Site icon Sanchika

ఎంత చేరువో అంత దూరము-6

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పరీక్షలకి ముందు చాముండీ ఆలయానికి వెళ్ళాలనుకుంటారు మిత్రులందరూ. ఫ్రెండ్స్ కోరిక మేరకు తల్లిని పాలక్ పన్నీర్ చేసివ్వమంటుంది జాహ్నవి. సెలవల్లో పాలక్ పన్నీర్ చేయడం నేర్చుకో అని మాలతి అంటే, సెలవల్లో తాను నాన్న దగ్గరకి వెళ్ళాలనుకుంటున్నట్లు చెబుతుంది జాహ్నవి. ఆ మాట వినగానే మాలతి షాక్‍కి గురవుతుంది. బాగా ఏడుస్తుంది. వాళ్ళ నాన్నగారు వచ్చి ఓదార్చి, ధైర్యం చెబుతారు.  అప్పటికి సర్దుకున్నా, మాలతి తన మనసుకు నచ్చజెప్పుకోలేక ఇంట్లో ముభావంగా ఉంటుంది. తను నాన్నని కావాలనుకోవడం తప్పెలా అవుతుందో జాహ్నవికి అర్థం కాదు. నాన్న విషయంలో తనని వారించే సరైన రీజన్ అమ్మ దగ్గరుందా అని అనుకుంటుంది. చాముండీ టెంపుల్‍కి వెళ్ళే రోజు దగ్గర పడుతూంటుంది. మాలతి, జాహ్నవి ఇద్దరూ మూడీగానే ఉంటారు. వీళ్ళని గమనిస్తున్న తాతగారు – భూషణం గారినీ, ఆయన భార్య రాధమ్మని పిలిపించి వాళ్ళ ద్వారా సమస్యని పరిష్కరించాలని భావిస్తారు. రాధమ్మ గారు, భూషణం గారు మాలతికి నచ్చజెప్తారు. చివరికి అంగీకరిస్తుంది మాలతి. మరొక్క రోజు భూషణం గారిని, రాధమ్మ గారిని ఉండమని చెప్పి తాను స్నేహితురాళ్ళతో చాముండీ ఆలయానికి వెళ్ళొస్తుంది జాహ్నవి. ఆ రాత్రి తన కంప్యూటర్‍లో నాన్న బొమ్మని చూసుకుని మురిసిపోతుంది జాహ్నవి. – ఇక చదవండి.]

అధ్యాయం 6

[dropcap]మ[/dropcap]రురోజు భూషణం గారు వాళ్ళు వెళ్ళి పోయారు. భద్రం గారికీ ఆయనకు మధ్య డిస్కషన్స్ నడిచాయి. జాహ్నవి తెలివితేటలపై, విజ్ఞతపై ఇద్దరికీ విశ్వాసం ఉంది. అమ్మాయి నాన్న దగ్గరికి వెళ్ళడం వల్ల వచ్చే లాభనష్టాల బేరీజులో..

అనుభవంలో అడ్వకేట్స్‌గా తలలు పండిన వారిరువురూ.. అంగుళంగళం శోధనలో.. ఒకే నిర్ణయానికి వచ్చారు.

అవును.. జాహ్నవి – మాలతి.

ఇద్దరి జీవితం ఓ ఒడ్డుకు చేరాలంటే.. జాహ్నవి ప్రయత్నానికి అడ్డు చెప్పకూడదు. మాలతికి కూతురుకి పెళ్ళి చేసే బాధ్యత ఉంది. కానీ, అందుకింకా సమయం ఉంది. తామింకా పెద్దవాళ్ళు అవుతారు. తాము అప్పటికి ఉండొచ్చు, లేకపోవచ్చు.. అదే జరిగితే ఆడపిల్లతో మాలతి ఒంటరి దవుతుంది.

మాలతి తనపై తాను శ్రద్ధ పెట్టక ఆమె ఆరోగ్యం కూడా అంత గొప్పదేమీ కాదు. మాలతి ఆవేశపరురాలు, అమాయకురాలు. సమాజాన్నుండి తనను తాను వెలివేసుకుని బ్రతకడం అలవాటు అయిన మాలతికి, కూతురి పెళ్ళి, సరైన వరుణ్ణి తేవడం సమస్యలే. ఉన్న కొద్దో గొప్పో ఆస్తి చూసుకోగలదా అన్నదీ సందేహమే!

ఆనంద్ మంచి పొజిషన్ లోనే ఉన్నాడని వినికిడి.

జాహ్నవికి చట్టబద్ధంగా కూడా అతని ఆస్తిలో హక్కు ఉంటుంది.

జాహ్నవికి తండ్రికి మధ్య అనుబంధం పెరిగితే, ఆమె పెళ్ళి గురించి, భవిష్యత్తు గురించి ఇంక దిగులు ఉండదు.

జాహ్నవికి పెళ్ళి చేసే బాధ్యతను, ఆనంద్ ఎలా విస్మరించగలడు. అది అతని బాధ్యత – జాహ్నవి హక్కు.

అతను మైసూర్ వస్తూ, వెళుతూంటే.. మాలతి పట్టుదల సడలిపోయి వాళ్ళు ఒకటైతే..

ఇలాంటివి లోకంలో అక్కడక్కడా జరిగేవే!

తాము పెద్దవాళ్ళు అవుతున్న తరుణంలో..

ఇంకా కావాల్సింది ఏముంది?

వాళ్ళు ఇంత వరకే ఆలోచించారు.

ఎవరి మనోభావాలు ఎంత నలిగి పోయినా,

మనుషుల ఎమోషన్స్ కంటే చట్టాలు, హక్కులు, ధనమే ప్రాముఖ్యం సంతరించుకుంటాయి అప్పుడప్పుడు, జీవిత నాటకంలో!..

***

ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. చాముండి అమ్మ వారి దర్శనం చేసుకుని వచ్చినప్పటి నుండి, స్నేహితురాళ్ళంతా చదువుల్లో బిజీ అయ్యారు. జాహ్నవి మళ్ళీ ఆ రోజు తాతగారి గది లోకి వచ్చింది. ఈ సారి అప్పటిలా టెన్షన్ లేదు. తాతగారి సపోర్ట్, అమ్మ మౌనంతోనే ఇచ్చిన అర్ధాంగీకారం జాహ్నవిని కాస్త రిలాక్స్ చేసాయి.

తాతగారు గ్రహించారు జాహ్నవి ఎందుకు వచ్చిందో! తన ఆరాటం చూస్తూంటే ఆమెపై జాలి కలుగుతున్నది.

‘దేవుడా! మా చిన్ని జాహ్నవికి అండగా ఉండు’, అనుకున్నారు.

“చెప్పు, అమ్మలూ!” అన్నారు.

ఆలోచిస్తూ నిలబడింది ఒక నిముషం.

“నాన్న అడ్రస్ కావాలి,” అంది.

ఆయన సాలోచనగా జాహ్నవిని చూసారు.

“సెలవులు రావడానికి ఇంకా చాలా టైం ఉందమ్మా!”

“అవును. కానీ సడన్‌గా వెళ్ళలేము కదా!” అంది.

ఆయన జాహ్నవి ముఖం లోకి సూటిగా చూస్తూ అన్నారు,

“నీ ప్లాన్ ఏమిటి? ఏమి చెయ్యాలి అని?”

జాహ్నవి నుండి రెడీగా పెట్టుకున్నట్టు వెంటనే సమాధానం వచ్చింది.

“నాన్నకు లెటర్స్ వ్రాస్తాను.”

“ఫోన్ చేయాలని లేదా? నెంబర్ దొరికితే”

“ఫోన్ అయితే వెంటనే కట్ చేస్తే, మళ్ళీ చేయలేము. ఓపెన్ అప్ అవలేము,” అంది.

ఆయన విభ్రాంతిగా చూసారు.

“ఈ వయసుకే ఈ పిల్ల ఇంత దూరం ఆలోచిస్తుందా!”

అప్పుడే మాలతి, తాతగారికి టిఫిన్ ఇచ్చేందుకు రూమ్ లోకి వచ్చింది. ఆమెకు అర్థం అయ్యింది. ఏదో గూడపుఠాణి జరుగుతూంది..

‘ఈ మనుషులు మారరు’, అనుకుంది.

వీళ్ళు ‘ఆనంద్’ జపం వదలరు.

అక్కడ జాహ్నవిని గమనించనట్టే బయటకు వచ్చేసింది.

తాతగారు అన్నారు, “భూషణం తాతగారికి మీ నాన్న అడ్రస్ గురించి చెప్పి ఉన్నాను. అడ్రస్ మాత్రం సంపాదించ గలిగారు కానీ, ఫోన్ నెంబర్ ఇంకా దొరకలేదు.”

ఆ మాట వింటూనే ఆనంద కెరటం ఉవ్వెత్తున ఎగిసి పడింది జాహ్నవిలో. “అడ్రస్ దొరికిందా!” అంటూ అబ్బుర పడింది. మోము విప్పారింది. సంతోషంతో చప్పట్లు చరుస్తూ ఇల్లంతా గెంతులు వేసింది.

ఆశ్చర్య పోవడం పెద్దవాళ్ళ వంతయ్యింది.

ఎప్పుడూ తన వయసుకు భిన్నంగా, భావాతీతంగా కనిపించే జాహ్నవి.. ఆమె సంతోషంలో పసిపిల్ల కనిపిస్తూంది వాళ్ళకు.

“ఇప్పుడు దొరికింది అడ్రస్ మాత్రమే! నాన్న కాదు” మాలతి కఠినంగా అంది.

“ఇల్లు అలక గానే పండుగ కాదు.”

“మాలతీ! దాని ఉత్సాహం మీద నీళ్ళు జల్లకు” తాతగారి మందలింపుకు మాలతి మిన్నకుంది.

“జానమ్మా! పరీక్షలయ్యాక కదా, అని నేను తాతగారి దగ్గర అడ్రస్ తీసుకోలేదు.”

మళ్ళీ అన్నారు, “రేపు తీసుకుంటాలే!”

“థాంక్స్, తాతగారు, ఐ యామ్ వెరీ హ్యాపీ నౌ!” తాతగారి దగ్గరికి వచ్చి చెప్పింది.

ఆయన ఆప్యాయంగా జాహ్నవి తల పై చేయి వేసారు.

“ఆల్ ద బెస్ట్ రా, అమ్మలూ!” అన్నారు.

జాహ్నవికి పట్టు గొమ్మ దొరికినట్టుగా ఉంది.

అడ్రస్ తెలిస్తే నాన్నను ఎలా అయినా చేరుకోగలననే అమిత విశ్వాసం ఆమెలో.

తాతగారి నోటి వెంట “మీ నాన్న” అనే పదం ఎంత స్వీట్ గా ఉంది. ఎప్పుడైనా నాన్న అనే పదం విన్నదా, ఈ ఇంట్లో!

***

మాలతికి అర్థం కావట్లేదు. జాహ్నవి ఉత్తరాలు ఆనంద్‌ను కదిలిస్తాయా! అతను రమ్మంటే జానూ వెళ్ళి పోతుందా!

అది నా మీద ఏదో చెప్పి జానూ మనసు విరిచి వేయడు కదా!

ఆనంద్, ఆ స్టుపిడ్ దగ్గర ఎందుకు, హాయిగా ఇక్కడే చదువుకో అంటే ఏమి జరుగుతుంది?

అది తియ్యని మాటలతో జానూను తన వంకే తిప్పేసుకుంటేనో..

జానూ దూరం అయితే తాను బ్రతగ్గలదా!

జాహ్నవి స్కూల్ కెళ్ళాక మళ్ళీ తన భయాలన్నీ తాతగారి ముందు ఉంచింది.

“మాలా! అలా ఎందుకు జరుగుతుంది?” సహనం తెచ్చి పెట్టుకున్నారు.

“ద్వేషం, నాన్నా! నన్ను అలా ఏడిపించ వచ్చు కదా!” అంది.

“పిచ్చి మాలతి, అలాంటివి ఎప్పుడు జరుగుతాయి చెప్పు. పిల్లలు ఊహ తెలియని వయసులో ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ, జాహ్నవి పెరిగిన పిల్ల. దానికామాత్రం జ్ఞానం ఉంది” అన్నారు.

మాలతి అప్పటికి సమాధానపడింది. కానీ, ఆ వెంటనే మరో ఆలోచన.

కొన్నాళ్ళు పెంచాను, నువ్వంటే ప్రేమ అంటూ, జాహ్నవికి దగ్గర అవుతుందేమో!

ఎవరూ కూర్చున్న క్రిందకు నీళ్ళు తెచ్చుకోరు – రాధపిన్ని మాటలు గుర్తుకు వచ్చాయి.

నిజమే! అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు జానూ దానికి సవతి కూతురు. దాని భయం దానికి ఉంటుంది..

ఇలా అనుకున్నాక రిలాక్స్ అయ్యింది.

మళ్ళీ మరో ఆలోచన..

ఇప్పుడేమి జరుగబోతున్నది.

ఆనంద్ సమాధానం ఇస్తే.. జరిగేదేమిటి?

జాహ్నవికి తండ్రి ప్రేమ దక్కుతుంది. తన భయాలన్నీ పక్కన బెడితే ఆ ఆలోచన ఎంతో మధురంగా ఉంది.

పిచ్చి మొద్దు, గుండెల్లో ఎంత దిగులు దాచుకుందో! తనకు కూడా ఆ విషయంలో చాలా బాధనే ఉంటుంది.

మాలతి మనసు ఇంకా ముందుకు ఆలోచించమంటుంది. మళ్ళీ తమ బంధాలు మెరుగు అవుతాయా!

ఛీ, ఛీ, మాలతీ, నీ ఆత్మాభిమానం ఏమయ్యింది?

అలా రాజీ పడడానికేనా ఇన్నాళ్ళు ఏకాంత వాసం చేసావు? అంది లోపలి నుండి మనసు.

మాలతి స్టవ్ ఆఫ్ చేసి, పోపు వేయడానికి పెట్టిన ఇనుప గరిటె నలాగే వదిలేసి, హాల్లోకి వచ్చి కూర్చుంది.

తన మనసేమి అంటుందో, అది తనకే కొత్తగా ఉంది.

ద్వైదీభావాలు ముసురుకుంటున్నాయి.

విపరీతమైన సంఘర్షణ.

గుండెల్లో సన్నగా దడ..

రక్త ప్రసరణ వేగం హెచ్చింది. వళ్ళంతా నిస్త్రాణంగా ఉంది.

లేచి, టాబ్లెట్ వేసుకుంది.

కాస్త ఉపశమించాక మాలతి మళ్ళీ ఆలోచనల చేతిలో ఓడిపోయింది.

నువ్వేదో ఒకటి తేల్చుకునే దాకా నిన్ను వదలను అంటూ వెంబడి పడుతున్నాయి ఆలోచనలు.

తలకట్టు విప్పి, దువ్వెన చేతి లోకి తీసుకుంది మాలతి.

అద్దంలో చాలా కాలం తరువాత తనను తాను పరిశీలనగా చూసుకుంది.

ఎలా అయిపోయింది తను.

అవును, రాముడిని విడిచిన సీత ఎలా ఉంటుంది, ఒంటరితనం అనే రాక్షసుడి చేతుల్లో బంది అయ్యాక.

అతను రాముడిలా లేకున్నా తాను సీతనే.

మనసా, వాచా అతని భార్య గానే మిగిలి పోయింది. ఇది సత్యంగా సత్యం.

ఆమెకు తాను ఓటమిని అంగీకరిస్తోందేమో అన్న భయం కలిగింది.

తన ఆత్మాభిమానం కాల పరీక్షలో ఓడిపోకూడదు.

బెట్టుగా లాక్కొస్తోన్న తనను ఇప్పుడు.. ఇప్పుడు.. జానూ మళ్ళీ ఆనంద్ పేరు తెస్తూ..

తాతగారు పిలవడంతో మాలతి ఆలోచన అక్కడికి ఆగింది.

***

భూషణం గారికి తెలిసిన వారికి తెలిసిన వారి ద్వారా ఆనంద్ ఇంటి అడ్రస్ లభిచించింది.

ఓ నిధి దొరికినంతగా సంబర పడిన జాహ్నవి, ఇటు చదువుకు న్యాయం చేస్తూనే అటు తన జీవితాశయానికి మొదటి ప్రయత్నం ఆరంభంచింది.

ఓ తెల్ల పేపర్ తీసుకొని ఇలా వ్రాయడానికి ఉపక్రమించింది.

“నాన్నా!

ప్రియమైన, ప్రియాతి ప్రియమైన అనను. ఎందుకంటే ప్రాణప్రదమైన అనాలి కనుక.

నాన్నా, ఎలా ఉన్నారు?

మిమ్మల్ని చూడాలని ఉంది.

నా ఫ్రెండ్స్ అందరికీ నాన్న ఉన్నారు. మాతో మాత్రం నాన్న లేరు.

ఇది నేను చిన్నప్పటి నుండి అనుభవిస్తూన్న వేదన.

గతం గతః అన్నారు. పాస్ట్ ఈజ్ పాస్ట్.

ఇప్పటికైనా నాకు మిమ్మల్ని చూడాలని ఉంది. అందరూ వేసవి సెలవుల్లో అమ్మమ్మల ఊరు వెళతారు. నాకు సెలవుల్లో మీ దగ్గరికి రావాలని ఉంది. నా జీవితంలో కొన్ని అనుభూతుల నైనా నాన్న అనే బంధంతో ముడి వేసుకొని, మురిపెంగా దాచుకుంటాను. అనుమతి ఇస్తారు కదూ!

ఎప్పటికి మీ ప్రేమ కోసం తపించే

మీ కూతురు – జాహ్నవి.

వ్రాయడంలో తెలుగు పదాలు బరువైన దగ్గర ఆంగ్లాన్ని సహాయంగా తీసుకుంది.

మళ్ళీ ఓసారి సరి చూసుకుంది.

మాలతికి తెలిసేలాగ, తాతగారితో లెటర్ పోస్ట్ చేసి వస్తానని చెప్పింది.

నాన్నకు మురిపెంగా మొదటి ఉత్తరం వ్రాసిన జాహ్నవి, ఆ తర్వాత చదువు లోకంలో మునిగి పోయింది.

తాను నాన్నకు ఉత్తరం వ్రాసానన్న నిజం ఆమెకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నిజం, తను నాన్నకు చేరువ అవుతూంది. కలల లోకంలో జాహ్నవి..

***

ఎగ్జామ్స్ డేట్‌కు మరింత ముందుకు ఉరికింది కాలం. జాహ్నవి మరింత సీరియస్‌గా స్టడీస్‌లో మునిగిపోయింది. అయినా, స్కూల్ నుండి వస్తూన్నప్పుడు, టీనాను కలిసి వస్తానని, క్రిందకు వెళ్ళి లెటర్ బాక్స్ చూసుకుంటూనే ఉంది.

తాతగారు కూడా జాహ్నవికి తీపి కబురు చెప్పాలని వాకింగ్ నుండి వస్తూ లెటర్ బాక్స్ చూస్తూనే ఉన్నారు.

మాలతి అన్నీ గమనిస్తూ మిన్నకుంది.

ఏదో అపరాధ భావం ఆమెలో..

ఇస్త్రీ తిప్పిన స్కూల్ యూనిఫామ్ జాహ్నవి గదిలో పెట్టేందుకు వెళ్ళింది. స్కూల్‌కు వెళ్ళే తొందరలో కంప్యూటర్ ఆఫ్ చేయనట్టుంది.

స్క్రీన్ మీద ఆనంద్‌ను చూసి నివ్వెర పోయింది.

తండ్రి పై ఎంత ధ్యాస పెట్టుకుంది ఈ పిల్ల.

దీనికి అసలు ఫోటో కూడా దొరకనివ్వలేదే! ఇది ఎలా సాధ్యం?

మాలతికి మరునిముషం మనసంతా ఏదోలా అయ్యింది.

“జానూ! సారీ, జానూ! నీ కోసం, కేవలం నీ కోసం అయినా, మేము ఇలా విడి పోవాల్సింది కాదు.”

తాము విడి పోలేదు. కలిసి లేరు, అంతే..

ఆమె కనుకొలుకుల్లో నీళ్ళు నిలిచాయి.

పిల్లలకు ఒక ఊహ వచ్చాక, వాళ్ళలో ఇలాంటివి ఎంత మనస్తాపం కలిగిస్తాయో!

తల్లికి లేదా తండ్రికి దూరం అయిన పిల్లల మనసుల్లో ఆ అపశృతి రాగం అంతర్లీనమై వినిపిస్తూనే ఉంటుంది.

మాలతి ఆనంద్ వంక చూస్తూ దిగమింగుకున్న దుఃఖంతో వెను తిరిగింది.

కూతురికి తనపై గల ప్రేమతో కంప్యూటర్‌లో బంధింపబడిన ఆనంద్, తన ఫార్మాసిటీ కంపెనీ పనిపై బయట దేశం వెళ్ళి వారం రోజుల తర్వాత ఆ రోజే వచ్చాడు. తనకు ఇన్ని రోజులుగా వచ్చిన మెయిల్  చెక్ చేసుకుంటూంటే  వాటి మధ్య కనిపించింది తెల్ల రంగు కవర్. ఇన్నేళ్ళకు పలకరింపుకు వచ్చిన ఆత్మ బంధువులా – ఆ కవర్.. అతని చేతు ల్లోకి వచ్చింది.

ఫ్రమ్ అడ్రస్ లేక పోవడం వల్ల ప్రశ్నార్థకంగా చూస్తూ జాహ్నవి అంతరంగ తరంగమై ఉబికి వస్తూన్న ఆ ఉత్తరాన్ని ఒకసారి చదివాడు. భృకుటి ముడిచి మళ్ళీ చదివాడు. మళ్ళీ కూడా చదివాడు.

ముఖం గంభీరంగా మారి పోయింది.

నిశ్చలమైన కొలను లో రాయి విసిరినట్టు,ఆ ఉత్తరం రేపిన అలజడి ఏమిటో కానీ, నిండైన చేయెత్తు ఆ విగ్రహం ప్యాంటు జేబుల్లో చేతులు దూర్చి, అసహనంగా పచార్లు మొదలు పెట్టింది.

(ఇంకా ఉంది)

Exit mobile version