Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-9: ఎంత మంచివాడో…

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]“మ[/dropcap]న రాజారాం బాబాయి మూడో అల్లుడు ఎంత మంచివాడో!”

ఈ మాట నేను రాజారాం బాబయ్య కూతురు పద్మ పెళ్ళి చేసినప్పట్నించీ వింటున్నాను. పద్మ పెళ్ళయి నాలుగేళ్ళు దాటింది. అప్పట్నించీ చుట్టపక్కాల్లో ఈ మాట బాగా వినిపించింది. ఇదిగో, ఇప్పుడే మా నరసింహం బాబాయి కూతురి పెళ్ళికి వచ్చినప్పుడే పెళ్లైన ఇన్నేళ్ళ తర్వాత పద్మని నేను చూడడం. అందుకే చూడగానే రెండు చేతులూ పట్టేసుకుని నా ఆనందాన్ని ప్రకటించేసేను.

“ఎలా ఉన్నావే” అంది పద్మ.

“నా సంగతి కేంలే.. పెళ్ళై వెళ్ళేక నువ్విదే కనపడ్డం. మీ ఆయన చాలా మంచివాట్ట కదా! అదృష్టవంతురాలివే..” అన్నాను నిండు మనసుతో.

“నా మొహం అదృష్టం…” అంది అది నిట్టూరుస్తూ..

“అదేంటే అలాగంటావూ! మీ ఆయన మంచివాడూ, మర్యాదస్తుడూ, నెమ్మదస్తుడూ అని అంతా కోడై కూస్తున్నారు కదే!” అన్నాను ఆశ్చర్యంగా..

“లక్ష్మక్కా, కాసేపు ఎక్కడైనా విడిగా మాట్లాడుకుందామా” అంది పద్మ.

“అంతకన్నానా…” అంటూ పక్కనున్న వరండా వైపు తీసికెళ్ళేను దాన్ని.

“ఊ, చెప్పు…” అన్నాను ఆత్రంగా.

“ఏం చెప్పమంటావు లక్ష్మక్కా. మా ఆయన మంచివాడే కాదు చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే అందరూ అది లోకువగా తీసుకుని ఆయనతో ఆడుకునేంత మంచివాడు..” అంది.

ఇదేం తిరకాసు. మంచివాడంటూనే అదేదో బాధపడిపోతున్నట్టు మాట్లాడుతుందీ.. అనుకుంటూ, “కాస్త అర్ధమయ్యేలా చెప్పవే తల్లీ…” అన్నాను. నెమ్మదిగా చెప్పడం మొదలెట్టింది.

“మా ఆయన సిగరెట్ కాల్చడు, తాగడు, నన్ను తిట్టడు, బైట తిరగడు, ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి. కానీ మరీ అతి మంచితనం… అంటే ఫరెగ్జాంపుల్ ఎవరైనా వచ్చి ఎవరిదైనా ఇంటి అడ్రస్ అడిగారనుకో, మనం ఏం చేస్తాం… తెలిస్తే చెపుతాం, లేకపోతే తెలీదండీ అంటాం… అంతే కదా… కానీ ఆయనలా కాదు… వాళ్లని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి, మంచినీళ్ళిచ్చి, ఆ అడ్రసు కాగితం ఈయనుచ్చుకుని, వాళ్ళక్కావల్సిన ఆసామీ ఎందులో పనిచేస్తున్నాడో కనుక్కుని, ఆ ఆఫీసులో తనకి తెలిసినాయనకి ఫోన్ చేసి, వివరాలు కనుక్కుని, వీళ్లని తీసికెళ్ళి స్వయంగా ఆ యింట్లో దింపి వచ్చేంత మంచివాడు…” ఆవేశంగా చెప్తున్న పద్మ మాట తడబడింది.

“పోనీలెద్దూ, ఏదో సాయం చేసే గుణం ఓ పిసరు ఎక్కువుందేమో… దానికే అంత బాధెందుకే…”

“అయ్యో, అదొక్కటే అనుకునేవు… ఎవరితోనూ గట్టిగా మాట్లాడడు. అందరినీ అమ్మా, బాబూ అని బతిమాలినట్టు మాట్లాడతాడు. ఆఖరికి పనివాళ్లతో కూడా. ఇది అలుసుగా చేసుకుని పనివాళ్ళు పని సరిగ్గా చెయ్యరు. అదేమిటని గట్టిగా అడిగిన నేను వాళ్ల దృష్టిలో రాక్షసిని అయిపోయేను. పనివాళ్ళ మాట అటుంచు. ఆయన అన్నా, తమ్ముడూ కూడా ఈ అతిమంచితనాన్ని బాగా కేష్ చేసుకున్నారు…” దుఃఖంతో దాని గొంతు బొంగురుపోయింది.

ఆశ్చర్యంగా చూస్తున్న నన్ను చూసి, “అవునే, ఇద్దరూ కలిసి ఈయన వాటా కూడా రాయించేసుకున్నారు. ఈ అతి మంచిమగాడు వాళ్ళు పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టేసేడు.”

 “అదేంటీ, వాళ్లని అంత నమ్మి చదవకుండా సంతకం పెట్టేడా?” అన్నాను ఆశ్చర్యంగా.

“హు, అలా జరిగినా బాగుండును. అన్నీ తెలిసే సంతకం పెట్టేడు..” నాకేంటో గందరగోళంగా అనిపించింది.

“మరి నువ్వు అడగలేదా?”

“అడక్కేం, అడిగేను. అన్నయ్యకి జీతం తక్కువ, పిల్లలని గట్టెక్కించాలంటే పాపం సంతకం పెట్టేసేను..” అన్నాడు.

“మరి, తమ్ముడి కేవన్నాడూ?”

 “అదీ అడిగేను. మీ తమ్ముడిది పెద్ద ఉద్యోగవే కదా, మీది అతనికెందు కిచ్చేసేరూ! అని” “ఏవన్నాడూ?”

“హూ, ఏవంటారూ! తమ్ముడు చిన్నవాడూ, ఆఖరివాడూ కనక న్యాయంగా వాడికి ఎక్కువ ఇవ్వాలి కదా, అందుకని ఇచ్చేసేనూ… అన్నాడు..”

నాకు కోపంలాంటిది వచ్చేసింది. “దీన్ని మంచితనం అనరు, చేతకానితనం అంటారు” అన్నాను.

పాపం పద్మ కళ్ళు తుడుచుకుంటూ, “ఆఖరికి మా ఇంట్లో కూడా ఆయన చేతకానితనం నా చావు కొచ్చింది” అంది.

హడిలిపోయేను.. “అదేవిటే!” అంటూ.

“కాపోతే ఏంటి చెప్పూ, పండగకి అక్కచెల్లెళ్ళమందరం పుట్టింటి కెడతామా మా ఆయనకి ఇది కావాలీ అదొద్దూ అంటూ మా అక్కలిద్దరూ అన్నీ ఎంచక్కా చేయించుకుంటారు. కానీ మా పద్మ మొగుడు ఇది కావాలని ఏమీ అడగడూ అంటూ అమ్మానాన్న కూడా ఈయన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇంట్లో ఏదుంటే అది తినడానికి పెడతారు. ఏదుంటే అది కట్టుకోమని పెడతారు. పైగా మా పద్మ మొగుడు ఎంత మంచివాడో అని అందరి ముందూ ఓ మాటనేసి తప్పుకుంటారు. నువ్వే చెప్పు, బావలిద్దర్నీ ఒకలాగా, మా ఆయన్ని మరోలాగా చూస్తే నాకు బాధగా ఉండదూ. “ఏదైనా అడగండి మహానుభావా… అని ఈయనతో అంటే “తప్పు, పెద్దవాళ్లని ఇబ్బంది పెట్టకూడదూ, వాళ్ల ఆశీర్వచనాలే మనకి పదివేలూ” అంటాడీ మహానుభావుడు.

ఇదేదో కొత్తగా ఉందే అంటూ వింటున్న నేను “పోనీ, నువ్వే అడగొచ్చుకదే బాబయ్యనీ, పిన్నినీ మీకేం కావాలో…” అన్నాను.

“ఆఁ… ఆ సంబరమూ అయింది. బావలకిచ్చినట్టే మా ఆయనకికూడా బట్టలు పెట్టండమ్మా… అన్న పాపానికి వాళ్ల దృష్టిలో నా మొగుడు మహానుభావుడూ, నేను బ్రహ్మరాక్షసినీ అయ్యేను…” అంది.

ఇదంతా వింటుంటే ఒక మంచిమనిషిని అందరూ వాళ్ల వాళ్ల లాభాల కోసం ఎంత బాగా వాడుకుంటారో తెలిసొచ్చింది. బాధ్యతలు నిర్వహించడం మంచిదే కానీ అంత మాత్రం చేత తమ హక్కుల్ని కూడా వదిలేసుకుంటారా ఎవరైనా! మంచివాణ్ణి చూస్తే మొత్తబుధ్ధీ అన్న సామెత పద్మమొగుడుకి సరిగ్గా సరిపోతుంది అనిపించింది నాకు.

“మరిప్పుడేం చేస్తావే! ఇలాగే ఊరుకుంటే రేప్పొద్దున్న నీకూ, పిల్లలకీ ఎలాగ?” అన్న నా ప్రశ్నకి “దానికి జవాబు చెప్తావనే కదా నీకిదంతా చెప్పింది. చెప్పు, ఇప్పుడు నేనేం చెయ్యాలో” అంది.

నిజమే. అదేదో సినిమాలో చెప్పినట్టు ఇదంత హరీబురీలా తేలే వ్యవహారం కాదు. చాలా చాలా ఆలోచించి, పద్మకి పనికొచ్చే సలహా ఇవ్వాలి. మీక్కూడా ఏమైనా తోస్తే కాస్త చెప్తారు కదూ!

Exit mobile version