[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తన నేస్తం నీలిమకి ఉత్తరాలు రాస్తానని చెబుతుంది జాహ్నవి. ఆ విషయం తన తల్లికి ముందే చెప్పి ఉంచుతుంది నీలిమ. భర్త తమ కూతురిని మరీ కట్టడిలో పెడుతున్నాడని నీలిమపై తల్లికి కాస్త సానుభూతి ఉంది. అందుకని ఉత్తరాలు రాసుకోవడానికి ఒప్పుకుంటుందావిడ. జాహ్నవి రాసిన మొదటి ఉత్తరం అందుకున్న నీలిమ చదివి, బాధపడుతుంది. వెంటనే అమ్మ ఫోన్ తీసుకుని, జాహ్నవితో మాట్లాడుతుంది. తరువాత వారిద్దరి మధ్య ఉత్తరాలు కొనసాగుతాయి. జాహ్నవి స్నేహం తనకెంత విలువైనదో రాస్తుంది నీలిమ. ఓ రోజు జాహ్నవి తన ఉత్తరంలో తన తండ్రి గురించి రాసి, ప్రాణస్నేహితురాలైన నీలిమ దగ్గర కూడా ఆ విషయం దాచినందుకు క్షమించమంటుంది. అది చదివి విచలితురాలవుతుంది నీలిమ. వెంటనే ఫోన్ చేసి జాహ్నవితో మాట్లాడాలనుకున్నా, అదే సమయంలో తండ్రి ఇంటికి రావడంతో, ఆ ప్రయత్నం మానుకుంటుంది. తర్వాత వీలు కుదిరినప్పుడు, జాహ్నవికి ఫోన్ చేసి, రెండు రోజులు ఉత్తరాలు రాయద్దనీ, నాన్న ఇంట్లోనే ఉంటారనీ, ఆయన అపార్థం చేసుకుంటే కష్టమని చెబుతుంది. ఓ రోజు స్కూల్లో జరిగిన ఓ సంఘటన జాహ్నవి మనసును కలచివేస్తుంది. స్వర్ణ కొద్ది రోజులుగా స్కూలుకి రాకపోవడంతో, ఆ విషయాన్ని మిస్‍కి రిపోర్ట్ చేస్తుంది జాహ్నవి. ప్రిన్సిపాల్ స్వర్ణ వాళ్ళమ్మ గారిని స్కూలుకి పిలిపిస్తే, ఆవిడ నోరు వెళ్ళబెడుతుంది. రోజూ బాక్స్ సర్ది పిల్లని స్కూలుకు పంపుతున్నానని చెప్తుంది. జాహ్నవి – స్వర్ణని అడిగితే, తాను వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్తున్నట్టు చెప్తుంది. తల్లిదండ్రులు విడిగా ఉంటారనీ, అప్పుడప్పుడు తాను నాన్న దగ్గరికి వెళ్ళి నానమ్మతోనూ, నాన్నతోను సమయం గడుపుతానని చెప్తుంది. ఆ మాటలు విన్నాకా జాహ్నవి ఆలోచనల్లో పడుతుంది. ఈ వివరాలన్నీ నీలిమకి ఉత్తరంలో రాయాలనుకుంటుంది. మర్నాడు స్కూల్ అయ్యాకా, హోం వర్క్ పూర్తి చేసి, ఆ పుస్తకాలను మిస్ స్వర్ణకి ఇవ్వమన్నారని అమ్మకి చెప్పి స్వర్ణ వాళ్ళింటికి వెళ్తుంది. స్వర్ణ తన తండ్రి గురించి, మేనత్తల గురించి, బాబయ్ గురించి చెప్తుంది. మరి తనకూ ఉన్నారా అని మనసులో అనుకుంటుంది జాహ్నవి. కొన్ని రోజుల తర్వాత – మళ్ళీ ఉత్తరాలు వ్రాయమని నీలిమ చెబుతుంది. వెంటనే ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేస్తుంది జాహ్నవి. – ఇక చదవండి.]
అధ్యాయం 4
[dropcap]మ[/dropcap]రి కాసేపట్లో నీలి ఇంటి లెటర్ బాక్స్ లోకి జాహ్నవి ఉత్తరం చేరింది. గంటలోపే, పొద్దుటి టపాలో, లెటర్ బాక్స్ లోని లెటర్‌ను చేతి లోకి తీసుకుంది నీలిమ. అందమైన చేతి దస్తూరితో ఉన్న ఆ ఉత్తరం తలుపులు తెరిచింది.
“నీలూ, ఆలోచిస్తున్నావా! ఇన్ని భావాలు.. నా దగ్గర కూడా రహస్యమా, అని. అవునే! రహస్యమే. అమ్మ దగ్గర కూడా రహస్యమే. ఏ నాడూ అమ్మను కూడా అడుగలేదు, నాన్న గురించి. నీ తోనూ మనసు విప్పలేదు. లోలోపలి స్ట్రగుల్..
తల్లితో షేర్ చేసుకోలేనివి, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకునే వారు ఉంటారు.
అమ్మతో నాన్న గురించి మాట్లాడేందుకు, ఏముంటుంది చెప్పు? కోల్పోయింది మాట్లాడుకోవడం చాలా అన్‌ప్లెజెంట్ ఎవరికైనా. అమ్మను బాధ పెట్ట లేను.
నీతో నా స్నేహం, ఇంకా పెరుగక ముందే, నా మనసులో ఓ సంఘటనకు అమితమైన విలువ నిచ్చాను. అదే నన్నిలా గుంభనగా మార్చిందేమో!
ఆ రోజు గుర్తుందా, నీలూ! మీ ఇంటికి గెస్ట్స్ వచ్చారు. ఆంటీ పనిలో హడావిడిగా ఉన్నారు. ఆ అంకుల్ నన్నేదో మాట్లాడిస్తున్నారు. చిన్న పిల్లలని మాట్లాడించడం కొందరికి సరదాగా ఉంటుంది, కదా!
“ఏమి చదువుతున్నావు, పాపా!” అన్నారు. చెప్పాక,
“నీ పేరు” అన్నారు. అదీ చెప్పాక,
“ఏ స్కూల్? మీ క్లాస్‌లో ఎవరు ఫస్ట్” అన్నారు. అప్పటి వరకు సమాధానాలు చెప్తూన్న నేను, ఒక ప్రశ్న దగ్గర ఆగిపోయాను.
అది, “మీ నాన్న ఏమి చేస్తున్నారు” అన్న ప్రశ్న.
ఆ వెంటనే, “మీ నాన్న గారి పేరేమిటి” అన్నారు.
నేను బదులు చెప్పలేదు. ఇంతలో ఆంటీ లోపలి నుండి పిలిచారు. “ఆ అమ్మాయిని అలాంటివి అడక్కు. వాళ్ళమ్మ డైవొర్సీ. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరే తాతగారి ఇంట్లో ఉంటుంది!”
“అయ్యో, పాపం, అవునా!” ఆ అంకుల్ బయటకు హాల్లోకి రావడం, నేను పరిగెత్తుకుని అక్కడి నుండి వచ్చేయడం క్షణాల్లో జరిగి పోయింది.
చిన్నపిల్ల ఏమి తెలుసు అనుకున్నారేమో, కానీ ఆ మాటలు నాక్కూడా ఒక చిన్న పిల్ల అర్థం చేసుకునే స్థాయిలోనే నాకప్పుడు అర్థం అయ్యాయి.
మా నాన్న లేడు. అలా లేకపోవడం గుసగుసలు చెప్పుకునేంత పెద్ద లోటు. ఎవరైనా నన్ను ఆ అంకుల్ లాగా ప్రశ్నించవచ్చు. సానుభూతి చూపవచ్చు. అన్న ఫీలింగ్ నాలో..
అమ్మ సొసైటీ నుండి దూరంగా ఉంటూ, ఈ మాటల, చూపుల దాడిని తప్పించుకుంది. కానీ నేనలా కాదు. నా చుట్టూ ఎదుటి వారికే ప్రవేశం లేని, చూపుల ‘కోట’ కట్టుకున్నాను.
నా ‘సీరియస్ లుక్స్’ ఎదుటి వారిని స్కాన్ చేస్తాయి. నా మాట బిరుసు, వాళ్ళ నోటికి ముందే తాళం వేస్తుంది. అన్నింటిలో ఫస్ట్ ఉంటూ, స్కూల్‌కు లీడర్ నయి, టీచర్స్‌కు ఫేవరెట్ నయి, తండ్రికి దూరం అయిన పిల్లగా సానుభూతిని ప్రక్కకు నెట్టి, ప్రశంసలే అందుకున్నాను.
అయినా, నీలు, నేను అక్కడక్కడా మా పై విన్న మాటలు.. జనాల విపరీతమైన కుతూహలం.. నన్ను వెంటాడే బాధలు.
అందరిలా నాకూ నాన్న ఉన్నారని, నాన్న వస్తారని అరిచి చెప్పాలనిపించేది. నాన్న ఉన్న ప్రతి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకునేదాన్ని. నాన్న లేని నా బాధ పంచుకోవడం చిన్నతనంగా ఫీలయ్యే దాన్ని. ఎప్పుడైనా వాళ్ళు నా పై విపరీతంగా సానుభూతి చూపించవచ్చు. ఎగతాళి చేయవచ్చు. అందుకే ఈ విషయం నా గుండెల్లోనే పదిలపరుచుకున్నాను.
అలా పదిలపరుచుకోవడంలో నిన్ను కూడా మినహాయించలేక పోయాను. ఎందుకంటే నీకూ నాన్న ఉన్నారు కనుక.. నీవూ నా కంటే అధికూరాలివే అనుకున్నాను. అధికులు అల్పుల నెప్పుడయినా అవమానించవచ్చు. అప్పటి నా మానసిక పరిస్థితి అంతే.
మన స్నేహం గురించి ఆలోచించేంత ఎదగలేదేమో! అందుకే నీతో కూడా నాన్న పై నా మక్కువ, నాన్న కోసం నా బాధ ఏవీ షేర్ చేసుకోలేక పోయాను.
నాకు మా నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉన్న తీవ్రమైన కోరిక నీకు ఎప్పుడూ చెప్పలేదు.
మన స్నేహానికి ద్రోహం చేసాను.
మన ఆరుగురి మిత్ర బృందంలో అందరూ స్కూల్‌మేట్స్. కానీ నువ్వూ, నేనూ బాల్య స్నేహితులం. అంతే కాదు ప్రాణ స్నేహితులం అని భావిస్తాను.
నన్ను.. నన్ను..
క్షమించవే!
క్రింద మళ్ళీ ఓ కన్నీళ్ళ ఎమోజీ.
ఇంక చెప్పేదేముంది? టీనేజ్ అమ్మాయిల భావోద్వేగాలు.. నీలి వెక్కిళ్ళు పెడ్తూ ఫోన్ అందుకుంది.
ఈ వయసు అమ్మాయిలకు ఆవేశాలు, అపార్థాలు అధికము. ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉండవేమో! కూతురిని చోద్యంగా చూస్తూండి పోయారు, భారతి గారు. అలా అక్కడికి ఉత్తరాల పర్వం ముగిసింది.
***
మున్నీని ప్రక్కనే కూర్చో బెట్టుకుని, తన రూమ్‌లో నోట్స్ వ్రాస్తూంది, జాహ్నవి.. మున్నీ నీలం రంగు జరీ అంచు ఉన్న పావడా కట్టుకొని ఉంది. మాలతి కుట్టి ఇచ్చింది. దాని చేతులకు మ్యాచింగ్ గాజులు ముద్దుగా ఉన్నాయి.
‘ఈ మున్నీ నాన్న గిఫ్ట్ అని నాకు తెలుసని అమ్మకు తెలీదు. తెలిస్తే నాకెక్కడ నాన్న గుర్తుకు వస్తాడోనని దీన్ని కూడా దాచి పెట్టేదేమో!’ అనుకుంది, జాహ్నవి.
‘పిచ్చి మామ్’ మళ్ళీ ప్రేమగా అనుకుంది.
ఒక్క క్షణం ‘నోట్స్’ వ్రాయడం ఆపింది.
“నాన్న వైపు పోలికలే ఎక్కువుంటాయి,”
స్వర్ణ మాటలు నిజమా!
అయితే తానెవరి లాగా ఉంది తనకు తెలిసి, తనకు, అమ్మ పోలికలు లేవు. తాతగారి పోలికలు కూడా లేవు. జాహ్నవి పెదవి బిగించి, ఓ క్షణం ఆలోచించి, కంప్యూటర్ ముందుకు వచ్చి, కూర్చుంది. తన ఫోటోకు హెయిర్ స్టయిల్ రెండు రకాలుగా మార్చి చూసింది. కాస్త గెడ్డం దిద్దింది. మీసం దిద్దడంలో మీమాంస ఎదురయ్యింది.
ఎలా, ఎలా అవుతే సెట్ అవుతుంది. డీసెంట్, డిగ్నిఫైడ్ లుక్ వచ్చేలా.. రెండు, మూడు సార్లు మార్చి, దిద్దింది. తెర పై ప్రత్యక్షమైన ఆ మూర్తిని చూసి అప్రతిభురాలైంది, జాహ్నవి.
“నా.. న్న” విడీ విడనట్టు పెదవుల మధ్య జీవం పోసుకుంది, ఆ పదం. హృదయ ప్రకంపనాల తీవ్ర అలజడి.. రాలిపడిన బాష్ప బిందువు.
అవును, నాన్న.. నాన్ననే.. డిలీట్ చేయాలని లేదు.
అమ్మ చూడకుండా జాగ్రత్త పడితే చాలు. జాహ్నవికి ఈ ఎగ్జయిట్మెంట్ ఒక్కతే భరించడం తన వల్ల కాలేదు. నీలికి ఫోన్ చేసింది.
“కూల్, జానూ, కూల్..” అంది నీలిమ.
‘హౌ, హ్యాండ్సమ్ యూ ఆర్, నాన్నా!’ అనుకుంది జాహ్నవి ఆనందంగా, అభిమానంగా, కంప్యూటర్ తెర వంక చూస్తూ.
క్రింద తన రూమ్‌లో, నిద్ర కుపక్రమించబోతూన్న మాలతికి ఇవేవీ తెలియవు. ఒక్కోసారి జాహ్నవి, మెలుకువ వచ్చినప్పుడు, వచ్చి ఆమె ప్రక్కన చేరుతుంది. సాధారణంగా మాలతి దగ్గరే పడుకుంటుంది. “లైట్ వేస్తే నీకు నిద్ర డిస్టర్బ్” అంటూ, తన రూమ్ లోనే చదువుకుంటున్న జాహ్నవి,నీలికి లెటర్స్ ఏమి వ్రాస్తూందో అని మాలతి ఎప్పుడూ ఆలోచించ లేదు. వాళ్ళలా వ్రాసుకుంటున్నారని కూడా తెలియదు ఆమెకు.
తానింత ప్రేమగా, సర్వస్వంగా చూసుకునే జాహ్నవిలో మరో ఆలోచన ఉంటుందనేది, ఆమె ఊహక్కూడా అందని విషయం. ఎంత సర్వస్వంగా పెంచినా, తల్లి, తండ్రి ఎవరికి వారే. ఒకరికి ఇంకొకరు ప్రత్యామ్నాయం కాదని మాలతి తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుందేమో!
ఆనంద్ పేరు పరిసరాల్లోనే వినిపించకుండా చేసి, జాహ్నవి నా స్వంతం అని మురిసే పిచ్చి తల్లి మాలతికి, జాహ్నవి ఏమి బహుమతి ఇవ్వబోతోందో!
***
పదిహేనున్నర సంవత్సరాల వయసులో జాహ్నవి ఆలోచనలు – సినిమాలో, షికార్లో కాదు. ఫ్యాషన్స్, టీనేజ్ రంగుల కలలు కావు. నాన్న – నాన్న దగ్గరికి వెళ్ళాలి. చిన్నప్పటి నుండి అదే భావం.. తానెప్పటికయినా నాన్నను కలుస్తుంది. 100% ఇది జరుగుతుంది. అదే భావం ఆమెలో వయసుతో పెరుగుతూ వచ్చింది. దానికి మూలం ఎక్కడో తెలీదు. ఆ నమ్మకం ఏమిటో అర్థం కాదు. తాను పెద్దయ్యాక నాన్నను కలిసే తీరుతుంది. ఇది తప్పదు.
ఇప్పుడు జాహ్నవి ఆలోచనలు మరో దారి మళ్ళాయి. ఎప్పుడో పెద్దయ్యాక ఎందుకు? అదేదో ఇప్పుడే ఎందుకు కాకూడదు? తాను ఎన్ని పనులు చేస్తుంది ఇంటా – బయటా కూడా! తాతగారిని, అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటుంది. స్కూల్ లీడర్ తాను. స్కూల్‌లో ఏ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికైనా టీచర్స్‌కు రైట్ హ్యాండ్ తాను. ఇంత కన్నా ఏమి పెద్ద కావాలి. ఇవన్నీ జాహ్నవిలో ఈగోను పెంచలేదు కానీ, ఇవి అన్నీ కలిసి అంతర్గతంగా తాననుకున్నది చేయడానికి అర్హత వచ్చేసిందన్న ఫీలింగ్‌కు ఏ మూలో కారణం అయ్యాయి.
పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. అసలే బోర్డ్ ఎగ్జామ్. అమ్మాయిలంతా ఉరికే క్యాలెండర్ వంక గుబులుగా చూస్తూంటే, జాహ్నవికి మాత్రం ఆలోచనలు ఎటో పరిగెడుతున్నాయి. ఏకసంథాగ్రహి అయిన జాహ్నవికి, చదువుతో ఎప్పుడూ సమస్య కాదు. నీలి, జానూ నిన్ననే ఫోన్లో మాట్లాడుకున్నారు.
“నాన్నకు నేనంటే ఇష్టం ఉంటుందంటావా, నీలూ” అంది, జాహ్నవి. తప్పక ఉంటుందని జాహ్నవి ప్రగాఢ విశ్వాసం. అయినా, అర్థం కాని సంధిగ్ధత. “అలా అయితే నువ్వో పని చేయాలే. అంకుల్, ఆంటీ వ్రాసుకున్న లెటర్స్ లాంటివి ఎక్కడైనా కనిపిస్తాయేమో చూడు” అంది నీలి. “హహ్హ అది అంత ఈజీ కాదు. మా అమ్మ బంగారం. అవి నాకు దొరకనివ్వదు.”
“మరెలానే?”
“ఓ పని చేస్తే సరి, అమ్మను టెంపుల్‌కు వెళ్ళేలా చూడాలి.”
“కానీ ఆంటీ బయటకు వచ్చేది చాలా, చాలా తక్కువ కదా!” ఇద్దరూ ఆలోచించారు.
తాతగారి మీద ఆధారపడ్డారు. మాలతి త్వరగా ఎక్కడికీ కదలదు. అమ్మ బయటకు వెళ్ళక ఎక్కువ రోజులు అయిందని గమనిస్తే, జాహ్నవి ఊరుకోదు. ఇప్పుడు అమ్మని బయటకు తీసుకెళ్ళమని తాతగారిని కోరింది. ఇద్దర్నీ గుడికి పంపి, చదువుకునే మిషతో ఇంట్లో ఉండిపోయిన జాహ్నవి, మాలతి రూమ్ అంతా వెదికింది. చివరికి అటక పై ఓ పాత సూట్‌కేస్‌లో, నీలి రంగు ఉత్తరాల కట్ట దొరికింది. అవి చూడగానే జాహ్నవిలో ఉత్సాహం ముప్పిరిగొంది. ఇవి తన భవిష్యత్తును ఏమి నిర్ణయించబోతున్నాయి. జాహ్నవి గుండె లబ్ డబ్‌ల శబ్దం ఆ నిశ్శబ్దంలో ఆమెకే వినిపిస్తూంటే, ఉత్తరాల కట్టకున్న రబ్బర్ బ్యాండ్ తొలగించింది.
ఆనంద్ టూర్‌కి వెళ్ళినప్పుడు, వ్రాసినవని అర్థం చేసుకుంది. ఒక్కో ఉత్తరమే చదువుతూంటే, కళ్ళు ఆనంద బాష్పాలు వర్షిస్తున్నాయి జాహ్నవికి. ప్రతి ఉత్తరం లోనూ తన ప్రస్తావన, తన కబుర్ల కోసమే ఉత్తరాలు వ్రాసారేమో అనిపించేలా. ఇంక చాలు. ఈ ఆనందం చాలు. ఉత్తరాలన్నీ యథాస్థానంలో సర్దింది. అన్నీ చదవాలను కోలేదు. మనసంతా తీరం చేరువయితున్నట్టు, ప్రశాంత పవనాలు సాగుతున్నాయి.
ఈ ప్రేమ, ఇదే ప్రేమ, మున్నీని బహుమతిగా ఇచ్చిన ప్రేమ ఇంకా నాపై మిగిలే ఉంది కదూ, నాన్నా!
నీలికి ఫోన్ చేసి చెప్పింది.
“అయితే, ఫస్ట్ స్టెప్ సక్సెస్. ఇంక నెక్స్ట్ ఆలోచించాలి” అంది నీలిమ.
నెక్స్ట్ స్టెప్ అప్పటికే ప్రణాళిక రూపుదిద్దుకుంటుంటే నీలి మాటలను ఆలకించింది, జాహ్నవి.
***
తాతగారి గదిలో, మాలతి మరచెంబుతో నీళ్ళు తీసుకొని వెళ్ళి ఉంచింది. అక్కడే హాల్లో కూర్చొని ఉంది జాహ్నవి.
“అమ్మా! బి. పి. టాబ్లెట్ వేసుకున్నావా?!” అంది. “వేసుకున్నాను లేవే,” అంటూ తన రూమ్ లోకి వెళుతూ,
“హూ.. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి” అంది మాలతి. ఆమె టెన్షన్ చూస్తుంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది, జాహ్నవికి.
“ఆ విషయం నేను చూసుకుంటాను కదా! స్కూల్ ఫస్ట్ వచ్చి, లాభం ఏమిటి? నువ్విలా టెన్షన్ పడితే..” అంటుంది చిరు కోపంగా.
ఇప్పుడు ఎగ్జామ్స్ మూడు నెల్లల్లోకి వచ్చాయి.. కానీ, తన టెన్షన్ ఈ పరీక్షల గురించి కాదు. దీని గురించి ఎక్కువ ఆలోచన లేదు తనకు. మరో ముఖ్యమైన పరీక్ష ఉంది. అదీ, ఈ సమ్మర్ హాలీడేస్ లో నాన్న దగ్గరికి వెళ్ళాలి.
పరీక్ష పెద్దది, గమ్యం గడువు చిన్నది. బట్, దిస్ ఈజ్ జాహ్నవి. ప్రయత్నమే ప్రథమ మిత్రుడు ‘ఎవరికైనా’.
ఆమె మెల్లిగా లేచి, మాలతి రూమ్ లోకి వెళ్ళి చూసింది. అప్పటికే నిద్ర లోకి జారుకుంది మాలతి. త్వరగా లేవదు. అక్కడి నుండే అమ్మకు గాల్లో ముద్దు విసిరింది. ‘క్యూట్ మామ్’ అనుకుంది. నీ లాంటి పంచ ప్రాణాలు పెట్టే తల్లి ఉన్నా, ఈ మనసు నాన్న వైపు లాగడం మానదెందుకో!
మెల్లిగా తాతగారి గదిలోకి నడిచింది. అప్పటికే తాతగారు, తొమ్మిదింటి వార్తలు వినేసారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి చదివి చాలా కాలం అయ్యిందని తెరిచిన బుక్ మూసేయబోతున్నారు. అప్పుడే గది లోకి వచ్చింది, జాహ్నవి. ‘ఊరికే రారు మహానుభావులు’ అన్నదెవరో కానీ, ఇప్పుడు జాహ్నవి ప్రవేశం తాతగారి గదిలోకి చాలా పెద్ద పని మీదే!
అందరూ ఒకే ప్రపంచంలో ఉంటూన్నట్టున్నా, ఎవరి ఆంతరంగిక ప్రపంచం వారిదే కదా! అలాగే ఇక్కడ కూడా తాతగారికి న్యూస్ వినడం, ఇంగ్లీష్ నావెల్స్ చదవడం, ప్రియమిత్రునితో ఫోన్‍లో సంభాషణ, మాలతి జీవితం గురించి ఆవేదన, అడిగిన పరిచయస్థులకు ఉచిత లీగల్ అడ్వయిజ్ ఇవ్వడం – వగైరాలన్నీ ఆయన ప్రపంచం అయితే – చదువు, స్నేహితులు, నాన్నపై అవధులు దాటిన ఇష్టం – అందుకై ఆరాటం జాహ్నవి ప్రపంచం. ఏ ప్రపంచం తెలియక, జాహ్నవే ప్రపంచంలా.. నాన్న అండనే శ్రీరామ రక్షగా బ్రతికేసే మనిషి మాలతి ఒక్కతే!
జాహ్నవి, తాతగారి మనో ప్రపంచానికి ఏ విధంగా డిస్టర్బన్స్ కలిగించని కామన్ సెన్స్‌తో, ఆయన పుస్తకం మూసేసే సమయానికి గదిలోకి అడుగు పెట్టింది. వచ్చిన జాహ్నవి ఎంతకూ పలుకదు. తాతగారి గదిలో ఉన్న, టేక్ వుడ్ టేబుల్‌ను ఆనుకుని, పెద్ద రేడియోకు ముందుగా నిలబడింది. ఆయన జాహ్నవి వంక చూసారు.
జాహ్నవి కాస్త తల ఎత్తి నిలబడి ఉంది. వేల వేల సంఘర్షణలను అదిమి పెట్టి ఉంచి నట్టుగా, ఆ ముఖం..
ఆయనకేమి అర్థం కాలేదు. కానీ, ఏదో ఉంది అనిపించింది. “అమ్మలూ..” అన్నారు. జానూ, అనకుండా, అమ్మలూ అనడంలోనే ఉంది, అంతా. ఆమె స్థితి పట్ల ఆయన సౌమ్య భావం, నీ వేదన నాకూ భరించరానిదే అన్న సౌహార్ధ భావం.. జాహ్నవి అప్పటికీ బదులు చెప్పలేదు. ఆయన ఆమె నుండి సమాధానం ఆశిస్తున్నారు.
ఆమె సమస్య ఏమిటో అంచనా వేసే ప్రయత్నంలో ఆయన.. తాతగారి రియాక్షన్ గురించి ఆలోచనలో నోరు మెదపని జాహ్నవి.. కొన్ని క్షణాల నిశ్శబ్దపు, నిశ్శబ్ద పరుగు..
చివరకు జాహ్నవి పెదవులు కదిలాయి.
“నేను, నాన్నగారి దగ్గరికి వెళతాను, తాతగారు!” అంది. వెళ్ళొచ్చా అనలేదు. “వెళతాను” అన్నది. మిన్ను విరిగి మీద పడ్డట్టు ఆయన రియాక్షన్ ఇవ్వలేదు. ఆయన నుండి నిశ్శబ్దానికి ఇంకా విమోచనం కలుగలేదు. ఆలోచిస్తున్నారు. తల పండిన లాయర్‌గా ఎన్నో చూసారు. అంత త్వరగా అవుననో, కాదనో తేల్చేస్తే ఆయన భద్రాద్రి గారెలా అవుతారు. చివరికి “ఆలోచిద్దాం” అన్నారు, ఆలోచిస్తూనే.
“అమ్మ” అంది జాహ్నవి. “జాగ్రత్త పడతాను” అన్నారాయన.
జాహ్నవి గది నుండి బయటకు వచ్చేసింది. ముఖం అంతా చిరు చెమటలు అలుముకున్నాయి. టెన్షన్ పడింది. తాతగారు, నాన్న దగ్గరకు వెళ్ళడానికి యాంటీగా లేరు అనుకున్నాక ఎంతో రిలీఫ్‌గా ఉంది జాహ్నవికి. నీలికి చెప్పింది. సంతోషించింది నీలి. కానీ వెంటనే “యాంటీగా లేరు కానీ ఆక్సెప్ట్ చేయలేదు కదా!” అంది. “చేస్తారు. అంత కంటే ముందు బాగా ఆలోచిస్తారు.” అంది మనసు నిండిన నమ్మకంతో జాహ్నవి.
ఆ మరురోజు అదే సమయానికి మాలతి నిద్ర పోయాక తాతగారు, భూషణం గారికి ఫోన్ కలిపారు. ఆయన ఎప్పటిలా ఛలోక్తులు విసురుతూంటే, “ఇక్కడ మేటర్ సీరియస్” అన్నారు.
“ఏమి జరిగింది” భూషణం గారు అలర్ట్ అయ్యారు.
క్షణకాల విరామం.. పరిస్థితి గాంభీర్యతని తెలుపుతూ
భద్రం గారి నుండి సమాధానం వచ్చింది.
“మనం ఎప్పుడో ఊరట కోసం అనుకున్న మాటలు, ఇప్పుడు నిజం అవుతాయేమో!”
“అంటే.. అదేదో అర్థం అయ్యేలా చెప్పొచ్చు కదా!” భూషణం గారిలో ఆదుర్దా.
ఆయన నుండి వచ్చిన సమాధానం, ఈసారి భూషణం గారిని మౌనం లోకి నెట్టింది. “ఏమిటీ, జాహ్నవమ్మ అలా అన్నదా!” అన్నారు తేరుకుని.
“అవును భూషణం! మాలతీ, ఆనంద్ విడిపోయిన కొత్తలో మనం అనుకునే వాళ్ళం. జానమ్మనే పెరిగి పెద్దయి, వాళ్ళను కలపాలని. ఏమిటో! అప్పుడు అలా అనుకుని ఓదార్పు పొందేవాళ్ళం. కానీ.. ఇప్పుడు జాహ్నవి తండ్రి దగ్గరికి వెళతాననడం..!”
“అలోచించాల్సిన విషయం” -భూషణం గారు.
“ఆలోచన అవసరం అయిన విషయమే.” – భద్రం గారు.
తలలు పండిన న్యాయవాదులు. లోకమెంతో ఎరిగినవారు. వాళ్ళు ఈ విషయాన్ని ఏ యాంగిల్‌లో చూడబోతున్నారు? తాతగారు ఫోన్‌లో మాట్లాడుతూంటే, ఆ ఫోన్ భూషణం తాతగారికే అయ్యుంటుందనుకుంది జాహ్నవి.
తన టాపిక్ భూషణం తాతగారితో చర్చించే అవకాశం తప్పకుండా ఉందని తెలిసినా, సభ్యత పాటించి అటు వెళ్ళలేదు. ఏమీ తెలియని మాలతి మాత్రం నిదురలో అటు నుండి ఇటు మరిలింది.
(ఇంకా ఉంది)