Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-11: ఎంత పెద్ద బిజినెస్సో…

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]మా[/dropcap] మేనల్లుడు కిరణ్ ఈ మధ్యనే అమెరికా నుంచి మకాం ఎత్తుకుని ఇంక ఇక్కడే సెటిల్ అయిపోతానంటూ ఇండియా వచ్చేసేడు. “ఎన్నాళ్ళు పడుతుందిరా ఇక్కడ నీకు ఉద్యోగం రావడానికీ?” అనడిగేను నా సహజ ధోరణిలో.

“అసలు నేను ఉద్యోగం చెయ్యాలనుకోట్లేదు ఆంటీ, బిజినెస్ చేస్తాను” అన్నాడు ధీమాగా.

అసలే అమెరికా నుంచి కొత్తగా వచ్చేడు. బిజినెస్ అంటే మాటలు కాదు. ఏమేం లైసెన్సులు కావాలో, ఎంతమంది పర్మిషన్లు కావాలో పాపం ఇండియా సంగతి ఇంకా వీడికి తెలీదనుకుంటూ…

“ఇక్కడ అంత తొందరగా పర్మిషన్లూ అవీ దొరకవురా…” అన్నాను ముందు జాగ్రత్త చెపుతూ.

“ఏం పరవాలేదు ఆంటీ… అవన్నీ మా ఫ్రెండ్ సురేష్ చూసుకుంటాడు” అంటూ సురేష్‌ని పరిచయం చేసేడు కిరణ్.  చెప్పొద్దూ, ఆ సురేష్ బలే కలివిడైన కుర్రాడు. మహా చురుకైనవాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకంలా కనిపించేడు. ఇహనేం… నా బెంగ సగం తగ్గింది.

“ఇంతకీ ఏం బిజినెస్ చేద్దామనీ…” అనడిగేను.

“అదే సర్వే చేస్తున్నాం ఆంటీ. ఇప్పటిదాకా మా సర్వేలో తేలిందేంటంటే ఒక్క ఫుడ్ బిజినెస్‌లో మటుకు నూటికి అయిదొందలు లాభం కనిపిస్తోంది. మూడొంతులు దానికే సెటిల్ అయిపోతాం” అన్నసురేష్ మాటలకి నా కడుపు నిండిపోయింది. అంటే మావాడు ఫైవ్ స్టార్ హోటల్ పెట్టేస్తాడన్న మాట. ఎంతైనా అక్కడ్నించి డాలర్లు బాగానే పోగేసుకుని వచ్చుంటాడు.

ఇహనేం… ఇంక నా ఫ్రెండ్స్ సర్కిల్లో నా ప్రెస్టీజ్ ఎంత పెరిగిపోతుందీ… ఒక సెలిబ్రిటీ ఆ ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభోత్సవం చేస్తున్న దృశ్యం నా కళ్ళముందు ప్రత్యక్ష్యమైంది. ఆ రోజున  హైహీల్స్ టకటకలాడించుకుంటూ, బాబ్డ్ హెయిర్ గాలికి అల్లల్లా కదులుతుంటే, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టుకుని, డిజైనర్ శారీలోని కుందన్స్ వజ్రాల్లా మెరుస్తుంటే, ఆన్‌లైన్‌లో తెప్పించుకున్న అందమైన పౌచ్ నాజూగ్గా చేతిలో ఉంచుకుని, “హాయ్” అంటూ ఇంగ్లీషు తప్ప తెలుగు రానట్టు మాట్లాడుతూ, ఫలానా ఫైవ్ స్టార్ హోటల్ వీళ్ళ మేనల్లుడిదే అని నన్ను చూపించి అందరూ చెప్పుకుంటుంటే, స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్న నన్ను నేను ఊహించుకుని మురిసిపోయేను.

“మరి ఎప్పుడు ప్రారంభిస్తారూ…” ఆత్రంగా అడిగేను వాళ్లని.

“ఇదిగో, లొకేషన్ చూసుకుంటున్నామాంటీ… బిజినెస్ బాగుండాలిగా…” అంటూ వాళ్ళిద్దరూ లొకేషన్ వేటలో పడ్డారు. పాపం. చిన్నపిల్లలు. మొత్తం అంతా నెత్తిమీదెక్కడ పెట్టుకుంటా రనుకుంటూ, నాకు తెలిసిన మంచి లొకేషన్లు, హై టెక్ సిటీ, బంజారాహిల్స్, జూబిలీ హిల్స్ లాంటివాటి పేర్లు నా శక్తి కొద్దీ చెప్పేను.

నెలైంది. రెండు నెలలైంది. ఎక్కడ పెడుతున్నారర్రా అంటే ఇదిగో, చూస్తున్నాం అదుగో చూస్తున్నాం అంటారు తప్పితే ఏ సంగతీ తేల్చరే. ఎంతసేపూ ఆ లాప్‌టాప్ ముందెట్టుకుని మ్యాపులు చూసుకోడవే తప్పితే ఎంతకీ నోరిప్పరే. మళ్ళీ వాళ్ళెక్కడ వ్యవధానం లేకుండా ఆ హోటల్ ఓపెన్ చేసేస్తారోనని నా బాధ నాది.

అందుకే వాళ్ళిద్దర్నీ కూర్చోబెట్టి చెప్పేను. “ఇదిగో, పిల్లలూ, మీకు అనుభవం లేదూ, ఇలాంటి వాటికి సెలిబ్రిటీలని పిలిస్తే మీ బిజినెస్ బాగుంటుందీ. వాళ్ళని పిలవాలంటే మనం బాగా నాలుగైదు నెలల ముందైనా ప్రోగ్రామ్ వేసుకోవాలీ, అందుకని హోటల్ ఎప్పుడు ఓపెన్ చెయ్యాలో పండితుల్నడిగి ఇప్పుడే ఓ డేట్ అనుకుంటే బాగుంటుందీ…” అని. ఔను మరి… నా డిజైనర్ శారీ పైకి బ్లౌజ్ కుట్టడానికి ఆమాత్రం టైమ్ కావద్దూ!

నా మాటలకి వాళ్ళిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుని “అలాగే ఆంటీ, మీకు ముందే చెప్తాం” అని హామీ ఇచ్చేరు. అలా హామీ ఇచ్చి కూడా నెలైంది. మళ్ళీ వాళ్ళని కదిపేను. ఇప్పుడు నేనింకా సంతోషించే మాటింకోటి చెప్పేరు. “ఒక్కచోటే కాదాంటీ. మేం సిటీలో నాలుగయిదు చోట్ల ఒక్కసారే పెడదామనుకుంటున్నాం” అన్న వాళ్ళ మాటలకి నాకు గంతులేయాలన్పించింది. అంటే చెయిన్ హోటల్స్ అన్నమాట. ఇహనేం… అనుకుంటుంటే ఒకరోజు పొద్దున్నే ఇద్దరూ “రేపట్నించే మొదలెడుతున్నాం ఆంటీ…” అంటూ శుభవార్త మోసుకొచ్చేరు. నాకు ఒక్కసారిగా కాళ్లకింద నిప్పులేసుకున్నట్టయింది. మరి నా ప్లాన్స్ అన్నింటికీ టైమేదీ..

“ఇదేంటర్రా… అసలు మీరు రెస్టరెంట్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారూ!”

“నాలుగుచోట్ల ఆంటీ. ఒకటి కోఠీ మెడికల్ కాలేజి దగ్గర, ఇంకోటి నారాయణగూడా తాజ్ వెనక, మరోటి ఉస్మానియా యూనివర్శిటీ పక్కన, ఆ మరోటి సికిందరాబాద్ స్టేషన్ పక్క సందులో…” అన్నాడు సురేష్ గుక్క తిప్పుకోకుండా.

“వార్నాయనో… ఇన్నిచోట్లా ఒక్కసారే… మరి చెఫ్ లని ఎప్పుడు మాట్లాడేరూ”

“చెఫ్ లెందుకాంటీ”

“మరి రెస్టరెంట్ లో ఎవరు వండుతారూ!”

“రెస్టరెంట్ కాదాంటీ. మేమీ నాలుగు చోట్లా నాలుగు టిఫిన్ బండిలని పెడతాము. అవి అక్కడ ఆ లొకాలిటీ వాళ్ళందరికీ పొద్దున్న ఇడ్లీ, దోశా, వడ, పూరీ వేడివేడిగా చేసిస్తారు. అదే బండి మళ్ళీ సాయంత్రం అయిదింటికి మిరపకాయ్ బజ్జీ, మైసూర్ బోండా, మసాలావడ లాంటివి చేస్తారు. ఈ మిర్చీబండీల కున్న డిమాండ్ మరింక ఏ బిజినెస్‌కీ లేదు. లాభాలు కూడా అలాగే ఉంటాయి. షాప్ అద్దె కట్టక్కర్లేదు, రోడ్డు పక్కన పెట్టేసుకోవచ్చు, షాప్ లేదు కనక మెయింటనెన్స్ అఖ్ఖర్లేదు, ఆ డబ్బు ఆదా… ఎవరి పర్మిషనూ అఖ్ఖర్లేదు, ఏ విధమైన పబ్లిసిటీ అవసరం లేదు. దీనికోసం ట్రైనింగ్ అయిన చెఫ్‌లు కూడా అఖ్ఖర్లేదు. ఎవరైనా చేసెయ్యొచ్చు. అందుకే నలుగురు కూలీల్ని మాట్లాడేం. ఓ రెండురోజులు నే దగ్గరుండి చెప్తాలెండి. వాళ్ళే నేర్చేసుకుంటారు… బజ్జీ లెయ్యడ మేవన్నా బ్రహ్మవిద్యా! అతి తక్కువ పెట్టుబడితో, మినిమమ్ మెయింటనెన్స్‌తో అత్యధిక లాభాలు వచ్చే వ్యాపారం రోడ్డు పక్కన మిర్చీబండే.. అందుకే ఇన్ని సర్వేలూ చేసి దానికే సెటిలయిపోయేమాంటీ…” అని చెప్తున్న సురేష్ మాటలు వింటున్న నాకు నోట మాట రాలేదు.

అతన్నేమీ అనలేక నా మేనల్లుడిని అడిగేను.

“అయినా అమెరికా నుంచొచ్చేవ్… శుచీ శుభ్రం చూసుకోకుండా నువ్విలా రోడ్డు పక్కన అమ్మకాలు పెట్టడమేవిట్రా…”

“ఏం పరవాలేదాంటీ.. ఇండియాలో ఏ మురిగ్గుంట పక్కన ఈ బళ్ళు పెట్టి అమ్మినా సరే బిజినెస్ బ్రహ్మాండంగా అయిపోతుంది. అయినా ఇండియాలో జనాలకి అంత తొందరగా జబ్బులు రావాంటీ” అన్నాడు వాడు.

“అలా రోడ్డు పక్కన బళ్ళు పెడితే గవర్నమెంటు ఊరుకోదు. కేసు బుక్ చేస్తే వెళ్ళి జైల్లో పడతారు.”

నా మాటలకి పడీపడీ నవ్వేరు వాళ్ళిద్దరూ. “ఎవరి కెంతెంత ఇవ్వాలో అన్నీ మాట్లాడేసుకున్నామాంటీ. అందుకే ఇన్ని రోజులు పట్టింది. ఎంత గొప్ప బిజినెస్సో తెల్సా… రోజూ పొద్దున్నా, సాయంత్రం ఒక్క రెండుగంటలు అలా నాలుగు బళ్ళూ చుట్టేసి, చూసుకు వచ్చేస్తే చాలు, వందకి అయిదువందలు లాభం…”

నేను అవాక్కాయ్యేను. ఏవిటీ పిల్లలు… ఒక సివిక్ సెన్స్ లేదు, జనాలు అనారోగ్యం పాలవుతారేమోనన్న బెంగ లేదు, పోలీసులు పట్టికెడతారన్న భయం లేదు, ఎవడెలా పోతేనేం ఎలాగోలాగు నాలుగు డబ్బులు సంపాదించేసుకుంటే చాలు అనుకుంటున్న ఈ పిల్లలు ఇలా తయారవడానికి కారణం ఎవరు?

ప్రభుత్వమా, వ్యవస్థా, సులభంగా డబ్బు సంపాదించెయ్యాలనే అత్యాశా, బాధ్యత లేకపోవడమా, నన్నెవరేం చేస్తారన్న ధీమానా…

ఈ అతి తెలివి పిల్లల్ని చూసిన నా తల గిర్రున తిరిగిపోయింది.

Exit mobile version