“ఎందుకు?” తెగని ప్రశ్న : “ఎపిలోగ్”

0
2

[dropcap]గు[/dropcap]మ్మానికీ, తలుపుకీ మధ్య రెంటినీ కలుపుతూ వుంటుందే హింజ్ (కీలు). తలుపు తెరుచుకున్నప్పుడూ, మూసుకుంటున్నప్పుడూ అది తొంభై డిగ్రీల కోణంలో తిరగగలదు. అది దాని లిమిట్, చాలా మటుకు. మొట్ట మొదటి సీన్ లో కుర్చీలో కూర్చున్న నాడ్జా (ఐసిస్ క్రూగర్) తల అలా తిరుగుతుంది. చాలా నెమ్మదిగా. ఆ కదలిక కూడా చక్కగా కాకుండా జర్కీ ఫ్రేంస్ కదిలినట్టుగా వుంటుంది. నేపథ్యం లో కీచు లాంటి సంగీత ధ్వని, హారర్ చిత్రాల్లో లాగా. ఆ వెంటనే టైటిల్స్. లౌడ్ వాల్యూంలో సంగీతం, క్రమంగా తగ్గుతూ. బ్లాక్ స్క్రీ న్ వచ్చేటప్పటికి నిశ్శబ్దం. మరి లఘు చిత్రమంటే మొదటి సీన్ నే కీలకమైన విషయం, పరిసరాల పరిచయం, పునాది అన్నీ వేసెయ్యాలి కదా. స్క్రీన్ టైం ఎంతుంటుందని, ఒక్క ఫ్రేం అయినా వేస్ట్ చెయ్యడానికి.
ఇంతకీ సినిమా పేరు చెప్ప లేదు కదూ. ఇది “ఎపిలోగ్” అనే ఓ జర్మన్ లఘు చిత్రం. రెండే పాత్రలు. అతను (థామస్ వుల్ఫ్ ) ఆమె (ఐసిస్ క్రూగర్). భార్యా భర్తలో, ప్రేమికులో కావచ్చు. ఒక్కటే గది. బేసిక్ ఫర్నిచర్. ఓ మంచం, బెడ్ సైడ్ టేబల్, పుస్తకాల బీరువా, సింగల్ సోఫా, ఫోను, .. ఇంకా ఒకటో రెండో వస్తువులు.
టైటిల్ కాగానే ఎదురెదురు వున్న స్త్రీ పురుషుల ముఖాలు ఒకరినొకరు చూసుకుంటూ. ఇది ఒక వేగంగా వున్న ఫుల్ ఆర్క్ షాట్. ఇది కూడా రెండు సార్లు వస్తుంది. ఆమె ముక్కునుంచి రక్తం కారి వుంటుంది. కెమెరా కదలిక ఆగాక ఆమె కోపంగా అతన్ని వెళ్ళిపొమ్మంటుంది. అతను బలహీనంగా వున్నట్టు, మంచం మీద కూలబడతాడు. అతని కనుపాపలు కుడి యెడమల తిరుగుతున్నాయి. నెమ్మదిగా బెడ్ సైడ్ టేబల్ వైపు చూస్తాడు. లేచి సొరుగు లాగి అందులోంచి గన్ తీసి ఆమెను షూట్ చేస్తాడు. ఆమె కుప్పకూలిపోతుంది. అతనేమో వెర్రి చూపులు చూస్తూ ఆలోచిస్తాడు : నిజంగా నేనే నాడ్జాని కాల్చి చంపానా? ఎందుకు? నాటకాల్లో తెర పడుతుందే అట్లా పై నుంచి కిందకు నల్ల స్క్రీన్ దిగుతుంది. ఇదీ రెండు సార్లు ఉంటుంది.


మొదట్లో ఆమె తల కీలు లా తిరిగింది అన్నాను కదా. ఇప్పుడు ఇదే కథ మరో రకమైన కథనంలో. ఆమె కుర్చీలో అటు తిరిగి కూర్చుని ఫోన్ లో మాట్లాడుతుంటున్నది. అతను తలుపు తెరుచుకుని లోపలికొస్తాడు. గోడవారగా వున్న సింగిల్ సోఫా జరిగి అతని దగ్గరికొస్తుంది. అతను కూర్చుంటాడు. అతని రాక తెలీక ఆమె మాట్లాడుతూనే వుంటుంది రహస్య ప్రియుడితో. ఇక్కడి నుంచి కథ చెప్పను. మీరు చూడండి.
ఒక రిలేషన్‌షిప్ ఎందుకు చెడుతుంది? మనుషులు ఎందుకని మోసం చేస్తారు? మనుషుల మధ్య కమ్యూనికేషన్ ఎందుకు సవ్యంగా వుండదు? పరస్పర నమ్మకం స్థానే అనుమానాలు వగైరా ఎందుకుంటున్నాయి? ఇవన్ని సమాధానం లేని ప్రశ్నలే. ఆ జంటలోనే కాదు చాలా జంటల్లో వుండేదే. దాన్ని తనదైన పధ్ధతి లో చెప్పాడు దర్శకుడు, కథ-స్క్రీన్‌ప్లే రచయితా, సంగీతం ఇచ్చినవాడూ అయిన టాం టిక్వర్. ఇతను జెర్మన్ దర్శకుడు. “రన్ లోలా రన్”, “పర్ఫ్యూం” లాంటి చిత్రాలకు ప్రసిధ్ధం. ఇంతా చేసి 1992 లో తీసిన ఇది అతని రెండో చిత్రం. మొదటిది కూడా ఓ లఘు చిత్రమే “భెచౌసె” అనే లఘు చిత్రం, దీనికి రెండేళ్ళ ముందు తీసినది. సినిమాల్లోకి అడుగు పెట్టే ముందే అతనికి ఓ దర్శక మిత్రుడు సలహా ఇచ్చాడు, నీ జీవితంలోని అనుభవాల నుంచే కథలు సినిమాలుగా తీయి, ఉదాహరణకు నీకూ నీ గాళ్ ఫ్రెండు కీ మధ్య వచ్చే వాదనలు, గొడవలను జాగ్రత్తగా గమనిస్తూ. అదే చేసాడు ఈ రెండు చిత్రాలలోనూ.
కొన్ని సీన్లను రెండు సార్లు చూపించడం, కథనాన్ని తిరగేసి చెప్పడం, గదిలోని వస్తువులు తమంతట తామే కదలడం ప్రాణం లేని పాత్రలలాగా, ఇంకా ఒక సైకలాజికల్ కోణం. ఇవి ఇతని విశేషాలు. ఒక సీన్ ని తనే దృశ్యకల్పన చేసి తనే సంగీతం కూడా చేర్చితే ఎంత ప్రభావవంతంగా వుండగలదో మీరు ఈ చిత్రంలో చూడొచ్చు. సత్యజిత్ రాయ్ మొదట్లో గొప్ప సంగీతకారుల చేత పని చేయించుకున్నాడు. కాని త్వరలోనే ఆ పనికి స్వస్తి చెప్పి సంగీతం కూడా తనే ఇవ్వడం మొదలుపెట్టాడు. (ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి, ఎంతమంది వుంటారలా?). ఆయన చెప్పిన రెండు కారణాలు : ఇగో కారణంగా వాళ్ళు తన మాటను విని, అర్థం చేసుకుని, ఫాలో అవరు. వాళ్ళు ముందే శాస్త్రీయ సంగీతం, రాగాలూ ఆ వలయంలో నుంచే ఆలోచిస్తారు. వారు చేసినది తనకు తన ఫ్రేంస్ కి అతికినట్టు అనిపించదు, తృప్తి నివ్వదు. రెండోది తన మనసులో వున్నది ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం కంటే తనే చేసుకుంటే మెరుగ్గా వుంటుంది.
ఇక కెమెరా ఏంగల్స్, కెమెరా మూవ్‌మెంట్లు పరిశీలించదగ్గవి. ఎందుకంటే కెమెరానే కథా ప్రధాన కథకుడు కదా. ఫ్రాంక్ గ్రీబ చాయాగ్రాహకుడు. టాం టిక్వర్ చాలా చిత్రాలకు అతనే. బహుశా వాళ్ళ ఆలోచనల వేవ్ లెంత్ లు బాగా కలిసి వుంటాయి.
థామస్ వుల్ఫ్, ఐసిస్ క్రూగర్ ల నటన చాలా బాగుంది.
నేను ఈ శీర్షిక మొదలు పెట్టినప్పుడు కన్వెషనల్ రెవ్యూ లాగా మొదలు పెట్టాను. చాలా త్వరలో నాకే విసుగెత్తింది. ఆ తర్వాత ఇంకాస్త వివరంగా వ్రాయడం మొదలు పెట్టాను. ఒక సమీక్ష పూర్తి కథ చెప్పకూడదు, ఒక పాయింట్ తర్వాత ఎక్కువ చర్చించనూ కూడదు. అవన్నీ ఫిలిం స్టడీ లో భాగంగా వస్తుంది. కొన్నాళ్ళు అదీ చేసి ఇప్పుడు కథనే చెబుతూ నా అబ్జర్వేషన్స్ ఏమిటో వ్రాస్తున్నాను. ఇది కూడా విసుగు పుట్టేదాక ఇలాగే కొనసాగిస్తా. ముఖ్యం ఏమిటంటే మీతో నా సంభాషణ. అంతే.
ఈ చిత్రం యూట్యూబ్ లో వుంది. తప్పక చూడండి.
https://youtu.be/aBMcfsRCuYk

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here