[dropcap]భా[/dropcap]రతదేశంలో అనాదిగా విదేశీ దండయాత్రలు జరిగాయి. ఆ దండయాత్రలను ఎదుర్కొని జయాపజయాలు పొందిన వారు కూడా మనకు చరిత్రలో కనిపిస్తారు.
మొఘలులను ఎదిరించి గెలిచిన ఛత్రపతి శివాజీ మహరాజ్ మనందరికీ తెలుసు. ఆయన జైత్రయాత్రలు చేసి సామ్రాజ్యాన్ని విస్తరింప జేశారు. కొంతమంది ఆయన పట్ల గౌరవాభిమానాలతో ఆదరించి స్నేహపూర్వకంగా ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించారు. కొంత మంది ఎదిరించి యుద్ధంలో ఓడి పాదాక్రాంతులయ్యారు.
కాని ఆయన జైత్రయాత్రల పరంపరలో సైనికులు చేసిన పొరబాటు కారణంగా ఆయనకు ఓటమి లభించింది. బెళవాడి రాజ్యంలో విశ్రమించిన శివాజీ సైన్యానికి పాలు అవసరమయ్యాయి. సరిపడ పాలు ఆ ఊరి వాళ్ళు ఇవ్వక పోవడంతో వారి ఆవులను తస్కరించారు సైన్యం. అప్పుడు బెళవాడి రాణి మల్లమ్మ సైన్యం మీద దాడి చేసి గెలిచారు. తన సైన్యం మహిళ చేతిలో ఓడిపోవడం శివాజీ జీర్ణించుకోలేక పోయారు.
తిరిగి ఆ రాజ్యం మీద దాడి చేయమని సైన్యాన్ని ఆదేశించారు. సైన్యం అక్రమ పద్ధతులలో అన్యాయంగా ఆ రాజును చంపి, రాణిని కూడా కుట్ర పన్ని బందీని చేసి శివాజీ దగ్గర హాజరు పరిచారు. ఆమె జరిగిన విషయాలన్నింటినీ శివాజీతో వివరించి ఆయన అభిమానాన్ని చూరగొంది. ఆయన జరిగిన పొరబాటును దిద్దుకుని ఆమెను సోదరిలా ఆదరించారు. ఈ విధంగా బెళవాడి రాణి మల్లమ్మ శివాజీ మహరాజ్ సైన్యం పైన గెలిచి, తర్వాత అన్యాయంగా బందీయై ఆయనతో కలసి కన్నడ – మరాఠా సామరస్యాన్ని నెలకొల్పి మొఘలులకు పక్కలో బల్లెమయ్యారు. శివాజీ మహరాజ్ చరిత్రలో ఇది ప్రత్యేక ఘట్టం.
ఈమె 17వ శతాబ్దంలో బెళవాడి అనే రాజ్యంలో జన్మించారు. ఇది నేటి కర్నాటక రాష్ట్రం ధార్వాడ్ జిల్లా లోని ‘బెలగాని’ ప్రాంతం. ఈమె తల్లి వీరమ్మాజీ. తండ్రి సోడె రాజ్యపు రాజు మధులింగ నాయకుడు. వీరి పూర్వీకులు విజయనగర సామంత రాజులు. సామ్రాజ్యం పతనమయిన తరువాత స్వతంత్ర రాజులయ్యారు.
మధులింగ నాయకునికి ఇద్దరు పిల్లలు. కొడుకు సదాశివ, కూతురు మల్లమ్మ. మధులింగ నాయకుడికి చదువంటే ఇష్టం. తన పిల్లల కోసం పాఠశాలను నిర్మించాడు. 10 మంది ఉపాధ్యాయులను నియమించాడు. వివిధ కులాలకు చెందిన బాలబాలికలకి ఈ పాఠశాలలో చదువుకునే అవకాశాన్ని కల్పించారు. సుమారు 350 సంవత్సరాల క్రితమే రాజరికపు పిల్లలతో సమానంగా సామాన్యుల పిల్లలకు ఒకే పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించడం గొప్ప. అంతేకాదు – సహవిద్య (Co-education) ఉండడమూ విశేషం. అలా అందరితోను కలసి మెలసి ఉండడం అలవాటయింది మల్లమ్మకి.
ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గొప్ప పండితుడయిన శంకరభట్టు. వీరి దగ్గర కవిత్వం, సాహిత్య పాఠాలు నేర్చారామె. మాతృభాష కన్నడతో పాటు మరాఠీ, ఉర్దూ, సంస్కృత భాషలను అభ్యసించారు. ఇవి ఆ తర్వాత పరిపాలనలోను, యుద్ధ సమయంలోను అక్కరకొచ్చాయి.
ఆనాటి అల్లకల్లోల్లమైన, చీటికి మాటికి అంతర్యుద్ధాలు, యుద్ధాలతో సతమయ్యే పరిస్థితులలో మహిళలు కూడా యుద్ధవిద్యలు నేర్వవలసిన అవసరముంది. ఈమె ఖడ్గవిద్య, విలువిద్య, గుర్రపుస్వారి, బల్లాలువిసిరే విద్య వంటి వాటిలో బాల్యం నుండి ఆరితేరారు.
బాల్యం నుండి అమితమైన భక్తి తత్పరురాలు. శివ పూజ చేసుకుని ఆ తరువాత బడికి వెళ్ళి పాఠాలు నేర్చేవారు. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ’ సూక్తిని తూచా తప్పకుండా ఆచరించి చూపారామె.
పదహారేళ్ళ వయసు రాగానే ఈమెకి స్వయంవరం ప్రకటించారామె తండ్రి. ఒక నెలలో గరిష్ట సంఖ్యలో, తన వయసుకు సమాన సంఖ్యలో పులులను వేటాడి చంపిన యువకుడితో పెళ్ళి జరగడం అనేది షరతు. మల్లమ్మ కూడా పులులను చంపగలదు.
బెళవాడి రాజకుమారుడు ఈశాప్రభు వయసు ఇరవై సంవత్సరాలు, 21 పులులను చంపి విజేతగా నిలిచాడు. మల్లమ్మని ఈశాప్రభుకిచ్చి పెళ్ళి చేశారు మధులింగ నాయకులు. వీరిదరూ కలసి ప్రజలను కన్న తల్లిదండ్రులలా పరిపాలించారు. అన్ని పరిపాలనా విభాగాలలోను ఇద్దరూ కలసి నిర్ణయాలను తీసుకునేవారు.
యుద్ధవిద్యలలో నిష్ణాతురాలైన మల్లమ్మ వేలమందితో మహిళా సైన్యాన్ని తయారు చేశారు.
ఇదిలా ఉండగా ఛత్రపతి శివాజీ మహరాజ్ యుద్ధాలు చేస్తూ రాజ్య విస్తరణను చేస్తున్నారు. వరుసగా వెల్లూరు, గింగి, ఖాందేశ్, పోండా, కార్వార్, కొల్హాపూర్ రాజ్యాలను జయించిందాయన సైన్యం. తరువాత తన సోదరుడు వెంకోజీ పరిపాలిస్తున్న తంజావూరు విషయాన్ని పరిష్కరించారు. తిరుగుప్రయాణంలో తుంగభద్రా నదిని దాటారు. కొప్పల్, గడగ్, లక్ష్మణేశ్వర్ వంటి సంస్థానాలు ఎదిరించకుండానే శివాజీ ఆధిపత్యాన్ని అంగీకరించాయి.
బెళవాడి రాజు ఈశాప్రభు కూడా శివాజీ పట్ల అభిమానం గలవాడు. శివాజీని గౌరవించడం కోసం ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు.
యాడ్వాడ్ గ్రామంలో శివాజీ సైన్యాలు విశ్రమించాయి. మరాఠ సైనికులు పాల కోసం అల్లాడసాగారు. ఆ గ్రామస్తులు సరిపడే పాలను సరఫరా చేయలేక పోయారు. తత్ఫలితంగా మరాఠా సైనికులు ఆవులను తమ శిబిరాలకు తోలుకొచ్చారు. ప్రజలు తమ రాజు ఈశా ప్రభుకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈశా ప్రభు తన సేనానాయకుడు సిద్ధన గౌడ పాటిల్‌ను సమస్యను పరిష్కరించమని పంపారు. మరాఠా సైనికులు సిద్ధన గౌడని అవమానించారు. ఈ విధంగా సైనికులు మధ్యస్పర్దలు పెరిగాయి. చిన్నపాటి యుద్ధం మొదలయింది.
ఈ యుద్ధంలో రాణి మల్లమ్మ తన మహిళా సైన్యంతో మరాఠా యోధుల మీద దాడి చేసింది. వందల మంది మరాఠా సైనికులు గాయపడ్డారు. 12 మంది మరణించారు. ప్రజల ఆవులను సైనికుల దగ్గరి నుండి విడిపించారు.
విషయం తెలిసిన శివాజీ తన సైన్యాన్ని బెళవాడి మీదకు పంపించారు. రాజు ఈశాప్రభు ప్రత్యక్షంగా యుద్ధభూమిలో పాల్గొన్నారు. ఒక మరాఠా సైనికుడి వెన్ను (కత్తి) పోటుతో ఆయన మరణించారు.
భర్త మరణాన్ని గురించి విన్న మల్లమ్మ ఏడుస్తూ కూర్చోలేదు. ప్రతీకారం తీర్చుకోవడం కోసం నెలల వయసున్న కుమారుని వదిలి యుద్ధభూమిని చేరారు. ఆమె గుర్రం కాళ్ళను నరికి ఆమెను క్రింద పడేసి, బంధించారు సైనికులు – మరింత అవమానిస్తూనే ఛత్రపతి దగ్గరకు తీసుకెళ్ళారామెను.
శివాజీ దగ్గర విచారణ సమయంలో ఆమె గోగ్రహణం దగ్గరి నుండి జరిగిన విషయాలని విపులంగా వివరించారు. పరిస్థితులను అవగాహన చేసుకున్న శివాజీ మహరాజ్ సేనాధిపతి సుఖోజీని శిక్షించారు. సైన్యం చేసిన పొరపాటుని ఈ విధంగా సరిదిద్దుకున్నారు.
మల్లమ్మను గౌరవించి రాజ్యాన్ని అప్పగించారు. ఆమెలో భవానీమాతని దర్శించారాయన. శివాజీ తల్లి జిజాబాయి పెంపకంలో ఆడపిల్లలను గౌరవించడాన్ని నేర్చుకున్నారాయన. ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారు ఆమె. కన్నడ – మరాఠీ ప్రాంతాలకు వీరు సామరస్య వారధులుగా మారారు. హిందూ రాజ్యాలుగా కలసి మెలసి పరిపాలన కొనసాగించారు. మొఘలాయి చక్రవర్తుల నుండి తమ రాజ్యాలను సంరక్షించుకున్నారు.
బెళవాడి సంస్థాన మఠాధిపతి శివబసవశాస్త్రి వ్రాసిన ‘తారాతూరి పంచమరి చరిత్ర’ లోను, మల్లమ్మ గురువు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వ్రాసిన ‘శివ వంశ సుధాకర’ సంస్కృత గ్రంథంలోను, జదునాథ సర్కార్ మరాఠీ భాషలో వ్రాసిన ‘శివాజీ చరిత్ర’ లోను, బ్రిటిష్ వారి చారిత్రక రికార్డులలోను బెళవాడి రాణి మల్లమ్మ శివాజీ సైన్యానికి జరిగిన యుద్ధాన్ని గురించిన ప్రస్తావన కనిపిస్తుంది.
పండిత శేషో శ్రీనివాస్ ముతాలిక్ సోడె మధులింగనాయకుని ఆస్థాన విశేషాలను మరాఠీ భాషలో రికార్డు చేశారు. ఈ రికార్డులు మల్లమ్మ బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని గురించి తెలియ జేస్తాయి.
2022 ఫిబ్రవరి 28 వ తేదీన బెళవాడి మల్లమ్మ 374వ జయంతి ఉత్సవాలను కర్ణాటక ముఖ్యమంత్రి పారంభించారు. ఆమె పోరాట పటిమని, యుద్ధవిశేషాలని ఈ తరంవారు స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఈమె గౌరవార్థం 2022 మార్చి 14వ తేదీన ఒక ప్రత్యేక తపాల కవర్‍ని విడుదల చేసింది భారత తపాలాశాఖా. ఈ కవర్ మీద ఎడమవైపున బెళవాడి మల్లమ్మ అశ్వారూఢులై కనిపిస్తారు. గుర్రం మీద ఠీవిగా ఆసీనురాలై కుడిచేత కరవాలంతో గంభీరంగా కన్పించినా ముఖం ప్రశాంతంగా కనిపిస్తుంది.
ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet