అంతరాలను చెరిపేసే విద్య : “ఎంతెంత దూరం”

1
2

[dropcap]ఈ[/dropcap] వారం ఎందుకో తెలుగు లఘు చిత్రం చూడాలనిపించింది. ప్రతి వారం హిందీవే చూస్తున్నాను కాబట్టి. నా చేతికి వేణు నక్షత్రం గారి “ఎంతెంత దూరం” వచ్చింది. చూశాను. ఏదన్నా ప్రాజెక్టు గురించి ప్రభుత్వం తీసే డాక్యుమెంటరీలు చాలా చూసి వుంటాము. కాని ఇది ఇంకాస్త ముందుకెళ్ళి విషయంతో పాటు దర్శకుడి నైపుణ్యాన్ని కూడా ఫోకస్ లోకి తెస్తుంది.

కథ సామాన్యమైనదే. ఒక పల్లెలోని జంట. భర్త ముత్తయ్య (భూపాల రెడ్డి) “దొర” కి చాకిరీ చేస్తుంటాడు. తాగుడు బలహీనత. భార్య ఏ సీజన్ కి ఏ పని దొరికితే అది చేస్తూ సంసారం నెట్టుకొస్తుంది. కొడుకును మాత్రం పట్టుబట్టి బళ్ళో వేసి వుంటుంది. ఇప్పుడా కొడుకు ధనుంజయ (అంజిబాబు) ఇంటర్ లో 96శాతంతో పాసయ్యి సంతోషంగా ఇంటికొస్తాడు, ఆ వార్తా పత్రిక తీసుకుని. తల్లితో అంటాడు తను పట్నం వెళ్ళి ఇంజినీరింగు చదువుతానని. మంచి మార్కులు వచ్చాయి కనుక చదువు ఖర్చు వుండదు, అప్పుడప్పుడు ఇంటికి వచ్చివెళ్ళడానికి బస్సు కిరాయికి మాత్రం డబ్బు అవసరమవుతుంది అంటాడు. కాని తండ్రి వొప్పుకోడు, చదివితే మండలంలోనే చదువు, లేదంటే దొర దగ్గర పనికి పెడతానంటాడు. ఆ పగలు భార్య గుంటూరోళ్ళ దగ్గర మిరపకాయలు తెంపే పనికి వెళ్తుంది గాని, డబ్బుకు బదులు వాళ్ళు తవ్వెడు మిరపకాయలే ఇస్తారు. రాత్రికి ఆమె కూర వొండలేకపోతుంది. కొడుకు అలుగుతాడు, పాసైననాడు కూర కూడా దిక్కు లేదని. తండ్రి కసురుకుంటాడు. మర్నాడు దొర ముత్తయ్యను పిలిపించుకుని తన కూతురు ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసైన సందర్భంగా మిత్రులకి పార్టీ ఇస్తున్నాననీ, ఆ ఏర్పాట్లవీ చూడమని పురమాయిస్తాడు. అప్పుడు మాటల్లో తెలుస్తుంది దొర కూతురికి 76శాతం వచ్చిందనీ, తన కొడుకుకు చాలా మంచి మార్కులొచ్చాయనీ. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటాడు దొర. సంతోషంతో, గర్వంతో ఇంటికెళ్ళిన ముత్తయ్య కొడుకును దగ్గరికి తీసుకుని తన ఆనందాన్ని పంచుకుంటాడు, మెచ్చుకుంటాడు, తప్పకుండా పట్నం చదువులు చదివి సామాజికంగా ఎదగాలంటాడు. భార్య, ఇతరుల ముందు తను ఇక నించి తాగను అని మాట ఇస్తాడు.

నేను వ్రాసిన కథ చూసి ఇదివరకు వచ్చే ఫిలిం డివిజన్ చిత్రాల్లా ఉండొచ్చు అనుకోకండి. చాలా కంట్రోల్ లో తీసిన చిత్రం. సంభాషణల భారం తప్పకపోయినా, అవి మరీ ఎక్కువా లేవూ, నాటకీయంగానూ లేవు. నటన కూడా లో కీ లో వుంది. కొడుకును తిడుతూ కాల్చిన సిగరెట్టును పక్కన పడేస్తాడు ముత్తయ్య, అక్కడ అంతకుముందే మూడు మందు బాటిళ్ళు, కొన్ని సిగరెట్ పీకలూ వుంటాయి. ఇక వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అవీ ప్రేక్షకుడికి చెప్పాలి. వొక రాత్రి తాగి వచ్చి భార్యతో ప్రేలాపనలలోనే అన్ని చెప్పుకుంటాడు. ఇది మనకు విషయాన్ని తెలియజేస్తుంది, అలాగనీ లెక్చర్ లా వుండదు. కూతురి పెళ్ళికి కొంత పొలం అమ్మగా, కొంత పొలం అమ్మి బోరు వేసినా నీళ్ళు పడకపోగా, ఇంకొంత భూమి శ్రీశైలం కెనాల్ ప్రాజెక్టుకని ప్రభుత్వం తీసుకున్నా కెనాలూ రాక, నీళ్ళూ రాక చతికిల పడ్డ వైనం, అదే సమయంలో అప్పుల్లో కూరుకుపోయిన తోటి రైతు ఆత్మహత్య ఇవన్ని నాలు ముక్కల్లో చెబుతాడు. మరోలా చెప్పిస్తే నచ్చేది కాదేమోగాని, అతను తాగి చెప్పడం వల్ల అతని పరిస్థితులే కాకుండా అతని మనసు కూడా అర్థమవుతుంది. అతను కేవలం తాగుడుకే కాదు లొంగిపోయింది,తన ఆర్థిక పరిస్థితులకు కూడా. స్వతహాగా అంత కఠినుడు కాదు. ఇక ఆ దొర ఇల్లు మనం చూడం. అంతా అతని ఇంటి వాకిట్లోనే షూట్ చేయబడింది. బహుశా అప్పటికే దొరతనాలు పేరుకే మిగిలిపోయాయి అనుకోవాలి. తన నౌకరు కొడుక్కి తన కూతురి కంటే ఎక్కువ మార్కులొచ్చాయని తెలిసి, ఎక్కడా చెప్పొద్దని వేడుకుంటాడు. ఆ పొగరు, అహంకారం ఏమీ కనబడవు; అతని మాటల్లోనూ, అతని “స్థితిమంతత్వం”లోనూ.

కథ, మాటలు, దర్శకత్వం అన్నీ వేణు నక్షత్రం గారివే. బాగుంది. సంభాషణలు తెలుగు మాండలికంలో సహజంగా ఉన్నాయి. భూపాల రెడ్డి నటన చాలా బాగుంది. అతని వాచకం, బాడీ లేంగవేజి, subdued acting అన్నీ బాగున్నాయి.తెలుగులో కొమరం భీం, దాసి చిత్రాలు, హిందిలో “పార్” అనే గౌతం ఘోష్ చిత్రం లో చేసిన నటుడే ఈ భూపాలరెడ్డి. మిగతా వాళ్ళు కూడా బాగా నటించారు. అంజిబాబుకి ఎక్కువ స్కోప్ లేదు. కాని, తండ్రి దగ్గర చదువు గురించి బతిమాలుకుంటున్నప్పుడు అతని హావభావాలు, మాటలూ బాగున్నాయి. కాని అతన్ని అంచనా వేయడానికది సరిపోదు.

ఈ సందర్భం లో ఇందిరా గాంధి మాటలు గుర్తుకొస్తున్నాయి. “Education is a liberating force, and in our age it is also a democratizing force, cutting across the barriers of caste and class, smoothing out inequalities imposed by birth and other circumstances.” ఈ మాటలను ప్రతిఫలిస్తుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here