విశాల దృక్పథం అలవరుచుకోవాలనే సందేశాన్నిచ్చే జి.కాళిదాసు కవిత ‘ఆశలు’

0
2

[కరీంనగర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రిటైర్డ్ తెలుగు భాషా ఉపన్యాసకులు, కవి శ్రీ జి.కాళిదాసు కలం నుండి జాలువారిన ‘ఆశలు’ అనే కవిత పై విశ్లేషణా వ్యాసం అందిస్తున్నారు సందినేని నరేంద్ర]

[dropcap]‘ఆ[/dropcap]శలు’ కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాలో ఆలోచనలు రేకెత్తించింది. ఏదో సాధించాలనే దిశగా ప్రతి మనిషికి ఆశలు ఉంటాయి. ఆశలు ఉండడం సహజమే. కాని ఆ ఆశలు అత్యాశలు కారాదు. కాని ఆశలు నెరవేర్చుకునే దిశగా సరైన ప్రణాళికలతో కృషి చేస్తే ఉన్నత లక్ష్యాన్ని చేరుకుంటాం. చదువుకునే రోజుల్లో ఒక పేపర్ బాయ్‌గా పనిచేసి కష్టపడి చదువుకొని ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్తగా మరియు భారత రాష్ట్రపతిగా ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. ఈనాటి సమాజంలో ఆశలు ఎలా ఉంటున్నాయి. ఆశలు పరిపూర్ణం చేసుకోవడానికి ఈనాటి యువత అక్రమాలకు పాల్పడుతున్నారు. కవి కాళిదాసు ‘ఆశలు’ కవితలో భావాలను అద్భుతంగా పండించారు.

‘అర్హత లేకున్న నాకు

అందలం కావాలి’

అర్హత అంటే వ్యక్తి యొక్క జ్ఞానం, అతని యొక్క అనుభవం. పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల యోగ్యతను పరీక్షిస్తారు. అర్హత అంటే ఏదైనా పని చేయడానికి గల సామర్థ్యం అని అర్థమవుతుంది. అందలం అంటే పల్లకి అని అర్థమవుతుంది. పల్లకి ఎవరు ఎక్కుతారు? రాజులు రాణులు పల్లకిలో ఎక్కి ఊరేగుతారు. పల్లకిని ఎవరు మోస్తారు? పల్లకిని బోయిలు మోస్తారు అని అర్థమవుతుంది. అర్హత లేకున్నచో అందలం ఎలా దొరుకుతుంది? అనే ప్రశ్న మనలో కలుగుతుంది. అర్హత లేకుంటే ఈనాటి నవీన సమాజంలో ఉద్యోగం, ఉపాధి దొరకడం కష్టమని మన అందరికీ తెలుసు. కొందరు మాత్రం ఏ పని చేయకుండా బేవార్స్‌గా తిరుగుతుంటారు. అయినప్పటికి కొందరు గొప్ప పదవి సంపాదించడానికి గల కనీస సామర్థ్యం తమకు ఉందా అని ఆలోచించరు. గొప్ప పదవి తమకు కావాలని కోరుతారు. అట్లా గొప్ప పదవి కావాలని కోరడం వాళ్ల అత్యాశ అని చెప్పవచ్చు.

‘సాధించినదేమీ లేదు

అయినా సన్మానం కావాలి’

మనిషి ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ పనిలో నైపుణ్యం పెరుగుతుంది. అలాంటి నైపుణ్యం గల వ్యక్తులను సన్మానించడంలో తప్పు లేదు. ఏ పని చేయకుండా రికామిగా ఉంటూ బజార్ల వెంట బహదూర్‌గా తిరుగుతూ ఉండటం మనం రోజు చూస్తున్నదే. అట్లాంటి వాళ్ళు ఈనాటి సమాజంలో ఎక్కువగా మనకు కనిపిస్తారు. వాళ్ళు ఏదైనా పనిచేసి సాధించినదేమీ లేదు. అయినా సన్మానం కావాలి అని కోరుకుంటారు. అట్లాంటి అసమర్థుల తీరును కవి చక్కగా తమ కవితలో వ్యక్తం చేశారు. అర్హత లేని వారికి సన్మానం చేస్తే వారి వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదనే నిజాన్ని కవి కాళిదాసు చక్కగా వ్యక్తీకరించారు.

‘తక్కువ సమయంలో

ఎక్కువ సంపాదించాలి’

తక్కువ సమయంలో ఎక్కువ ఎలా సంపాదిస్తారు? అనే ప్రశ్న మనలో తలెత్తవచ్చు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తారు. జూదం అనేది త్వరగా డబ్బు సంపాదించే మార్గంగా చిత్రీకరించబడినందున ఇది యువకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. యువకులు చివరికి జూదానికి బానిసలుగా మారుతారు. జూదం ఒక వ్యసనం. జూదం ఉచ్చులో పడిపోయే వ్యక్తులు నేరాలు, ఘోరాలు చేస్తారు. మట్కా, పేకాటలలో ఎక్కువ సంపాదించవచ్చనే ఆశతో అమాయకులు జూదానికి బానిసలు అవుతున్నారు. ఎన్నో కుటుంబాలు జూదం వల్ల నాశనం అవుతున్నాయి.

‘తప్పొప్పులు నాకు తెలియవు

గొప్ప వాడిని కావాలి’

ఇది తప్పు, ఇది ఒప్పు అనే విచక్షణా జ్ఞానం ప్రతి మనిషిలో ఉండాలి. ఈనాటి మానవుడు గొప్పవాడు కావడానికి సులువైన మార్గాలు వెతుకుతున్నాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుడు తప్పుడు మార్గంలో పయనిస్తున్నాడని తెలిసినా వారించలేదు. దండించలేదు. దుర్యోధనుని దురాశల వల్ల మహాభారత యుద్ధం జరిగింది. కౌరవులు సామ్రాజ్యమును కోల్పోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు పాండవులు విజేతలయ్యారు. ఇట్లాంటి ఆశల వలయాన్ని కవి కాళిదాసు వ్యతిరేకిస్తున్నారు.

‘పిల్లలు కావాలి కాని

తల్లిగ పాలివ్వలేను’

అప్పుడే పుట్టిన పసిపాపకు ఆరు నెలల వయస్సు వరకు వారి ఎదుగుదలకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. తల్లిపాలు బలవర్ధకమైనవి. ఆరునెలల వరకు బిడ్డకు కావలసిన పరిమాణంలో పోషక పదార్థాలు తల్లిపాల ద్వారా లభిస్తాయి. తల్లిపాలు పరిశుభ్రమైనవి. తల్లిపాలు తేలికగా జీర్ణమయ్యే విధంగా సరి అయిన ఉష్ణోగ్రతతో లభిస్తాయి. పిల్లలకు అంటువ్యాధులు రాకుండా కాపాడే వ్యాధి నిరోధక శక్తి తల్లి పాలలో ఉంటుంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఏర్పడిన  అధికమైన  కొవ్వు వల్ల మారిన శరీరాకృతి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తిరిగి మామూలు స్థితికి వస్తుంది. తల్లి బిడ్డకు పాలివ్వటం వలన ఋతుస్రావం ఆలస్యం అవుతుంది. బిడ్డ పాలు త్రాగడం వల్ల అండం విడుదల నిరోధింపబడి మళ్లీ గర్భం ఏర్పడడానికి కొంత వ్యవధి లభిస్తుంది. తల్లి పాలు ఇవ్వడం వలన తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. పిల్లలు పాలు త్రాగడం వలన వారి దవడలు, దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది. తల్లిపాలు ఇవ్వడం ద్వారా ప్రసవానంతరం జరిగే రక్తస్రావం నియంత్రించవచ్చు. తల్లిపాలు ఇవ్వడం వల్ల రొమ్ము మరియు గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం సన్నగిల్లుతుంది. భారతదేశంలో తల్లిపాలు ఇవ్వడం అనేది పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. పట్టణాలలో తల్లి పాలివ్వటం తగ్గిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కుటుంబ ఆరోగ్యపరంగా తల్లిపాలను ఇవ్వమని ప్రోత్సహించారు. కొందరు మహిళలు పిల్లలు కావాలి కాని తల్లిగ పాలివ్వలేను అనే దృఢమైన అభిప్రాయంతో ఉన్నారు. పిల్లల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం మంచిది. పిల్లలకు పాలివ్వడం వలన తమ అందం తగ్గిపోతుందనే తప్పుడు అపోహ ఉంది. ఈనాటి సమాజంలో కొందరి తల్లుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. అట్లాంటి తల్లుల గురించి కవి కాళిదాసు సరియైన భావాన్ని తమ కవితలో వెల్లడించారు.

‘పండు ముదుసలితనంలోను

పడుచులాగ  కన్పించాలి’

పండు ముసలితనంలో పడుచులాగా కనిపించడం కొరకు అనేక కాస్మెటిక్స్ క్రీమ్స్ ముఖానికి రుద్దుతారు. ఆ కాస్మెటిక్ క్రీముల వలన అందంగా ఉన్నట్టు తళతళ మెరిసిపోతారు. అప్సరసలాగ అగుపిస్తారు. అట్టి కాస్మెటిక్స్ వల్ల ముఖం యొక్క సహజమైన ఆకృతిని కోల్పోతున్నారు. పండు ముదుసలితనంలో పడుచులాగా ఎందుకు కనిపించాలి? ఏ వయసులో ఉన్నవారు ఆ వయసులో ఉన్నట్టు కనిపిస్తే బాగుంటుంది. ముసలితనంలో పడుచుదనం కొరకు ప్రయత్నించడం మంచిది కాదు. ముసలితనం కాలానుగుణంగా వచ్చునట్టిది. ముసలితనంలో పడుచులాగా కనిపించడం వల్ల ఆత్మాభిమానం పెరుగుతుంది. అట్లాంటి అసహజమైన వింత కోరికల వలన వారు కృత్రిమ పద్ధతులను అవలంబిస్తారు. ఇది ఒక వెర్రిగా కనిపిస్తుంది. మనిషి మనిషి లాగా ఉండాలి అనే కవి కాళిదాసు భావన చక్కగా ఉంది.

‘ప్రతిభ గూర్చి అడిగేదెవ్వడు

పత్రికలో మన పేరుండాలి’

ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుంది. చాలామంది తమలో ఉన్న ప్రతిభను గుర్తించక ఇబ్బంది పడుతుంటారు. తమలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆ రంగంలో కృషి చేసినచో ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతారు. తమను తాము నిరూపించుకోవడానికి ప్రతిభతో పాటు ఆత్మవిశ్వాసం అవసరం. ఆత్మవిశ్వాసం లేకుండా ప్రతిభను సరిగ్గా వ్యక్తం చేయలేరు. ప్రతిభ, ఆత్మవిశ్వాసం కలిసినట్లయితే దేనిని అయినా సాధించవచ్చు. మనలోని ప్రతిభను గూర్చి ఎవ్వడు అడుగుతాడు. పత్రికలో మన పేరు ఉండాలి అని అనుకోవడం సరైనది కాదు. ప్రతిభ ఒక సృజనాత్మకమైన ప్రక్రియ. ప్రతిభ వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈనాటి సమాజంలో కొందరు తమకు ప్రతిభ లేకున్నప్పటికి ఉన్నట్టుగా నటిస్తుంటారు. పత్రికలలో తమ పేరు వచ్చేటట్లు చేసుకుంటారు. అలా ప్రవర్తిస్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారని చెప్పవచ్చు. ప్రతిభ లేకున్నప్పటికి పత్రికలో తమ పేరును మాత్రం ప్రతిభ ఉన్నట్లుగా రాయించుకునే వాళ్ల వల్ల సమాజానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పవచ్చు. ఏ రంగంలో కృషి చేయకుండా పత్రికలో వట్టిగా పేరు రావడం అనే ప్రక్రియ సరియైనది కాదు అని కవి కాళిదాసు భావించడం చక్కగా ఉంది.

‘పనిచేయడం నాకు కుదరదు

ఫస్ట్‌కు జీతం కావాలి’

పనిచేయడం నాకు కుదరదు అంటే పనిచేయడాన్ని నిరాకరించడం అని అర్థమవుతుంది. మీరు మీ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రతి దినం క్రమం తప్పకుండా పని చేయాలి. మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత మంచిది.అది మీకు పనిలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. పనిచేయకుండా ప్రతిభను నిరూపించకుండా ఫస్ట్‌కు జీతం కావాలి అనే పద్ధతి సరి అయినది కాదు. కాని చాలామంది పనిచేయకుండానే నాయకులమని చెప్పి తమకు అధికారుల మరియు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని బెదిరిస్తూ పని చేయడం మాని ఫస్ట్‌కు జీతం తీసుకుంటున్నారు. అట్లాంటి వాళ్లు సమాజానికి కీడు చేస్తున్నారని చెప్పవచ్చు. మనం శ్రమించి శ్రమకు తగ్గ ప్రతిఫలం తీసుకోవాలి. శ్రమించకుండానే ప్రతిఫలం తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. పనిచేయడం నాకు కుదరదు. ఫస్ట్‌కు జీతం కావాలనుకునే వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. సమాజానికి వాళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కవి కాళిదాసు ప్రతిభను గౌరవిస్తారు.పని చేయని సోమరిపోతుల గురించి తమ కవితలో బలమైన భావాల ద్వారా నిరసన ప్రకటించారు.

‘కవిత్వం నే రాయలేను

కవిగా కీర్తి రావాలి’

కవిత్వం రాయకుండా కవిగా కీర్తి ఎలా వస్తుంది అనే సందేహం మనలో పొడచూపవచ్చు. కవిత్వం అంటే ఏమిటి? కవిత్వం నిగూఢతను కలిగి సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచన. కవిత్వం ఒక సృజనాత్మకమైన సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగుపరచుకోవాలి. కవిత్వం రాసే వారిని కవులు అంటారు. కవిత్వం రాసేవారికి కీర్తి కాంక్ష అసలే ఉండరాదు.కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు. కవిత్వం అనుభవాన్ని మరియు అనుభూతులను వ్యక్తం చేస్తుంది. మానవుని అస్తవ్యస్తమైన జీవిత అనుభవాలకి ఓ క్రమాన్ని అర్థాన్ని కవిత్వం ఆపాదిస్తుంది. కవిత్వం రాయని వారు కవి సమ్మేళనాల్లో పాల్గొంటూ కవిత్వం గురించి మాట్లాడుతున్నారు. కవిగా తాను రాసింది ఏమి లేకపోయినా ఇతర కవులు రాసిన కొటేషన్‌లు చెబుతూ కవిత్వం ఎలా రాయాలి? కవిత్వంలో పదబంధాలు ఎలా ఉపయోగించాలి? కవిత్వంలో వస్తువు ఉండాలి, వైవిధ్యం ఉండాలి, ఎత్తుగడ ఉండాలి, మార్మికత ఉండాలి అని కవిత్వం యొక్క విశిష్టతను తెలుపుతూ గొప్పగా సంభాషిస్తూ ఆయనే గొప్ప కవి అనుకునేంతగా ప్రవర్తిస్తాడు. ప్రతి కవి సమ్మేళనంలో పాల్గొంటూ అధ్యక్షత వహిస్తుంటాడు. తను కవిత్వం మాత్రం ఏమీ రాయడు. ప్రతి సమావేశంలో వక్తగా పాల్గొంటాడు. పత్రికలో పేరు వస్తుంది. కవిగా కీర్తి వస్తుంది.కవిగా తాను రాసినది ఏదీ ఉండదు. అయినప్పటికీ గొప్ప కవిగా చెలామణి అవుతున్న కవుల గురించి ఆవేదన చెందుతూ కవి కాళిదాసు తమ కవితలో భావాన్ని చక్కగా వ్యక్తీకరించారు.

‘ప్రజలంటే నాకసహ్యం

పదవి మాత్రం కావాలి’

ప్రజలు అంటే ఎవరు? ప్రజలు సమాజంలో నివసించేవారు అని చెప్పవచ్చు. ప్రజలు సమాజంలో అత్యంత ముఖ్య భూమికను పోషిస్తారు. ప్రజల యొక్క అభివృద్ధి కొరకు తపన ఉండాలి. ప్రజల అవసరాలు తీర్చడానికి కృషి చేయాలి. అప్పుడే ప్రజల యొక్క మద్దతు లభిస్తుంది. ప్రజలకు సహాయం చేయడం, ప్రజల హక్కుల కొరకు ఉద్యమించడం ద్వారానే ప్రజల్లో నాయకునికి సముచిత స్థానం లభిస్తుంది. ప్రజలు అతనికి మద్దతు ఇస్తారు. ప్రజల సాయంతో ఆదరణతో అతనికి పదవి  లభిస్తుంది. ప్రజల సమస్యలు పట్టించుకోవడం, ప్రజల అవసరాలను ఆలకించడం, ప్రజల భవిష్యత్తు మెరుగుపడేలా చర్యలు తీసుకోవడం ద్వారానే నాయకులకు ప్రజా హృదయాల్లో స్థానం ఏర్పడుతుంది. ఏ ప్రజలు అయితే అతనికి అండగా నిలిచి పదవి అందించారో, ఆ ప్రజలను నాయకుడు అసహ్యించుకోవడం సరికాదు. పదవి మాత్రం కావాలి అనే నాయకుల సంఖ్య ఎక్కువగా తయారవుతున్న దుస్థితిని చూస్తున్నాం. కవి కాళిదాసు అట్లాంటి రాజకీయ నాయకుల గురించి ఆవేదన చెంది రాసిన భావాల్లో నిజాయితీ ఉంది. ఇవాళ ప్రజల బాగోగులు చూడక ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారిని ప్రజా కంటకులు అంటారు. ప్రజా కంటకులను ప్రజలంతా ఏకమై పదవి నుండి తొలగించే రోజు వస్తుంది. ప్రజలను అసహ్యించుకుంటూ పదవిలో కొనసాగుతున్న వాళ్లను చూస్తున్నాం. ఇలాంటి స్థితి మారాలి. ఈ దుస్థితి మారుతుంది అనే ఆశా భావం కవిలో కనిపిస్తుంది.

‘మంచి చెడు అంటే ఎలా

దండిగా సంపాదించాలి’

ఎక్కువమందికి ఉపయోగపడేది మరియు ఎవరికైనా వారి బాధలు సమస్యల నుండి ఉపశమనం కలిగించే విధంగా చేసే పని దేనినైనా మంచిపని అంటారు. మన స్వార్థం కోసం ఇతరులను వంచించడం, మోసగించడం లాంటి వాటిని చెడుపని అని చెప్పవచ్చు. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానంతో మనం నడుచుకోవాలి. ఉద్యోగులకు పనిచేస్తేనే జీతం వస్తుంది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ మరియు ప్రజల వద్ద లంచాలు తీసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు. సామాన్య ప్రజలు లంచాలు ఇవ్వలేక పూరి గుడిసెల్లో నివసిస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. లంచం తీసుకోవడం నేరం అని తెలుసు. అయినప్పటికీ లంచం తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి సొమ్మును సంపాదించిన వారికి రాజకీయ నాయకుల అండ ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజా‌సంక్షేమం కొరకు పని చేయాలి. కాని అలా చేయడం లేదు. రాజకీయ నాయకులు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ జల్సాల్లో తేలుతున్నారు. మంచిని ఆచరిస్తూ చెడుకు దూరంగా ఉంటూ న్యాయమైన సంపాదనతో సక్రమంగా జీవించాలి అనే కవి కాళిదాసు భావన చక్కగా ఉంది.

‘ఎవరెక్కడ పోతే ఏం

మనకు సుఖం ఉండాలి’

ఎవరు ఎక్కడ పోయినా నాకు సంబంధం లేదు. నేను నా కుటుంబం సుఖంగా ఉండాలి అనేది తప్పుడు భావన. కలిసి ఉంటేనే కలదు సుఖం. స్వార్థపు భావనలు మన దరికి రానీయకూడదు. ఇతరుల చెడు కోరుకుంటే మనకి ఆ చెడు జరుగుతుంది. మంచిగా ఆలోచించాలి. మంచి వైపే మన పయనం కొనసాగాలి. మహనీయుల ఆలోచనలతో మనం ముందుకు సాగాలి. స్వార్థపు చర్యల వల్ల సమాజానికి చెడు జరుగుతుంది. సమాజంలోని ప్రజలలో తిరుగుబాటు వస్తే అవినీతిపరులను తరిమి తరిమి కొడతారు. అందరి సుఖం కోసం మనం ఆరాటపడాలి. అందుకే మన శాస్త్రాలు సర్వేజనాః సుఖినోభవంతు అని చెప్పాయి. సకల మానవాళికి సుఖశాంతులు ప్రసాదించమని కోరుకోవాలి. అందరి శ్రేయస్సు ఆశించడం వల్లనే వసుధైక కుటుంబం అనే భావన ఏర్పడుతుంది. కవి కాళిదాసు ‘ఆశలు’ కవితలో విశాల దృక్పథం అలవరుచుకోవాలనే సందేశాన్ని అందించారు.

కవి కాళిదాసు ‘ఆశలు’ కవిత  ద్వారా సమాజంలో జరుగుతున్న దుర్నీతిని ఎండగట్టారు. కవి కాళిదాసు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా  కోరుకుంటున్నాను.


కవి గుత్తికొండ కాళిదాసు, తేది 10-05- 1949 రోజున రేకొండ గ్రామంలో సామాన్య చేనేత కుటుంబంలో జన్మించారు. కాళిదాసు రేకొండ గ్రామం, మండలం చిగురుమామిడి, జిల్లా: కరీంనగర్‌కు చెందిన వారు. తల్లిదండ్రులు జోగవ్వ, చంద్రయ్య, తండ్రి చంద్రయ్య చేనేత కార్మికుడు, మగ్గం నేసేవాడు మరియు స్టేట్ ఫ్రీడమ్ ఫైటర్‍గా గుర్తించబడినారు. పెన్షన్ కూడా పొందినారు. తాత: మల్లయ్య, నానమ్మ: లచ్చవ్వ, తాత మల్లయ్య బట్టల బేరం చేసేవారు.కాళిదాసు తన ప్రాథమిక విద్యను తమ గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల పూర్తి చేశారు. 6వ, 7వ తరగతి, ప్రభుత్వ పాఠశాల సైదాపూర్ గ్రామంలో చదివారు. కాళిదాసు 8, 9, 10,11 తరగతులు పర్లపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. పి.యు.సి. ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్‌లో చదివారు. బి.ఏ. డిగ్రీ ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్‌లో చదివారు. డిగ్రీ పూర్తి కాగానే ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ పాఠశాల బొమ్మనపల్లిలో అపాయింట్ అయ్యారు. 1977-1978 మధ్య కాలంలో హనుమకొండ బీఈడీ కళాశాలలో బీఈడీ చదివారు. కాళిదాసు ఎం.ఏ ఇంగ్లీష్ కాకతీయ విశ్వ విద్యాలయం ఎస్.డి.ఎల్.సి. దూరవిద్య ద్వారా 1990 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు. కాళిదాసు ఎం.ఏ. తెలుగు కాకతీయ విశ్వ విద్యాలయం ఎస్.డి.ఎల్.సి. దూరవిద్య ద్వారా 1992 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు. కాళిదాసు 1998 సంవత్సరంలో ప్రమోషన్ ద్వారా తెలుగు లెక్చరర్ గా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కరీంనగర్ లో పనిచేశారు. కాళిదాసు 2007లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కరీంనగర్, తెలుగు లెక్చరర్‌గా రిటైర్ అయ్యారు.

కాళిదాసు, పుష్పలత దంపతులకు ఇద్దరు సంతానం ఉదయ్ కుమార్, ఇంజపురి భారతి.

కాళిదాసు గారికి విద్యార్థిగా ఉన్నప్పటినుండి సాహిత్యంపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. పదవ తరగతి నుండి పద్యాలు రాస్తున్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటి నుండి సాహితీవేత్తలకు లేఖలు రాస్తుండేవారు. గుంటూరు శేషేంద్ర శర్మ, దాశరథి, డాక్టర్ సి.నారాయణరెడ్డి లాంటి గొప్ప కవులు రాసిన లేఖలు ఆయన వద్ద భద్రంగా ఉన్నాయి.

కాళిదాసు 1) ‘మయ సభ’ కవితా సంపుటి (2002);  2) ‘త్రిశూలం’ మినీ కవితా సంపుటి (2011) ప్రచురించారు.

రిటైర్ అయిన తర్వాత పుస్తక పఠనంతో సేద తీరుతున్న కాళిదాసు సాహిత్య సమావేశాల్లో పాల్గొంటారు. కరీంనగర్‌లో స్వగృహంలో ఉంటున్నారు. కాళిదాసు భార్య, పిల్లలు, మనుమలు, మనుమరాళ్లతో కలిసి విశ్రాంత జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here