Site icon Sanchika

ఎంత చేరువో అంత దూరము-5

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[జాహ్నవి రాసిన ఉత్తరం నీలికి అందుతుంది. ఆ ఉత్తరంలో తన భావాలు, ఉద్వేగాలు, ఆలోచనలూ అన్నీ పంచుకుంటుంది జాహ్నవి. తన తండ్రి గురించి జనాలు అడిగే ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో తెలియక ఇబ్బంది పడేదాన్నని అంటుంది. తనకి నాన్న దగ్గరకి వెళ్ళలని ఉన్నా, వెళ్ళలేకపోతున్నానని అంటుంది. ఆ ఉత్తరాన్ని చదివిన నీలికి కన్నీరాగదు. ఫోన్ చేసి జాహ్నవితో మాట్లాడుతుంది. తన గదిలో చదువుకుంటున్న జాహ్వనికి స్వర్ణ మాటలు గుర్తొచ్చి తానెవరి పోలికో అని ఆలోచిస్తుంది. మరో ఆలోచన వచ్చి కంప్యూటర్‍లో తన ఫొటోకి చిన్న మార్పులు చేసి మగ వ్యక్తిలా మారిస్తే.. ఆ రూపు.. తన నాన్నేనేమో అనిపిస్తుందామెకు. ఆ ఇమేజ్‍ని డిలీట్ చేయాలనిపించదు. అమ్మ చూడకుండా జాగ్రత్త పడాలనుకుంటుంది. ఆ ఇమేజ్‍ని చూస్తూ, యూ ఆర్ హ్యాండ్సమ్ నాన్నా అని అనుకుంటుంది. అయితే మాలతికి మాత్రం కూతురు మనసులో మెదులుతున్న ఆలోచనలేవీ తెలియవు. కూతురికి తండ్రి పేరు కూడా ఇంటి పరిసరాల్లో వినిపించకుండా చేసిన మాలతికి జాహ్నవి ఉద్దేశం నచ్చుతుందా? పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. జాహ్నవి, ఆమె మిత్రులంతా శ్రద్ధగా చదువుతున్నారు. తండ్రి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్న జాహ్నవికి ఓ ఐడియా చెప్తుంది నీలి. దాని ప్రకారం తాతగారినీ, అమ్మని గుడికి పంపించి, ఆ సమయంలో ఇంట్లో వెతికి, అటక మీద దాచిన ఓ పాత సూట్‌కేసు లోని ఉత్తరాలను తీసి చదువుతుంది జాహ్నవి. ప్రతి ఉత్తరంలోనూ తన ప్రసక్తి ఉండడం చూసి సంతోషిస్తుంది. వాటిని యథాస్థానంలో ఉంచి, సూట్ కేసును అటక మీద పెట్టేస్తుంది. నీలికి ఫోన్ చేసి తరువాతి స్టెప్ గురించి ప్లాన్ చేస్తుంది. ఒకరోజు అమ్మ పడుకున్నాక, తాతగారి గదిలోకి వెళ్ళి, ‘నేను నాన్నగారి దగ్గరికి వెళతాను తాతగారు!’ అంటుంది. అనుభవజ్ఞుడైన ఆయన తొణక్కుండా, ఆలోచిద్దామని అంటారు. జాహ్నవి మదిలో మెదిలిన ఈ ఆలోచన గురించి తాతగారు తన స్నేహితుడు భూషణంతో మాట్లాడుతారు. – ఇక చదవండి.]

అధ్యాయం 5

[dropcap]ప[/dropcap]రీక్షలు దగ్గరికి వస్తున్నాయి. చాముండి గుడికి వెళ్ళాలనే తలంపు వచ్చింది, అమ్మాయిల్లో. “ఒకసారి టెంపుల్‌కు వెళ్ళి వచ్చాక ఇంక సీరియస్‌గా స్టడీస్ స్టార్ట్ చేద్దాం” అంది శ్రీవల్లి. “అవును. ఒకసారి అమ్మవారిని దర్శించుకుని వస్తే ఫుల్‌గా ధైర్యం వస్తుంది” అంది మీనా. ఫ్రెండ్స్ సెంటిమెంట్స్ తెలియనివి కావు జాహ్నవికి. అయినా నవ్వుతూ అంది, “అమ్మవారిని దర్శించుకోవాలి అనా, లేక ఎగ్జామ్స్ అయ్యేదాకా సరిపడినంత తిరగాలనా?”

“అన్నీ కలిసి వస్తాయి, కదా!” అంది జ్యోత్స్న.

“అబ్బా, నేను మాత్రం అమ్మవారి మీది భక్తి తోనే” అంది వినుత. భక్తికి అగైనిస్ట్ కాదు కానీ, ఇలా ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కోసం మాత్రం గుడికి వెళ్ళాలనుకోదు, జాహ్నవి. తనకు తన మిత్రురాళ్ళ సాన్నిహిత్యం కావాలి. ఎక్కడికి వెళ్ళడం అన్నది ఇంపార్టెంట్ కానే కాదు. తన ఎనర్జీ బూస్టర్స్ వాళ్ళే, అనుకుంది..

ఇంక వంటకాల లిస్ట్ మొదలయ్యింది. ఎవరి మామ్ చేసేది ఎక్కువ బాగుంటుందో వాటికి డిమాండ్ మొదలయ్యింది. “పాలక్ పన్నీరు జాహ్నవి తెస్తుంది.” “ఇంకా నయం, చేస్తుంది అన్నావు కాదు చచ్చే వాళ్ళం” విడీ విడనట్టున్న పెదాల నవ్వుతో ఫెండ్స్ జోక్స్ రిసీవ్ చేసుకుంటున్నది జాహ్నవి. తను అంతే. వాగదు, వింటుంది. విన్న రియాక్షన్ కూడా బయటకు కనబడదు. అలా అని మొద్దు మొఖంలా ఉండదు. అదును చూసి ఓ ఛలోక్తి విసిరి తాను నవ్వకుండా ఫ్రెండ్స్‌ను నవ్విస్తుంది, ఎవరినీ హర్ట్ చేయకుండానే! ఆ ఇంటలిజెంట్ క్లాస్ లీడర్ గ్రూప్‌లో తాము ఉన్నందుకు ఆ అమ్మాయిలకు గర్వ కారణం. కొత్త వాళ్ళకు ప్రవేశం దొరకక ఉడుకుమోతుతనం. క్లాస్ టాలెస్ట్ జాహ్నవి నడిచేటప్పుడు ఫ్రెండ్స్‌తో మాట్లాడేందుకు కాస్త ముందుకు వంగుతుంది. చామనఛాయలో ఉండే జాహ్నవిలో పెద్ద కళ్ళే పెద్ద ఆకర్షణ. ఎదుటి వారిని స్కాన్ చేసే చూపులతో అంత దూరం నిలబెట్టేస్తుంది. ఓ అంచనాకు వచ్చాకే ఎవరినైనా నమ్ముతుంది. ఇదీ ఆమె నేచర్. గంభీర వదనం, ఆ సూటి చూపులు.. తన నిక్ నేమ్‌కు తగ్గట్టు గానే జాహ్నవి.

చాముండి టెంపుల్‌కు వెళ్ళే విషయం మాలతికి చెప్పింది. పాలక్ పన్నీరు విషయం చెప్పి, వినుత అన్న మాటలు చెప్పింది. మాలతి ఫక్కున నవ్వింది. “ఎగ్జామ్స్ అవగానే హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు నేర్చేసుకో!”

జాహ్నవి గంభీరంగా మారి పోయింది. తన మనసులో మాట చెప్పాలా? వద్దా? చెపితే అమ్మను మానసికంగా సిద్ధం చేయవచ్చు.

అమ్మ ముందు కూడా దాపరికాలు ఎంత ఘోరమైన పరిస్థితి.

“ఒక వేళ సమ్మర్ హాలీడేస్‌లో అస్సలు కుదరక పోవచ్చు” అంది.

మాలతి ముఖం లోకి చూసేందుకు బాధగా ఉంది.

“ఏమి! ఏదైనా నేర్చుకుంటావా సెలవుల్లో. ఏదైనా క్లాస్‌లకు వెళదాం అనుకున్నారా, ఫ్రెండ్స్ అంతా కలిసి?”

జాహ్నవి తల్లి ముఖంలోకే చూస్తూంది. ఆమె రియాక్షన్స్ తలుచుకుంటే భయంగా ఉంది. కానీ ధైర్యం చేసింది.

ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి.. అంతే టైం బాంబు పేల్చేసింది.

“సమ్మర్ హాలీడేస్‌లో నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉందమ్మా!”

మాలతి చేతిలో పని వదిలేసి, జాహ్నవి వైపు గిర్రున తిరిగింది..

తాను జాహ్నవి వైపు తిరిగిందో, తన చుట్టూ తాను తిరిగిందో, ప్రపంచం తన చుట్టూ తిరిగిందో అర్థం కాలేదు.. అయోమయం అవహించింది ఆమెను.

జాహ్నవి తల్లి ముఖంలో మారే రంగులను నిస్సహాయంగా గమనిస్తూంది. సర్ది చెప్పాలనో, అనునయించాలనుకుందో, ఇలా అంది.

“అవునమ్మా, అందరూ హాలిడేస్‌లో అమ్మమ్మ ఇంటికి వెళతారు. మనం అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నాము, కదా! అందుకే అలా అన్నాను.”

మాలతి జీవిత కాలపు నమ్మకం పై సమ్మెట వేటు పడింది.

మాలతి ముఖం కందగడ్డలా మారింది. ఆవేశం అణుచుకోలేక క్రింది పెదవి అదురుతున్నది. దుఃఖం ఆనకట్టను తెంచుకుంది. భోరున ఏడుస్తూ వంటింట్లో కూలబడి మోకాళ్ళ మధ్య ముఖం పెట్టుకుంది మాలతి. జాహ్నవి ఇంత కంటే భిన్నంగా ఏమీ ఊహించలేదు. మాలతి ఏడుస్తూంటే, ఆమెకూ కళ్ళ వెంట నీళ్ళు కారిపోతున్నాయి. ఓదార్చేందుకు ధైర్యం చాలట్లేదు. ఇంతలో తాతగారు రంగప్రవేశం చేసారు. “పిచ్చి మాలమ్మా, అంత దుఃఖం ఎందుకు?” అన్నారు. మాలతి సమాధానం చెప్పలేదు. ఏడుపు ఆపలేదు. “జానూ, అమ్మకు కొన్ని నీళ్ళు తెచ్చివ్వు” అన్నారు, ఏడుస్తూ నిలుచున్న జాహ్నవితో.

తాతగారికి జరిగింది చెప్పింది. “మాలమ్మా! పిల్ల ఏదో అనగానే ఇంత హంగామానా! చూడు, బి. పి. పెరిగితే ఎంత కష్టం.” బలవంతంగా కొన్ని నీళ్ళు తాగించి, మెల్లిగా లేపి, సోఫా లోకి తెచ్చి పడుకోబెట్టారు. ముడుచుకొని పడుకున్న మాలతి పాదాల దగ్గరే, ఆగని కన్నీటితో తానూ కూర్చుంది జాహ్నవి. ఆ ఇద్దర్నీ చూస్తూ, దీర్ఘమైన నిశ్వాసంతో తన గది లోకి నడిచారు తాతగారు.

***

ఆ తర్వాత నుండి అంతా మాలతి డల్‌గా, మౌనంగా మారిపోయింది. అడిగిన దానికి బదులిస్తుంది. ఎంతో అవసరమైతేనే ఏదైనా అడుగుతుంది. అప్పటికి మూడు రోజులుగా ఆమె మూడ్ సెట్ అవ్వనే లేదు. ఆమెలో ఏ సుడిగుండాలు సుళ్ళు తిరుగుతున్నాయో, ఆమె మానసిక స్థితి ఏమిటో జాహ్నవికి అంతు బట్టట్లేదు. తనకు, అమ్మకు మధ్య ఇంత పెద్ద గ్యాప్ ఏర్పడుతుందని, కాకున్నా, ఇది అంత ఈజీగా సాధ్యమయ్యేది కాదని ముందుగా ఊహించిందే.

అసలు అమ్మ మనసులో ఏముంది? తానంత తప్పేమి అన్నది. నాన్న కావాలనుకోవడం తప్పెలా అవుతుంది. తాను ఇప్పుడు ఆగిపోవాలా? అసలు తన గమ్యం తనకు అర్ధం కాని స్థితిలో ఉంది. తాతగారు కూడా విన్నారే కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. నాన్నను చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులైనా అధిగమిస్తుంది. కానీ, అమ్మ, తాతగారు హర్ట్ అవకుండా ఉంటే చాలు. తాతగారితో ప్రాబ్లమ్ లేదేమో! అమ్మ కెలా చెప్పాలి?

ఏదైనా ఒదులుకునేందుకు ఎంతో సేపు పట్టదు. తిరిగి తెచ్చుకోవాలంటే అంత తొందరగా దొరకదు. ప్రయత్నం తోనే కదా, ఏదైనా సాధ్యం. నాన్నను శాశ్వతంగా ఎందుకు ఒదులుకోవాలి? నాన్నకు తనంటే ఇష్టం లేకుంటే, తను ఆ ఫాక్ట్ రిసీవ్ చేసుకుంటుంది. కానీ, ముందే డిసైడ్ అయి, నాన్నను ఒదులు కోవాలని తనకు లేదు. తనని వారించేందుకు సరైన రీజన్ అమ్మ దగ్గరుందా? అమ్మ అలా ఉంటే తాను స్కూల్‌కు వెళ్ళగలదా! ఏవో హాలిడేస్ కలిసి రావడం వల్ల సరిపోయింది కానీ, అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన ఒక వైపు, ఆమె మౌనం బాధిస్తూ మరో వైపు.. ఎంత గుండె దిటవుగా కనిపించినా, ఆమె కూడా ఒక ఆడపిల్లనే! సహజ భావొద్వేగాలు ఆమెకూ ఉంటాయి. సింగిల్ పేరెంట్స్‌లో ఒకరిపై ఒకరు పులుముకునే నిందారోపణల వల్ల పిల్లలు తండ్రిపై లేదా తల్లిపై ద్వేషం పెంచుకునే అవకాశం ఉంది. కానీ అన్నీ గుప్పెట్లో మూసి పెట్టుకున్న మాలతి – జాహ్నవిని శారీరకంగానే కానీ మానసికంగా తండ్రికి దూరం చేయలేక పోయింది.

బి.పీ., ఆయాసం, గుండె దడ.. ఇవన్నీ వైవాహిక విచ్చిన్నం మాలతికి ఇచ్చిన అదనపు ఆస్తులు. ఏది మాట్లాడినా ఆమె ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. తల్లీకూతుళ్ళ మధ్య నిశ్శబ్దంగా నలిగి పోతున్నారు, తాత గారు. ఎవరి భావాల్లో వారుండగా, మరో రోజు భళ్ళున తెల్లవారింది.

***

తాము చాముండి టెంపుల్‌కు వెళ్ళేందుకు ఇంకా రెండు రోజులే ఉంది. అమ్మను ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్ళలేదు. రోజూ నిద్ర కూడా అమ్మ ప్రక్కనే. ఒంటరిగా ఏడుస్తూ పడుకుంటూదేమోనన్న భయంతో. తాను రానంటే ఫ్రెండ్స్ డిస్సపాయింట్ అవుతారు. ప్రోగ్రామ్ కాన్సిల్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ, అమ్మ కంటే అవేవి ముఖ్యం కాదు తనకు.

తాతగారు కూడా ఆ సమయంలో మాలతి గురించే ఆలోచిస్తున్నారు. ఆమె భయాలు ఆయనకు తెలుసు. అవెంత అవాస్తవికమో చెపితే అర్థం చేసుకోకపోగా, ఆమె మానసిక స్థితిని మరింత రెచ్చగొట్టినట్టే అవుతుందని  భావించారాయన. కదిలిస్తే కడివెడు కన్నీళ్లలా ఉంది. ఇంట్లో ఎప్పుడూ ఎదురుకాని పరిస్థితి.. గుండెల్లో ఎంత లావా అణుచుకుందో! విధిగా కూతురు కోసం జీవితం లాగిస్తూంది. భర్తను వదులుకున్నంత సులభంగా సమాజాన్ని గెలువలేక పోయింది. తనని తానే గెలువలేక పోయింది. అశోకవనంలో సీతమ్మలా శోకమే మిగుల్చుకుంది.

ఇక ఈ సమస్యను భూషణంకు వదిలేయాల్సిందే. మాలతి అంటే పంచప్రాణాలు వాడికి. తాము రాజమండ్రిలో ఉండగా, మాలతి ఎప్పుడూ వాళ్ళింట్లోనే ఆడుకుంటూ ఉండేది. పిల్లలు లేని ఆ దంపతులు మాలతిని బాగా దగ్గరికి తీసేవారు. మా పెంపుడు కూతురు అని చెప్పుకునే వాడే, ఇప్పుడు ఈ తల్లీ కూతుళ్ళ సమస్యను సమన్వయంతో సాధించగలడు. వీలైతే చెల్లెమ్మను కూడా తీసుకురమ్మంటాను. మండ్య ఎంత దూరం అని.. రేపే, ఉహు, వీలైతే ఇప్పుడే వచ్చేయమంటాను. ఇలా అనుకున్నాక ఆయన నిశ్చింతగా ఫీలయ్యారు. ఆయన ఫోన్ కాల్ అందుకుని అదే రోజు సాయంత్రం ట్రైన్‌కు బయలుదేరారు, రాధమ్మ, భూషణం గారు. మాలతి సహజంగానే వాళ్ళను చూసి సంతోషంచింది. ఏవేవో వంటకాలు చేసి తీసుకొచ్చిన ఆమె, తల్లి ప్రేమతో మాలతిని అలరించింది.

ఆ రాత్రి భోజనాలు చేసి హాల్లో కూర్చున్నాక అసలు పాయింట్‌కు వచ్చారు, తాతగార్లిద్దరూ. ముందుగా సమాధానం జాహ్నవి నుండే వచ్చింది. “అవును. నాన్న దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. కానీ, ఇంకా ఆయన అభిప్రాయం ఏమిటో తెలీనే తెలియదు,” అంది జాహ్నవి, మాలతి ఎక్కడ బరస్ట్ అవుతుందేమో అన్న భయంతో ఆమె వంక చూస్తూ. మాలతికి తాతగారి ప్లాన్ అర్ధం అయ్యింది. ‘ఓహో, ఈ మీటింగ్ పెట్టేందుకా, పిన్నీ, బాబాయ్ ను రప్పించారు’ అనుకుంది. అంటే నాన్న కూడా జానూకు సపోర్టా!

అది చిన్న పిల్ల. దాని తిక్కల వేషాలకు వీళ్ళంతా సపోర్ట్ కాబోలు. పిల్లకు బుద్ధి చెప్పవలసింది పోయి, అందరూ ఒకటై.. తననిలా.. జానూనే ప్రపంచంగా బ్రతికింది ఇన్నాళ్ళూ. ఇప్పుడు ఇంక ఎవరో రావాలా తమ జీవితాల్లోకి! రోజులు ఇలా గడిచి పోతే చాలు కదా! ఇంట్లో వాళ్ళే తన పాలిట శత్రువులయ్యారేమి? మాలతి రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది. రాధమ్మ లేచి, మాలతిని భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకున్నారు.

“మాలా! నీ మనసులో ఏముంది చెప్పమ్మా!” అన్నారు.

కొద్దిగా విరామమిచ్చి.. దుఃఖాన్ని నిభాయించుకుని, “దీన్ని నేను ఒక్కదాన్నే కదా, ఇన్నేళ్ళు పెంచాను. ఆ బంధం ఒద్దు అనుకున్నాను కదా! ఇప్పుడు హఠాత్తుగా అందరికీ ఆయన ఎందుకు గుర్తుకొస్తున్నారు.” అంది.

“మాలతీ! పిల్ల ధ్యాస తండ్రి మీదకు మళ్ళింది. అది కాదనుకుంటే పోయే బంధం కాదమ్మా!” రాధమ్మ గారు నచ్చ చెప్తూంటే, మగవాళ్ళిద్దరూ అటే గమనిస్తున్నారు.

“అలా అంటారేమిటి పిన్నీ! నాకు అప్రియమైన వాళ్ళనీ, నన్ను బాధపెట్టిన వాళ్ళనీ, అదెలా ఇష్టపడుతుంది చెప్పండి. అది నా కూతురు కదా!” తరుముకు వస్తున్న దుఃఖం, ఆవేశం మాలతి గొంతు స్థాయిని పెంచింది.

“అలా ఆలోచించకు మాలతీ! జాహ్నవి నిన్ను బాధపెట్టిన వాళ్ళని కాదు, అతని లోని కన్న తండ్రిని కోరుకుంటున్నది. ప్రాణంలా పెంచావు కదా, అది నిరాశ పడడం నీకు మాత్రం ఇష్టమా?”

ఆ మాటతో రాధ గారి భుజం మీద నుండి ఆమె ఒళ్ళోకి జారిపోయింది మాలతి. హిస్టీరిక్‌గా ఏడవ సాగింది. “అక్కడ.. అక్కడ.. అది ఉంటుంది. అది నా బిడ్డను నాకు కాకుండా చేస్తుంది.”

ఈ మాటతో జాహ్నవి ఉలిక్కి పడి చూసింది.

మగవాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రాదమ్మకు బాగానే అర్థం అయ్యింది.

“నీ బిడ్డ నీకు గాకుండా పోవడం ఏమిటి? అలా ఏమి జరుగదు.”

మాలతి ఆమె ఒళ్ళో నుండి లేచి, అదే సోఫాలో తల వాల్చి కూర్చుంది.

“అవును, పిన్నీ, అది మాయలాడి. నా బిడ్డను కూడా, నా మీది కోపంతో మాయ మాటలు చెప్పి, అక్కడే పెట్టుకుంటుంది.”

“అప్పుడు, దూడ కోసం ఆవు పరిగెత్తుతుంది.” తెల్లబోయి చూడ్డం మాలతి వంతయ్యింది.

“అవును, మాలతీ, నీ బిడ్డను అట్టేపెట్టుకోవాలంటే, ఆమెకూ భయమే ఉంటుంది. కూర్చున్న క్రిందికి నీళ్ళు తెచ్చుకుంటారా, ఎవరైనా!”

“అలా చూడు, జాహ్నవిని చూడు! అది నిన్ను ఒదిలి వేస్తుందని నువ్వు ఎలా నమ్ముతున్నావు, మాలమ్మా! అది చిన్న పిల్ల కాదు. చెప్పుడు మాటలు వినే అమాయకురాలు కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. కాలం కలిసి వస్తే ఆనంద్ మనసు పిల్లను చూసి మారుతుందేమో!”

అందరూ ఈమె కెలా చెప్పాలా అని బుర్ర పగుల గొట్టుకునే సందర్భాన్ని, తన స్త్రీ సహజ నైపుణ్యంతో, ఒక కొలిక్కి తెచ్చారు రాధగారు.

“ఆయనేమీ నా కోసం మనసు మార్చుకోనక్కర్లేదు,” కటువుగా అంది మాలతి.

నాన్న దగ్గరికి వెళ్ళాలనే తన అందమైన భావజగత్తు, ఇన్ని రూపాలు సంతరించుకోవడం చూసి, జాహ్నవి ముఖం వివర్ణమయ్యింది.

మాలతి మాటల్లో అంతర్లీనమైన అంగీకారాన్ని గ్రహించిన పెద్దవాళ్ళు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.

***

ఇంట్లో జాహ్నవికి నచ్చిన సందడి వాతావరణం ఏర్పడింది, పెద్దవాళ్ళ రాక సంతోషంగా ఉంది. రాధమ్మ గారి ఆప్యాయత, తాతగార్ల చతురోక్తులు.. రేపు వాళ్ళు ఊరికి వెళితే అన్నీమిస్ అవడమే.

రేపు అనుకోగానే గుర్తుకు వచ్చింది. చాముండి టెంపుల్ వెళ్ళేది, రేపే. ఈ పరిస్థితుల్లో అమ్మను వదిలి వెళ్ళడం ఎందుకు? భూషణం తాతగారు వాళ్ళు కూడా రేపు మండ్యకు వెళతారు. తాతగారిని రేపు ఒక్క రోజు ఉండిపొమ్మని అడిగితే..

“భూషణం తాతగారు, రేపు మీరు ఉండిపోండి, ప్లీజ్!” అంది.

“నేను ఫ్రెండ్స్‌తో వెళ్ళి వచ్చేవరకు చాలా లేట్ అవుతుంది. అమ్మా, అమ్మమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.”

“ఎక్కడికి వెళ్ళాలి, జానమ్మా!”

“చాముండి టెంపుల్‌కు. నేను రావట్లేదు అంటే, ఫ్రెండ్స్ డిసపాయింట్ అవుతారు” అంది.

ఆ పిల్లకు కుటుంబం పట్ల ఉన్న శ్రద్ధను గమనిస్తూన్న భూషణం గారికి ముచ్చట వేసింది. తల్లి కోసం ఎంత ఆలోచిస్తూంది ఈ బంగారు తల్లి.

“అలాగే, జానమ్మా! నువ్వు అడిగితే కాదనేది ఏముంది?” అన్నారు.

మాలతి మనసు స్థిర పడిందో, లేదో కానీ.. పైనకి మాములుగానే ఉంది. తుఫాన్ ముందు ప్రశాంతతనా! భూషణం వాళ్ళు వెళ్ళి పోయాక, మళ్ళీ గొడవ చేయదు కదా, అనుకున్నారు తాతగారు.

జాహ్నవి మర్నాడు టెంపుల్‌కు వెళ్ళడానికి తయారు అవుతూంటే, బయట టేబుల్ మీద ఓ టిఫిన్ బాక్స్ పెట్టి కనిపించింది. పొద్దుటి నుండి అమ్మ, రాధమ్మమ్మ వంట ఇంట్లో బిజీగా ఉన్నారు, ఇందుకేనా అనుకుంది.

“డబ్బా మరిచి పోకుండా తీసుకుని వెళ్ళు జానమ్మా!” అన్నారు రాధమ్మమ్మమ్మ.

డబ్బా వేడిగా ఉంది. మూత వదులుగా పెట్టి ఉంది. మూత జరిపి చూసింది.

పాలక్ పనీర్! ‘అమ్మ’ ఆర్ద్రం అయ్యింది, జాహ్నవి హృదయం.

అప్పుడు సరదాగా ఫ్రెండ్స్ మధ్య అనుకున్న మాట..

తాను అమ్మను అడుగనే లేదు. ఎంత బాగా గుర్తు పెట్టుకుందో!

“మామ్, థాంక్యూ, మామ్! సారీ మామ్!” అంది.

మాలతి సమాధానం ఏమీ చెప్పకుండా తల ఆడించింది. జాహ్నవి తల్లికి దగ్గరగా వెళ్ళి, గాఢంగా చుట్టేసింది. బాక్స్ బ్యాగ్‌లో సర్దుకుని అందరికీ బాయ్ చెప్పి, బయల్దేరింది.

నీలి కూడా వస్తే ఎంత బాగుండేది, అనిపించింది. ఫ్రెండ్స్ అందరి ఫీలింగ్ అదే.

నీలితో సమయం చూసి అన్నీ చెప్పాలి. తాతగారితో మాట్లాడడం, అమ్మతో సమ్మర్ హాలిడేస్‌లో నాన్న దగ్గరికి వెళతానని చెప్పడం, అందుకు అమ్మ ఎలా రియాక్ట్ అయ్యింది, రాధమ్మమ్మ, అమ్మకు నచ్చ చెప్పడం అన్నీ దానితో షేర్ చేసుకోవాలి. లెటర్స్ వ్రాసుకుని ఓపెన్ అప్ అయినప్పటి నుండి నీలితో తన ఆంతరంగిక విషయాలు షేర్ చేసుకుంటూంది జాహ్నవి. నాన్న దగ్గరికి వెళ్ళే తన ఒంటరి పోరాటంలో, నీలి బాసటగా ఉంది. చాముండి హిల్స్ నుండి చీకటి పడకుండానే ఇల్లు చేరుకున్నారు అమ్మాయిలు.

***

చాముండి టెంపుల్‌కు వెళ్ళి వచ్చిన జాహ్నవి, ఆ రోజు తన రూమ్‌లో పడుకోబోతూ, కంప్యూటర్ ఓపెన్ చేసి, తన ఊహాజనిత ‘నాన్న’ చిత్రాన్నిఅపురూపంగా చూసుకుంది.

‘నాన్నా! నా కెన్ని మార్కులు వస్తాయి, తెలుసా! మీకు నా మార్క్స్ చూపాలని నా రిపోర్ట్స్ అన్నీ దాచి పెట్టుకున్నాను’ అనుకుంది.

అమ్మ కొద్దిగా కూల్ అయ్యింది. తాతగారు ఇంకా ఆక్సెప్ట్ చేయకున్నా, ‘నో’ అని మాత్రం అనలేదు. కొన్ని రోజుల మనస్తాపం..

అమ్మ రోదన, మౌనం భరించడం పిల్లల కెంత కష్టం.

అర్థం లేని అనుమానాలు అమ్మవి.

తాను అమ్మను ఒదిలి అక్కడే ఉండిపోతుందా!

అది ఎప్పటికైనా జరిగే పనా!

మహాతల్లి, మాయలాడి – నీలి బర్త్‌డేలో ఫ్రెండ్స్ మాటలు..

ఐ నెవర్ వాంట్ టు హియర్ దీస్ వర్డ్స్, అనుకుంది.

ఒక సెకన్ కూడా ఆమె గురించి ఆలోచన తన కిష్టం లేదు. తానూ – నాన్నా, అంతే! ఆ ప్రపంచంలో ఇంకెవరి గురించి ఆలోచనా అవసరం లేదు.

ఆవిడ అక్కడున్నా, లేకున్నా తన కనవసరం. తన ధ్యాస, ధ్యానం అంతా నాన్న మీదే. చూపు సూటిగా ఉండాలి. ప్రక్కల కెందుకు?

అమ్మలాగా తనసలు ఆమెను పట్టించుకోదు. కావలసింది, నాన్న. అంతే.

(ఇంకా ఉంది)

Exit mobile version