ఎప్పుడూ ఇంతే

0
2

[శ్రీ పి. రాజేంద్రప్రసాద్ గారు రాసిన ‘ఎప్పుడూ ఇంతే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సా[/dropcap]యంత్రం ఐదున్నర కావస్తూంది. ఇంటి ముందరి లాన్ లోని వాలు కుర్చీలో కూర్చుని ఉన్నాడు సుబ్బారావు. ఈవెనింగ్ వాక్‌కి వెళ్ళడానికి తోడువచ్చే మిత్రుడు రాజారావు గురించి ఎదురు చూస్తున్నాడు. అలా గేటు వైపు చూస్తూ ఉండగా ఒక ముసలాయన వంగిపోయి ఉన్నా వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళడం కనిపించింది. పీలగా, తలమీద పుంజీడు తెల్ల వెంట్రుకలతో అచ్చంగా అతనికి వాళ్ళ చిన్నప్పటి కామేశ్వరరావు తాతయ్య లాగే అనిపించి సుబ్బారావు చిన్నప్పటి జ్ఞాపకాలలోకి వెళ్ళాడు.

సుబ్బారావు చిన్నవాడిగా ఉన్నప్పుడు, అంటే ఊహ తెలిసీ తెలియని రోజుల్లో ఇంచుమించు ప్రతీవారమూ వాళ్ళ ఇంటికి వస్తూ ఉండే ఇద్దరు చుట్టాలు అతనికి బాగా గుర్తుండిపోయారు. వాళ్ళలో ఒకడు కామేశ్వరరావు తాతయ్య. సుబ్బారావు తల్లిగారికి మేనమామ. బ్రతికి చెడ్డవాడు. భార్యా,పిల్లలూ ఉన్నారో లేరో ఉంటే ఏమయ్యారో ఆ వయసులో సుబ్బారావుకి తెలియలేదు. వాళ్ళమ్మ కూడా అతనికి ఎప్పుడూ చెప్పలేదు. అదేమిటో ఆ తాతయ్య వచ్చినప్పుడెప్పుడూ వాళ్ళ నాన్నైతే ఇంట్లో ఉండేవాడు కాదు.

“అమ్మాయ్! అనసూయా! ఈ రోజు మీ ఇంట్లో ఒక ముద్ద తిని పోతానమ్మా!” అంటూ ఇంట్లో అడుగు పెట్టేవాడు కామేశ్వరరావు తాతయ్య.

ఆవిడ వెంటనే “అయ్యో! మావయ్యా! అమ్మా నాన్నా పోనే పోయారు. అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ లేనే లేరాయే. నువ్వుగాక ఎవరున్నారు? ఒక్కడివే ఆ రూములో ఎక్కడో ఉండకపోతే మా ఇంట్లోనే ఓ పంచన ఉండరాదూ. నా ముగ్గురు పిల్లలతో పాటు నాలుగో వాడివిగా ఉంటావు.” అంటూ భోజనం వడ్డించేది. ఆయన మొహమాటపడుతూ చాలా కొంచెంగా ఏదో తిన్నానన్నట్టుగా రెండు మూడు ముద్దలేమో తినేవాడు. ఇదంతా నిశితంగా గమనించే సుబ్బారావుకి ఆయన తినే భోజనం చూస్తే చాలా జాలి వేసేది. భోజనం చేశాక “అమ్మా! అనసూయా!” అంటూ లోగొంతులో ఏదో అభ్యర్ధిస్తూ నసిగేవాడు. ఆవిడ ఆ మాటకు నొచ్చుకుంటూ “అయ్యో! మావయ్యా! ఫరవాలేదులే!” అంటూ ఇచ్చిన తృణమో, పణమో పుచ్చుకొని వెనుతిరిగి చూడకుండా చక్కాపోయేవాడు. అతని దీనస్థితి చూసి అనసూయమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకునేది. చెప్పొద్దూ.. సుబ్బారావుకు కూడా చాలా బాధనిపించేది.

ఇక రెండో ఆయన సుబ్బారావు నాన్నగారివైపు ఏదో దూరపు చుట్టం. ఈయన ఏదైనా పని మీద సిటీకి వచ్చినప్పుడల్లా వీళ్ళ ఇంట్లోనే మకాం. సరిగ్గా అనసూయమ్మ వంట పూర్తి చేసే సమయానికి ఠంచనుగా వచ్చేవాడు. ఈయన ఒక్కడూ భోజనం చేస్తే ఆ ఇంట మళ్ళీ వంట చేసి తీరాల్సిందే. అయిదు వేళ్ళకీ ఉంగరాలూ, మెడలో గొలుసూ ఆయన స్థితిమంతుడని చెప్పకనే చెప్పేవి. ఆయన తినే తిండిని చూసి టన్నుడు తింటాడని పెద్దపిల్లలిద్దరూ ఆయనకు ‘టన్ను గారు’ అని నిక్ నేమ్ పెట్టారు. అంత డబ్బు ఉండీ ఆయన ఏ హోటలుకో వెళ్లకుండా వచ్చిన ప్రతీసారీ వీళ్ళ ఇంటికే వచ్చి ఉండిపోవడం అన్నదమ్ములెవ్వరికీ నచ్చేది కాదు.

ఈ రోజు, ఇన్ని సంవత్సరాల తరువాత సుబ్బారావుకి వాళ్ళిద్దరూ ఎందుకో అనుకోకుండా గుర్తుకొచ్చారు. నలభయ్యేళ్ళ మాట ఇది. ఈపాటికి ఇద్దరూ స్వర్గలోకంలో వారి వారి అభిరుచుల మేరకు భోంచేస్తూ ఉంటారు. ఆతడు అలాగ ఆలోచనల పర్వంలో ఉండగానే రాజారావు వచ్చాడు. సుబ్బారావు అంతటితో కుర్చీలోంచి లేచి “అలా వెళ్ళొస్తానోయ్!” అంటూ శ్రీమతికి చెప్పి సాయంకాలపు వ్యాహ్యాళికి బయలుదేరాడు. షికారు నుండి ఇంటికి రాగానే మరునాడు బ్యాంకుకి వెళ్లి ఫిక్సెడ్ డిపాజిట్‌ను రెన్యూ చేయించవలసి ఉందని గుర్తు చేసింది సుబ్బారావు భార్య.

***

బ్యాంకులో పని పూర్తయ్యింది. బయటికొచ్చి బండి తీసేంతలో “ఓయ్! సుబ్బారావూ! నువ్వేనా? ఎలా ఉన్నావు?” దాదాపు పరిగెట్టుకుంటూ వచ్చిన ఓ శాల్తీ పలకరించింది.

“ఎవరండీ మీరు?” అయోమయంగా అడిగాడు సుబ్బారావు.

“నేనురా! చలాన్ని! వీరేశలింగం స్కూల్లో నువ్వు ఎయిత్ బీ సెక్షన్. నేను ఎయిత్ ఏ సెక్షన్. మాత్స్ క్లాస్‌లో కలిసేవాళ్ళం. బులుసు వారమ్మాయ్ కూడా ఉండేది చూడు.” కన్నుకొడుతూ అన్నాడు అవతలి వ్యక్తి. సుబ్బారావుకి గుర్తు రాలేదు గాని మొహమాటంగా నవ్వాడు.

“నీకింకా గుర్తొచ్చినట్లు లేదురా! నిన్ను అంతా ఐరన్ లెగ్ అని ఏడిపించేవాళ్ళు కదరా!” అతగాడికి అప్పట్లో ఉన్న నిక్ నేమ్ గుర్తు చెయ్యగానే, ‘ఇక సందేహానికి తావులేదులే! నాకెందుకో పోలికలే అందడం లేదు’ అనుకున్నాడు సుబ్బారావు. అతగాడేమో మాటల మధ్యలో తను ప్రస్తుతం చెన్నైలో ఏదో ఫాక్టరీ పెట్టినట్టూ, ఆ బిజినెస్ పనిమీద బ్యాంకుకి ఎదురుగా ఉన్న ఫైవ్ స్టార్ హోటల్‌లో దిగినట్టూ, హోటల్ లోంచి బయటకు రాగానే సుబ్బారావు కనిపించగా ఇటు వచ్చినట్టూ చెప్పి తనని హోటల్‌కి ఆహ్వానించాడు. సుబ్బారావు తన దుస్తులు చూసుకుని ఫైవ్ స్టార్ హోటల్ లోకి వెళ్ళటానికి కొంచెం మొహమాటపడ్డాడు. పైకి “హోటల్ కి ఎందుకులేరా! మా ఇంటికి వెళదాం. ఇంటి భోజనం చేద్దువుగాని!” అన్నాడు ఫ్రెండుతో.

ఇద్దరూ చిన్నప్పటి కబుర్లలో పడ్డారు. చలం అని పిలవబడే శేషాచలాన్ని తన యాక్టివా మీద ఇంటికి తీసుకెళ్లాడు సుబ్బారావు. తన కొడుకునీ కూతుర్నీ పరిచయం చేశాడు. “అరె! నాక్కూడా ఒక కొడుకూ, కూతురూ. నీకు లాగే కొడుకు పెద్దవాడు, అమ్మాయి చిన్నది. అబ్బాయి ఏం.బీ.ఏ చదివి నా తరువాత కంపెనీ పగ్గాలు పట్టడానికి రెడీగా ఉన్నాడు. అమ్మాయి డిగ్రీ అయ్యి ఖాళీగా ఉంది. మీ పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలే చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారని చెప్పావు. బాగుంది సుబ్బారావ్! వీళ్ళ గురించి మనం ఆలోచించాలి. వాళ్ళని ఒకళ్లకొకళ్ళకి పరిచయం చేద్దాం. మిగతా సంగతి వాళ్ళే చూసుకుంటారు. ఏవంటావ్?” కన్నుగీటాడు శేషాచలం. సుబ్బారావు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. సమాధానం ఏం చెప్పాలో తోచలేదు. చివరికి ఎలాగైతే గొంతు పెగల్చుకొని “నీ ఫోన్ నంబరూ అడ్రస్సూ ఇవ్వు చలం! ఈసారి చెన్నై వచ్చి నిన్ను కలుస్తాను.” అన్నాడు. “ఏదీ! నీ ఫోన్ ఇవ్వి. నా నెంబర్ ఫీడ్ చేస్తాను.” అంటూ సుబ్బారావు ఫోన్‌ను తీసుకుని లాక్ తీయమన్నాడు.

సుబ్బారావు ఫోన్ లాక్‌ను తీసిన ఒక నిమిషానికి ‘బీప్!బీప్!’ మంటూ ఒక ఓటీపీ వచ్చింది. ఏమిటా అని సుబ్బారావు చూసేలోపులో “ఏదీ! అదేమిటో నన్ను చూడనీ!” అంటూ సుబ్బారావు చేతిలో ఫోన్ తీసుకున్నాడు చలం. ఒకసారి పరిశీలనగా చూసి “ఇదేదో స్పామ్ నంబరు లే! నీ ఫోన్‌కి రింగ్ ఇస్తున్నాను చూడు!” అంటూ తనే చొరవగా “నా నంబర్ సేవ్ చేసేశాలే. నీ నంబర్ కూడా సేవ్ చేసుకున్నాను.” అనే లోపులో చలం సెల్లు మోగింది. రెండు నిమిషాలు మాట్లాడిన చలం “సుబ్బారావ్! మా ఫాక్టరీలో ఏదో అర్జంట్ ఇష్యూ వచ్చింది. నేను వెంటనే వెళ్ళాలి. హోటల్‌కు వెళ్లి అట్నుంచటే ఫ్లైట్ ఎక్కుతాను. సారీ ఏమనుకోవద్దు! ఫోన్ చేస్తానులే.” అంటూ హడావుడిగా బయలుదేరాడు. సుబ్బారావు తనకు పట్టిన అదృష్టాన్ని ఎలా జీర్ణించుకోవాలో తెలియక సంభ్రమంగా చూస్తూ మిత్రుడికి వీడ్కోలు చెప్పాడు.

***

సాయంకాలం యథావిధిగా టీ తాగి మిత్రుడు రాజారావు గురించి వెయిట్ చేస్తూ కూర్చున్నప్పుడు నిన్నటి ముసలాయన హడావుడిగా వెళుతూ మళ్ళీ కనిపించాడు. సుబ్బారావుకి నిన్నటి ఆలోచనలు కంటిన్యూ అయ్యాయి. చిన్నపుడు ఇంటికి వచ్చే ఆ చుట్టాల గురించి తనవన్నీ తప్పుడు అభిప్రాయాలని తను కొంచెం పెద్దయ్యాక నాన్నగారు చెప్పగా తెలిసింది. కామేశ్వరరావు తాతయ్య సరిగ్గా అన్నం తినలేకపోవడానికి కారణం అతను ఎప్పుడూ నల్లమందు మత్తులోనే ఉండడమనీ, నాన్నగారికి తెలియకుండా ఉండడానికే ఆయన లేనపుడు మాత్రమే వచ్చి అందినంత మేరకు అమ్మ దగ్గర లాఘవంగా డబ్బులు గుంజేవాడనీ అర్థమైంది. పోతే ‘టన్ను’ గారికి కడుపునిండా పెట్టగలిగే హోటల్ దొరకకే వీళ్ళింటికి వచ్చేవాడనీ, అందుకు ప్రతిఫలంగా పిల్లల చదువులకు పెద్ద మొత్తాల్లోనే నాన్నగారికి సాయం చేసేవాడనీ కూడా తెలిసింది. ఇవన్నీ అర్థమయ్యేటప్పటికి సుబ్బారావుకి వేరే ఊళ్లో ఉద్యోగమూ, పెళ్ళీ సంసారమూ ఏర్పడి వీళ్ళిద్దర్నీ మర్చిపోవడం జరిగింది. ‘మనం ఎక్కవలసిన రైలెప్పుడూ ఒక జీవితకాలం లేటు’ అనుకుంటూ ఆలోచనల ఒరవడిలో ఉండగానే రాజారావొచ్చాడు.

సుబ్బారావు తన మధ్యాహ్నపు సంతోషాన్ని భార్యతో అయితే పంచుకున్నాడు గాని మిత్రుడికి కూడా చెప్పెయ్యకపోతే కడుపుబ్బరం తగ్గేటట్టు లేదు.

“ఒరేయ్! రాజారావ్! మధ్యాహ్నం ఏమయిందో తెలుసా!” అంటూ మొదలుపెట్టి జరిగినదంతా ఏకబిగిన చెప్పేశాడు. పూర్తిచేశాక స్నేహితుడి ముఖంలో ఆశ్చర్యము, అసూయ, దిగ్భ్రమలాంటివి కనపడతాయని ఎదురు చూశాడు సుబ్బారావు. అలాంటివేవీ కనపడకపోగా ఆ స్థానే ఆందోళనా, భయమూ కనిపించాయతనికి.

“ఒరేయ్! సుబ్బూ! ఎలా ఉన్నాడ్రా ఆ వచ్చిన మనిషి? వివరంగా అంతా చెప్పు!” ఆందోళనగా అడిగాడు రాజారావు.

“ఎందుకురా!?” అని అడుగుతూనే శేషాచలం రూపురేఖలూ, అతనితో జరిగిన సంభాషణా, ఫోను నంబర్లు మార్చుకోవడమూ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు సుబ్బారావు.

రాజారావు మొహంలో క్షణక్షణానికీ రంగులు మారసాగాయి. అంతా విని చివరికి “ఒరేయ్! సుబ్బారావూ! నిన్ననో, మొన్ననో పేపర్లో ఇలాంటి వాడొకడు ప్రతీ ఊర్లో తిరిగి మోసాలు చేస్తున్నాడని రాశారు కదా. నువ్వు చూడలేదా? అయినా నువ్వు అతగాడికి డబ్బూ, నగలూ ఏమైనా ఇవ్వలేదు కదా?” అడిగాడు.

“లేదురా! ఏమీ ఇవ్వలేదు! ఊరికే ఫోన్ నంబర్లు మార్చుకున్నామంతే! ఈ లోపులో అతనికి ఏదో ఫోన్ వచ్చింది. హడావుడిగా వెళ్ళిపోయాడంతే.” కన్ఫర్మ్‌గా చెప్పాడు సుబ్బారావు.

“అయితే ఏమయ్యుంటుందబ్బా! ఏదీ అతను సేవ్ చేసిన నంబరుకి ఒక సారి కాల్ చెయ్యి.” సాలోచనగా అన్నాడు రాజారావు.

రింగ్ చేసిన సుబ్బారావుకి ‘మీరు డయల్ చేసిన నంబరు మనుగడలో లేదు’ అని వినిపించగానే కొద్దిగా అనుమానం వేసింది.

“లేదురా!” అన్నాడు నీరసంగా.

“ఎందుకైనా మంచిది. మొబైల్ ఓపెన్ చేసి నీ బ్యాంక్ అకౌంటులో డబ్బులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో!” అనుమానంగా అన్నాడు రాజారావు.

ఒకే నిమిషం. ఫోన్‌లో ఆప్ ఓపెన్ చేసి బ్యాలన్స్ చూసుకొన్న సుబ్బారావుకి కళ్ళ ముందర బాంబులు పేలి ఆ పైన నక్షత్రాలు కనిపించాయి. తూలి పడిపోబోతున్న అతన్ని పట్టుకుని “ఏమయ్యింది సుబ్రావ్?” అడిగాడు రాజారావు.

“ఏభై వేలు.. ఏభై వేలురా!” అంటూనే మళ్ళీ ఢామ్మని కింద పడిపోయాడు సుబ్బారావు.

లోపల్నుంచి పరిగెట్టుకొచ్చిన సుబ్బారావు భార్యామణి శైత్యోపచారాలు చేస్తూనే జరిగిందంతా విని “ఈయన ఎప్పుడూ ఇంతే అన్నయ్యా! ఏదైనా తొందరగా అర్థమైతే కదా!” అంటూ నిట్టూర్చింది సగం బాధా, సగం కోపమూ నిండిన స్వరంతో.

🥺🥺🥺

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here