ఎంత చేరువో అంత దూరము-19

7
2

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తప్పనిసరి పరిస్థితిలో ఆ రాత్రి ఊర్మిళని తమ ఇంటికి తీసుకువెళ్తాడు ఆనంద్. కలిసి వచ్చిన వాళ్ళిద్దర్నీ చూసి మాలతి ఏమీ మాట్లాడదు. జరిగినదంతా ఆనంద్ వివరంగా చెప్తాడు. మాలతి అంతా వింటుంది. మర్నాడు ఉదయం ఊర్మిళ తన గదికి వెళ్ళిపోతుంది. తరువాత ఆనంద్ ఆఫీసుకు వెళ్తాడు. ఒక్క ముక్కా మాట్లాడని మాలతి పెట్టేబేడా సర్దుకుని జాహ్నవిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఆనంద్ ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉంటుంది. కొన్నాళ్ళ తరువాత మాలతి తరఫున భద్రం గారు, భూషణం గారు వచ్చి గొడవ చేసి వెళ్తారు. ఆనంద్ వాళ్ళకి జరిగినదంతా చెప్పినా మాలతి నమ్మదు. తనని అమాయకురాలిని చేసి మోసగించారని గట్టిగా నమ్ముతుంది. ఇవేవి ఊర్మిళకు తెలియవు. ఓ రౌడీ ఊర్మిళపై మోజు పడి ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు వెంటపడి వేధిస్తుండేవాడు. ఓ రాత్రి బాగా తాగి వచ్చి ఊర్మిళ గది తలుపుని తన్ని తన్ని డిస్ట్రర్బ్ చేస్తాడు. ఈ గోలకి బెదిరిపోయిన ఇంటి యజమాని ఊర్మిళని వెంటనే గది ఖాళీ చేయించి పంపేస్తుంది. అప్పుడు అమ్మణ్ని అండగా నిలిచి, తనకి తెలిసిన ఓ సంగీతం టీచర్ ఇంట్లో గది ఖాళీ ఉందని చెప్పి, తానూ కూడా ప్రస్తుతం పని చేస్తున్న చోట మానేసి, ఊర్మిళతో పాటు వచ్చి అదే గదిలో దిగుతుంది. ఓ రోజు సంగీతం టీచరు గారితో పాటు అమ్మణ్ణిని వెంట పెట్టుకుని బ్రహ్మకుమారీస్ మీటింగ్‍కి వెళ్తుంది ఊర్మిళ. వారి బోధనలు బాగా నచ్చుతాయి. వాళ్ళ ఆహార్యంలోకి మారిపోతుంది. ఓ రోజు తెల్ల చీరలో డోర్ టు డోర్ టీ పాకెట్స్ అమ్ముతూ రోడ్డు మీద వెళ్తుండగా ఆనంద్ చూస్తాడామెను. కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్తాడు. ఈ ఐదేళ్ళ కాలంలో ఏం జరిగిందో తెలుసా అని అడిగితే, ఊర్మిళ వల్ల తాను తన కుటుంబానికి ఎలా దూరమయ్యాడో చెప్తాడు ఆనంద్. తన భార్యాకూతురు తనకి తిరిగి దక్కాలంటే, ఊర్మిళ పెళ్ళి చేసుకోవాలని అంటాడు. అనడమే కాదు, సంబంధాలూ చూడడం మొదలుపెడతాడు. ఓ రోజు ఊర్మిళ గది దగ్గరకు వచ్చి, ఊర్మిళని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. ఐదు గంటలకి ఒకతన్ని రమ్మన్నానని చెప్తాడు. ఆ ఆగంతకుడు చెప్పిన టైం కు వస్తాడు. – ఇక చదవండి.]

అధ్యాయం 19

[dropcap]మం[/dropcap]చి అబ్బాయి లాగానే ఉన్నాడు కానీ, ఎలా రా బాబు ఈతన్ని తప్పించుకోవడం!

“సర్! మిమ్మల్ని కలసి చెప్పడం మర్యాద అని భావించాను. నాకు మేనరికం ఉంది. ఫ్యామిలీలో గొడవల వల్ల పెద్ద వాళ్ళ అంగీకారం దొరకట్లేదు. అందుకే ఇప్పుడే ఏమి డిసైడ్ చేసుకోలేక పోతున్నాను. కానీ, ష్యూర్ సర్! నేను మీ బంధువుల అమ్మాయికి మంచి సంబంధం చూస్తాను.”

అతని మాటలు వింటూ, తనకు మనసు దూది పింజలకు మల్లే తేలిక అయ్యింది. ‘మంచి అబ్బాయి సంబంధం తప్పి పోయిందోచ్.’

అతను వెళ్ళాక ఆనంద్ గారు అన్నారు, “ఊర్మిళా! నేను ఇంకా కూడా చెప్పి ఉంచుతాను సంబంధాల కోసం” అని.

ఈయనకి నా పెళ్ళి గోల పట్టుకుందేమిటో!

“ఇంక వదిలేయండి, ఆ విషయాన్ని” అంది.

అప్పటి దాకా ఉన్న ప్రశాంతత కాస్త ఠక్కున మాయమయ్యింది ఆయన ముఖంలో.

“అయితే, నేనే స్వయంగా నీకు మ్యాచెస్ చూస్తాను” అన్నారు.

“నాకు వద్దు. పెళ్ళే ఇష్టం లేదు నాకు.”

“మంచివాళ్ళని, మంచి జాబ్ హోల్డర్‌నీ చూస్తున్నాను..”

“వద్దూ -వద్దూ!” తాను గట్టిగానే అంది.

“ఎందుకు వద్దూ”

“వద్దు, అంతే!” తాను మొండిగా అంది.

“ఎలాంటి వాళ్ళు కావాలో చెప్పు.”

“ఎలాంటి వాళ్ళయినా వద్దు.”

“పోనీ నన్ను చేసుకుంటావా!” కోపంతో అరిచారు.

“చేసుకుంటాను”

క్షణం, నిశ్శబ్దం..

“బుద్ది ఉందా! నేను నీ కంటే ఎంత పెద్దనో తెలుసా!”

“అయితే ఏమిటి!”

“నాకు ఎవరెవరినో చేసుకోవాలని లేదు. మీలో నేను కోల్పోయిన నా ఆత్మీయులందరూ ఉన్నారు.”

“నాకు మాత్రం నీ లాంటి పిరికి అమ్మాయి ఇష్టం లేదు. పొగరుబోతుదయినా నా భార్యే నాక్కావాలి.”

“అందుకు నన్ను పెళ్ళి చేసుకోమని ఫోర్స్ చేస్తారా! ఇదెక్కడి న్యాయం?”

“ఓ విషయం తెలుసుకో! ఆ దయ్యం నన్ను ఒదిలి ఉండదు.”

“అయితే.. దయచేసి నా పెళ్ళి ప్రయత్నాలు మానండి. నేను లైఫ్‌తో డిటాచ్డ్‌గా ఉండదలిచాను.”

“మరి నన్నెలా చేసుకుంటానన్నావు.”

“మిమ్మల్ని చూసుకునే వారెవరు లేరని!”

ఆ మాటతో ఆనంద్ గారు మరింత గంభీరంగా, నిశ్శబ్దంగా అయ్యారు.

ఆయన ఆలోచిస్తూనే ఉన్నారు, సుధీర్ఘంగా!

ఆ ముఖంలో మానసికమైన అలసట..

“ఆలోచించుకో ఊర్మిళా! అవకాశం చేజార్చుకోకు. అశోకా చెట్టులా కాదు, మందారంలా నీ జీవితం విరబూయాలి.”

ఆయన అంత లాలనగా చెప్పేసరికి తనకు ఏడుపు వచ్చేసింది. “దయచేసి వద్దండి. నాకు ఇంకెవరూ వద్దు. కుమారీస్‌లో చేరిపోతాను” అంది.

తాను ఏడుస్తూనే ఉంది. ఆయన సోఫాలో వెనక్కు వాలి కూర్చున్నారు.

తన కో విషయం అర్థం అయ్యింది.

పెళ్ళి చేసుకోమన్న ఆజ్ఞాపనలో తన భార్య తిరిగి రావాలన్న స్వార్థమేనా! తన కో జీవితం ఏర్పరచాలన్న తాపత్రయం స్పష్టంగా కనిపిస్తూంది.

బంధువులే బాధ్యత పైన బడుతుందని దూరం పెట్టారు. ఆత్మీయులు అర్థాంతరంగా అంతర్ధానమాయ్యారు.

తన బాగు ఆలోచించే మనిషి కంటే ఇంకా ఎవరు కావాలి?

ఆయన్ని చూసుకోవడం తనకు ముఖ్యం.

చదువులు – ఉద్యోగాలు అంటూ జీవిత పోరాటం చేయాలని లేదు.

ఆనంద్ గారికి తోడుగా ఉండాలి. లేదంటే, కుమారీస్‌లో చేరిపోవాలి అంతే!

ముందేదో అవుతుందన్న ఆలోచనకు తావివ్వాలని లేదు.

తన జీవితము విధి చేతిలో బిగుసుకున్న బంతి.

గతంలో నుండి ఇంకా బయటపడలేదు.

వర్తమానం మీద ఆశలు లేవు.

ఉన్నదల్లా ఓకే కోరిక.

ఒక చిన్న ధ్యేయంతో జీవించాలి.

ఆయన ఏమి నిర్ణయించుకున్నారో తెలియదు.

ఇంటి ముందు దింపేసి నిశ్శబ్దంగా వెళ్ళి పోయారు.

***

ఆ తర్వాత –

ఒక రోజు తాను టీ పాకెట్స్ ఉన్న సంచీ భుజాన తగిలించుకుని, రంగులు వెలిసిన ఆ కాంపౌండ్ గేట్ దాటి, ఇరుకు సందులో నుండి వీధి మలుపుకు వచ్చింది.

అక్కడ నిలిపి ఉన్న పొడుగాటి కారును చూస్తూ పోల్చుకుంది. ఇది ఆనంద్ గారి కారులా ఉంది. నెంబర్ అవన్నీ తనకు తెలియవు కానీ, తమ సందు దగ్గరికి అంత పెద్ద కారు ఆగి ఉండడం అనే దృశ్యం తానెప్పుడూ చూడలేదు.

ఆయన కారేమో, అనే అనుమానం, ఆదుర్దా తనని విజ్ఞత మరిచి, కారు లోనికి ఓ చూపు వేసేలా చేసాయి.

ఆయనే!! మై గాడ్! ఇదేమిటి! స్టీరింగ్ సీట్‌లో వెనక్కు వాలి పడుకున్నారేమిటి? ఇక్కడికి ఎందుకు వస్తారు. తన కోసమయితే కాదు కదా!

కొంచెంగా ఓపెన్‌గా ఉన్న విండో నుండి చూస్తూ, “సర్” అంది.

ఆయన దగ్గర జాబ్ చేసినప్పుడు పిలిచినట్టుగా. ఆయన వెంటనే కళ్ళు తెరిచారు. కాస్త ముందుకు వంగి కారు డోర్ తెరిచారు.

టీ పాకెట్స్, కొత్త గా మార్కెట్ లోకి వస్తూన్న సర్ఫ్ కంపెనీ శాంపిల్ కవర్స్ ఉన్న బ్యాగ్‌తో తాను కారులో కూర్చుంది.

వడలి పోయి న ముఖం, పీక్కు పోయిన కళ్ళు – అసలు ఆనంద్ గారేనా!

“ఏమిటి అలా ఉన్నారు. ఎప్పుడు వచ్చారు?”

ఆయన అంటే ఉన్న భయం మర్చిపోయి కంగారుగా అంది.

“రాత్రి..”

తను అర్థం కానట్టు చూసింది.

రాత్రి ఎప్పుడు వచ్చారో! ఏమి జరిగి ఉంటుంది?

ఆయన గారు రాత్రి ఇలా కారులో నిద్ర పోవడం ఏమిటి!

కారు స్టార్ట్ అయ్యింది.

కొంచెం దూరం కారు వెళ్ళాక, “థాంక్ గాడ్!” అన్నారు.

ఏమిటో అర్థం కాక చూసింది.

తన వంక, తన బ్యాగ్ వంక అలవోక దృష్టి సారించి, “తెల్ల చీర కట్టి ఏరియల్ కంపెనీ అడ్వటైజ్మెంట్ లాగ ప్రత్యక్షం కానందుకు” అన్నారు.

రోషంతో తన ముక్కు పుటాలు అదిరాయి.

ఆ వెంటనే మరో ఆలోచన..

ఎవ్వరో పెళ్ళికొడుకును కూర్చోబెట్టి వచ్చారేమో! అలా అయితే రాత్రే ఎందుకు వచ్చి ఉంటారు.

అప్పుడు గమనించలేదు కానీ, ఇంటికి వచ్చాక చూసింది. ఆయన కళ్ళు ఉబ్బి ఉన్నాయి. కళ్ళ క్రింద ఆరిపోయిన తడి చారికల మిగుళ్ళు ఉన్నాయి.

తనకు బాధగా ఉంది.

ఒక రాత్రి తన కోసం పరుగు పెట్టి వచ్చిన వ్యక్తి ఏమి జరిగిందో చెప్పడేం!

గుండె గుట్టు విప్పడేం!

అడిగే ధైర్యం తనకెటూ లేదు.

మెల్లిగా లేచి ఫ్రిజ్ నుండి చల్లని వాటర్ తీసిచ్చింది.

వాడ్రోబ్ నుండీ ఇస్త్రీ కర్చీఫ్ తడిపి ముఖం తుడుచుకునేందుకు ఆయన చేతికి ఇచ్చింది..

ఇవన్నీ తను ఏ మెప్పు కోసం చేసినవి కావు.

తన ‘సిస్టర్’ ప్రవృత్తి తనని అలా ప్రేరేపించింది.

కిచెన్ లోకి వెళ్ళి, ఇలాచి వేసి వేడి టీ పెట్టి ఇచ్చింది.

ఏ కళనున్నాడో మహానుభావుడు ఏమీ అనలేదు. అసలు తనకో విలువ ఉందా, అని. అందమైన ఆడపిల్లగా కూడా ఆయన దృష్టిలో ఎలాంటి గుర్తింపూ లేదు.

ఇంక మెల్లిగా పెళ్ళి కొడుకు ప్రసక్తి తెస్తాడేమో!

‘నీ వల్లే, అంతా నీ వల్లే! బాబోయ్! ఇంకా స్టార్ట్ చేయడేమి!’ అనుకుంటూండగానే “ఊర్మిళా” అన్న పిలుపు వినిపించి అలర్ట్ అయ్యింది.

“నీ కోసం ఎందుకు వచ్చానో తెలుసా!”

ఏమనాలో తెలియక తల ఆడించింది –

అవుననో, కాదనో తనకే తెలియనట్టుగా.

“మొన్న బెంగుళూరు వెళ్ళాను.”

వినేందుకు సిద్ధంగా ఉంది.

“ఎందుకు వెళ్ళానో తెలుసా!”

‘పెళ్ళికొడుకు కోసం కాకపోతే చాలు’ అనిపించింది.

“నా ఫ్రెండ్ ఇల్లు కట్టుకున్నాడు.”

“అలాగా!” అంది. ‘హమ్మయ్య’ అనుకుంది.

“కానీ, అనుకున్న పని అవలేదు.”

ఆయన గొంతు మంద్రస్వరంలో ధ్వనిస్తోంది.

“జానూను చూడాలి అన్న కోరిక తీరలేదు.”

ఆయన కళ్ళల్లో తడిపొర.

“అయ్యో!”

వెళ్ళి కాస్త దగ్గరలో కూర్చుంది.

ఎలా సంభాషణ కొనసాగించాలో తనకు అర్థం కాలేదు.

ఆయనే మళ్ళీ అన్నారు.

“బెంగుళూరుకు వచ్చానని, మైసూర్ హోటల్ రూమ్‌లో ఉన్నానని, నా ఫ్రెండ్‌తో కబురు పంపించాను.”

కళ్ళద్దాలు నొసటి పైకి పెట్టుకొని, సోఫాలో తల వెనక్కు వాల్చారు.

ఆయన కళ్ళ నుండి ధారగా కన్నీళ్ళు..

“జానూను పంపడం ఇష్టం లేకపోతే నేనే వచ్చి, చూసి వెళతానని కూడా చెప్పించాను కానీ, ససేమిరా అందిట.

స్కూల్ కయినా వెళ్ళి చూస్తాను. స్కూల్ పేరు చెప్పమంటే కూడా నిరాకరించింది.

భద్రం గారి మాటనూ చెవిని పెట్టలేదు.

తనది ఏ మాత్రం అనుమానం కాదని, నా స్నేహితునితో వాదించిందట.

“ఇంక అయిపొయింది, ఊర్మిళా! నా కుటుంబం నన్ను ఒంటరివాణ్ణి చేసింది. నా బిడ్డను ఇంక చూడలేను!”

ఆయన కళ్ళు అవిశ్రాంతంగా వర్షిస్తూంటే, చేయితో తుడవబోయింది. హఠాత్తుగా ఆయన తన భుజం మీద తల వాల్చారు.

ఆయన్ని ఎలా ఓదార్చాలో తెలియని తన కళ్ళ నుండి కూడా ధారగా కన్నీళ్ళు కారుతున్నాయి.

కాస్సేపటికి ఆయన స్థిమితపడినా, ముఖంలో బాధా వీచికలు అలాగే ఉన్నాయి.

“అక్కడి నుండి వచ్చాక, నా మనసేమీ బాగా లేదు. ఇంట్లో ఉండలేకపోయాను. హోటల్‌కు వెళ్ళాలనిపించ లేదు. నీ దగ్గరకు రావాలనిపించింది. అందుకే వచ్చాను. కానీ, ఆ సమయంలో అలా రావడం భావ్యం కాదని తెలుసు. కారు లోనే ఉండి పోయాను.”

ఆయన మాటలు వింటూ నిట్టూర్చింది.

ఓదార్చగలిగే మాటలు ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి?

ఆయనకు జ్వరంగా ఉంది.

మెల్లిగా లేచి అలమారలో వెతికి, క్రోసిన్ టాబ్లెట్ తీసుకుంది. బెడ్ రూమ్‌లో నుండి రగ్గు తీసుకు వచ్చింది.

ఇలా ఎవరిని చూసినా, తనలో సహజంగా సత్వర స్పందన ఉంటుంది.

ఆయనచే టాబ్లెట్ మింగించింది.

నుదురు మీద వేసుకున్న చేయి తొలగించి, ఇమామి మెంతో ప్లస్ సున్నితంగా రుద్దింది.

రగ్గు కప్పబోతుంటే ఆయనే చేతి లోకి తీసుకున్నారు. పడుకున్న ఆయన్ని చూస్తూ కూర్చుంది.

ఆఫీస్ టేబుల్ మీద పెట్టిన ఇంతెత్తు పుస్తకాల కట్ట –

చెప్పిన ప్రకారం ఉద్యోగం ఇప్పించిన నిజాయితీ –

పోలీస్ స్టేషన్ నుండి అర్ధరాత్రి విడిపించి, వెంట తీసికెళ్ళిన ఔదార్యం –

ఒక్క రోజూ వక్ర దృష్టి సారించని, హుందాతనం..

ఇప్పుడు ఆయనకు ఇన్ని బాధలా!

కుటుంబ విచ్చిత్తికి స్త్రీకి సమానమయిన బాధను పురుషుడూ అనుభవిస్తాడు, అనుకుంది, చెదరని ఆయన కన్నీటి చారల వంక చూస్తూ.

కాససేపటికి ఆయన లేచారు.

టెంపరేచర్ తగ్గింది.

వేడిగా చారు చేసి, అన్నంలో కలిపి స్పూన్ వేసి చేతి కిచ్చింది.

“నువ్వూ తిను ఊర్మిళా!” అన్నారు.

తానూ తెచ్చుకుంది.

కాస్సేపటికి ఆయన రూమ్ లోకి వెళ్ళారు.

డ్రెసప్ అయి వచ్చారు.

చేతి లోకి కారు కీస్ తీసుకున్నారు.

తానూ లేచింది.

ఆయన వంక, చేతి లోని కారు కీస్ వంక చూస్తూ నిలబడింది.

ఏమిటీ ఆలస్యం, అన్నట్టున్నాయి ఆయన చూపులు..

“జ్వరం మొత్తం తగ్గి నట్టు తెలియనిదే, ఎలా వెళ్ళడం?” అంది

“నేను ఫోన్ చేస్తాగా!” అన్నారు.

ఆయనకు ఓ అడుగు దగ్గరగా వచ్చి, “దయచేసి ఇంక నాకు సంబంధాలు చూడకండి!” అంది అభ్యర్థనగా.

ఆయన చేయి ఓదార్పుగా తన భుజాలను చుట్టింది. ఆయన మౌనంగా విని వెళ్ళి కారు స్టార్ట్ చేసారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here