ఏరిన ముత్యాలు 8

3
2

[box type=’note’ fontsize=’16’] కథా రచనలోని విభిన్నప్రక్రియలను వివరిస్తూ కథ గురించి అవగాహన కలిగించే వ్యాసపరంపర, తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందు వచ్చిన గ్రంథాల కంటే భిన్నమైన వస్తురూపాలతో – విలక్షణంగా వెలువడిన గ్రంథాల విశ్లేషణ. తెలుగు సాహిత్యంలో అత్యంత అనుభవజ్ఞుడయిన రచయిత విహారి విశ్లేషణాత్మక వివరణలివి. [/box]

కథావస్తువు ఎంపికలో నవ్య చైతన్యం ఎమ్వీ రామిరెడ్డి ‘కురుక్షేత్రం’

[dropcap]శ్రీ[/dropcap] ఎమ్వీ రామిరెడ్డి గారు సాహితీలోకానికి చిరపరిచితులు. 1997లో రచనా వ్యాసంగం మొదలెట్టి-వేగంగా రచనలు చేస్తూ, వాటికి వివిధ పత్రికల నుండి సాహిత్య సాంస్కృతిక సంస్థల నుండి ఒక డజనుకు పైగా ప్రతిష్ఠాత్మక బహుమతుల్నీ, పురస్కారాల్నీ అందుకుంటూ-ఉత్తమ రచయితగా మన్ననల్ని పొందుతున్నారు. 3 కవితా సంపుటాలు, 2 కథా సంపుటాలు, ఒక నవల, 4 రేడియో నాటికలు, 2 నాటకాలు, పాతికకు పైగా వ్యాసాలూ, 30 దాకా పెద్దల జీవిత కథనాలు, మరో 20 విశేష వాస్తవ కథనాలూ వచ్చాయి. తండ్రి గారి జ్ఞాపకార్థం వృద్ధాశ్రమం, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ సంస్థల ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాల్ని తమ ట్రస్ట్ ద్వారా చేపట్టారు. దాని ద్వారా 13 పుస్తకాల్ని ప్రచురించారు. 11 ఏళ్లు ఈనాడు సంపాదకశాఖలో పనిచేసి, 2006 నుండి రాంకీ ఫౌండేషన్ సిఈఓగా వ్యవహరిస్తున్నారు. రామిరెడ్డి గారి ఇటీవలి ‘వెంటవచ్చునది’ కథా సంపుటి విశేష గౌరవాన్నీ, పురస్కారాల్నీ పొందింది, పొందుతున్నది.

రామిరెడ్డి గారి ఈనాటి ఒక అపూర్వమైన కథ-‘కురుక్షేత్రం’. కథల పోటీలో రెండవ బహుమతి పొంది, పాలపిట్ట – నవంబరు 2020 సంచికలో వచ్చింది. ఈ కథా వస్తువు మీద నా ఎరుకలో తెలుగులో ఇంతవరకూ మరో కథ రాలేదు. అందుకూ ఇది ఈ ‘సంచిక’ ఏరిన ముత్యమైంది.

‘కురుక్షేత్రం’ కథ సామాజిక సేవారంగంలో జరుగుతున్న అత్యంత ఆవశ్యకమైన కొత్త అంశాన్ని అక్షరీకరించింది.

‘కురుక్షేత్రం’ కథ ఇలా నడుస్తుంది: కృష్ణవేణి ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో క్రియాశీల సాంఘిక సేవా కార్యకర్త. ఆమెకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శశిధర్‌తో పరిచయం, ప్రేమ…! బాగా సన్నిహితులైనారు. శశిధర్‌కి కృష్ణవేణి బారుజడ అంటే ఆరాధన. అంతో ఇంతో భావుకుడు అతను. ఏదో ప్రాజెక్ట్ పనిమీద ఆస్ట్రేలియా వెళ్లాడతను. తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుందామనుకున్నారు. ఇక్కడ కృష్ణవేణి ‘హెయిర్ ఫర్ హోప్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న ఒక సెమినార్‌కి వెళ్లింది. ఆ సంస్థ కేన్సర్ పేషంట్స్ (స్త్రీలు) అనుభవిస్తున్న ఒక ప్రత్యేక సమస్య మీద తమ దృష్టిని కేంద్రీకరించి, కొన్ని చర్యల్ని చేపట్టింది.

“ఒకవైపు క్యాన్సర్ వ్యాధితో కుంగిపోయి, మరోవైపు కీమోథెరపీతో జుట్టంతా ఊడిపోవటంతో విపరీతమైన ఆత్మన్యూనతకు లోనై డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదముంది. ఒక చిన్న చేర్పు లేదా కూర్పుతో వాళ్లల్లో కొత్త ఉత్సాహం తీసుకురావచ్చు. ఇలా చూడండి…” అంటూ తెరమీద ఓ మహిళ గుండుతో దిగాలుగా కూర్చొని ఉన్న ఫోటో డిస్‌ప్లే చేశారు. ఆమె మొహం కళాహీనంగా ఉంది. వెంటనే మరో ఫోటో చూపించారు. అదే మహిళ విగ్గు ధరించి ఉంది. ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. ఇద్దరూ ఒకరేనని వెంటనే గుర్తుపట్టలేకపోయిన కృష్ణవేణి ఆశ్చర్యపోయింది.

“ఇలా…. వారిలో సరికొత్త జీవనోత్సాహం నింపగల అవకాశం మా చేతుల్లో లేదు. మీ భుజాలపై ఉంది. అది కూడా మీలో పొడవైన వెంట్రుకలున్న వాళ్లకు మాత్రమే ఉంది”.

“ఏం చెయ్యాలి?” ఉత్సాహంగా అడిగింది మూడో వరసలో కూర్చున్న పొడవైన జడ గల అమ్మాయి.

“మీ రెండు జడల్లోంచి 14 అంగుళాల పొడవైన జుట్టును డొనేట్ చెయ్యాలి. అది కూడా ఆరోగ్యవంతమైన జుట్టు అయితేనే. మేమే వచ్చి కత్తిరించి తీసుకుంటాము. కొందరైతే ఒక మొక్కులా… మొత్తం జుట్టును దానమిస్తామంటారు. గుండు చెయ్యటం ద్వారా వాళ్ల జుట్టును సేకరిస్తాం. అలా అయిదారుగురి నుంచి సేకరించిన జుట్టంతా కలిపితే ఒక విగ్గు తయారవుతుంది”

“వినటానికి బాగున్నా, అమలు అంత తేలిగ్గాదు. స్త్రీలకు జుట్టే అందం. ప్రేమగా చూసుకునే కురుల్ని కత్తిరించి ఇవ్వటం కష్టమే. తీరా ఇచ్చాక, రూపురేఖల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అందమంతా అమాంతం అదృశ్యమై పోయినట్లుంటుంది. కానీ, ఆ త్యాగం గొప్పది. రెండుమూడు నెలలు ఓపిక పడితే మీ జడలు మీకొచ్చేస్తాయి. చేతులు జోడించి వేడుకుంటున్నాము…. మీ జుట్టును దానమివ్వండి” ఇదీ ఆ సంస్థ విజ్ఞప్తి. ఈ విజ్ఞప్తికి స్పందించి కృష్ణవేణి తన జుట్టుని ఇచ్చింది.

శశిధర్ తిరిగి వచ్చాడు. కొండంత ఆశతో, ఆమె జడకు అలంకరణలు కొనుక్కుని తెచ్చాడు! సహజంగానే, నిరాశ, నిస్పృహ… కినుక, కోపం… ఇవన్నీ మామూలు కథల్లో భాగాలు అవుతాయి. అతనామెని నిరాదరించటం లేక నిరాకరించటం వగైరా…! ఈ కథలోనూ అయ్యాయి! అతను దుఃఖంలో, కోపంలో ఆమెను నిందించి వెళ్లిపోయాడు!

‘కురుక్షేత్రం’లో ఇక్కడ ఒక మలుపు ప్రవేశించింది. శశిధర్ మేనత్త కేన్సర్ పేషెంట్. కీమోథెరపీల వలన ఆమె జుట్టంతా వూడిపోయింది. ఆమె తీవ్రమైన డిప్రెషన్లో వుంది. శశిధర్ అతని మామయ్యకు ఈ ‘హెయిర్ ఫర్ హోప్’ సంస్థ గురించి చెప్పి వాళ్ల సహాయంతో తన అత్తయ్య ‘డిప్రెషన్’ నుండి కోలుకొనేటట్లు చేస్తాడు. అప్పుడు కృష్ణవేణి చేసిన పవిత్రకార్యం గురించిన ఆలోచనలో పడ్డాడు. తప్పుచేసిన భావం అతన్ని స్థిరంగా కూర్చోనివ్వటం లేదు. ఒక నిర్ణయానికొచ్చి, ఫోన్ తీసి, కృష్ణవేణికి కాల్ చేశాడు. “చెప్పండి” అత్యంత మామూలుగా పలకరించింది కృష్ణవేణి.

“సారీ… సారీ కృష్ణా, నాకిష్టమైన జడను నువ్వెవరికో దానమిచ్చావని వివేకం కోల్పోయి ఏదేదో మాట్లాడేశాను. మా అత్తయ్యకే అవసరమైన ఈరోజు అదే సంస్థను ఆశ్రయించాల్సి వచ్చింది. నిజంగా వాళ్లు చేస్తున్న సేవ అపూర్వం. హెయిర్ డొనేట్ చేసేవాళ్లు అంతకన్నా…..”

“ఒక్క నిమిషం శశీ! శరీరానికి జుట్టూ బొట్టూ ఉండాలని నువ్వనుకుంటున్నావు; మనిషికి రక్తమాంసాలుండాలని నేననుకుంటున్నాను. నువ్వు జ్ఞానోదయం పొందటానికి ప్రతిసారీ బోధివృక్షం దొరకదు. కామన్ సెన్స్ ఉండాలి. అది లేని వాళ్లను నేనెప్పటికీ ప్రేమించలేను…” విసురుగా ఫోన్ పెట్టేసింది కృష్ణవేణి.

ఇదీ కథ. కథా నిర్మాణం దృష్ట్యా, శిల్పపరంగా చెప్పుకోవలసిన విషయం -కథని చక్కని అంకాలుగా విభజించి రాయటం. దీని వలన పాఠకుడికి సంఘటనల ప్రవాహం స్పష్టంగా కనిపిస్తోంది. వస్తుకేంద్రకానికి నడిచే సన్నివేశ కల్పన, ముఖ్య పాత్రల పోషణ-పటిష్టంగా వచ్చాయి.

…. “జుట్టంతా ఊడిపోయి, కళాహీనంగా ఉన్న క్యాన్సర్ పేషెంటులా ఉందా చెరువు.

పక్కనున్న పార్కు మాత్రం కళకళలాడుతోంది. తనను ఆశ్రయించిన వారి నిస్పృహకు నిప్పు పెట్టగల దయామయిలా.

ఆ పార్కులో ఓ చెట్టుకింద కూర్చొని ఉన్నారు కృష్ణవేణి, శశిధర్. “ఎప్పుడు ప్రయాణం? అడిగిందామె”–

కథానిక ఎత్తుగడనే ఇలా ప్రారంభించి ఒక సాభిప్రాయమైన మెరుపుని చూపారు రచయిత. తాను కూర్చిన పోలికల్ని జరగబోయే కథా వస్తువుకి అనుసంధానం చేశారు. అలాగే, పాఠకుని కథా పఠనానికి చేయిపట్టి లాగేట్టు- ఆ సన్నివేశాన్ని మొదలెట్టారు. కథ నిడివి కొంత విస్తరించినట్టు అనిపించినా, సంఘటనల్లోని ఉత్కంఠవలన చదివించే గుణానికి ఇబ్బంది రాలేదు. కథ ముగింపు మీద పాఠకుల్లో అభిప్రాయభేదాలు కలుగవచ్చు. కృష్ణవేణి నిర్ణయం-గతంలో శశిధర్ ‘తొందరపాటు’ వంటిదే అన్న ధ్వనిని వినిపించి ముగిస్తే బాగుండేదనిపించింది నాకు. లేదా Open-ended గా నిర్ణయాన్ని చెప్పకున్నా బాగుండేది. ఆరోజుల్లో- ‘చెల్లెలి కాపురం’ సినిమాలో శోభన్ బాబుని అందం వికారిని చేయవలసిన అవసరమేమిటని బందర్లో మేమొక సమావేశంలో విశ్వనాథ్ గారిని అడిగితే, వారొక మాట అన్నారు, ‘రచయితకు పాత్రలమీద, సందేశంమీద, సంఘటనలమీద కొన్ని Convictions ఉంటాయి. వాటిని ప్రశ్నించటం తప్పు. ఆ Conviction ఎలా పోషింపబడింది, ఎలా రాణించింది-అన్న అంశాలే చర్చనీయం’ అని! ‘కురుక్షేత్రం’ అలా ముగియటమే రచయిత Conviction అన్నమాట! మంచి కథను అందించిన రామిరెడ్డిగారికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here