ్యింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here