[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఊర్మిళతో పని చేసిన టీచర్ ఒకావిడ – ఊర్మిళ ఆసుపత్రిలో ఉన్నప్పుడు రాలేక, డిశ్చార్జ్ అయ్యాకా ఇంటికొచ్చి పరామర్శిస్తుంది. తొలుత ఆనంద్ గారి కూతురు, ఆ తర్వాత మొదటి భార్య వచ్చి ఇంట్లో తిష్ట వేసిన సంగతి ఊర్మిళ సహోద్యోగులందరిలో బాగా ప్రచారం అవుతుంది. ఊర్మిళను సాధించే నెపంతో పిల్లలు అల్లరి చేస్తే వాళ్ళని కొడుతూ ఉంటుంది మాలతి. ఒకరోజు పెద్దవాడు బయట ఆడుకుని వచ్చి, చేతులు కడుక్కోకుండా వచ్చి ఫ్రిజ్ తలుపు తీస్తే, మాలతి వాడిని గట్టిగా కొడుతుంది. మాలతి చేసిన పనికి జాహ్నవి, ఊర్మిళ విస్తుపోతారు. తల్లి చర్యని ఖండిస్తుంది జానూ. పసిపిల్లలని కొట్టద్దని అంటుంది. ఊర్మిళ పిల్లల్ని దగ్గర కూర్చుని బుజ్జగిస్తుంటే, పెద్దమ్మ మంచిది, ఆరోగ్యం బాగాలేక చిరాకు పడుతుందని చెబుతుంటే అక్కడికి వచ్చిన అన్నమ్మ, సణుగుతుంది. తాము మైసూరు ఎప్పుడు వెళ్ళాలని జానూ అడుగుతున్నా, మాలతి బదులివ్వదు. ఇక్కడే ఉంటామంటుంది. ఓ రోజు అన్నమ్మ ఊర్మిళకి తీసుకెళ్ళే అన్నంలో కారం బాగా ఎక్కువేసి తీసుకెళ్తే, అది మాలతి పనేమోనని భావిస్తుంది ఊర్మిళ. తాను అలాంటి పనులు చేయనని మాలతి జానూ మీద ఒట్టేస్తుంది. చివరికి నీకు పౌరుషం తెప్పించాలనే నేనే కారం ఎక్కువ వేశానని అన్నమ్మ ఊర్మిళకి చెప్తుంది. జానూ అమ్మకి ఎంతగానో నచ్చచెబుతూ ఉంటుంది. అయినా ఇంట్లో ఘర్షణలు తప్పడం లేదు. అందరూ ఆనంద్ రాక కోసం ఎదురుచూస్తుంటారు. ఊర్మిళ పుట్టినరోజుకి ఆనంద్ ఆన్‍లైన్ ద్వారా కేక్, బొకే ఏర్పాటు చేస్తాడు. డ్రెస్ కూడా ఆన్‍లైన్‍లో కొని పంపుతాడు. ఆ డ్రెస్ వేసుకుని, కేక్ కట్ చేసి తనకి ఫోటోలు పంపమని చెప్తాడు. అలాగే చేస్తుంది ఊర్మిళ. ఈ సందడికి నిద్రపోతున్న మాలతికి మెలకువ వస్తుంది. కారణం తెలుసుకున్న ఆమెకు మూడ్ ఆఫ్ అయిపోతుంది. తీవ్రమైన మనోవేదనతో బి.పి. డౌన్ అయి కళ్ళు తిరిగి పడిపోతుంది. వేణు సాయంతో, జానూ మాలతిని ఆసుపత్రిలో చేర్పిస్తుంది. వెంట వెళ్ళి సాయం చేయలేని నిస్సహాయత ఊర్మిళది. – ఇక చదవండి.]
అధ్యాయం 26
[dropcap]ఆ[/dropcap]నంద్ గారు ఎప్పుడు వస్తారో!
మాలతి గారిని చూస్తే బాధగా ఉంది.
ఎంత అశాంతిని అనుభవిస్తున్నారు.
పరోక్షంగా ఆవిడ బాధకు తను బాధ్యురాలవుతున్నందుకు, తన తప్పు లేకున్నా, ఆమె బాధలో తనకూ భాగం ఉన్నందుకు గిల్టీగా ఉంది.
ఇప్పుడు తాను ఆమెకు ఏమీ చెప్పలేదు. చెప్పినా అర్థం చేసుకునే స్థితి ఆమె కెన్నడూ లేదు. అపార్థాల కుంపటిలో ఎగిసిపడుతున్న ద్వేషజ్వాలలకు ఆవిడ ఆరోగ్యం ఆహుతి అవుతుంటే ఇంతమంది నిస్సహాయంగా ప్రేక్షక పాత్ర వహించక తప్పడం లేదు అనుకుంది ఊర్మిళ.
జానూకు ఫోన్ చేసింది. బి.పి. కంట్రోల్ చేసి, ఒక రోజు అబ్జర్వేషన్‌లో ఉంచి పంపిస్తారని చెప్పింది.
నిట్టూర్చి, “అవసరం ఉంటే నాన్నకు ఫోన్ చేయి జానూ!” అంది.
“పని మీద వెళ్ళారు. కంగారు పెట్టడం ఎందుకు పిన్నీ! అందుకే తాతగారికి కూడా చెప్పలేదు” అంది.
***
కానీ వేణు భయపడ్డాడు, ఇంత జరిగితే నువ్వయినా నాకెందుకు చెప్పలేదని సార్ తిడతారని. అందుకే ఆనంద్‌కు ఫోన్ చేసాడు. ఆనంద్ వెంటనే అవైలబుల్ ఉన్న ఫ్లైట్‌కు బయల్దేరి వచ్చేసాడు.
అదీ అతని బాధ్యతాయుత వ్యక్తిత్వం. అదీ అతని ప్రేమ మూర్తిమత్వం.
అదీ ఆతని క్షమాగుణం.
ఆడది క్షమిస్తే అమృతమయి. మగవాడు క్షమిస్తే అవకాశవాదా!
తన కోసం పరగెత్తుకు వచ్చిన భర్తను చూసి, మాలతి కళ్ళల్లో వెలుగు, విజయగర్వం కూడా.
మాలతి కోలుకుంది. కానీ సమస్య అలాగే ఉంది.
***
ఆనంద్ మధ్యలో వచ్చాడు కనుక మళ్ళీ వెంటనే వెళ్ళేది ఉంది. అతను బ్రీఫ్ కేస్ చేత పట్టుకొని ఊర్మిళ బెడ్ దగ్గరికి వచ్చాడు.
ఊర్మిళను చూస్తూ, “ హెల్త్ జాగ్రత్త!” అన్నాడు.
ఊర్మిళ అతని చేయి అందుకుంది.
“నేను బాగానే ఉన్నాను. నా గురించి వర్రీ అవొద్దు.” అంది.
సమాధానం లేని చూపొకటి ఊర్మిళ వంక చూసి అతను బయటకు నడిచాడు. ఊర్మిళ నిట్టూర్చింది.
ఈ సమస్యలు ఏవి ఎలా ఉన్నా, వీటి మధ్య ఆనంద్ గారు నలిగి పోకూడదు. ఇప్పుడు ఆయన ప్రాబ్లమ్‌లో ఉన్నారు. తనకు జీవితం, విజ్ఞానం, బిడ్డలూ ఇచ్చిన ఆయన క్షేమం తనకు ముఖ్యం. ఇప్పుడే ఆయన్ని తను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక విధంగా ఆయనకు కష్టం వచ్చిపడింది. ఆ కష్టంలో ఆయనకు తోడుగా నిలవాలి. అందుకు తాను దూరం కావాల్సి వచ్చినా బాధ పడకూడదు. ఇప్పుడు ఆయనకు సాంత్వన అవసరం. ‘నేనేమి కావాలి? నా జీవితం ఏమి కావాలి? నా పిల్లలు ఎట్లా? ఆవిడను గెంటేయండి’ అంటే ఆయన నలిగిపోతారు. అందుకే తన సహజ ఆభరణం సహనమే తన నేస్తం. దాని తోనే ఆయనకు బాసటగా నిలుస్తుంది. అంతకన్నా తాను ఆయనకు ఏ విధంగా హెల్ప్ చేయగలదు? ఊర్మిళ ఇలా ఆలోచిస్తుంటే మరురోజు ఆనంద్ జాహ్నవికి ఫోన్ చేసాడు.
“జాన్వీ! గుర్తు పెట్టుకో! రేపు అమ్మను చెకప్‌కు తీసుకొని వెళ్ళాలి!” అన్నాడు.
“అలాగే డాడ్! ఎన్నింటికి? మీరు ఆపాయింట్మెంట్ తీసుకున్నారా!” అన్న జాహ్నవి ప్రశ్నలకు “అంతా మాట్లాడి పెట్టాను.” అన్నాడు ఆనంద్.
***
జాహ్నవి, ఆనంద్ చెప్పినట్టే మాలతిని చెకప్‌కు తీసుకొని వచ్చింది.
మాలతి వెయిటింగ్ ఏరియాలో కూర్చొని ఉంది. జాహ్నవి వాటర్ బాటిల్ తెచ్చేందుకు వెళ్ళింది.
అక్కడికి ఒకావిడ హడావిడిగా వచ్చి కూర్చుంది. మళ్ళీ ఏదో రిసెప్షన్‌లో అడగడానికి వెళుతూ, పర్స్ అక్కడ మర్చిపోయింది.
ఆమె వాళ్ళను ఏదో అడుగుతూ పర్స్ మాటే మర్చిపోయినట్టు ఉంది. మాలతికి ఏమి చేయాలో తోచలేదు.
జాహ్నవి కూడా అక్కడే ఉన్న మెడికల్ షాప్‌లో వాటర్ బాటిల్ తెచ్చేందుకు వెళ్ళి, ఇంకా రాకపాయె!
ఆవిడ పర్స్ తను పట్టుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళింది.
“హ్యాండ్ పర్స్ అక్కడే మర్చి పోయారు” అంటూ ఇచ్చింది.
“ఓ. థాంక్స్ అండీ. అంత వాల్యూ అయినవి ఏమీ లేవు లెండి” అంది నవ్వుతూ ఆమె.
రిసెప్షన్ నుండి మళ్ళీ వెయిటింగ్ ఏరియాకే వచ్చి, మాలతి ప్రక్కనే కూర్చుంది శృతకీర్తి.
తన చిరునవ్వుతో, పలకరింపుతో మాలతిని చేరువ చేసుకుంది.
“అయ్యో! మీకు ఇంకా పెళ్ళి కాలేదా!” అంది మాలతి సానుభూతిగా.
“చేసుకోదల్చుకోలేదు అండీ” అంది శృతకీర్తి.
“ఎందుకు!” మాలతిలో స్త్రీ సహజమైన కుతూహలం.
“మా అక్క, చెల్లెళ్ళ స్టోరీస్ వల్ల!” అంది శృతకీర్తి.
“అయ్యో! ఏమి జరిగింది” అంది మాలతి.
శృతకీర్తి అలా ఆమె కనుగుణంగా తన భావాలు చెప్తూ ఆమెకు మరింత దగ్గర అయ్యింది. ఎంత దగ్గర అంటే, “మీరు మా ఇంటికి రండి.” అని మాలతితో అనిపించుకోగలిగేంత!
సాధారణ వస్త్రధారణతో, అతి సాధారణంగా కనిపించే శృతకీర్తి మాలతి ‘ఇగో’ను సంతృప్తి పరిచేలా ఉంది. ఎక్కువ ఫ్యాషన్ పోకడలు లేవు, తనకంటే ఎక్కువ అందగత్తేమి కాదు. ఆమె ధోరణి చూస్తే మరీ ఎక్కువ చదువుకున్న ఆవిడలా కూడా లేదు. కొందరు స్నేహం చేసేటప్పుడు తమ కంటే అధికులను ఇష్టపడరు. మాలతికి కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి. శృతకీర్తి దగ్గరలో ఉన్న స్కూల్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నానని చెప్పింది.
“ఇంకేమి మీరు స్కూల్ నుండి వచ్చేప్పుడు ఇటు వచ్చి వెళుతూండండి” అంది మాలతి.
“అలాగే! మీరు కూడా మా ఇంటికి రావాలి” అంది శృతకీర్తి.
“నేనా! నాకు తొందరగా ఎక్కడికీ కదిలే అలవాటు లేదు” అంటూ నవ్వింది మాలతి.
“పర్లేదు నేను వస్తూ ఉంటాను లెండి.” అంది.
అలా రోజు విడిచి రోజు శృతకీర్తి మాలతిని కలిసేందుకు వస్తూంది.
స్నేహితులు లేని మాలతి శృతకీర్తి వల్ల స్నేహితం లోని మాధుర్యం అనుభవించసాగింది.
ఒకరోజు శృతకీర్తి ఒక అందమైన చీరను ప్యాక్ చేయించుకుని మాలతికి తెచ్చిచ్చింది. “అయ్యో! ఎందుకు తీసుకున్నారు” అంది మాలతి మొహమాటంగా.
“మీరు ఇన్ని సార్లు ఇంటికి వచ్చారు. నేనే మీకు పసుపు, బొట్టు ఇవ్వాలి” అంది మాలతి.
“మీరు మళ్ళీ ఊరు వెళతారు, కదా! మీ ప్రోగ్రామ్ ఎప్పుడో నాకు తెలీదాయె! అందుకే ఇప్పుడే ఇస్తున్నాను.” అంది శృతకీర్తి.
“నేను అప్పుడే వెళ్ళను లెండి. వచ్చిన పని ఇంకా కాలేదు” అంటూన్న మాలతి మాటలు సైకాలజిస్ట్ శృతకీర్తి చెవులను దాటి పోలేదు.
“వచ్చిన పనేమిటి?” అని వెంటనే అడగలేదు.
“అలా స్కూల్ నుండి వస్తూంటే, షాప్‌లో కనిపించింది. చీర చూడగానే మీరే గుర్తుకు వచ్చారు. మీకు చాలా నప్పుతుందనిపించింది.”
మాలతి ఆ అభిమానానికి లొంగిపోయింది. శృతకీర్తి స్నేహాన్ని మనసారా నమ్మింది. ఆమెతో మాట్లాడుతూంటే, మనసంతా తేలిక అయినట్టు ఉంటుంది. తెలియని ప్రపంచం చాలా ఉన్నట్టు అనిపిస్తుంది.
మరు రోజు చీర కొనుక్కోమని ఆప్యాయంగా డబ్బులిస్తూన్న మాలతితో, “మీరే వచ్చి కొనివ్వకూడదూ! మీకు కూడా కాస్త బయట తిరిగినట్టు ఉంటుంది” అంది ఆమె.
“ఆయనకు చెప్పలేదు. ఆయన ఊళ్ళో లేరు” అంది.
ఆ మాటతో మాలతి సగటు గృహిణి మనస్తత్వం మరోసారి అర్థం అయ్యింది ఆమె కు.
“పర్లేదు! మీవారు వచ్చినా ఏమి అనరు లెండి!” అని “ఫోన్ చేసి చెప్పండి. లేదా ఆయన వస్తే జాన్వీ చెపుతుంది” అంది.
ఆవిడతో కలిసి షాపింగ్‌కు బయల్దేరింది మాలతి. బయట ప్రపంచం అలవాటు తప్పినట్టయిన ఆమె – జనం, సందడి చూస్తూ తత్తరపడింది. చీర సెలెక్షన్ పూర్తి అయ్యాక, శృతకీర్తి తనకు కాస్త పని ఉందని చెప్తూ, ఇంకా షాపింగ్ చేసేది ఉందని తీసుకొని వెళ్ళింది. అన్నీ చూస్తూ ఎంతో ఎంజాయ్ చేసింది మాలతి. నచ్చినవి కొనుక్కోమని కూడా శృతకీర్తి ప్రోత్సహించింది.
ఆ కాస్సేపు మాలతిలో ఆలోచనలు దూరం అయ్యాయి. జాన్వీ ఎంత ప్రయత్నించినా తల్లిని బయట తిప్పలేక పోయింది, కానీ స్నేహం ఆ పని చేయగలిగింది.
ఒక రోజు –
మాలతిని శృతకీర్తి అడిగింది. “క్రింద రూమ్‌లో ఎవరు మీ బంధువులా!” అని.
తీగ లాగితే డొంక కదిలినట్టు, మాలతి ఆమె ముందు మనసు పరుస్తోంది.
శృతకీర్తి పాయింట్స్ నోట్ చేసుకుంటూంది. మెల్లిమెల్లిగా మిస్టరీ వీడుతూంది ఆమెకు.
***
మాలతి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ.
మేనత్త సక్కుబాయికి పిల్లలు లేనందున భద్రం గారు, చెల్లెలి కోసం తరుచు మాలతిని సక్కుబాయి ఇంటికి పంపించేవారు.
ఇరుగు పొరుగు సక్కుబాయి ఇంట్లోనే ఉన్న చేదబావిలో నీళ్ళు తోడుకునే వారు. వాళ్ళ మాటలు మాలతి మనసుపై గాఢంగా ముద్ర వేసుకున్నాయి. స్వయానా సక్కుబాయినే భర్త మరెవరినో, తెచ్చుకున్నాడని, వేరే ఇంట్లో ఉంచాడని ఆడిపోసుకునేది. భర్తతో నిత్యం పోరాడేది. దానికి తోడు ఇరుగు పొరుగు అమ్మలక్కలు బావిలో ఓ చేద వేసి నిల్చుని కంటికి కడివెడు ఏడ్చేవారు. మగవాళ్ళ తిరుగుబోతు వేషాల పైనే చర్చలు నడిచేవి. మగవాళ్ళు అంటే నమ్మరాని వాళ్ళు, పరస్త్రీలోలురు అనే విషయాన్ని అక్కడ అందరూ ఘంటాపథంగా అంగీకరించేవారు. మాలతి పసి మనసులో అప్రయత్నం గానే మరో వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. అది మగవాళ్ళను విశ్వసించని వ్యక్తిత్వం. మగవాళ్ళు స్త్రీలకు దాసోహం అనే వ్యక్తిత్వం.
మనసులో ఉన్న అంకురం మేనత్త సక్కుబాయి బలవన్మరణంతో మహా వృక్షమై కూర్చుంది. మేనత్త ఒక రోజు భర్తతో పోరాడి, ‘అదైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి, నువ్వు నా మాట వినవు. మళ్ళీ దాని కొంప కే వెళ్ళొచ్చావ్!’ అంది. అంటూనే కిరోసిన్ గుమ్మరించుకుంది.
తాను భయంతో ‘అత్తయ్యా’ అంటూ వాటేసుకోబోయింది. “వద్దే అమ్మా! నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి పో! నువ్వు నా దగ్గరికి రావొద్దు. ఈ బాధ ఆడదానికి లోకం ఇచ్చిన శాపం” అంది. తాను ఏడుస్తూంది.
మామయ్య “ఏమి బెదిరిస్తున్నావా! దాని సంగతి నీ కెందుకు? నిన్ను బాగా చూసుకుంటున్నాను కదా!” అన్నాడు.
అత్తయ్య మరేదో తిట్టింది. మామయ్య మరేదో అన్నాడు.
బెదిరించాలనుకుని పోసుకుందేమో కానీ ఆవేశం పెరిగి కుంపటి సెగలో చీర కొంగు వేసేసింది. వంట ఇంటి తలుపులు మూసేసింది. నిలువెత్తు మంటలు భగ్గున లేచాయి. ఆహుతవుతున్న అత్తయ్యను తలుపు కన్నాల్లోంచి చూస్తూ భోరున ఏడుస్తూంది తాను. అలాగే స్పృహ తప్పింది. జ్వరం కూడా తెచ్చుకుంది.
“అందుకేనా, ‘అన్నయ్యా! వచ్చి పిల్లను తీసుకు వెళ్ళు’ అంటూ ఉత్తరం వేసింది” అంటూ భద్రం గారు కుమిలి పోతున్నారు. “ఎవత్తినో పెట్టుకుని దాని ఉసురు పోసుకున్నాడు, పాపిష్టివాడు” అన్నారు భద్రం గారు.
అత్తయ్య దినవారాలప్పుడు మామయ్య వైపు బంధువులు, “మొగుణ్ణి అదుపు చేసుకునే తెలివి సక్కుబాయమ్మకు లేకపోతే ఏ మగవాడైనా అంతే!” అంటూ వెనుక వేసుకొని వచ్చి, దెబ్బలాడారు.
“తన కేమి తక్కువ చేసాడని, మగవాడు అన్నాక తిరుగుతాడు.”
ఆనాటి సమాజంలో అదొక వ్యవహారికమైన నానుడి.
మగవాడు అన్నాక తిరుగుతాడు.
మగవాడు అన్నాక తిరుగుతాడు .
మగవాడు అన్నాక తిరుగుతాడు..
మాలతి మనసు నిక్షిప్తం చేసుకుందా పదజాలాన్ని. ఒక అన్యాయం కళ్ళ ముందు జరిగాక తనను తాను ఆ అన్యాయానికి గురి కాకుండా చూసుకోవాలన్న శపథం అక్కడికక్కడే జరిగిపోయింది. తీవ్ర భద్రతా భావం కూడా ఒక లాంటి అభద్రతాభావాన్నే సూచిస్తుంది.
ఇది ఇలా ఉంటే మాలతిలోని సహజమైన మాలతి, సగటు స్త్రీలా సంసార పక్షం – భర్తను దైవంగా పూజించే మనస్తత్వం. ఆనంద్, మాలతిల వైవాహిక జీవితం ఒకరికొకరు ప్రాణంగా పెనవేసుకొని, సాగుతుండగా జాహ్నవి పుట్టింది. ఆ తర్వాత మరో కాన్పు చాలా తొందరగా అందుకుంది మాలతికి. ఆ పురిటి కందు దక్కలేదు. ఆ పరితాపం, హార్మోన్ ఇమ్‌బాలెన్స్ ఆమెను పోస్ట్ పార్టం డిప్రెషన్‌కు గురి చేసాయి. చిన్నప్పటి సక్కుబాయి అత్తను నిదుర లేపాయి. పురిటిలో వచ్చిన శారీరక అస్వస్థత, ఆనంద్ జాహ్నవి కోసం క్రెష్‌కు వెళ్ళడం, అతడు ఊర్మిళను కలుస్తున్నాడనే వేదన, బాలింతరాలిగా నిస్సహాయత ఆమెను మరింత క్రుంగదీసాయి.
ఖచ్చితంగా ఆనంద్, ఊర్మిళ దగ్గరయ్యారని ఆమె నమ్మసాగింది. ఆనంద్ ప్రేమపై ఎంత విశ్వాసం ఉన్నా, తాను చిన్నప్పుడు చూసిన సమాజం ఇంకా మారలేదు అని అడపా తడపా విన్న ఇతర స్త్రీల కథలు గుర్తుకు తెచ్చాయి.
మాలతి నిశ్చయించుకుంది, ఆనంద్, ఊర్మిళల పరిచయం హద్దులు దాటిందని.
మంచి నమ్మేందుకు ఋజువులు దొరకడం కష్టం. కానీ చెడును నమ్మేందుకు ఊహాగానం ఒక్కటి చాలు.
ఇక ఊర్మిళను వేటాడడం మొదలు పెట్టింది. ఆనంద్ జీవితం నుండి తరిమేసాననుకుని తృప్తి పడింది. సక్కుబాయి అత్తయ్యకు థమ్సప్ సిగ్నల్ చూపించింది.
కానీ ఆ తర్వాత కూడా కాన్పుల్లో వచ్చే P. P. D. వల్ల నేమో మాలతి ప్రవర్తనలో మార్పు వచ్చింది.
పనిమనిషిని నీళ్ళ కూజా గదిలో పెట్టి రమ్మని తాను వెనకాల వెళ్ళి ఆనంద్‌ని గమనించడం – ఇంకా విచిత్రం ఏమిటంటే – ఓ రోజు ఆనంద్ జేబులో నుండి పూలు బయటకు తీసింది. “ఇవి ఎక్కడివి” అంది. ఆనంద్ గట్టిగా కోప్పడ్డాడు.
“నాతో ఇలాంటి నాటకాలు సాగవు. అవి ఎక్కడి వో నీకే తెలియాలి” అన్నాడు.
దానితో మాలతి నోరు అప్పటికి మూతబడింది. కానీ ఆనంద్‌పై ఎంక్వయిరీలు సాగిస్తూనే ఉంది. ఆఫీస్‌లోనూ, ఇంటా, బయట ఆయన భార్యకు ఆయన పై అనుమానం అనే పేరు తెచ్చుకుంది.
అదే సమయంలో ఆనంద్ ఊర్మిళను చాలా దయనీయ పరిస్థితుల్లో ఇంటికి తెచ్చాడు. కానీ అప్పటికే మాలతిలోని సక్కుబాయి అత్తయ్య మాలతిని సమన్వయం కోల్పోయేలా చేసింది.
భోరున ఏడుస్తూ పుట్టింటి దారి పట్టింది.
ఇక ఇక్కడి నుండి మాలతి మనసంతా సంఘర్షణల మయమే!
నిజం, అబద్ధాల అంచనాలో ఆమెకు అంతా గందరగోళమే!
కాస్సేపు ఆనంద్‌ను నమ్మాలనుకుంటుంది. మరు నిముషం సక్కుబాయి అత్తయ్య సాక్షాత్కారిస్తుంది. అక్కడి సమాజం, చుట్టూ మహిళల ఆక్రందన చెవిన పడుతుంది.
మాలతి ఇక ఒక నిర్ణయానికి వచ్చింది. ఆనంద్‌ను విడిచి అయినా బ్రతుకుతుంది. సక్కుబాయి అత్తయ్యలా జీవితం ముగించి ఓడిపోదు. రాజీ పడి అసలు బ్రతుకదు.
అలా తన ప్రేమ అంతా జాహ్నవికి పంచి, కేంద్ర బిందువుగా చేసుకుంది. ఆనంద్‌కు కూతురును అందనివ్వక పోవడం తన విజయంగా భావించింది.
జాహ్నవి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒంటరితనం మాలతిని మరింత స్థిమితం కోల్పోయేలా చేసింది. సక్కుబాయి అత్తయ్య నవ్వింది. పగలబడి నవ్వింది.
“చూసావా!, నీ కూతురు కూడా అటే వెళ్ళి పోయింది” అంది.
“ఈ ప్రపంచంలో మగవాడిని గెలవడం సాధ్యం కాదే అమ్మా!” అని కంటికి కడివెడు కార్చింది.
మాలతి ఆలోచనల్లో ఇప్పుడు ఊర్మిళ టార్గెట్ అయ్యింది. కేవలం ఊర్మిళ కారణం గానే భర్త తనకు దూరం అయ్యాడు. భర్తను అది మలుపుకుంది. లేకుంటే ఆనంద్ అలాంటి వాడు కాడు. తాను చక్కగా దాని కప్పగించి వచ్చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో బాధపడింది ఎవరు? తాను, ఆనంద్, జాహ్నవి..నే! ఊర్మిళ కేమీ కాలేదు. పెళ్ళి చేసుకునే శక్తి లేని దానికి పెళ్ళయ్యింది. ఇద్దరు పిల్లలు వచ్చారు.
జాహ్నవి వాళ్ళ దగ్గరే ఉండిపోతుందన్న భయం మాలతి కెప్పుడూ లేదు. కూతురి ప్రేమపై అమిత నమ్మకం. కానీ ఊర్మిళపై అవిశ్వాసం అలా ప్రకటించేది. ఆమెను నెగెటివ్‌గా ఊహించుకుంటే అదో తృప్తిగా ఉండేది. అలా తనపై తను పెంచుకునే సానుభూతి మరింత తృప్తిగా ఉండేది.
అయితే ఇప్పుడు జాహ్నవి తండ్రి దగ్గరికి వెళ్ళాలని తీసుకున్న స్టెప్ ఆమె సంతృప్తిని మొదలుకల్లా నరికేసింది. జీవితం గేలి చేస్తున్నట్టు ఉంది. జాహ్నవి వెళ్ళిపోయింది. ఇన్నాళ్ల వేదనలో నువ్వు సాధించినది ఏమిటని మనసు ప్రశ్నిస్తూంది. ఒకపప్పుడు ఆనంద్‌కు జాహ్నవిని దూరం చేసి అతను తనకు చేసిన ద్రోహానికి అది ప్రతీకారం అనుకునేది.
ఊర్మిళకు ఆనంద్‌ను అలా అప్పగించేసి, తానే నేరం చేసినట్టు పారిపోయి వచ్చిన తన తెలివితక్కువతనం మాలతిని ఇప్పుడు మరీ వెక్కిరిస్తూంది. ఊర్మిళను ఏమీ అనకుండా వచ్చేసిన కక్ష మనసులో అలా మిగిలిపోయింది. అందుకే ఇప్పుడు జాహ్నవిని తీసుకొని వెళ్ళడం నెక్స్ట్ థింగ్ అయ్యింది.
హైదరాబాద్‌కు వచ్చాక ఊర్మిళ ఇంట్లో లేదు. ఎప్పటి నుండో అణుచుకొన్న బాధ, ఊర్మిళపై కక్ష సాధించుకోవాలి అన్న కోరికగా మారింది. అందుకు ఆనంద్ ఉదాసీనత సహకరించింది. ఇంట్లో పట్టు సాధించింది.
ఊర్మిళను వేధించాలి. సాధించాలి. తన ప్రెసెన్స్ ఊర్మిళకు నరకప్రాయంలా ఉంటుంది. అందుకే తానిక్కడ ఉండాలి, అనుకుంది. ఎంత కాలం అనే దానికి ఆమె దగ్గర సమాధానం లేదు. ఆమె మనసు శాంతించినప్పుడు వెళ్ళిపోతుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది, శృతకీర్తి. మాలతి ఆనంద్‌తో వైవాహిక జీవితం గడపాలి అనుకోవట్లేదు. ‘ఊర్మిళ పై అనుమానం తోనే తిరస్కరించిన తాను, ఆమెతో జీవితం పంచుకున్న ఆనంద్‌ను ఎలా స్వీకరించగలను?’ అంది అని చెప్పింది శృతకీర్తి.
జాహ్నవి తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు తనకు కూడా ఆనంద్‌తో జీవితం గడపాలనిపించిందని, అయితే ఆ మధుర భావాల్లో ఊర్మిళ ఊహ భరించలేక పోయానని చెప్పింది. తనకో స్వప్న జగత్తు ఉందని అందులో, తనకు మాత్రమే పరిమితమైన ఆనంద్ ఉంటాడని, నిజ జీవితంలో ఆయనను స్వీకరించలేనని చెప్పిందట.
ఆనంద్ అంతా విని నిట్టూర్చాడు. అతనికి మాలతిపై సానుభూతి అంచెలంచెలుగా పెరిగి పోతున్నది.
ఎంత సంఘర్షణ అనుభవించింది మాలతి.
“మాలతి వల్ల ఊర్మిళ కేమీ ప్రమాదం లేదు కదా” అన్నాడు ఆనంద్.
“లేదు అనే నా నమ్మకం. మాలతి కొన్ని విలువల మధ్య పెరిగింది. కొన్ని విలువలు నమ్ముతుంది” మళ్ళీ అంది శృతకీర్తి.
“ఆమెలో ఓ బడబానలం రగులుతూంది. ఆమెలోనే కాదు దెబ్బ తిన్న ప్రతి స్త్రీ లోనూ బడబానలం దాగుకుని ఉంటుంది. అది ఎప్పుడూ ఒక్కసారిగా బద్దలవదు. సెగలై రగిలి పోతుంటుంది. ఇప్పుడు మాలతి పరిస్థితి అదే!” అంది.
“ఇప్పుడు ఎలా!”
“ఈ వివరాలు ఆమె మనసు లోతుల్లోకి వెళ్ళి ఆమెకు తెలియకుండానే రాబట్టినవి. ఆమెకు కౌన్సిలింగ్ ఎంత వరకు పని చేస్తుందో చూడాలి. మార్పు వస్తుంది అనే ఆశిస్తున్నాను” అంది శృతకీర్తి.
“మీరు డాక్టర్‌గా తెలియనప్పుడే అది సాధ్యం” అన్నాడు ఆనంద్.
“ఎస్!” అంది ఆమె.
“ఒక మెడికల్ సెమినార్ కోసం ఔట్ ఆఫ్ స్టేషన్ ఉంటాను. ఓ వారం రోజుల తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాను” అంది శృతకీర్తి.
ఆనంద్ ఆమె సహకారానికి కృతజ్ఞతలు తెలిపాడు.
(ఇంకా ఉంది)