Site icon Sanchika

ఎంత చేరువో అంత దూరము-27

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[జరుగుతున్న సంఘటనల పట్ల బాధపడుతూ, ఆనంద్ ఎప్పుడొస్తారో అని అనుకుంటుంది ఊర్మిళ. జానూకి ఫోన్ చేస్తుంది. బిపి. కంట్రోల్ చేసి, ఒక రోజు అబ్జర్వేషన్‍లో ఉంచి మాలతిని డిశ్చార్జ్ చేస్తారని చెప్తుంది జానూ. వేణు ఆనంద్‍కి ఫోన్ చేసి చెప్పగానే, వెంటనే బయల్దేరి వచ్చేస్తాడు ఆనంద్. తన కోసం పరుగెత్తుకు వచ్చిన భర్తను చూశాకా మాలతి కళ్ళల్లో విజయగర్వం కనబడుతుంది. మాలతి కోలుకున్నా, సమస్య మాత్రం అలాగే ఉంటుంది. పని మధ్యలో వచ్చాడు కాబట్టి, తిరిగి వెళ్ళక తప్పదు ఆనంద్‍కి. వెళ్ళేముందు ఊర్మిళకు జాగ్రత్తలు చెప్తాడు. ఏం జరిగినా ఆనంద్‍కు బాసటగా నిలవాలని ఊర్మిళ భావిస్తుంది. ఆనంద్ ఏర్పాటు చేసిన ప్రకారం – జాహ్నవి మాలతిని చెకప్‍కి హాస్పటల్‍కి తీసుకువెళ్తుంది. మాలతిని వెయిటింగ్ ఏరియాలో కూర్చొబెట్టి వాటర్ బాటిల్ తెచ్చేందుకు వెళ్తుంది జాహ్నవి. ఆ సమయంలో అక్కడ ఓ మహిళతో పరిచయం అవుతుంది మాలతికి. ఆమె తన పేరు శృతకీర్తి అని చెప్తుంది. కొద్దిసేపటికే వాళ్ళిద్దరూ దగ్గరవుతారు. పరిచయం, స్నేహంగా మారుతుంది. ఒకరి విషయాలు మరొకరికి చెప్పుకునేంత సన్నిహితులవుతారు. మాలతి తన గతమంతా శృతకీర్తికి చెప్తుంది. తన మేనత్త గురించి, ఆమె అనుభవించిన కష్టాలు, ఆ కష్టాలు తనపై చూపిన ప్రభావం అన్నీ చెబుతుంది. నిజానికి శృతకీర్తి ఓ సైకియాట్రిస్ట్. ఆనంద్ కోరికపై మాలతిని పరిశీలించి, వివరాలు తెలుసుకుంటుంది. తను గ్రహించినవన్నీ ఆనంద్‍కి చెప్తుంది. మాలతిది స్ప్లిట్ పర్సనాలిటీ అనీ, తనిక్కడ ఉండడం ఊర్మిళకు నరకప్రాయంగా ఉంటుందని భావించి, ఇంకా కొంతకాలం ఇక్కడే ఉండాలనుకుంటోందనీ, ఎంత కాలమనేది ఆమెకూ తెలియదని, మనసు శాంతించినప్పుడు వెళ్ళిపోతుందని చెప్తుంది శృతకీర్తి. ఓ సెమినార్ కోసం ఊరెళ్తున్నానీ, వారం తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తానని అంటుంది. ఆమెకు ధన్యవాదాలు చెప్తాడు ఆనంద్. – ఇక చదవండి.]

అధ్యాయం 27

[dropcap]ఆ[/dropcap]నంద్‌కు జరిగేదంతా బాధగా ఉంది.

శ్రుతకీర్తి మాటలు ఆలోచింప జేస్తున్నాయి.

మాలతి వచ్చినప్పుడు ఇంట్లో తాము ఉండి ఉంటే, ఎలా ఉండేది పరిస్థితి.

అప్పుడు మాలతి ఏమి చేసేది?

తన మీద అరిచేదా! ఊర్మిళతో దెబ్బలాడేదా!

ఆ ఆవేశంతో జాహ్నవిని లాక్కొని వెళ్ళేదా!

ఈ ప్రశ్నలకు సమాధానం మాలతి దగ్గర అయినా ఉందా!

ఒక లాంటి ట్రాన్స్‌లో, ఉద్వేగం హద్దులు దాటి ఉన్న మాలతి అప్పుడు ఏమి చేసేదో!

ఇక్కడే ఉండిపోవాలి అన్న మూడ్ స్వింగ్స్ అప్పుడు కలిగేవా!

ఆలోచిస్తే అంతా ఫజిల్ లాగా ఉంది.

పల్లెలోని చుట్టూ సమాజంతో, తన మేనత్త జీవితంతో ప్రభావితం అయిన మాలతి, తన ఆలోచనల మీద తనకే కంట్రోల్ లేని మాలతి..

ఆనంద్ నిట్టూర్చాడు..

ఎంత భేదాభిప్రాయాలతో విడిపోయిన భార్యాభర్తల్లో నయినా ఒకరి పట్ల ఒకరికి ఓ సాఫ్ట్ కార్నర్ ఉండే ఉంటుంది. ఆనంద్ విషయానికి వస్తే, ఆనంద్ మాలతిని ఎప్పుడూ దూరం చేసుకోవాలి అనుకోలేదు. మాలతియే అపోహలతో దూరంగా జరిగిపోయింది. భద్రం గారి ఏకైక కూతురిగా ఎన్ని సంబంధాలు వచ్చినా, ఆనంద్ కోసం ఒంటరిగా మిగిలిపోయింది.

బేసిక్‌గ్గా చెప్పాలంటే ఆనంద్‌కు అతని భార్య అంటే ఇష్టం. మూర్ఖత్వం, గయ్యాళి తనం ఉన్న భార్యలను భరించే అనేకానేక భర్తల్లో అతనూ ఒకడు.

ఆరోగ్యం పాడు చేసుకొని వచ్చిన ఆమెపై సానుభూతి.

కానీ ఊర్మిళ..??

బహు భార్యత్వం నడిచే కాలం నుండి స్త్రీ విముక్తి చెందిన రోజుల్లో, అంతఃపురాల్లో రాణి వాసపు సంకెళ్ళు తెగిపోయిన కాలంలో – ఓ ఆధునిక స్త్రీగా ఊర్మిళ సహనం ఎంతవరకు?

మాలతిని వెళ్ళమని చెప్పాలని లేనట్టే ఊర్మిళను బాధ పెట్టాలని కూడా అస్సలు లేదు.

నిర్ణయం కాలానికి వదిలి వేయలేడు.

పరిష్కారం అర్థం కావట్లేదు.

కోట్లు సంపాదించే తెలివితేటలు ఉన్నా కూడా, ఆనంద్ ఈ విషయంలో నిస్సహాయంగా మిగిలిపోయాడు.

***

సెలెన్ బాటిల్స్, విటమిన్ మందులతో మాలతి కాస్త కోలుకున్నట్టే అనిపిస్తూంది.

శ్రుతకీర్తి కోసం ఆశగా చూస్తూంది.

ఆమె మాటల్లోని మెస్మరిజం, చిరునవ్వులో తనపై ఒలికే ఆప్యాయత ఆమె కోసం ఎదురు చూసేలా చేస్తున్నాయి.

ఉంటూ, ఉంటూంటే మాలతికి తన మనసు తనకే అర్థం కాకుండా పోతుంది. కాస్త కోలుకున్నట్టు కనబడేసరికి జానూ పోరు ఎక్కువయ్యింది.

“అమ్మా!వెళ్ళి పోదాం!” అంటుంది.

వెళ్లాలా! తాను వెళ్ళాల్సిందేనా!

ఆనంద్ తన కేమీ కాడా!

తానీ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయిందా!

కానీ, ఆనంద్ మనసులో తాను ఇంకా ఉంది.

ఈ సత్యం తెలుసుకున్నాక తనకు వెళ్ళాలి అనిపించడం లేదు.

ఆనంద్ సమక్షంలో తన బ్రతుకు ముగిసిపోతే చాలు. అంత కన్నా ఇంకేమి అక్కర్లేదు. అతని దగ్గర ఉన్నానన్న తృప్తే తనకు మనసు నిండుగా అనిపిస్తుంది. జీవచ్ఛవంలా, నడిచే బొమ్మలా ఆ ఒంటరి బ్రతుకు తనకు వద్దు. శారీరక వాంఛలు లేని మనోబంధం తమది. తానూ, ఆనంద్ ఒకే కప్పు క్రింద ఎందుకు ఉండకూడదు.

ఊర్మిళనే వెళ్ళి పోవాలి.

వెళ్ళక పోతే అలా పడిఉండనీ!

ఈ ఆలోచన ఊర్మిళపై మరింత అసహనం పెంచింది మాలతిలో.

తన బిడ్డ మాత్రం ఇన్నేళ్ళు తండ్రికి దూరంగా లేదా! ఇన్నేళ్ళు తన బ్రతుకు బీడు వారి పోలేదా!

ఇప్పుడు తాను వచ్చింది, ఆమె వెళ్ళి పోవాలి -వింత లాజిక్ సృష్టించుకుంది.

ఆనంద్‌కు తన పై ప్రేమ ఉండడం – సర్వాధికారాలు తనవేనన్న ఫీలింగ్..

ఒక సంఘటనలో ఆవేశం ఆపుకోలేక ఆనంద్ ముందే ఊర్మిళను అరిచేసింది. కుదుటపడ్తున్న ఆరోగ్యం మళ్ళీ మొదటికి రాకూడదు అని ఆనంద్ మౌనం వహించాడు. అది ఊర్మిళ అర్థం చేసుకుంది.

కానీ, ఆగ్రహావేశాలకు నెలవులా ఉన్న మాలతి మనసు వాస్తవం గ్రహించలేకపోయింది.

రోజులు గడుస్తున్నాయి.

శృతకీర్తి వచ్చేందుకు ఇంకా నాలుగు రోజులు ఉంది.

***

ఆమెకు రెస్ట్ ఇచ్చేందుకు అన్నమ్మను వంట చేయమంటే, అన్నమ్మ వండితే నేను ముట్టనే ముట్టను అంది మాలతి.

అప్పుడు అందరికీ ఒకే కుక్‌ను మాట్లాడి, అన్నమ్మను ఇంట్లో పనికి మాత్రం పరిమితంచేసారు.

ఆమె హెల్త్ గురించి, టెన్షన్ కాస్త ప్రక్కకు జరిగాకే, తల్లిని కదిలించింది మాలతి, “అమ్మా! సీరియస్‌గా చెప్తున్నాను. మనం మైసూర్ వెళదాం.”

“నువ్వెందుకు చెప్తున్నావు. నువ్వు పిల్లవి” అంది.

జాహ్నవికి ఏమి చెప్పాలో తెలీలేదు.

“మనం ఇక్కడ ఉండేందుకు రాలేదు, కదమ్మా!”

“నాకు ఉండాలని ఉంది.”

“మరి, పిన్ని”

“నువ్వెవరి గురించి ఆలోచించాలి. కన్నతల్లి గురించే కదా! నిన్నిలా అడగమని ఎవరు చెప్పారు, చెప్పు. అదే చెప్పింది, కదా!”

మాలతి బిగ్గరగా అరుస్తూంటే మ్రాన్పడి పోయింది.

“అది కాదమ్మా! మైసూర్ వెళితే నాన్నే అక్కడికి వస్తూంటారు.”

మాలతి లేచి రూమ్‌లో నుండి బయటకు వచ్చింది.

ఊర్మిళ వినేలా, “ఎవరు పిల్లతో నన్ను మైసూర్ వెళ్ళమని చెప్పిస్తున్నారు. నేను వెళ్ళను. నేనక్కడ ఉంటే ఆయన వచ్చి వెళ్ళడానికి, నేనేమీ ఆయన కీప్‌ని కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, మాట్లాడే వాళ్ళు” అంది.

ఊర్మిళ స్థాణువయ్యింది.

కళ్ళు నిండుకున్నాయి.

అన్నమ్మకు తిరిగి అరిచేయాలని ఉంది. కానీ ఊర్మిళ పర్మిషన్ లేదు.

‘కర్మ కు గిప్పుడే కాలు గిట్లాయె పాపం!’ అనుకుంది.

వాకర్ సహాయంతో కాస్త అడుగులు వేస్తూంది ఊర్మిళ.

జరిగిన సంఘటనతో ఆమెకో విషయం అర్థం అయ్యింది.

మాలతి వెళ్ళదు, వెళ్ళదల్చుకోలేదు. ఊర్మిళకు మరో విషయం కూడా అర్థం అయ్యింది. ఆవిడ ప్రశాంతంగా ఉండదు, తనను ఉండనివ్వదు. నిప్పు కణాలు కురిసే ఆ చూపులు భరిస్తూ తాను ఇంక ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేదు. ఇక్కడే కాదు, తానీ మహా నగరం లోనే ఉండకూడదు.

ఆనంద్ గారికి మనశ్శాంతి దక్కాలంటే, చాలా దూరం వెళ్ళిపోవాలి. లేకుంటే – ఎటు వెళ్ళినా, తన వద్దకే వచ్చారని నరకం సృష్టిస్తుంది.

ఆవిడతో కలిసి జీవితం పంచుకోవడానికి తాను కూడా సిద్ధంగా లేదు. తనకీ ఆత్మాభిమానం ఉంది. చదువు ఉంది. తన జీవితం తను చూసుకోగలదు.

***

జరిగిన గొడవ జాహ్నవిని కూడా అప్సెట్ చేసింది. ‘అమ్మ మారదు ఇక’ అనుకుంది.

నాన్నను కలవాలి అన్న తన కోరిక వల్లే మేటర్ ఇంత దూరం వచ్చింది.

దీనికంతా తానే కారణం.

తానే దీన్ని సరిచేయాలి.

కృతనిశ్చయంతో మాలతి దగ్గరికి వెళ్ళింది.

“అమ్మా! మనం వెళ్ళాలి. అదే మాట చెప్పి వచ్చాము. అదే చేయాలి.”

ఎన్ని సార్లు చెప్పినా ఈ పిల్ల ఇంతేనా!

మాలతి, జాహ్నవి వంక ప్రాధేయ పూర్వకంగా చూసింది.

“జానూ! నన్నెందుకు అర్థం చేసుకోవు. నీవు నీ నాన్న కోసం వచ్చావు. నేనూ నాన్న లాంటి ఆ మనిషి కోసమే ఉన్నాను. నీ ఆశ నెరవేరింది. నువ్వు వెళ్దాం అంటున్నావు.

కానీ, నా ఆశ నెరవేర లేదు. నా ఆశకు ముగింపు ఉండదు. ఎందుకంటే ఇది జీవితకాలపు అనుబంధం. ఇన్నేళ్ళు దూరంగా ఉన్నా, నా మనసుతో ముడి వేసుకునే ఉన్న బంధం. చిన్న పిల్లవు. నీకు చెపితే అర్థం కాదు. ఈ బంధం నుండి తప్పుకోవడం అంటే స్త్రీ జీవచ్ఛవంలా మిగలడమే. నాకు మళ్ళీ ఆ జీవితం లోకి వెళ్ళాలని లేదు.”

తల్లి మాటలకు జాహ్నవి కళ్ళు బొటబొటా కన్నీళ్ళు రాల్చాయి.

“అమ్మా! మనం చాలా అన్ లక్కీ. ఇలాంటి సిట్యువేషన్ ఏ అమ్మాయి కైనా వస్తే ఏమి చేస్తారో నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళ అమ్మ సుఖమే కోరుకుంటారేమో! కానీ, నేను ఈ మేటర్‌ను నా హార్ట్ మీదకు తీసుకున్నాను. ఎందుకంటే నేను నాన్న కోసం అంత ఫీలయ్యాను. ఇప్పుడు తమ్ముళ్ళకు ఆ పరిస్థితి రాకూడదు” అంది జాహ్నవి.

“ఒప్పుకో అమ్మా! ప్లీజ్. అందరికీ నీ హెల్త్ విషయంలో కన్సర్న్ ఉంది. అందరి మంచితనం యూస్ చేసుకొని సెల్ఫిష్ అవ్వొద్దు మనం. వాళ్ళ జీవితాలు డిస్టర్బ్ చేయొద్దు” అంది జాహ్నవి.

ఎంత చెప్పినా మాలతి తన పట్టు విడవలేదు. జీవన్మరణ సమస్య లాగా భావిస్తూంది.

జాహ్నవి కూడా తగ్గలేదు.

***

ఆనంద్ నలిగిపోతూ ప్రేక్షక పాత్ర అయ్యాడు.

కట్టిన తాళికి విలువ నిస్తున్నాడా! జీవితాలతో చెలగాటం ఆడుతున్న విధికి లొంగిపోతున్నాడా! అతని ఆలోచన ఏమిటో!

మాలతికి అనుమానం రోగం తప్పితే, ఒక గృహిణిగా తన బాధ్యతల్లో ఎప్పుడూ పర్ఫెక్ట్! ఆమె కేరింగ్, ప్రేమా అన్నీ తెలుసు ఆనంద్‌కు. నిర్ణయం తీసుకోవడం క్షణికమే! కానీ ఆ ఇంపాక్ట్ ఎవరి జీవితాలమీద ఎలా ఉంటుందనేది, నిర్ణయం తీసుకునే వారికి ఉండే పెద్ద చిక్కు. ఎన్ని ఎమోషన్స్ చిక్కుముడి అయి బిగసుకుని ఉంటాయి, ఒక నిర్ణయం వెనక. ఆనంద్ మౌనంలో అంతరార్థం ఉందా!!?

***

ఊర్మిళలో ఆలోచనలు హోరుమంటున్నాయి.

స్వార్థపూరితమైన ప్రేమలు..

మనసులో మాలిన్యాన్ని నింపి, మానవత్వానికి దూరంగా తీసుకువెళ్లే ప్రేమలు..

దీన్ని ప్రేమ అనాలా!

మెంటల్ డిపెండెన్సీ అనాలేమో!

కరుడు గట్టిన స్వార్థపు ప్రేమలు.

సరే, తానే వెళుతుంది.

అర్హతలు, హక్కులు ప్రశ్నించకుండానే వెళ్ళిపోతుంది.

ఎదుటి వారు తన నుంచి ఆశించి, మథనపడేది ఏదైనా ఉంటే, తాను లాక్కొని, దాచుకుని తృప్తిగా ఉండలేదు.

“చార్టీ” ఆనంద్ మాటలు గుర్తొచ్చి నవ్వుకుంది.

ఆవిడది రాగం. తనది విరాగం.

పిల్లలే ప్రశ్నార్థకం!

ఆనంద్ గారిది ఇప్పుడూ తటస్థ వైఖరియే.

ఆయనకు కావాల్సిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చేసారు.

వెళ్ళిపొమ్మనలేరు గదా!

ఆయన ఎంత నలిగిపోతున్నారో!

***

ఊర్మిళ నిర్ణయం పదే పదే ఆలోచింప చేస్తూంది జాహ్నవిని.

పిన్ని వెళ్ళిపోతుందా! మరి తమ్ముళ్ళు..

వాళ్ళూ నాన్న లేని బాధ అనుభవించాల్సిందేనా!

నో, నో, తను ఒప్పుకోదు.

అంతకంటే ముందు తామే వెళ్ళిపోతారు.

అమ్మను ఒప్పిస్తుంది.

అమ్మ ప్రవర్తనను ఇన్నాళ్ళు సహించగలిగింది అంటే అది పిన్ని కావడం వల్లనే.

తాను మైసూర్ వెళితే, మళ్ళీ నాన్న దగ్గరికి రాగాలుగుతుంది. పిన్ని తనని ఎప్పుడూ రిజెక్ట్ చేయదు. కానీ, తమ్ముళ్ళను అమ్మ చూడదు.

పిన్ని ఆర్మీలో నర్సింగ్ చేయడానికి, ప్రయత్నం చేసుకుంటుందట. పిల్లలను హాస్టల్‌లో వేస్తుందా! అయ్యో, వద్దు.

పిల్లలకు అమ్మ ఎంతో కావాలి. నాన్న కూడా కావాలి.

వాళ్ళ మధ్యే పిల్లలు పెరగాలి. పిల్లలు ఎంత బాధపడతారో తన మనసే ఉదాహరణ.

నాలుగు స్తంభాల ఆట కాదు ఇది. ముక్కోణపు ఆట. మూడు స్తంభాల ఆట. అమ్మా, నాన్న, పిన్ని.. ఎవరెటు మారినా, వారి మధ్య నలిగే పిల్లలు..

జాహ్నవికి ఈ విషయం అర్థం అవుతూంది ఇప్పటికే తానీ ఆటను అనాలోచితంగా చాలా దూరం తెచ్చింది.

తానే ఈ ఆటకు పుల్‌స్టాప్ పెట్టాలి.

ఓ చిన్న ఆశ.. నాన్నను కలవాలని.

మరో చిన్న కోరిక, అమ్మనూ, నాన్ననూ కలిపి చూడాలని.

తానంతే ఆశించింది. కానీ, దాని చుట్టూ ఉన్న ముళ్ళ కంచె, తన ఊహకు అందనిది.

ఏ ఆట లోనయినా విజయం అందర్నీ వరించదు. ఈ ఆట లోనూ అంతే. న్యాయం ఒక్కరికే జరుగుతుంది.

తాను గ్రోన్ చైల్డ్. కానీ వాళ్ళింకా చిన్న పిల్లలు. నాన్న అవసరం వాళ్ళకు ఎంతో ఉంది. తాము తిరిగి వెళ్ళాలి.

ఉత్తరాలతో మొదలయిన తన జర్నీని, మళ్ళీ ఉత్తరం తోనే వెనక్కు మళ్ళిస్తుంది.

దృఢ నిశ్చయానికి వచ్చి, పేపర్, పెన్ అందుకుంది, జాహ్నవి.

ఓ అయిదు నిముషాలు ఆలోచించింది.

తాను చేస్తూన్న పని కరెక్టే అనుకుంది.

జాహ్నవి లెటర్‌లో ఇలా వ్రాసింది, “అమ్మా! నా నిర్ణయం నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయి. నేను ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. ఒప్పుకోకపోతే నేను ఇంటికి రాను. మైసూర్‌కు తాతగారి దగ్గరకు వెళ్ళి పోతాను. నీ జానూ.”

వ్రాయడం కాగానే పెన్ మూసి, మాలతి పడుకునే తలగడ క్రింద పెట్టి, నిశ్శబ్దంగా ఇంటి నుండి నిష్క్రమించింది, జాహ్నవి.

(ఇంకా ఉంది)

Exit mobile version