[box type=’note’ fontsize=’16’] కథా రచనలోని విభిన్నప్రక్రియలను వివరిస్తూ కథ గురించి అవగాహన కలిగించే వ్యాసపరంపర, తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందు వచ్చిన గ్రంథాల కంటే భిన్నమైన వస్తురూపాలతో – విలక్షణంగా వెలువడిన గ్రంథాల విశ్లేషణ. తెలుగు సాహిత్యంలో అత్యంత అనుభవజ్ఞుడయిన రచయిత విహారి విశ్లేషణాత్మక వివరణలివి. [/box]
చైతన్య క్షణాల్లో సుమనస్వి హృదయ చలనాలు డాక్టర్ డి ఎన్ వి రామశర్మ ‘త్రిపద’లు కవిత్వం ‘మనసున నిలిచిన నెచ్చెలి’
[dropcap]శ్రీ[/dropcap] రామశర్మ గారు ఉన్నత విద్యాభ్యాసం చేసి, ఉన్నతమైన సంస్థలో, ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నారు. ఇది ఈ వృత్తి వైశిష్ట్యం. సహృదయుడుగా, సరస హృదయుడుగా పరిణత మనస్కుడు ఆయన. మనుషుల మనసులను గెలుచుకోగల విద్యను తన లోకజ్ఞతతో వన్నెకెక్కించుకున్న వారు. 250 మంది ‘ప్రియమైన కథకులు’ను రచయితల్ని సభ్యులుగా మూడు గ్రూపులుగా సూత్రీకరించి అహరహము వినూత్న కార్యక్రమాలతో చైతన్యవంతం చేస్తున్న స్మిత పూర్వ భాషి. ఈ సుగుణ విశేషం – శ్రీరామునిది. ఇప్పుడీ రామ సుకృతికి సార్థకంగా నప్పింది. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, బహుమతుల స్వీకర్త. ఇదంతా శర్మగారి ప్రవృత్తి మార్గ పురోగమనం!
కవిత్వంలో లఘు రూప ప్రక్రియలకు చెందినవి ‘త్రిపద’లు. అసలు తెలుగు చందస్సులోనూ ‘త్రిపద’ ఉన్నది. శర్మ గారి పద్యాలు వచన కవితలో అణురూపాలు. ఇవన్నీ ముక్తక శాఖకు చెందినవి. భావ ప్రధానమైనవి. అభివ్యక్తికి పెద్దపీట! విద్యుల్లత విరిసినట్లు తళతళ మెరుస్తాయి. క్షణంలో ఆ మెరుపులు హృదయంలో పదిలం చేసుకో మంటాయి. ఇదివరకు శర్మ గారు ‘స్వాతి ముత్యాలు’ గా సహస్రాధిక మైన త్రిపదల్ని గ్రంథస్తం చేశారు.
‘మనసు భాష’ తెలిసిన నెచ్చెలి అనగానే ప్రేమ భావన వెల్లివిరుస్తుంది. భావ కవిత్వంలో ఒక శాఖగా వెలిగిన ఈ ప్రేమ భావన శ్రీ శర్మ గారి త్రిపదలులో ఇప్పుడు మళ్ళీ సహృదయాభిసరణంగా కవితాత్మకతతో మన ముందుకు వచ్చింది.
‘మనసు భాష/ కనుల కెరుక/భావాలు ఆనందభాష్పాలే’. ‘ ఏ వ్రతమైనా పర్లేదు/ ఒక మౌనవ్రతం తప్ప/ ముత్యాల మాటలు లేకుండా ఎలా?’ వంటి శబ్దానురక్తీ, అభివ్యక్తి శక్తి – రెంటినీ పొదవుకున్న త్రిపదలు ఈ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఫలం – అనుభూతి పారమ్యం!
‘చెలి’ టేనే ఒక మధుర భావన. తీపి తలపు. చిలిపి ఊహ. ఒక్కొక్కప్పుడు సయ్యాటల హేల, అలకల గోల! వీటన్నిటా— చిత్రంగా కంటిని, మనసుని చెమ్మగిలచేసే ఆర్ద్రత ఉంటుంది. ఆ ఆర్ద్రతే అటు కవి పలకరింపు, ఇటు భావుకుడైన చదువరి పులకింత!
‘గుండెలయ పెరుగుతోంది /నా ఊహల్లోకి నువ్వు వచ్చావని సంకేతం’ అనగానే అ ఊహలు చదువరి మనసులోనూ తీగ సాగుతాయి. దృశ్యాదృశ్య భావనలేవో కళ్లముందు కదలాడతాయి. ఆమె సంకేతం ఒక అల్లరిగా ఎంతెంతో సంభాషణ అల్లుతుంది – మనసులో! ఇదీ భావ శబలత!
‘చెలి త్రిపదల్లో కవితాత్మకమైన సూటిదనం ఉన్నది. వాక్య సముచ్చయంలో పద పదార్థ సారళ్యం ఉన్నది. ‘నీ చిరునవ్వుల చిరునామా ఒకటే తెలుసు కవితలకు/నా అక్షరాల ఉత్తరాలకు/’ అన్నారు. అందుకనే – ‘నా వలపు ఉత్తరం నీకే చేరాలని/ చిరునామాలో ‘చిరునవ్వు’ అనే అక్షరాలే వ్రాశాను’ అని మరో త్రిపదలో వివరణ! ‘చిరునవ్వు చిరునామా’ రూపకం అనేక ఊహల్ని ప్రచోదితం చేస్తున్నది. అదే కవిత్వ లిపి రహస్యం. పొట్టి పదాల్లో పొడవైన భావనలు! ఈ రహస్యం తెలిసిన శర్మ గారి వాక్యాలు రసాత్మకాలు! ‘తన అలకకెంత సొగసు/ తనవైపు తిప్పుకునేందుకు అదో మంత్రమని తెలుసు’
రాధా మాధవ హేల నేపథ్యంలో ‘ధ్వనివంతమైంద. చివరికి వామ పాద తాండనం కీ కావ్యత్వం ఉండనే ఉన్నది! ఈ త్రిపద చదవగానే ఆ దృశ్యము స్పురణకు వస్తుంది. కవికృత్యంలో ముఖ్యమైన అంశాల్లో ఒకటి – చెప్పిన దానికంటే చెప్పని దానికి ‘బరువు’ని కల్పించడమే. దీన్నే గడుసుగా ‘మోయలేని ఆ హాయిని మోయనీ’ అన్నారు సినారె! శర్మ గారికి ఈ విద్య అరచేతి ఉసిరిక! పొట్టి కవితకి అంత్యప్రాస ఆభరణం అని తెలుసు, దానికి నగిషీలు చెక్కడమూ తెలుసు!
చెలికి సంబంధించిన అనుభవాలూ – జ్ఞాపకాలూ అన్ని వేళలా వినిపించని రాగాలే! పలికించలేని అనురాగ భాషాభూషణం! ఎప్పుడూ కొమ్మల్లో దాగిన కోయిలమ్మ ‘కుహూ-కుహూ’ గుసగుసే!!
‘కనులకు/ నిద్దుర లేని క్షణాలే/ బుగ్గ మీద చిలిపి సంతకం’ అన్నారు. భావ భరితంగా, బహు సుందరంగా ఉంది వ్యక్తీకరణ సౌభాగ్యం! కవిత్వం ఎక్కడుంటుంది అని మధన పడేవారికి చూపతగిన ముక్తకం ఇది!
‘కలవరింతల కలలలో/ ప్రతి క్షణమూ నీ కదలికే/ ప్రత్యక్షంగా రావాలిక చెలీ’ అన్నారు. అంతా విరాళి చేస్తున్న సరాగాల సణుగుడే! కవితా మయమైన రసప్రసరణం!
‘గాలి తుమ్మెదల తాళానికి/ ముంగురుల నాట్యం తోడుగా చిరునగవుల చెలి లాస్యం’ – అనగానే అవ్యక్తమైన జీవభాష ఆహ్లాదం కలిగిస్తుంది. ప్రకృతీ పురుషుల ఊసులాటలేవో అంతశ్చేతనని చల్లబరుస్తాయి. అలాంటి అంతరంగ స్పందనే కదా మంచి కవిత్వ ప్రయోజనం!
అలాగే కవిత్వంలో కించిత్ వర్ణన స్వాభావికంగా సాగితే; దాని వస్తు శిల్ప గుణ సాంద్రత ఇనుమడిస్తుంది.
‘కాటుక/ చెలి కనులకు అందం అనుకున్నా/ కాదట/ తన కనులలో దాచుకున్న అది/ నా రూపానికి దిష్టి చుక్కట’ – అన్నారు. ఎంతో భావ సాంద్రత కలిగిన ఖండిక! చదువరి మనసుని గిలకొట్టి ఆలోచనని రగిలించి అంతర్ముఖుని చేస్తుంది; అలరిస్తుంది!
‘హరితపు అవనికి/ చినుకుల స్పర్శ గా నిలిచే/ నా స్నేహిత మానసి… నీవే.. చెలీ..!’
‘చెలీ.. నీ పేరు తలచీ తలవగనే /అక్షరాలు కూడా మెలికలు /తిరిగి పోతున్నాయి్… సిగ్గుతో!’
వంటి త్రిపదలు నిశ్శబ్దానికి గాయం చేస్తూ గుండె సవ్వడిలో వినిపించని రాగాలని వినిపిస్తాయి.
రామశర్మ గారి త్రిపదల్లో నులివేడి భావనాస్పర్శ తనువుకీ, మనసుకీ కూడా వెట్ట కూరుస్తున్నది. సామాజిక సంక్లిష్టతలూ, సాంస్కృతిక దుర్గంధం పేరుకుపోతున్న వర్తమాన స్థితి గతుల్లో ‘చెలి త్రిపదలు’ వంటి సాత్విక కవిత్వం వాంఛనీయం’ అభినందనీయం! ఇలాంటి రచనలే మనుషుల అంతరాంతరాల్ల్ని మలినం కాకుండా నిలిపేందుకు నిలిపేందుకు ఊరట బాటలు!! మంచి కవిత్వాన్ని వెలయించిన రామశర్మ గారికి హృదయపూర్వక అభినందనలు! శుభాకాంక్షలు!
(రామశర్మ గారి ఫోన్ నెంబర్:: 96635 26008)