ఏరిన ముత్యాలు 14

3
2

[box type=’note’ fontsize=’16’] కథా రచనలోని విభిన్నప్రక్రియలను వివరిస్తూ కథ గురించి అవగాహన కలిగించే వ్యాసపరంపర, తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందు వచ్చిన గ్రంథాల కంటే భిన్నమైన వస్తురూపాలతో – విలక్షణంగా వెలువడిన గ్రంథాల విశ్లేషణ. తెలుగు సాహిత్యంలో అత్యంత అనుభవజ్ఞుడయిన రచయిత విహారి విశ్లేషణాత్మక వివరణలివి. [/box]

నవ్వుతూ బతకాలిరా… నరుడా!

[dropcap]ప్ర[/dropcap]పంచం పీకపట్టుకుని గిలగిల్లాడిస్తున్న ‘కరోనా’ అలజడి మీద – అబ్బో ఇప్పటికే చాలా కథలూ కాకరకాయలూ వచ్చేశాయి. ఇదిగో ఇప్పుడు సరసి రెండు టానిక్కుల్ని అందిస్తున్నారు. 1. కరోనా కరకజ్జం-కామెడీ కబుర్లు, 2. నవ్వు’కోరానా’నాయనా! కార్టూన్లు!!

రెండు పుస్తకాలూ తెలుగులో మొట్టమొదటి ‘రికార్డ్’ విడుదలలే! కారణం మొదటిది చిట్టిచిట్టి కథల తీపిగుళికలు. (కథల సంపుటాలు వచ్చినై కానీ, ఇలా హాస్యాన్ని పండించి వండి వడ్డించిన చిట్టికథలు సంపుటిగా రాలేదు). రెండవది 200 ‘కరోనా’ కార్టూన్లు ఏకసంపుటి!

సరసి అంటే అసాధ్యుడు! ఏకంగా 15 ఏళ్ల పాటు ‘మనమీదేనర్రోయ్’ అని వారం వారం చదువరుల్ని బుజాలు తడుముకొనేట్టుచేసిన ‘గీత’కారుడు. నరసి మంచి కథనవీరుడు కూడా. ‘బొమ్మలాట’ వంటి చాలా గొప్ప కథలు చాలా రాసి ప్రైజులు కొట్టేసిన విజేత!

‘హాలాహలం అమృతాన్ని తెచ్చినట్టు, కరోనా తెచ్చిన చేదుకజ్జాల గోలలో తీపి కరకజ్జాలని రుచి చూపించాలని చేస్తున్న చిన్ని ప్రయత్నం’ అన్నారు తన కథనాన్ని గురించి.

ఈ కథనాలు కరకజ్జాలేకాదు, మధ్య తరగతి ‘మంద”హాస’ రుచులూ, అభిరుచులూ కూడా! ‘మూతిగోచీలు’; ‘కూరలు కడిగిన శుభవేళ’, ‘శారీలకి సారీ’, ‘కోరంటీన్ పేరంటం’, ‘కరోనా కాలము-దూరము’, ‘ఆన్లైన్లో ఆవకాయపాఠం’, ‘షాదీ కరోనా’, ‘మాస్కోడిగామా’ – ఇలా కథనాల పేర్లు చూడగానే వాటిలోని వస్తువు, ఇతివృత్తం కూడా అర్థమైపోయి నవ్వు తెప్పించేస్తున్నది కదా! అయితే, అసలు సరసి ‘టచ్’ అనుభవించాలంటే ఆ కథనాన్ని చదివి, ముగింపుని ఆరగించవలసిందే! ఒక్క ఉదాహరణని పంచుకుందాం, ‘మాస్కోడిగామా’లో ద్రౌపది బాధ ‘మాచింగ్ మాస్కు లేకపోతే కాలేజీలో నవ్వుతారు’ అని. కృష్ణమూర్తి తండ్రి తన పాత లుంగీ పంచె (ఉతికిందే) ఒకటి తీసి వెడల్పు పీలికలుగా చింపి, ఇంట్లో అందరికి తలోటీ ఇచ్చాడు. … ఇవన్నీ సరే… చివరికి ట్రంప్ గారి కార్యాలయంలో ఆయన పిఏ వచ్చి ‘ఒకాయనెవరో వాస్కోడిగామా గారి మునిమనవడట! స్పెషల్ పర్మిషన్ ఇమ్మంటున్నాడు’ అన్నాడు. ‘వాస్కోడిగామా మునుమనవడా? పేరు’ అడిగాడు ట్రంపు ఆత్రంగా! “మాస్కోడిగామా అట సార్!” ఇదీ సరస మార్కు ముగింపు! ఇంతేకాదు-ఇంకా చాలా వున్నై. వాటన్నిటినీ ఆరగారగా నవ్వుకుంటూ అరిగించుకోవలసిందే! పుస్తకాన్ని తెప్పించుకోండి మరి! (ఫోన్ : 9440542950).

ఇంతకింత హాస్య వ్యంగ్య రసతరంగితంగా వచ్చింది ‘నవ్వు’కోరానా’యనా!’ కార్టూన్ల సంపుటి. తెలుగు పత్రికల దురదృష్టం, ముఖపుస్తకం అదృష్టం వలన, ఏకంగా 200 పేజీల కార్టూన్లని సరసంగా సరసి గ్రుచ్చి కూర్చారు. అన్నీ కరోనా మీదే.

‘కరోనా’ మీద ప్రపంచం మొత్తంమీద, మరీ ముఖ్యంగా ఇంగ్లండ్, అమెరికాల్లో కార్టూనిష్టులు ఎంతో విజృంభించి వేశారు కార్టూన్లని. తెలుగులో ఈ సంపుటం ప్రయత్న సాఫల్యం – ఒక ఢంకాబజాయింపు ‘రికార్డు’!

కార్టూన్ పేలాలంటే – కార్టూనిస్ట్‌కి ఊహ మెరపులా తళుక్కుమనాలి. బుర్ర మెత్తగానూ, గట్టిగానూ కూడా ఉండాలి. మెత్తగా వుంటేనే మరి – సారవంతంగా ఆ ఊహ మొలకెత్తుతుంది. మొక్కవుతుంది. నవ్వుల పూవుల్ని విరబూస్తుంది. పుష్పించిన తర్వాత ఫలిస్తుంది (చదువరి ఆనందంలో)! గట్టిగా వుంటేనేమో మరి – గీతల్లోకి రాతకెక్కి ‘శిలాశాసనం’ అయి నిలుస్తుంది, ఇదిగో ఈ సంపుటంలా!

కార్టూన్ అనగానే బొమ్మ దృష్టికి తగుల్తుంది. వెంటనే కేప్షన్ – నన్ను చూడు అంటుంది. అలా కాక, దృష్టి ముందుగా కేప్షన్ మీదికి సోకితే – ‘నన్ను చూడు, నా అందం చూడు’ అంటుంది బొమ్మ! ఈ రెంటికీ పోటీ పెట్టి, మన దృష్టిని కట్టిపడేసి – ‘ఆహాహా’ ‘ఓహోహో’ అనిపిస్తాయి సరసి కార్టూన్లు.

సరసి కార్టూన్లకి మా చెడ్డ సరదా ఉంది. కొన్ని ఏడ్వలేక నవ్వే మొహాల్ని పట్టేస్తాయి; కొన్నేమో నవ్వలేక ఏడ్చేమొహాల్ని కట్టేస్తాయి.

రోడ్డుకు ఆ సైడు, ‘మడత మంచములు అద్దెకు ఇవ్వబడును’ హోటల్, ఈ సైడు ‘కరోనా హాస్పటల్’ – ‘బెడ్స్ ఖాళీలేవు’ బోర్డు! మూతికి మాస్కుతో మడతమంచాలు మోసుకుని బారులు తీరుతున్నారు. పేషంట్స్! వ్యంగ్యమా, మజాకా! దాన్లోంచే మరి హాస్య రసోత్పత్తి! మరీ నిదానంగా ఆలోచిస్తే ఎన్నెన్ని దురవస్థలకో నీరసమే మరి!

‘కరోనా జాగ్రత్తలు’ కేప్షన్! స్కూటర్ మీద ఆఫీస్‌కు బయల్దేరుతున్నాడు చిరుద్యోగి. భార్య బాక్స్‌ల్ని అందిస్తోంది. ‘వేడినీళ్లతో బాటు ఇందులో శొంఠి పొడీ, అల్లప్పచ్చడీ, మిరియాల చారూ పెట్టా! రెస్టుండాల్ట’! రెండు గంటలు పడుకోండి!’ ఇదీ అసలు పంచ్! – నవ్వురానివాడు – ‘ఖర్మ’కారుడు! అంతే!

“ఇదిగో-అంటే అన్నానంటావు-మీ తమ్ముడు చేతుల్లో బాటు తలని కూడా శానిటైజరుతో …! – ఇదీ వ్యాఖ్య! వ్యాఖ్యానం బొమ్మ ఏమున్నదో-‘నవ్వు’కోరానా’యనా’ కార్టూన్ సంపుటి తెప్పించుకుని చూసి, ఆనందించండి. చిన్నా పెద్దా బొమ్మలన్నీ కలిపి 250 పైగానే లభించును!

సరసి కార్టూన్లలో పాత్రలు – మనమూ, మనిరుగూ పొరుగూ, దారిన పోతూ మనం చూసీ చూడనట్టు తప్పుకుపోయే అశేష సశేషవర్గం మనుషులుకు, వాటిలో తొణికే నవరసాలకీ మన లోలోపల అవ్యక్తమధురిమలూ, వ్యక్త విసుగులూ, విసుర్లూ, వికృతులూ!! సరసి కార్టూనంటే మనను మనం అద్దం ముందు నిలబెట్టుకున్నట్టే! అందుకే ఆయన గడు(గీత)సరి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here