హిందూ – ముస్లిం సఖ్యతతో బ్రిటిష్ వారితో యుద్ధం చేసిన బేగం హజ్రత్ మహల్

6
2

[dropcap]ఏ[/dropcap]ప్రిల్ 7వ తేదీ బేగం హజ్రత్ మహల్ జయంతి మరియు వర్థంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

భారత స్వాతంత్ర్య పోరాటంలో స్త్రీ పురుష, కుల మత భేద రహితంగా పాల్గొన్నారు. యుద్ధాలు చేశారు. సత్యాగ్రహోద్యమాలలో పాల్గొన్నారు. ముస్లిం నాయకులకూ కొదవలేదు. వేలాది మంది ముస్లిం యోధులు, హిందువులతో కలిసి బ్రిటిష్ వారి మీద దాడి చేశారు. బ్రిటిష్ అధికారులను ఓడించారు. చివరకు వారి బలం ముందు నిలవలేక ఓటమి పాలయినా – తమ శరీరాలను మాత్రం శత్రువులకు చిక్కనివ్వలేదు. ఆత్మాహుతి చేసుకున్నారు. అజ్ఞాతవాసాలు చేశారు. అజ్ఞాతవాసి అయిన ఒక యోధురాలు బేగం హజ్రత్ మహల్.

1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని, బ్రిటిష్ వారిని ఎదిరించి యుద్ధం చేసిన మహిళలలో ఒకరు శ్రీమతి బేగం హజ్రత్ మహల్. వీరు 1820వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ఫైజాబాద్‌లో జన్మించారు. ఆ ప్రాంతం నాడు లక్నో రెసిడెన్సీలో నేడు ఉత్తరప్రదేశ్ లో ఉంది.

వీరి తండ్రి గులామ్ హుస్సేన్ ఆలీఖాన్ దగ్గర పనిచేసే ‘ఉమర్’. పేదరికాన్ని భరించలేక వీరిని ‘అవుధ్’ రాజాస్థానానికి అమ్మేశారు. వీరి అసలు పేరు మహమ్మదీ ఖానమ్.

రాజాస్థానంలో ‘మహాక్ పరి’ అని పిలిచారు. ఆమె అందం, తెలివితేటలు, సృజనాత్మకతలు, రాజు ‘వాజిద్ ఆలీషా’ని ఆకర్షించాయి. రాజు ఈమెను వివాహం చేసుకున్నారు. ‘ఇఫ్లికర్ ఉన్-నీసా’ అని పేరు పెట్టారు. ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు ‘బిర్జిస్ ఖాదర్’. కుమారుడు పుట్టిన తరువాత ఈమె పేరు ‘బేగం హజ్రత్ మహల్’ గా మారింది.

అవి డల్‌హౌసీ రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా భారతస్వతంత్ర రాజ్యాలని ఆక్రమిస్తున్న రోజులు. దీని ప్రకారం బ్రిటిష్ వారు అవుధ్ రాజు వాజిద్ ఆలీషాని రాజు పదవి నుండి తప్పించారు. అవుధ్‌ని ఆక్రమించుకుని ఈస్టిండియా కంపెనీ పరిపాలన క్రిందికి తీసుకురావాలని వారి ఆలోచన. వారు లక్నోని ఆక్రమించారు.

1856లో వాజిద్ ఆలీషా కలకత్తాకు చేరాడు. బేగం హజ్రత్ మహల్ తన పన్నేండేళ్ళ కుమారుడు బిర్జిస్ ఖాదర్‌కి అవుధ్ రాజుగా పట్టాభిషేకం చేసి, 1856 జూన్ 5వ తేదీనుండి స్వయంగా పరిపాలనా బాధ్యతలను స్వీకరించారు.

బ్రిటిష్ వారు దేవాలయాలను, మసీదులను కూలదోసారు. ఆ సంపదను ఉపయోగించి రహదార్లు వేయించారు. బ్రిటిష్ సైన్యానికి, ఇతర అవసరాల నిమిత్తం ఉపయోగించారు. ఈ పరిస్థితిని బహిరంగంగా ఖండించారు బేగం. వాటి పునరుద్ధరణ చేయాలనకున్నారు. ప్రజలను కన్నతల్లిలా పరిపాలించారు.

హిందూ ముస్లింల మధ్య సఖ్యతను కుదిర్చారు. ఏకత్రాటి మీదకు తీసుకువచ్చారు. బ్రిటిష్ వారిని ఎదిరించడానికి, యుద్ధంలో పాల్గొనడానికి, ప్రజలను మానసికంగా సంసిద్ధం చేశారు.

బేగం హజ్రత్ మహల్ సైన్యాన్ని కూడగట్టటంతో సరిపెట్టలేదు. వారందరినీ సమావేశపరచి వారికి స్ఫూర్తినిచ్చే విధంగా మాట్లాడేవారు. అందరినీ మెచ్చుకుంటూ భుజాలు చరిచి యుద్ధోన్ముఖులను చేసేవారు. ఉత్తరాల ద్వారా కూడా స్ఫూర్తినిచ్చేవారు.

వీరు అద్భుతమైన సైన్యాన్ని తయారు చేశారు. కాల్బలము, అశ్వికదళము, ఫిరంగి దళము వంటి సైనిక విభాగాలు ముఖ్యమైనవి. వీరి సైన్యంలో హిందూ, ముస్లింలు కలిసి పనిచేశారు. సర్వ సైన్యాధిపతి రాజా జలాల్ సింగ్, సూపరింటెండెంట్ కమాండర్ మరియు బేగంకు ఆంతరంగికుడు మమ్ముఖాన్‌లు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి బేగం పేరు నిలిపారు.

బేగం హజ్రత్ స్త్రీలందరినీ ఒకచోట చేర్చి మహిళా సైన్యాన్ని తయారు చేశారు. ఈ సైన్యానికి ఉదాదేవి నాయకురాలు. ఉదాదేవి గొప్ప యోధురాలు. 1857 నవంబర్ 16వ తేదీన ‘సికిందర్ బాగ్ యుద్ధం’లో తన బెటాలియన్‌తో పాల్గొంది. స్వయంగా 32 మంది బ్రిటిష్ యోధులను హతమార్చింది.

1857 జూన్ 30 నాటికి బ్రిటిష్ సేనలు వెనకడుగు వేశాయి. అయితే మళ్ళీ ముందుకు సాగి 1857 సెప్టెంబర్ 23వ తేదీన ‘అలుమ్ బాగ్’ అనే లక్నో తోట ప్రాంతాన్ని ఆక్రమించారు. ఈ దండయాత్ర ‘సర్ కోలిన్ కాంప్‌బెల్’ అనే బ్రిటిష్ సైనిక దళాల కమాండర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటిష్ అధికారులు ఈ సమయంలో గాయాల పాలయ్యారు. కొంత మంది చనిపోయారు.

ఈ సంఘటన తరువాత బ్రిటిష్ వారు కాంప్‌బెల్ ఆధ్వర్యంలో లక్నో మీద దండయాత్రలను కొనసాగించారు. 1858 మార్చినాటికి మూసాబాగ్, చార్బాగ్, కేసర్ బాగ్‌లను గెలుచుకున్నారు. ఈ సైన్యంలో లక్నో మీద దాడి చేసిన బ్రిటిష్ సైన్యంలో నేపాల్ రాజు గారి సైన్యం 3000 మంది గూర్ఖాలున్నారు.

బ్రిటిష్ వారు బేగం హజ్రత్ మహల్‌కు ఆశ్రయం ఇవ్వడం కోసం కొన్ని షరతులను విధించారు. లక్షరూపాయల భరణాన్ని అందిస్తామన్నారు. విప్లవకారులకు సహాయం చేయకూడదని, వారితో సంబంధ బాంధవ్యాలు నెలకొల్పకూడదని కోరారు. ఈ షరతులను బేగం అంగీకరించలేదు.

బేగం ధైర్యాన్ని ఈ దిగువ సంఘటన తెలియజేస్తుంది. విక్టోరియా మహారాణి శాంతి వచనాలు, వాగ్దానాలతో విడుదల చేసిన ప్రకటనకు ప్రతిగా ఆ ప్రకటనను నమ్మవద్దని సమాధానంగా మరొక ప్రకటనను విడుదల చేశారు.

ఈమె యుద్ధంలో ఓడిన తరువాత నేపాల్ రాజు ఆశ్రయాన్ని కోరారు. ముందు నేపాల్ రాజు ఒప్పుకోలేదు. కాని చివరకు ఆశ్రయాన్ని అందించారు. అయితే భారత భూభాగంలోకి ప్రవేశించకూడదు ఒకవేళ ప్రవేశించాలనుకుంటే బ్రిటిష్ వారి షరతులను అంగీకరించాలి.

బేగం భారతదేశంలోకి రావడానికి, తన కుమారుని రాజ్యాన్ని పరిపాలించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విప్లవ నాయకులతో కలిసి చాలా ప్రయత్నాలు చేశారు.

బ్రిటిష్ ప్రభుత్వం బారీ మొత్తాలలో భరణం, విలాసవంతమైన సౌకర్యాలు ఇవ్వజూపింది. వాటన్నింటిని తిరస్కరించారు బేగం. తనకు కావలసింది ‘స్వతంత్ర అవుధ్ రాజ్యమ’ని స్పష్టం చేశారు. కాని అది అసాధ్యమైంది.

ఆమె చరమకాలమంతా నేపాల్లోనే గడిచింది. 1879 ఏప్రిల్ 7వ తేదీనే 59 సంవత్సరాల వయసులో మరణించారు. ఆమె స్వయంగా కవయిత్రి కూడా!

“దేశంలో మాకు ఉన్న కీర్తి,
ఈ పోరాటం దానికోసం
మా శత్రువులు మారు వేషంలో వచ్చారు
మేము సహించని చెడు పనులను వారు చేశారు”

అంటూ చివరి రోజులో వ్రాశారు. వీరి దేశభక్తికి ప్రతి రూపంగా ఈ కవిత క(అ)నిపిస్తుంది.

ఈ విధంగా బానిసగా పుట్టి, రాజులకి అమ్ముడై, రాణియై, బ్రిటిష్ వారితో యుద్ధం చేసి తొలి విజయాన్ని సాధించి చివరికి సైనిక బలం చాలక, మిత్రులే శత్రువులై వంచించిన వేళ, బ్రిటిష్ వారికి దొరకకూడదని, నేపాల్ లో చివరి జీవితం గడిపిన బేగం హజ్రత్ మహల్‌కు చరిత్రలో తగిన స్థానం లభించలేదనడం అతిశయోక్తి కాదు.

ది.10.05.1984వ తేదీన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం (సిపాయిల తిరుగుబాటు) సందర్భంగా ఆరుగురు వీరుల జ్ఞాపకార్థం స్టాంపుల సెట్ విడుదలయింది. ఈ సెట్లో వీరికి స్థానం కల్పించి సరైన నివాళిని అర్పించింది భారత తపాలా శాఖ. 50 పైసల విలువలో వీరి స్టాంపు విడుదలయింది.

వీరి జయంతి మరియు వర్థంతి ఏప్రిల్ 7వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

*** 

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here