[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఇంట్లో జరుగుతున్న సంఘటనలకు ఆనంద్ బాధపడతాడు. మాలతి వచ్చినప్పుడు తాము ఇంట్లో ఉండి ఉంటే మాలతి ఏం చేసేదో అని అనుకుంటాడు. తన మేనత్త జీవితంతో ప్రభావితమైన మాలతిని తలచుకుని నిట్టూరుస్తాడు. భార్యంటే ఇప్పటికీ ఇష్టం.. కానీ ఊర్మిళను బాధపెట్టలేడు. సమస్యకి పరిష్కారం దొరకక, నిస్సహాయంగా ఉండిపోతాడు. మందులతో కాస్త కోలుకుంటుంది మాలతి. శ్రుతకీర్తి కోసం ఎదురుచూస్తుంది. జానూ మైసూరు వెళ్ళిపోదామని ఒత్తిడి చేస్తుంటే, తానీ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయిందా అని అనుకుంటుంది మాలతి. ఆనంద్ మనసులో తానింకా ఉన్నానని గ్రహించి, ఆయన సమక్షంలో తన బతుకు వెళ్ళిపోతే చాలని భావిస్తుంది. మైసూరుకి వెళ్ళిపోదామని జానూ మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే – ఇలా ఎవరు అడిగిస్తున్నారో నాకు తెలుసు – అంటూ ఊర్మిళ మీద అరుస్తుంది. ఇదంతా భరించలేక ఊర్మిళ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటుంది. జానూ వెళ్ళిపోదామంటుంది. మాలతి పట్టు విడవదు. మాలతికి జీవన్మరణ సమస్య అవుతుంది. ఆనంద్ నలిగిపోతుండడం గ్రహించిన ఊర్మిళ ఇంట్లోంచి వెళ్ళిపోవాలన్న తన నిర్ణయం సరైనదేనని అనుకుంటుంది. పిన్ని వెళ్ళిపోవాలనుకుంటోందని అర్థమైన జానూ తమ్ముళ్ళ గురించి ఆలోచిస్తుంది. నాన్న లేని బాధను వాళ్ళు అనుభవించకూడదని తలుస్తుంది. అమ్మకి ఉత్తరం రాసి ఆమె దిండు కింద పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది జానూ. – ఇక చదవండి.]
అధ్యాయం 28
[dropcap]కా[/dropcap]లు బాగు కాగానే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.
ఎటైనా వెళ్ళి పోవాలి.
ఇదే ఆలోచన ఊర్మిళలో.
ఒక ‘నవలా నాయిక’కు ఈ స్వతంత్ర నిర్ణయం చెల్లుతుందేమో కానీ, ఇద్దరు పిల్లలని ముందు ఉంచుకుని ఎటు వెళ్ళగలదు?
‘ఆత్మాభిమానం’ కాన్సెప్ట్ అన్ని సందర్భాలలోనూ చెల్లుతుందా!
‘అసలు ఆనంద్ గారి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, తన నిర్ణయం చెప్పే ధైర్యం తనకు ఉందా!’ అనుకుంది.
‘బ్రతుకడమెలాగో ఆయన తనకు మొదటి నుండి పాఠాలు నేర్పుతూనే ఉన్నారు. నేర్చుకోవడంలో తానే వెనుక బడింది.’ అనుకుంది నిస్పృహగా.
కాలు విరిగి కాదు, అంతా బాగున్నప్పుడు మాలతి గారు వచ్చినా, తానేమి చేయగలిగేది కాదు.
తానేమి చేయాలో తన కెప్పుడూ తెలీదు. ఇప్పుడూ అంతే! బ్రతుకు నుండి పారిపోవాలి అనుకునే వాళ్ళకు ఎన్నో ప్రతిబంధకాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు..
అర్థరహిత త్యాగాలు సినిమాల్లో బాగుంటాయి. నిజ జీవితానికి అది కత్తి మీద సాము.
కానీ, కొందరు మనుషులు అంతే! దోచుకునే వాళ్ళుంటే దోచుకోబడుతూనే ఉంటారు. భయపెట్టే వాళ్ళకు భయపడుతూనే ఉంటారు.
గమ్యం తెలియని నౌకలో ప్రయాణంలా జీవితంలోని చిక్కుముడి విప్పలేక, పలాయనం చిత్తగిస్తూ ఉంటారు.
ఇప్పుడు ఊర్మిళ పరిస్థితి అదే!
ఇది ఇలా ఎంతో కాలం సాగదు, అని ఆమెకు తెలుసు.
ఎక్కడో అక్కడ స్వస్తి పలకాలి.
అది అవసరం కూడా అనుకుంది.
అనుబంధాలు మరింత నీరుగారక ముందు –
మనశ్శాంతి మృగ్యమయి ఎవరికో ఒకరికి పిచ్చెక్కక ముందు –
సహనం నశించి ఎవరో ఒకరు క్రిమినల్స్‌గా మారక ముందు –
ఈ సమస్యను ఓ దారిలో పెట్టాలి.
తన బ్రతుకు తన కంటే ముందే పరుగు తీసి తనకో గమ్యం నిర్దేశిస్తూందేమో!
ఇలా ఎన్ని పరుగుల అలసట తన జీవితం –
ఇప్పుడు కూడా ఎటో వెళ్ళిపోవాలి.
అందరూ సుఖంగా ఉండాలి అనే ఒక ధ్యేయంతో, పిల్లలతో వెళ్ళిపోవాలి.
వెళ్ళేందుకు తను సిద్ధం.
ఆనంద్ గారికి ఎలా చెప్పాలి?
ఇలాంటి సమస్యలకు ఎవరయినా ఇంతకంటే ఏమి పరిష్కారం ఇవ్వగలరు? అనుకుంది.
ఆ పరిష్కారం కోసమే జాహ్నవి ఇల్లు విడిచి వెళ్ళిందని ఊర్మిళకు తెలియదు.
***
మాలతి జాహ్నవి కోసం వేచి చూసి, చూసి ఆపై తాను భోజనం చేసింది.
వంట ఆవిడ ఏమి చేసి వెళ్ళిందో చూసుకొని, వడ్డించుకుంది.
జానూ రోజూ తాను పెట్టుకుంటా అన్నా కూడా, తానే దగ్గర ఉండి వడ్డించేది.
పిచ్చి పిల్ల! ఫోన్ ఇక్కడే మరిచి పోయింది.
మాలతికి తెలియదు.
జాహ్నవి వెళ్ళి పోయిందని.
ఎంత ప్రేమించినా, ఎవరినీ ఎవరూ నిర్దేశించలేరు. వ్యక్తిత్వాన్ని అణిచి వేయలేరు.
ఊర్మిళ తన కూతురిని వశం చేసుకుంటుందనే భయం సాకుగా ఆనంద్ దగ్గరికి పంపేందుకు నిరాకరించింది. కానీ ఆ కూతురే ఇప్పుడు ఆమె కంట్రోల్‌లో లేదు. తలగడ క్రింద దాచి పెట్టిన ఉత్తరం సాక్షిగా ఆమె విన్నపం కాదని వెళ్ళిపోయింది.
తెలిస్తే మాలతి తల్లి మనసు తట్టుకోగలదా!
ఒక జన్మాంతపు బంధం – భర్త
ఒక జన్మాంతపు విశ్వాసం – కన్నకడుపు
ఇంకెవరి మేలునో ఆశించి, కూతురు దెబ్బ కొట్టిన విధానం మాలతికి తెలిస్తే ఆమెకు అది అశనిపాతమే!
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు!
ఊహల గుర్రానివే మనసా!
మాయల దయ్యానివే!
ఎందుకు రగిలేవో! ఏమై మిగిలేవో.
***
కొన్ని’విడి’ ఆకుల కథలు అంతే! వింత గానే ఉంటాయి.
మనసు ఎడారిని ఒయాసిస్సులై బంధాలు ఊరిస్తూ పరిగెడుతుంటాయి. అవి ఎన్నటికీ చేతికి చిక్కవు.
విదేశాల్లో లాగా స్నేహితులుగా విడిపోయే సంస్కారం, పిల్లలని యాక్సెప్ట్ చేసే విశాలత్వం.. కలిసినప్పుడు పలకరించుకోగల నాగరీకం – మన సమాజంలో రావడానికి చాలా కాలమే పట్టొచ్చు.
కానీ నలిగిపోయే పిల్లల గోల ఎవరికీ పట్టదు.
***
హైదర్‌గూడ లోని అపార్ట్‌మెంట్ లోని ఓ ఫ్లాట్ ముందు ఆగి బెల్ కొట్టింది జాహ్నవి. జాహ్నవి అంత వయసు ఉన్న అమ్మాయే తలుపు తెరిచింది. జాహ్నవి రాక ముందే తెలిసి ఉన్నట్టు, లోపలికి ఆహ్వానించింది. ఆమెనే నీలి కజిన్ ధృతిమతి.
“హాయ్” అంది జాహ్నవి.
కాససేపట్లో ఇద్దరూ బాగా కలిసిపోయారు.
తన ఫ్రెండ్ మైసూర్ నుండి బంధువుల ఇంటికి వచ్చింది అని, వాళ్ళేదో ఫంక్షన్‌కు వెళుతుంటే తనకు వెళ్ళడం ఇష్టం లేక ఫ్రెండ్స్ ఇంటికి వెళతానని చెప్పి ఇంట్లోనే ఉండిపోయిందని. తనకు బోర్ అవకుండా నీ దగ్గరికి వెళ్ళమన్నానని చెప్పింది నీలిమ ధృతితో.
“నా కజిన్‌ను కలిసి రావే అని దానితో ఎప్పుడూ అంటూ ఉంటాను,” అని కూడా చెప్పిందిట నీలిమ, ధృతితో.
తన వయసు అమ్మాయిలను కలవడం ఎవరికి ఇష్టం ఉండదు. ధృతి చాలా సంతోషించింది.
“చాలా దగ్గరే ఇల్లు” అంది జాహ్నవి.
“అవును. ఆదర్శ్ నగర్ అంత దూరం ఏమి కాదు హైదర్‌గూడాకు” అంది ధృతి.
అప్పుడు సమయం సాయంత్రం ఆరు అవుతూంది.
“మీ రిలేటివ్స్ ఇంకా అక్కడే ఓ రెండు రోజులు ఉంటే బాగుణ్ణు. మనం చక్కగా ఇంకా కబుర్లు చెప్పుకోవచ్చు” అన్న ధృతి మాటలకు పెదవులపై నవ్వు బలవంతంగా తెచ్చుకుంది, జాహ్నవి. వాళ్ళమ్మ గారు వాళ్ళు పలకరిస్తూంటే ఓ వైపు సమాధానాలు చెప్తున్నా, మరోవైపు మనసు ఇంటి వైపు లాగుతూంది.
అమ్మ ఏమి చేస్తుందో!
రోజూ తానీ టైమ్‌కు వాకింగ్‌కు తీసుకొని వెళ్తుంది.
***
మాలతి గడియారం వంక చూసింది.
సమయం ఆరు గంటలు. వాకింగ్ చేయాలి.
బయట చల్లగా ఉంది. షాల్ తీసి కప్పుకుంది.
గది నుండి బయటకు వచ్చిన మాలతికి గది ప్రక్కనే ఉన్న వరండాలో సోఫా కమ్ బెడ్ పై చివరికి వచ్చి పడుకుని ఉన్న చిన్నవాడు కనిపించాడు. వాణ్ణి కష్టంగా పైకి జరిపి పడుకోబెడుతూంటే, వాడి కాలు వేలికు దెబ్బ తగిలి, రక్తం ఎండుకుపోయి కనిపించింది. వీళ్ళ జాహ్నవక్క లేకుంటే వీడు ఏదో చేసేసుకున్నాడు, అనుకుంటూ వాణ్ణి సరిగా పడుకో బెట్టి, కర్చీఫ్ తడిపి తుడిచింది వేలి పై రక్తాన్ని.
కుండీలో చెట్లకు నీళ్ళు పోయడానికి వచ్చిన అన్నమ్మ, అనూప్ బాబు మీదకు వంగిన మాలతిని, నోరేళ్లబెట్టి చూస్తూంది.
మాలతి శాలువా భుజాల మీద నుండి జారి దానికి కనిపించకుండా అడ్డంగా ఉంది.
ఏమి ఘోరం జరుగబోతోందని, బిగసుకుపోయిన ఆమె మాలతి చేస్తుంది గ్రహించి తేటపడింది.
మాలతి వాడి వేలు తుడిచి, పసుపు అద్ది, లేచిన గోరు దేనికీ తగిలి ఇబ్బంది పెట్టకుండా, కట్టు కట్టింది. మెట్ల మీద నుండి వాకింగ్ చేసేందుకు క్రిందకు దిగింది.
‘అంతేలే! ఆడదానిలో అమ్మ ఉండకుండా ఎటు పోద్ది’ అనుకుంది అన్నమ్మ.
తన అపోహ గురించి ఊర్మిళకు చెప్పింది. “అందరూ మనుషులేనే! అలా ఎవ్వరినీ అనుకోవద్దు” అంది ఊర్మిళ.
మెల్లిగా, వాకింగ్ మొదలు పెట్టింది మాలతి.
కాస్సేపు తిరగ్గానే కాళ్ళలో బలం తగ్గిన భావన.
అక్కడే ఉన్న బెంచిపై కూలబడింది. ఈ వాకింగ్‍లూ అవీ తనకు సరిపడవు.
ఇంట్లో తిరగడమే బోలెడు ఉంటుంది. ఇంక వాకింగ్ ఎందుకు అంటే వినరు.
గతం గుర్తుకు వచ్చింది ఆమెకు.
అప్పుడు అపార్ట్‌మెంట్ కల్చర్ లేని రోజుల్లో, ఓ ఇంట్లో ఓ పోర్షన్‌లో తాము అద్దెకు ఉండేవాళ్ళు. అక్కడి కంపెనీలో ఆనంద్ జాబ్ చేసేవాడు.
అది మరీ పెద్ద సిటీ ఏమి కాదు.
తాను వాకింగ్ చేస్తుండగా ఆనంద్ వచ్చాడు.
తను వాకింగ్ చేసేది తన కోసం అయితే కదా!
ఎదురింటి ఆవిడలా ఆ వయసుకు అలా మెయింటైన్ చేయడం అందరికీ సాధ్యం కాదని ఏదో సందర్భంలో ఆనంద్ అన్న మాటలకు తనకు ఒళ్ళు కారం రాసుకున్నట్టయ్యింది.
వాకింగ్ చేసి, రొప్పుతూ.. ఆగుతూ.. మళ్ళీ వాకింగ్ చేస్తూ.. ఎప్పుడు కంపెనీ నుండి వచ్చాడో ఆనంద్.. “మరీ అంతలా కష్టపడకు. నువ్వెలా ఉన్నా నా మాలతి వే!” అన్నాడు.
మంచిగానే అన్నాడుగా. విని ఊరుకోవచ్చు గదా!
తనకు సర్రున కోపం వచ్చేసింది.
అంటే తాను వాకింగ్ చేసేది, ఆయన గారి కళ్ళకు మంచిగా కనబడాలనా!
“నేను సన్నబడాలనుకునేది నా కోసం” అంది బింకంగా.
“స్కూటర్ టైర్ కోసం కాదూ!” ఆనంద్ నవ్వుతూంటే ఉడుక్కుంది.
“నువ్వెలా ఉన్నా నా మాలతి వే” ఆ మాటలో ఎంత ప్రేముందో తను ఆలోచించనే లేదు.
అప్పుడే కాదు ఇప్పటికీ ఆలోచించట్లేదు.
ఆనంద్ ప్రేమపై పరిపూర్ణ విశ్వాసం ఉంటే, ఊర్మిళపై ఆగ్రహ జ్వాల లెందుకు?
ఆమెతో తనకు పోలికలు ఎందుకు? తను తనే కదా! జాహ్నవికి తనలా ఎవరున్నారు?
మాలతి మెల్లిగా నడక సాగించింది.
అడుగులు భారంగా పడుతున్నాయి.
ఏమిటో! ఈ రోజు లేచింది మొదలు ఏదో ఒక సంఘటన – ఎందుకు జ్ఞప్తికి వస్తున్నాయో తెలియదు.
తన ప్రమేయం లేకనే మస్తిష్కపు తెర మీదికి వస్తున్నాయి.
మైసూర్ వచ్చి, జాహ్నవిని చూస్తానన్నాడని చెప్పిన ఆనంద్ ఫ్రెండ్‌ను నిర్ద్వందంగా తిరస్కరించింది. జాహ్నవి బాల్యంలో అపురూపమైన తండ్రి ప్రేమను దూరం చేసింది.
అబ్బా, ఏమిటోగా ఉంది. తలలో ఏదో హోరు.
తనకెప్పుడూ తను చేసిందే కరెక్ట్ గదా!
ఇవ్వాళ ఏమిటి ఈ ఆలోచనలు! తను చేసిన తప్పుల పట్ల ఎన్నడూ లేని ఇంత జ్ఞానోదయం ఏమిటి!
ఆరిపోయే దీపం బాగా వెలిగినట్టు..
ఛ! అపశృతి! అలా అనుకోకూడదు.
పొద్దుటి నుండి నాన్న గుర్తుకు వస్తున్నారు.
తలలో హోరు హెచ్చిన భావన.
‘ఎందుకిలా? తన కేమీ అవదు కదా!’ మరి కొన్ని అడుగులు వేసింది.
కాంపౌండ్ వాల్ చుట్టూ అందమైన పూల చెట్లు, రకరకాల క్రోటన్స్..
ఎంత బాగుంది.
ఇవన్నీ ఎవరి కృషి?
ఎవరి అభిరుచి?
మరి కొన్ని అడుగులు వేసింది.
ఆనంద్‌కు సారీ చెప్పాలి. ఇన్నేళ్ళకు సారీనా!
ఎన్నేళ్ళయినా అవనీ. చెప్పాల్సిందే! ఎన్నో చెప్పాలి.
గుండె బరువెక్కింది. ఇంక తిరుగలేను అనిపించింది.
మాలతి అక్కడే ఉన్న బెంచీలో అదుపు తప్పినట్టు కూలబడింది. పొద్దుటి నుండి గుండె దడగా ఉంది. చేయి మొద్దు బారిన ఫీలింగ్. కణతల్లో పోట్లు వస్తున్నాయి.
తన కేదో అయ్యేలా ఉంది. ఏమవుతుందో!
ఆనంద్ ఎప్పుడొస్తాడు. జానూ! ఎక్కడికెళ్ళావ్!
నాన్నా! సారీ నాన్నా! ఇన్నేళ్ళు నీ నీడలో ఉన్నాను. నిన్ను చూసుకోవాల్సిన వయసులో వదిలేసి వచ్చాను.
జానూ! జానూ! ఎక్కడికి వెళ్ళావు?
పెదవి పలకదేమి!
తన పిలుపు జానూకు చేరేదెలా!
జానూ.. జానూ.. పిలిచాననుకుంటుంది.
తన ముఖంపై నీళ్ళు చిలకరిస్తూన్నారు.
రేగిన జుట్టుతో తను దయ్యం అని తిట్టుకునే అన్నమ్మ..
అన్నమ్మనే కదా!
అంటే అన్నమ్మ కూడా మంచిదేనా!
తన ఒళ్ళు తన వశం తప్పుతోంది.
ఇంక కళ్ళు తెరిచే శక్తి కూడా కరువవుతూంది.
కళ్ళ ముందు ధవళ వస్త్రాల్లో ఊర్మిళ నిల్చుంది.
నీ..క్కూ..డా సా..రీ! నా.. బిడ్డ.. జా..గ్ర..త్త!
జాను.. బం..గారు.. తల్లి.. సారీ.. రా!
నీ నుండి ప్రేమ నెంతో తీసుకున్నాను.
తిరిగి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాను.
అప్పటి వరకు సాగిన అంతఃశ్చేతన లోని సంగ్రామంతో అలసినట్టు.. ఇన్ని మందులు, జాగ్రత్తలు, స్ట్రెస్ బస్టర్స్ – అన్నిటిని నిరసించినట్టు –
మాలతి గుండె ఆగి పోయింది.
ఆమె తలగడ క్రింద జాహ్నవి ఉంచిన తెల్ల కాగితం అలానే నిశ్చలంగా ఉంది.
***
ధృతి రూమ్‌లో పడుకునే టి. వి. చూస్తూన్నారు ఇద్దరూ!
ఇలా ఇల్లు విడిచి రావడం ఏమిటి తను.
ఎన్నాళ్ళు ఇలా ఉండగలదు.
అమ్మ మనసు మారుతుందా!
నెక్స్ట్ ఏమి చేయాలి?
ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంది.
ఎనిమిదింటికి అమ్మ డిన్నర్ అయిపోతుంది. 8-30 కు పడుకుంటుంది. అప్పుడు లెటర్ చూస్తుంది.
జాహ్నవికి ఉద్విగ్నంగా ఉంది.
తానింత బోల్డ్ డెసిసషన్ తీసుకుందంటే అమ్మ తప్పకుండా తనెంత ఈ విషయంలో సీరియస్‌గా ఉందో అర్థం చేసుకుంటుంది.
రేపు మధ్యాహ్నం వెళ్ళి, మౌనంగా ఉంటే అమ్మను ట్రాక్‌లో పెట్టవచ్చు అనుకుంది.
కానీ ఆ నిర్ణయం ఎక్కువ సేపు నిలువలేదు జాహ్నవిలో.
పరి పరి విధాల ఆలోచనా ఆవృతంలో మనసు చిక్కుకుంటూంది.
తనేమి చేసిందో తెలియ వస్తూంది. పొరపాటు చేసింది.
బ్లాక్‌మెయిల్ చేసి అమ్మ మనసుతో గేమ్స్ ఆడుతూంది.
‘దిస్ ఈజ్ నాట్ ఫెయిర్,’ అనుకుంది.
పిల్లలు కనిపించడంలేదు అంటే పేరెంట్స్‌కు ఎంత టెన్షన్! ఆడపిల్ల గురించి సేఫ్ గానే ఉంటుందిలే, అని ఎలా ఉండగలరు? అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో! ఎవరికి, ఏమని చెప్తుంది. నా కూతురు నన్ను కరెక్ట్ చేయడానికి ఎటో వెళ్ళిపోయిందని చెప్పుకుంటుందా!
జాహ్నవికి గట్టిగా చెంపలు బాదుకోవాలి అనిపిస్తూంది.
మధ్యాహ్నం అవగా వచ్చింది ఇక్కడకు.
వెళ్తూంటే “ఎక్కడికి?” అంది.
ఫ్రెండ్ కజిన్ ఇంటికి అని ముక్తసరి మాటలతో చెప్పింది.
ఆవేశం, ఆవేదన తన విజ్ఞతను పొట్టన పెట్టుకున్నాయని అర్థం అయ్యింది.
టి. వి.లో క్రింద స్క్రోలింగ్‌లో ఓ వాక్యం పదే పదే కళ్ళ ముందుకు వస్తోంది. కుటుంబ కలహాలతో మహిళ మృతి.
జాహ్నవి కింక మనసు పట్టలేదు.
అమ్మకు ఫోన్ చేసింది ఎత్తలేదు.
మందులు వేసుకుందో లేదో!
నిద్ర మాత్రలు దాచి పెట్టే వచ్చింది.
మందులు కూడా ఒక రోజువే బయట ఉంచింది. అయినా జాహ్నవి నెర్వస్ అవుతూంది. లెటర్ చదివి అమ్మకేమైనా అయితే తన లైఫ్ వేస్ట్. ఇలా వచ్చేసిన టెన్షన్‍తో అమ్మ కేమీ కాదు కదా!
టైం తొమ్మిది అయ్యింది. జాహ్నవి ఒక్క నిముషం ఆగకుండా, వాళ్ళమ్మ మెడిసిన్స్ తన బ్యాగ్ లోనే ఉన్నాయని చెప్పి అర్జంట్‌గా బయల్దేరింది.
కొత్త ఊరు. కొత్త రోడ్లు.
“పొద్దున్నే వెళ్ళమ్మా!” అంటే, వాళ్ళ మాట వినే పరిస్థితిలో ఉంటేగా జాహ్నవి, రోడెక్కి ఆటోల కోసం చూస్తూంటే – ఆ ఇంటాయాన చొక్కా వేసుకొని, వచ్చి, కారు ప్రక్కన నిలిపాడు.
“ఆడపిల్లలకు ఈ ధైర్యమే పనికి రాదు. ఒక్క దానివీ, ఊరికి కొత్త అమ్మాయివి ఈ రాత్రి వేళ ఒక్కత్తినీ ఎలా పంపుతాం,” అంటూ డోర్ తెరిచాడు. ప్రక్కనే ఉన్న జాహ్నవి మొఖం చూసి ఖంగుతిన్నాడు.
“ఏమైందమ్మా!”
“అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో. బెంగగా ఉందంకుల్”, అంటూంటే, ఆమెకు దుఃఖం పొంగుకు వచ్చింది.
అప్పటికే తుడిచి తుడిచి ఉన్న కళ్ళు ఉబ్బి ఉన్నాయి.
“అయ్యో! సారీ అమ్మా! అమ్మ బాగుంటుంది. బెంగ పడకు,” ఆంటుంటే, జాహ్నవి దైన్యంగా వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది.
ఎంత అదిమి పెట్టినా, దుఃఖం పైకి రాకుండా కంట్రోల్ చేసుకోలేక పోతోంది.
“అమ్మా! నేను నిన్ను లోపల దింపి వెళతాను. పద,” అన్నారాయన.
“పర్లేదు అంకుల్!” అంది.
ఆయన వెళ్ళి పోయారు.
జాహ్నవికి లోపలికి వెళ్ళే ధైర్యం చాలట్లేదు.
కాళ్ళలో శక్తి లేనట్టు తేలి పోతున్నాయి. అడుగు ముందుకు పడట్లేదు.
అక్కడే కూలబడిపోయింది.
“అమ్మా – అమ్మా” అంటూ ఏడుస్తోంది.
మామ్! ఏమైంది నీకు!
నా మీద అలిగావా!
అయ్యో!
జాహ్నవి టప టప నెత్తి కొట్టు కుంటుంది. అంబులెన్స్ ఆగింది.
బాడీ బయటకు తీస్తున్నారు.
అంతే, అది చూసి జాహ్నవి నరనరాల్లో శక్తి అంతా తేలిపోయినట్టు కుప్పలా కూలబడిపోయింది. “జాన్వీ” అంటూ ఆమె వైపు పరిగెత్తాడు ఆనంద్.
(ముగింపు వచ్చే వారం)