ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికి ఆ ధోరణి

0
2

2015లో న్యూక్లియర్ డీల్ నుండి వైదొలగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్‍పై తిరిగి ఆంక్షలు అమలు చేస్తామని ప్రకటిస్తూ అయితే బేషరతుగా చర్చలకు వస్తే ఎప్పుడైనా తాము సిద్ధమేనని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ప్రతిగా ఇరాన్ విదేశాంగమంత్రి మహమ్మద్ జావేద్ షరీఫ్ – ఆంక్షలు, బెదిరింపులు వంటి హంగామాలు పనిచేయబోవని, ఎటువంటి పరిణామాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

చర్చలకు సిద్ధపడి అంగీకారానికి రాకపోతే ముందు ముందు ఇరాన్‍కు విపరీతమైన కష్టాలూ, ఇబ్బందులూ తప్పవనీ ట్రంప్ బెదిరించడం జరిగింది. గార్డ్స్ కమాండర్ జనరల్ మహమద్ ఆల్ జాఫరీ ఇరానియన్లు ట్రంప్‍ను కలుసుకోవటానికి ఆఫీసర్లను పురమాయించరనీ, ఇరాన్ నార్త్ కొరియా కాదనీ తిరుగు జవాబు చెప్పారు.

గతంలో-

వెనిజులా అధ్యక్షుడు విక్టర్ హ్యూగో ఛావెజ్ అయినా, లిబియా అధ్యక్షుడు కల్నల్‍ గడాఫీ అయినా, క్యూబా అధ్యక్షుడు కాస్ట్రో అయినా, ఇరాన్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అయినా, పాలస్తీనా అధ్యక్షుడు యాసర్ అరాఫత్ అయినా ఏ దేశపు అధినేత అయినా, నియంతా కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడి ఉండవచ్చుగాక, దేశ గౌరవం విషయానికి వస్తే మాత్రం ఏ నేతా రాజీపడిన దాఖలాలు లేవు, సంఘటనలూ లేవు.

అంతర్గత వివక్షలూ, నిరంకుశత్వాలూ, అణచివేతలూ ఉండి ఉండవచ్చుగాక, అంతర్జాతీయ సమాజం ముందు ఆయా దేశాలు సగర్వంగా తలెత్తుకుని నిలబడగలగడానికి కారణం – అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గి దాసోహం అవకపోవడమే. అదే అమెరికాకు కంటగింపుగా ఉండేది. లాటిన్ అమెరికాలో, గల్ఫ్‌లో చమురు నిక్షేపాలను కొల్లగొట్టుకొనిపోవడానికి అమెరికాకు ఆయాదేశాల అధినేతలు సహకరించలేదు సరికదా దశాబ్దాల తరబడి అమెరికాకు ఎదురొడ్డి (ఆంక్షల చట్రంలో ఇరికించబడి అష్టకష్టాలు పడుతున్నప్పటికీ) పోరాడి తమ దేశాల గౌరవాన్ని నిలబెట్టి తలెత్తుకొని నిలబడేలా చేసిన ధీశాలులు వారందరూ.

ప్రపంచ వాణిజ్య ఒప్పందం తరువాత సరళీకృత ఆర్థికవిధానాల నేపథ్యంలో – భారతదేశం, చైనా వంటి దేశాలు కూడా ఒకనాడు సమస్యగా భావించబడిన అధిక జనాభాయే విశాలమైన మార్కెట్లుగా, చవకయిన శ్రామికశక్తిగా/మానవ వనరుగా పారిశ్రామిక దేశాల దృష్టిని ఆకర్షించకముందు –

చమురు నిక్షేపాలను కొల్లగొట్టుకోవడమే వాటి ముఖ్య లక్ష్యం. అయినప్పుడు అమెరికా ఆంక్షలకు, అనంతరం దాష్టీకానికి బలైపోయిన ఆదేశాలు అంతటి సమర్థవంతమైన నాయకులతరం అంతరించిపోయిన కారణంగా బలహీనపడిపోయాయి. అనేక దేశాల్లో తిరుగుబాట్ల నెగళ్లను ఎగదోసి శాంతిప్రక్రియ పేరుతో సైనిక చర్యలు జరిపి అణ్వస్త్రాల తయారీ, రసాయనిక ఆయుధాలు వంటి అనేక సాకులతో తన సైన్యాన్ని అక్కడ స్థిరీకరించి బాంబు దాడులతో ఆయా దేశాల సంస్కృతి వారసత్వాలను, సమాజాలను ఛిన్నాభిన్నం చేసిన అమెరికా ఇప్పుడు శాంతిని ప్రభోదిస్తోంది. సైనిక చర్యల అనంతరం అక్కడ కొలువుదీరినవి కూడా అమెరికా ప్రభావానికి ఎదురొడ్డి నిలువగలిగిన స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు కావు. అయినా ఎన్నికల వాగ్దానం మేరకు సైన్యాన్ని వెనక్కు రప్పించాలంటే కొత్త పల్లవి ఎత్తుకోక తప్పని పరిస్థితి అమెరికా అధ్యక్షుడిది. ఆ కొత్త పల్లవిలోనే శాంతి ప్రబోధాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here