ఏరిన ముత్యాలు 12

3
2

[box type=’note’ fontsize=’16’] కథా రచనలోని విభిన్నప్రక్రియలను వివరిస్తూ కథ గురించి అవగాహన కలిగించే వ్యాసపరంపర, తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందు వచ్చిన గ్రంథాల కంటే భిన్నమైన వస్తురూపాలతో – విలక్షణంగా వెలువడిన గ్రంథాల విశ్లేషణ. తెలుగు సాహిత్యంలో అత్యంత అనుభవజ్ఞుడయిన రచయిత విహారి విశ్లేషణాత్మక వివరణలివి. [/box]

అన్నీ అంతరంగ కథనాలే!

‘మెడికో శ్యామ్ ఆత్మకథనాత్మక రచన’

[dropcap]‘న[/dropcap]డిచిన పుస్తకం’ గడచిన మహనీయుని పుస్తకం. ఆ మహనీయులు చిర్రావూరి సర్వేశ్వరశర్మ గారు. ‘దొరికిన ప్రతి పుస్తకాన్ని చదవటం/వీలైతే సొంతం చేసుకోవటం/ఎప్పుడైనా రాస్తే గీస్తే క్రిస్పీగా రాయటం’ ఇదీ -ఢిల్లీ శర్మగారు! ‘దొర టోపీ, చేతిలో పుస్తకం’! స్ఫురద్రూపి, మనోహరంగా చమత్కరించగల సున్నిత హాస్యప్రియులు, సంస్కారవంతులు, ఆదర్శజీవులు, నిగర్వి; మితభాషి; మృదుస్వభావి! విలక్షణ వ్యక్తి!

శర్మగారి శతజయంతి రానున్నది. ఆ సందర్భంగా ఈ అక్షరమాల! వారి సంతానం నలుగురూ-శ్యామ్, ఘనశ్యామ్, జఘనరాణి, వల్లీశ్యామల-తండ్రి మూర్తిమత్వాన్ని వ్యక్తిత్వాన్నీ, సాహిత్య వ్యక్తిత్వాన్నీ-ఇలా అరుదైన గ్రంథరూపంలో ఆవిష్కరించారు.

ఈ జ్ఞాపక చిహ్నముద్ర-మూడు భాగాల్లో రూపొందింది – 1.సన్నిహితుల జ్ఞాపకాలు, అనుభవాలు; 2. వ్యక్తిగత జీవితంలో ప్రధాన ఘట్టాలు, 3. వారి రచనలు-కథలు, వ్యాసాలు, ఛలోక్తులు, లేఖలు.

శర్మగారి జీవనరేఖల్లో – వారి వ్యక్తిత్వ దర్శనం చేయించారు-వ్యాసకర్తలూ, సంతానం. దానికి ఈ వ్యాసం మొదటి పేరా-ఒక సంక్షిప్త శబ్దచిత్రం. కాగా,

శర్మగారి సాహిత్య వరివస్యకు ఉదాహరణ ప్రాయంగా లభించిన రచనల్ని ముద్రించారు-మూడవ విభాగంలో ‘ఆలోచనామృత గుళికలు’ ఇలా వుంటాయి

‘ఒకర్ని చూస్తే / నువ్వు / దూరందూరం/ పోతావే! ఆ / ఒకనే / మరొకరికి / ఎంత దగ్గరో కదా!’

‘కోటిమంది / కుంగితే / ఓ కోట నిలుస్తుంది / వేలమంది / నేలకూలితే / లక్షమంది / శ్రమిస్తే / క్షమిస్తే / ఒకడు పేలతాడు / ఒకడు ఏలతాడు’

– భావసారాన్నీ, వ్యక్తీకరణ విధానాన్ని చూస్తే శర్మగారి అంతరంగం, అంతఃకరణ స్వభావం అర్థమౌతున్నాయి. వారికి గల సామాజిక దృష్టి, సమతాకాంక్ష ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి.

అలాగే-వ్యాసాల్లో ఒక్క ఉదాహరణ :- వారు గిడుగు రామ్మూర్తి పంతులుగారి నిర్యాణం (22.1. 1940) నాడు ఆంధ్రప్రభలో రాసిన వ్యాసం. గిడుగుని వారు ఆంధ్ర సారస్వత స్వరూప నిర్ణేతగా అభివర్ణిస్తూ-‘ఆయన సమగ్ర జీవిత చరిత్రను ప్రకటించవలసి వున్నదని హెచ్చరిక’ అని నిష్కర్షగా చెప్పేశారు.

హెచ్.ఎమ్.రెడ్డిగారి ‘తెనాలి రామ’ చిత్రాన్ని సమీక్షిస్తూ వారన్నారు, ‘ప్రభాత్ వారు జ్ఞానేశ్వర్ తీసిన్నాడూ, ఛాప్లిన్ The great dictator విడుదల చేసిన్నాడూ, మన రెడ్డిగారు ‘తెనాలి రామన్న’ను తీసి రిలీజ్ చేశారు. ఎంత గొప్పవారు. సమకాలికులు వీరందరూ! ఎంత తమాషా!’ అని. శర్మగారి తెలుగుతనం, తెలుగువారి ప్రతిభా ఔన్నత్యాల పట్ల సమంసజమైన గర్వం – ఈ తరం వారికి స్ఫూర్తిదాయకం కావాలి!

శర్మగారు చాలా కలం పేర్లతో రచనలు చేశారు. చిత్రమైన విషయం – ‘హ్యూమర్’ రాసి ‘సీరియస్’ కలంపేరు పెట్టారు! ‘ప్రేమకథ’ని (వెలుగు-చీకటి) ‘ప్రేమికుడు’ కలం పేరుతో రాశాడు

శర్మగారు నాకంటే ఇరవైయేళ్ళు పెద్దవారు! అణాకి అరవీసె వంకాయలు వస్తున్న రోజుల్లో సంతృప్త జీవనం సాగించి, సంతానాన్ని యోగ్యపథంలో నడిపినవారు. ఆ కాలం మనుషుల్లో-ప్రత్యేకించి చదువుకున్న మధ్యతరగతి వారిలో ఏదో ఒక ఉద్యోగంలో కుదురుకోవటం, సంసారాన్ని ‘సజావు’గా సరిదిద్దుకోవటం, ‘బతకటం’ కాకుండా ‘జీవించటం’ ముఖ్యమైన ఆనందాలుగా ఉండేవనిపిస్తుంది. లలితగారి వంటి ‘ఉత్తమా ఇల్లాండ్రు’ ఉండేవారు. ఒకవిధమైన రసహృదయం, కారుణ్యం, ఆపన్నులయెడ చెమర్చే కన్నూ ఉండేవి వారికి. ఆత్మతృప్తి ప్రధాన సుగుణ విశేషంగా కనిపించేది! తన మన; పర, స్వపర సమాన అభిమానాలు, ఆప్యాయతలు ఉండేవి.

ఇవన్నీ-మనకు ఈ ‘నడిచిన పుస్తకం’ నడిపించిన అక్షరాల్లో గోచరిస్తున్నాయి. ఒక్కమాట ‘Living is an art’ ‘బ్రతకటం వో కళ’ అన్నారు శర్మగారు. ఆనాటికి అది పెద్ద గొప్ప సూక్తి కాదు! ఈ నాడు మనం ఆమాటని తిరగేసి మల్లేసి, దాని గురించి వినటానికి దానివెంట పరిగెత్తుకుపోతున్నాం!

‘ఒక నిండైన సాహిత్య కళా శతాబ్దాన్ని విజయనగరానికి, ప్రపంచానికి అందించి నిశ్శబ్దంగా కనుమరుగైపోయిన మౌని, మహానుభావుడు, నా స్నేహితుడు, నన్నింత ప్రయోజకుణ్ణి చేసిన నా పితృసమానుడు-‘ అన్నారు డా||వి శ్రీనాథ్. ఇంతకంటే శర్మగారికి ఇంకేం గొప్ప నివాళి నివ్వగలం. తిమిరం తొలగాలంటే జ్యోతి వెలగాల్సిందే!! ‘ప్రవర్తితో దీప ఇవ ప్రదీపాత్!’

ఇప్పుడు ఈ ‘నడచిన పుస్తకం’లో గల ‘నడుస్తున్న గాలిరథం’ ఒకదాన్ని పరామర్శిస్తాను.

మెడికో శ్యామ్‌కి ‘కథ’ చదవాల్సిన అవసరాన్ని ఎరక్కపోయి కల్పించారు ప్రవాసీమంచ్ వారు! వర్తమానాన్నీ, కథాలోకం సర్వంనీ-ఒక చూపు చూశాడు! ఆ వెంటనే తనను తాను కూడా ఆపాదమస్తకం చూసుకున్నాడు.

కనపడిందేమిటి? అసమంజస వాతావరణం; అనేక మెలడీలు! వీటికి ఏ రెమెడీల నివ్వగలం అనే విచికిత్స మొదలైంది. అది మొదలైతే మెదడులో మరి ‘పురుగు’ అవుతుంది కదా. అది ‘తొలుస్తుంది! ఆ సంవేదన, ఆత్మఘోష, అంతరంగ వీక్షణ, అంతర్మథనం-ఇదిగో ఇలా అక్షరాలకి దిగింది! ఒక చింతనపరుడైన కథకుని ‘అవసర నైవేద్యం’ ఒక బుద్ధిజీవి సొంత నివేదన-అదృష్టవంతులైన తెలుగులకు అందివచ్చింది! చదివాను; రెండుమూడుసార్లు! ఒక రాయని భాస్కరుని హృద్దర్శనం అనిపించింది. సరే-కథ అనుకుందామా? అనుకుంటే-‘అనుకో’ అన్నది. ఎందుకని? అంతా కలిపి ఆ ‘మహమ్మారి’ కల్పించిన ఒక అసహాయ స్థితి చిత్రణ కనుక. మనసెందుకో-కథ కంటే కథనం ఎక్కువ అన్నది. ‘కవితాత్మ కలిగిన కథకుడివీ, భావుకుడివీ కనుక నీకు శిథిల సౌందర్యంపట్ల ఆకర్షణవుంది. అసలు నీకు ఆడ ఫ్లేవరు చాలు…’ వంటి అనేకానేక వ్యాకరణాత్మక వాక్య సముదాయం కళ్లముందుకొచ్చి అవునవునన్నాయి. కాదు, ‘వచన కవిత్వమబ్బి’ అని గుసగుసవోయింది మనసు. ‘నువ్వెప్పుడూ ఒంటరివే. నీ పక్కింటివాడెవడో నీకు తెలీదు..’ వంటి Stanza లు చదవమని కన్నుగీటాయి. అదేంకాదు – దీన్ని కవితావచనమ్ అనాలి. అప్పుడెప్పుడో మో ‘చితి-చింత’ చదవలేదా? అని ఒక గద్దింపు వినిపించింది. అవును- ‘శ్యామ్‍యానా’ లాంటి అనేక నా ‘బెడ్ సైడ్’ బుక్స్ లో అదీ ఒకటి’-అని కళవళపడి సంజాయిషీ ఇచ్చుకున్నాను-‘అయితే ఒక దాఖలా చూపు’ అన్నది ‘గద్దింపు’. ‘నువ్వేదేశం వాడివైతే ఆ దేశం నీదేశం/నీలో లోపలికి తరచి చూసుకో. శ్వేతాశ్వేతాలేకాదు. మిగతా రంగుల్నుంచీ, మరకల్నుంచీ దూరంగా జరుగు. విశ్వమానవుడివి నువ్వు…’ నుంచీ ఈ మహాశయుడు చెప్పిందంతా కవితా వచనమే అని అరమోడ్పుగా, గుండె అరల్లోకి సర్దుకున్నాను. ‘శ్యామ్‌యానా’ చేతికొస్తే-రోజూ చదువుకొనే కథా, 107, 108 పేజీల్లో అండర్‌లైన్లు గద్దింపుకి మద్దతుదార్లయినాయి! శ్యామ్ వాక్య విన్యాసమంతా ‘దొరకునా ఇటువంటి సేవ’ అని రాగం తీయసాగింది!

ఏతావాతా-కథ ఉన్నదండీ! వర్తమానంలో కథకులు పెన్నులు మూసుకుని రాయని భాస్కరులైపోవటానికి గల పరిస్థితుల దుర్దశ చిత్రణ ఉన్నది. వేరే ‘కథకుడి అంతరంగం’ ఒక సంవేదనాపరుడి అశాంతి దర్పణం కనుక కవిత ఉన్నది. అంతర్మథనం కనుక కథనం వచ్చింది. వస్తురూప ప్రక్రియల్లో ‘ప్రయోగశీలి’ కనుక దీన్ని కవితావచనమే కూడా చేశాడు శ్యామ్.

ఏది చెప్పినా-‘డయోగ్నసిస్’ స్పష్టంగా ఉన్నది. ‘ప్రిస్క్రిప్షన్’ కావాలంటే-వేరే ‘ఖర్చ’వుతుంది మరి! ‘కథకుడి అంతరంగం’లో చెప్పిన దాని వెనుక చెప్పని పదా(ద+అ)ర్థం ఎక్కువ ఉన్నది. అది ‘ధ్వనిమంతు’ల ఘనత! వారంతా కథారచనలో ‘పనిమంతులు’! చదివేవాడి బుర్రకీ ‘పని’ పెడతారు!

శ్యామ్ రచనల్ని త్రిపుర, గ్రిపుర అనీ, రావిశా, కావే, వచం-అనీ కొంచెం కొంచెం పీక సన్నాయి వదులుతున్నారు. అన్యాయం సార్. శ్యామ్ రచన శ్యామ్ రచనే! అతన్ని అతను గానే అననీయండి, మననీయండి!

అప్పుడెప్పుడో చంద్ర, రచనా శాయి, నేనూ మాట్లాడుకుంటుంటే శ్యామ్ మాట వచ్చింది. ‘అతను రాస్తే బాగుంటుంది’ అనుకున్నాం-శ్లేషతో! మునిపల్లె రాజు గారి దగ్గర నేనీ ప్రసక్తి తెస్తే, వారన్నారు- ‘అతని కథలన్నీ పరిశోధన పత్రాలు కదా; పరిశోధనకైతే సమయం అక్కర్లేదు. వాటికి కావాలి’ అని నవ్వారు.

ఇప్పుడు- ‘గన్కాసే పడ్‌రే…!’ అన్నట్టు; చిన్నవిజ్ఞప్తి; మనవి; విన్నపం-‘డాక్టర్ గా మరీ అంత బిజీ అయితే, ఏ ‘ఐసీసీయూ’ వంటి కథనైనా పడేయండి సార్! ఎటూ మీరే అన్నారు కదా ‘కథలు రాయడం ఎలా?’ అంటే ‘ఎలా బడితే అలా’ అని!!

***

చివరగా ఒక గమనింపు: ఇదే పుస్తకంలో మాన్యులు ద్వారం దుర్గాప్రసాదరావు గారి వ్యాసం ఉంది. అంతర్మథనం గురించి శ్యామ్ గురించీ, నిండైన మేలిపలుకులున్నా, అవశ్యం పఠనీయం. చిత్తగించండి ప్లీజ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here