ఒక తల్లి వ్యథాభరిత గాథకు – అక్షర రూపం ‘అస్తిత్వం’ కథ!!

4
2

[dropcap]ఒ[/dropcap]కప్పుడు అమెరికా వెళ్లడం అంటే మామూలు విషయం కాదు.

సామాన్యులకు అసలే అది అందని ద్రాక్షలాంటిది. ఎందుచేతనంటే దానికి తగిన అర్హతలు, అవసరమైన సొమ్ము, అనుకూల పరిస్థితులు ఇవన్నీ కలిసివస్తే తప్ప అమెరికా వంటి విదేశాలకు వెళ్లడం, చదవడం లేదా ఉద్యోగం చేయడం అనే పరిస్థితులు ఏర్పడేవి కాదు.

ఇప్పుడు కాస్త పరిస్థితులు అనుకూలంగా ఏర్పడిన తర్వాత, అభివృద్ధి చెందుతున్న దేశాలవంటి మన దేశంలో నిరుద్యోగ సమస్య ఇంకా వెన్నంటి ఉండడం వల్ల స్తోమత వున్నవాళ్లు, విదేశాలలో చదువుకోవడానికి, ఆ తర్వాత ఉద్యోగం చేసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందులో రెండు రకాల వాళ్ళు వున్నారు. మొదటి తరగతి ఎవరంటే, స్వయంగా విదేశాలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకునే విద్యార్థులు (తల్లిదండ్రులకు ఇష్టంలేకపోయినా, పిల్లలకు నిరుత్సాహం కలిగించ కూడదనే ఉద్దేశంతో ఒప్పుకోవడం), ఇలా కాకుండా, పిల్లలకు ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు బలవంతం చేయడం ద్వారా విదేశాలకు వెళ్లే పిల్లలు (కొంతమంది తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకోవడానికి పిల్లలను విదేశాలకు పంపే ప్రయత్నం చేస్తుంటారు).

అయితే కారణం ఏదైనా, పిల్లల చదువులు పూర్తి కావడం ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవడం, అక్కడి వాళ్లనే ప్రేమించి పెళ్లి చేసుకోవడమో, తల్లిదండ్రులు పెళ్లి చేయడమో, లేకుంటే ఆధునిక పద్ధతుల్లో కలిసి జీవించడమో (లివింగ్ టుగెదర్) మొదలైన తర్వాత, పిల్లలు పుట్టడం, వారి పెంపకం కోసం తల్లిదండ్రుల, ముఖ్యంగా తల్లుల అవసరం వస్తుంది. అప్పుడు ఎంతో ప్రేమగా తమ దగ్గరకు రమ్మని తల్లిదండ్రులను ఆహ్వానిస్తారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడిపోతారోనని వెళ్లి అక్కడ వాయువేగంతో వాలిపోతారు. అప్పుడు మొదలవుతాయి అసలు సమస్యలు. ఇలాంటి సమస్యల్లో ఒక సమస్యను తీసుకుని, చక్కని కథను అల్లారు ప్రముఖ కథా/నవలా రచయిత్రి శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ కొప్పిశెట్టి. వీరు స్వయంగా ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల, అక్కడ చూసిన అనుభవమో, స్వీయ అనుభవమో తెలియదు గానీ, ఈ కథ చదువుతుంటే, కథలా అనిపించదు.

నిజంగా ఒక తల్లి అనుభవించిన వ్యథలా అనిపిస్తుంది. కథ ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. తల్లి, కూతురు, అల్లుడు, ఈ కథలోని పాత్రలు. తల్లి ఒక ఉన్నత ఉద్యోగిని. తండ్రిని కోల్పోయిన కూతురు అమెరికాలో భర్తతో కాపురం చేస్తుంటుంది. వారికి ఒక పాప కలుగుతుంది. ఆమెను చూసుకోవడం కోసం తల్లి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆత్రంగా అమెరికాలో వాలుతుంది. మనవరాలిని కంటికి రెప్పలా కాపాడుతుంటుంది. ఆర్థికంగా కూడా తల్లి వాళ్ళను ఆడుకుంటుంది. కానీ ఒకానొక సంఘటనలో తల్లి, తనను అనుమానించినట్టుగా ఆమె భావిస్తుంది. ఆమె మనసు విరిగిపోతుంది. తనకు అస్తిత్వం కొరవడిన చోట ఉండలేనని, ఎంత బ్రతిమాలినా వినకుండా బాధతో, స్వదేశానికి బయలుదేరుతుంది. టూకీగా కథ ఇది.

కానీ రచయిత్రి సృష్టించిన సన్నివేశాలు, సంభాషణలు చదువుతుంటే పాఠకులు కథలో లీనమై కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చిన్న కథ అయినప్పటికీ, ఒక నవలకు సరిపడినంత వస్తువు ఇందులో వుంది. రచయిత్రి, కవయిత్రి కూడా కావడంతో కొన్ని వాఖ్యలు కవితాత్మకంగా సాగి, పాఠకుడికి ఆ క్షణంలోనే కథ చదవడం పూర్తిచేయాలనే ఆరాటం వెంటాడుతుంది. ఈ కథ రచయిత్రి రచించిన ‘చీకటి వెన్నెల’ అనే కథా సంపుటి లోనిది. ఈ సంపుటిలో ఈ కథతో పాటు మరో పన్నెండు, భిన్నమైన జీవిత గాథలు వున్నాయి. ఈ కథల సంపుటి, పాలపిట్ట ప్రచురణల ద్వారా అక్టోబర్ 2022 లో వెలువడింది.

చీకటి వెన్నెల – కథల సంపుటి పై ఆసక్తి గలవారు స్వయంగా రచయిత్రిని గానీ, ప్రచురణకర్తలను గానీ సంప్రదించవచ్చును. చక్కని కథలను అందించిన రచయిత్రికి అభినందనలు. (రచయిత్రి మొబైల్ 9866059615; ప్రచురణకర్త మొబైల్ 9848787284)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here