[box type=’note’ fontsize=’16’] కథా రచనలోని విభిన్నప్రక్రియలను వివరిస్తూ కథ గురించి అవగాహన కలిగించే వ్యాసపరంపర, తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందు వచ్చిన గ్రంథాల కంటే భిన్నమైన వస్తురూపాలతో – విలక్షణంగా వెలువడిన గ్రంథాల విశ్లేషణ. తెలుగు సాహిత్యంలో అత్యంత అనుభవజ్ఞుడయిన రచయిత విహారి విశ్లేషణాత్మక వివరణలివి. [/box]
డాక్టర్ రావి రంగారావు కవిత్వమంతా అచ్చమైన సమకాలీనమైన దేశీయతే!
[dropcap]రా[/dropcap]వి రంగారావు గారు అనగానే మినీ కవిత్వోద్యమ గుర్తుకొస్తుంది. 1980 నుండి అనేక సంవత్సరాలు తెలుగు నాట మినీ కవిత గురించి ఆయన -డాక్టర్ జివి పూర్ణచంద్ తో కలిసి ఉద్యమస్థాయిలో ప్రచారంచేశారు.
1980- 2005 వరకు వచ్చిన ఉత్తమ మినీ కవితల సంకలనం “వెయ్యి నూట పదహార్లు” పేరుతో ప్రచురించారు. దీనిలో సుప్రసిద్ధులు, ఔత్సాహికులు అయిన 1227 మంది రాసిన మినీ కవితలు ఉన్నాయి. ఇదికాక, ఏటా మినీ కవితా సంకలనాలు ప్రచురించి ఎందరో కొత్త కవుల మినీ కవితల్ని వెలుగులోకి తెచ్చారు. “మినీకవితలలో మెనీ భావాలు” రంగారావు గారి ఎం.ఫిల్.పరిశోధన గ్రంథం. వీరి “పిల్లల్లోకవిత్వం రచనా నైపుణ్యాలు”- పిహెచ్. డి. సిద్ధాంత గ్రంథాన్ని ఆచార్య చేకూరి రామారావు గారు ‘ground breaking research’ అనీ, ఏ భాషలోనూ ఇలాంటి పరిశోధన చూడలేదనీ మెచ్చుకున్నారు.”మినీకవితలలో మెనీ భావాలు” అనే వ్యాస సంకలనం వారి సాహిత్యాంశాల నిశిత పరిశీలనా దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది.
రంగారావు గారు మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలలో బోధన అధ్యాపకుడిగా మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు. అనేక బోధనా పద్ధతుల గ్రంథాల్ని కూడా రాశారు.
పద్యకవిగా రావి రంగారావు గారు వెలువరించిన “అమృత వృక్షం”, “రావి శతకం”, “వింటివా ఏడుకొండల వెంకటేశ”, “అశ్వత్థ వృక్షం”మొదలైన గ్రంథాలు సరళ వ్యావహారిక శైలిలో, అభ్యుదయ భావాలతో వెలువడినాయి. వచన కవితా సంపుటాలు అనేకం ఉన్నాయి. అవన్నీ పాఠకాదరణనీ, సాహితీ లోకం ప్రశంసల్నీ పొందాయి. రంగారావు గారికి అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, సత్కారాలు లభించాయి
రంగారావు గారు బహుముఖీనమైన కవిత ప్రయోగాలు చేశారు. 1984 లో మన రాష్ట్రంలో సంభవించిన రాజకీయ పరిణామాల మీద రాసిన దీర్ఘ కవితా సంపుటి “సూర్యుళ్ళ గెలుపు” విశేష ప్రశంసల్ని పొందింది. “అమరావతి సాహిత్య మిత్రులు” సంస్థను స్థాపించి, “జనరంజక కవిత్వ” గ్రంథాలకు పురస్కారాలు అందిస్తున్నారు.
అంతకు ముందు వచ్చినవి కాక, 2018, 19, 20 సంవత్సరాలలో ఒక్కొక్క కవితా సంపుటి చొప్పున మూడు సంపుటాలు వెలువరించారు రంగారావుగారు.
రావి రంగారావు గారి కవిత్వంలో సమకాలీన ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక సంభవాల స్పర్శ ఎక్కువగా ఉంటుంది. తన కవిత్వంలో వారే చెప్పుకున్నట్టు “రాసింది గొప్ప అందంగా ఉండాల్సిన నియమం లేదు. చక్కగా అర్థం అవుతూ ఉంటే చాలు. కొట్టివేతలు తప్పుపట్టాల్సిన పనిలేదు. రాసిన ఆకాశం కాగితం మీద సత్యం సూర్యుడు వికసించాలి”– ఇదే రంగారావు గారి కవిత్వ ఆత్మ!
దేశంలోని సామాజిక దుస్థితిని రంగారావుగారు వర్ణించే విధానం నవ్యంగా, అభివ్యక్తి తీవ్రతతో ఉంటుంది.
‘రాత్రి జనం పడుకొన్నాక/ఏడవటం మొదలెట్టింది/ దేశంలో విశ్వాసం విరుల ప్రమాణాలు పడిపోయాయని…./ అర్ధరాత్రి శివాలయానికెళ్ళింది/ మనిషిని మనీషిగా కాదు/ మనిషిగా నిలబెట్టలేకపోయినా/ తనతో సమానంగానైనా / ప్రవర్తించేలా వరమివ్వాలని……./ ఉషోదయానికి లేచి హుషారుగా తిరగటం మొదలెట్టింది / మారిన మనసుల్ని చూడాలని/ మనసునిండా దేశం గురించి పాడాలని/….. కానీ కాసేపటికే ఏడవడం మొదలు పెట్టింది/ మనిషి దేవుడిని కూడా కొనేశాడని/ తనకన్నా హీనంగా దిగజారాడని/ మహీతలం పరువు దిగజార్చాడని……”! ‘కుక్క ఏడుపు’ అని శీర్షిక!!కవితాభివ్యక్తిలోని వ్యంగ్యం ఎంతో చేవగావచ్చింది!
కాలం ముందుకు పోతుంటే మనిషి వెనక్కి పోతున్నాడా అనే ఒక ప్రశ్న ఎప్పుడూ కవిని వేధిస్తూనే ఉంటుంది. కారణం – పరిణామక్రమంలో కుడి ఎడమల ఎటు చూసినా అవాంఛనీయ ధోరణే కనిపిస్తూ ఉండటం!
‘పేదలు – అనాథలు’ అనే కవిత గాఢమైన ఆలోచనా ప్రేరకంగా సాగుతుంది.
“మా ముత్తాత/ గులాబీ పువ్వులోనో మల్లె పువ్వు లోనో బృహస్పతిని దర్శించాడు/ ఇప్పుడు వీళ్ళడుగుతున్నారు/ ‘పువ్వులంటే ఏంటి అంకుల్?!’
“మా తాత మామిడిపండు లోనో అరటి పండులోనో ‘మదర్ థెరీసా’ ను గమనించాడు/ ఇప్పుడు వీళ్ళడుగుతున్నారు/ ‘పండంటే ఏంటి ఆంటీ?’!
“మా నాన్న రావి చెట్టు లోనో, వేప చెట్టు లోనో దివ్యుల్ని చూడగలిగాడు/ ఇప్పుడు వీళ్ళడుగుతున్నారు/ చెట్టంటే ఏంటి డాడీ?!”
“మా అబ్బాయి/ కూలి మనిషిలోనో/ బక్క రైతు లోనో అమ్మనో నాన్ననో వీక్షించాడు/ ఇప్పుడు వీళ్ళడుగుతున్నారు/ ‘మనిషంటే, రైతంటే ఏంటి మమ్మీ?!”
“ఇప్పుడు మా మనవళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా సరే/ మాతృభాష అమృతం తాగని అనాథలే/ఆనందానుభూతులందని అత్యంత పేదలే?!”
సామాజిక స్పృహ అంతిమ వాంఛితం సామాజిక న్యాయ పరిరక్షణ. కవి మననధారలో ఎప్పుడూ, వారి స్థితి గతులపట్ల సంవేదనే!
“కాలం అమృత వృక్షం/ మధ్యలో ఎన్ని వచ్చినా భయపడకుండా/ పూనిక వదిలిపెట్టకుండా/ పిండుకో కలిగినవాడే నరుడు”…అంటూ, కవిత ముక్తాయింపుగా…సామాజిక న్యాయం ఆవశ్యకతను దృఢపరుస్తూ–” అందరికీ పంచి పెట్టగలిగినవాడే అమరుడు!”..అని కవిగా క్రాంతి దర్శనం చేశారు!
రంగారావు గారి కవిత్వంలో దృశ్య స్పృహకూడా చాలా స్పష్టంగా, శబ్ద చిత్రాలతో అలరిస్తుంది. ఆయన ‘పండ్లు అమ్ముకునే పెద్దాయన’ గురించి రాశారు, ఉపాధ్యాయుల లోవెతలు, వెలిచిరునవ్వుల్ని గురించి రాశారు, పార్టీ జెండాలు గురించి, వడ్డీ మంటల్లో మనుషుల్ని గురించి, పండగ దండగ గురించి, ఈగో సర్టిఫికెట్ గురించి, పూల తపన గురించి, ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్న పెద్దల్ని గురించి కవితాత్మకంగా ఆవిష్కరించారు. నిరంతరం రేగుతున్న గాయాల రోడ్డున పడుతున్న బాధితుల నరకం గురించి, డాక్టర్ సూర్యుడు గురించి…. ఇలా ఇలా అనేక అంశాల మీద అనుకరణ కాలుష్యం లేని కవిత్వం రాశారు రంగారావుగారు.
రంగారావు గారి కవిత్వంలో మరొక ప్రత్యేకత అక్లిష్టత. దాని సౌందర్యం వారి కవితల్లోని చాలా పదునైన అభివ్యక్తిలో కనిపిస్తుంది. “కుర్చీల మహిమలు”.. అని ఒక కవిత ఉంది. ” ఆ కుర్చీలు అంటే అంత మోజు అందుకే మరి” … అంటూ మొదలవుతుంది ఆ ఖండిక. “కుర్చీ లెక్కగానే ఎన్నెన్నో మహిమలు వస్తాయి” …… అంటూ ఆ మహిమలు అన్నింటినీ — స్ట్రక్చరల్ పోయెమ్– గా మన ముందు దర్శింప జేస్తారు.వాక్యాన్ని వ్యంగ్య విలసితం చేయటం కవిత్వ శిల్ప నైపుణ్యాల్లో ఒకటి!
“దృశ్యాన్ని మార్చటానికి /దృశ్యం లో కనిపించే వారెవరురూ/ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రారు/ కంటికి కనిపించక పోయినా/ మనం పిలిచి అర్థించక పోయినా/ సత్య సాక్ష్యం ఇవ్వడానికి మాత్రం/ ఎప్పుడైనా సిద్ధమేనంటోంది గాలి”…. అనగానే ఈనాటి సామాజిక అవ్యవస్థలోని, బయటకు చెప్పుకోలేని బహిరంగ రహస్య విషాదం పఠిత భావనాకాశంలో రూపుదాలుస్తుంది. తేలికైన శబ్ద శరీరం గాఢమైన వస్తుప్రాణాన్నిప్రోదిచేస్తూ, కవిత్వ సౌందర్యంతో ఆకర్షణీయం చేస్తుంది.
రంగారావు గారి కవిత్వంలో కొన్ని రూపకాలు వారి అనుభవసారాన్నీ, సాహిత్య సంప్రదాయాల విజ్ఞతనీ తెలియజేస్తుంటాయి. పతన త్యాగం, మెరుపుల కన్నులు, మేఘ హస్తాలు, పుస్తకం సముద్రం, కాంతి వస్త్రాలు, వంటివి… భావ విస్తరణకు ఆలోచన ప్రేరకంగా కనిపిస్తాయి మనిషి జీవన తత్వాన్ని కరతలామలకం చేస్తూ, సామాజిక ప్రయోజనాన్ని దర్శింపచేస్తూ తనదైన సొంత ముద్రతో మెరుపులీనుతోంది–రంగారావు గారి కవిత్వ పటుత్వ సంపద. వచన కవితాప్రియలకు అమృతఫలాల్ని అందిస్తున్న రంగారావు గారికి అభినందనలు!!