ఎంత మధురం…. ఎంతెంత మధురం

0
3

[box type=’note’ fontsize=’16’] జీవితంలో సంభవించే తొలిసారి ఘటనలు ఎంత అందంగా ఉంటాయో, కాలక్రమంలో అవే మధురమైన జ్ఞాపకాలుగా ఎలా మారుతాయో చెబుతున్నారు శ్రీధర్ చౌడారపుఎంత మధురం…. ఎంతెంత మధురం” కవితలో. [/box]

[dropcap]మొ[/dropcap]క్క వేసిన మొట్టమొదటి ఆకు
మెల్లగా విచ్చుకొంటోన్న సిగ్గుల తొలిమొగ్గ
వయ్యారంగా వికసిస్తోన్న తొలకరి జల్లులాంటి పువ్వు
ఆకుల నీడల్లోంచి తొంగిచూస్తున్న తొట్టతొలిపిందె
చూస్తుంటే ప్రకృతి ఎంత మధురం

కొత్తవాసన వేస్తోన్న స్కూల్ యూనిఫాము
కాళ్ళను కట్టేసుకున్న కొంగొత్త బూట్లు పైతాబులు
శ్రీకారంతో పలకరిస్తోన్న అక్షరాభ్యాసం పలక
వీపెక్కిన రంగుల బొమ్మల కొంగొత్త స్కూల్ బ్యాగు
తాకుతుంటే బాల్యమెంత మధురం

కొత్తదెబ్బలు తినిపించిన బెల్ బాటమ్ ప్యాంటు
మొదటిసారి నెత్తినెక్కిన కళాశాల హిప్పీకటింగ్
వంటిని వణికించిన చల్లదనాల ఏ.సి సినిమాహాలు
తిప్పలుపడి రాసిన తప్పుల తడకల తొలి ప్రేమలేఖ
తలచుకుంటే యవ్వనం ఎంతంత మధురం

పోస్టుమ్యాను అందించిన మొట్టమొదటి కాల్ లెటర్
అరచేతి చెమటల గుండెల్లో దడల తొలి ఇంటర్వ్యూ
ఆనందంలో ముంచేసిన మొదటి ఉద్యోగపు ఉత్తర్వు
అమ్మ చేతికందించిన మొదటినెల జీతం

జ్ఞాపకంగా మరువలేనంత మరువంలాంటి మధురం
కొంటెచూపుల కళ్ళుకలిపిన కొత్త పెళ్లికూతురు
తాళికట్టేవేళ తాకిన మెత్తనైన తన హాయైన తొలిస్పర్శ
ముద్దుముద్దుగ ముద్దాడిన తీయనైన తొలిముద్దు
మాటలేమీ లేక మధురగీతమైపోయిన తొలిరేయి
సాగిపోయిన సరసమెంతెంత మధురం

ప్రసూతిగదిలోంచి వినిపించిన పాపాయి తొలికేక
పొత్తిల్లలో కదిలే పాపాయి మెత్తనైన మొదటిస్పర్శ
“మ్..మ్..మ్మ మ్మ… అమ్మా” అన్న మొట్టమొదటి మాట
పడిలేచి నిలబడ్డ పాపాయి తడబడిన అడుగులు
తీయనైన సంసారం తరగనంత మధురం

కాలచక్రం గిర్రుగిర్రున తిరిగి నంతవరకు
తలచుకుంటూ పోతే ఎన్నెన్ని జ్ఞాపకాలు
తవ్వి తీసుకుని పంచుకుంటూ పోతే
మధుర మధుర మృదు మధురాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here