సాహిత్యం ఆరోప్రాణంగా భావించిన రచయిత

4
2

[18 అక్టోబర్ 2023 శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి జయంతి సందర్భంగా సాహితీ, ఆధ్యాత్మిక రంగాలలో వారి కృషిని స్మరించుకుంటున్నారు వారి కుమార్తె ఏ. అన్నపూర్ణ.]

[dropcap]సా[/dropcap]హిత్యం వంశపారంపరంగా వస్తుందో లేదో, అది కొందరికే స్వంతమో తెలియదు కానీ, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా ‘పొడగట్లపల్లి’ అనే గ్రామంలో వేదపండితులు వున్నారు. అప్పటి రోజుల్లో బ్రాహ్మణులకు వేదవిద్య – పౌరోహిత్యానికి, దేవాలయాలలో పూజారిగానూ ఉపాధి కల్పించేది. పెళ్లిళ్లలో వధూవరులను వేదం మంత్రాలు చదివి ఆశీర్వదించడం సాంప్రదాయంగా అందరూ పాటించేవారు!

అలాంటి కుటుంబంలో బులుసు వెంకట సుబ్బయ్య, అన్నపూర్ణ దంపతులకు నలుగురు మగపిల్లలు జన్మించారు. ఆ చుట్టుపక్కల వున్నా గ్రామ ప్రజలు వారి వున్నత పాఠశాల చదువులకు రాజోలు, కాలేజీ చదువుకు జిల్లా ముఖ్యపట్టణం కాకినాడకు వెళ్లి చదువుకునేవారు.

కుటుంబ బాధ్యతను అన్నదమ్ములు పంచుకోడం ఆ రోజుల్లో సర్వసాధారణం! కనుక ముగ్గురూ కాకినాడలో చదువుకుని ఉద్యోగాలలో చేరారు. పెద్ద అన్న లాయరు, రెండవ అన్న పిఠాపురం రాజావారి కళాశాలలో లెక్చరర్, మూడవ అన్న కందుకూరి వీరేశలింగం హైస్కూల్ రాజమహేంద్రవరం (ఇప్పటి రాజమహేంద్రి)లో తెలుగు పండితులుగా వున్నారు. చివరి తమ్ముడు వెంకటేశ్వర్లుకి 9 ఏళ్ల వయసులో వారి తండ్రి సుబ్బయ్యగారు పరమపదించగా, రెండవ అన్న వెంకటేశ్వర్లును కాకినాడ తీసుకువచ్చి తన దగ్గిర ఉంచుకుని స్కూల్‍లో చేర్పించారు. హైస్కూల్‌లో చదివే రోజుల్లోనే ‘సైకిల్ పోయినది..’ అనే కథ ప్రచురించబడింది. అది వెంకటేశ్వర్లు రచనలు చేయడానికి శ్రీకారం ఐనది. త్రిలింగ పత్రిక స్థాపకులు వావిళ్ళ రామస్వామి శాస్త్రులు. ఆ పత్రికలో వెంకటేశ్వర్లు వ్యాసాలూ చర్చలు ఎన్నో వచ్చాయి.

ఆనాటి అన్నదమ్ముల అనుబంధం ఒకే ఇంటిలో ప్రారంభమై, వెంకటేశ్వర్లు వివాహం అయ్యేవరకూ కొనసాగింది. తండ్రి సుబ్బయ్యగారిని బాల్యంలో కోల్పోయిన వెంకటేశ్వర్లు ఉద్యోగంలో చేరాక అమ్మను తనతోనే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటిదాకా కలిసివున్న అన్నదమ్ములు కుటుంబం పిల్లలతో విస్తరించగా ఒకే ఇంటిలో ఎదురెదురు వాటాల లోకి మారేరు.. తప్ప విడిపోలేదు. వారి తల్లి అన్నపూర్ణమ్మ మరణించేవరకూ అలా ఒకే ఇంట్లో వున్నారు.

B.A. డిగ్రీ పూర్తిచేసిన వెంకటేశ్వర్లు కాకినాడ వావిళ్ళ రామస్వామి తెలుగు – సంస్కృతం పుస్తకాల ప్రచురణలో భాగస్వాములు. అప్పటి వుమ్మడి రాష్ట్రం మద్రాసు(తమిళనాడుకి ముఖ్య పట్టణం) రామానుజ అయ్యర్ వీధిలో వుండే వావిళ్ళ రామస్వామి శాస్త్రులు 1854లో ‘హిందూ భాషా సంజీవిని’ అనే పేరుతో ముద్రణాలయం ప్రారంభించారు. పురాణ గ్రంథాలను తెలుగు, సంస్కృతం, తమిళ, ఇంగ్లీషు భాషల్లో 900 గ్రంథాలను ముద్రించారు. ఈ ముద్రణాలయానికి 150 ఏళ్ల చరిత్ర వుంది.

కాలక్రమంలో రామస్వామి కుమారులు (ఆంధ్రా) కాకినాడలో వుండే పిఠాపురం రాజావారి ఆధ్వర్యంలో ముద్రణాలయం ప్రారంభించారు. రాజావారు ‘సూర్య రాయాంధ్ర తెలుగు నిఘంటువు’ ప్రచురణ చేపట్టాలని రామస్వామిగారితో సంప్రదించి మొదలుపెట్టారు. మొదటి రెండుభాగాల ప్రచురణలో బులుసు వెంకటేశ్వర్లుకు ప్రమేయం ఉన్నప్పటికీ.. కొన్ని వ్యక్తిగత కారణాల వలన వారు తన పేరును పెట్టవద్దని చెప్పి మిగిలిన ఆరు భాగాల ప్రచురణ నుంచి తప్పుకున్నారు. అప్పటికే రామస్వామి శాస్ర్తులువారికి పేరాలసిస్ వచ్చి మాటలాడలేని స్థితిలోవున్నారు. వెంకటేశ్వరుల నిష్క్రమణ వారికి చాలా బాధకలిగించినా తెలియచెప్పలేని నిస్సహాయస్థితిలో వున్నారు. అంతటితో వారితోవున్న అనుబంధం తెగిపొయింది.

అయితే వేరొకరి ప్రమేయం లేకుండా స్వంత ఆలోచనలు చేయడానికి ఆ సంఘటన కారణం కూడా ఐనది.

అప్పటికే అన్నగారి దగ్గిర వున్న భారత భాగవత రామాయణ పురాణ గ్రంథాలను చదివి వాటిపట్ల మక్కువ పెంచుకున్న వెంకటేశ్వర్లు తెలుగు భాషా ప్రవీణ చదివే రోజుల్లోనే మొదటి ప్రతి ‘అష్టావక్రచరిత్ర’ అనే పద్య కావ్యం రాశారు. దీనికి మూలం ‘మహాభారత’ కథలోని ఒక అధ్యాయం.

ఇక్కడ విశేషం ఏమంటే ఈ ‘అష్టావక్ర చరిత్ర’ అనే గ్రంథాన్ని మద్రాస్ యూనివర్సిటీ తెలుగు భాషాప్రవీణ విద్యార్థులకు పొయిట్రీ పాఠ్యపుస్తకంగా ప్రమోట్ చేయడం ఒక గొప్ప విషయంగా చెప్పాలి.

అంటే వెంకటేశ్వర్లు గారు రాసిన ఆయన కావ్యాన్ని ఆయన తన డిగ్రీలో చదవడం అనే అనుభూతి ఎవరూ వివరించలేనిది. ఈ పుస్తకానికి ముందుమాటను తిరుపతిలో వుండే వేటూరి ప్రభాకరశాస్త్రి గారు రాయడం మరో ప్రతేకత (వారు సినీ రచయిత వేటూరి సుందరరామమూర్తిగారికి పెత్తండ్రి గారు).

మరో ముఖ్యమైన సంగతి ఇది! సరస్వతి వున్నచోట లక్ష్మి ఉండదు.. అనేది నానుడి! అది చాలావరకూ నిజమే! వెంకటేశ్వర్లుకి ఎవరూ ఆర్థిక సహాయం చేసినవారులేరు.. పుస్తకం రాస్తే స్వంత ఖర్చుతో ప్రింట్ చేసుకుని, ఆ గ్రంథాలను ఎవరైనా కొంటే వచ్చే డబ్బుతో మళ్లీ కొత్త పుస్తకం అచ్చు వేయించుకోడం జరిగేది. సాహిత్యం పట్ల ఇష్టం సరే.. కుటుంబ బాధ్యతలు తప్పనివి కదా.., మరి ఎలా! సిరి మహాలక్ష్మి అమ్మగారు కటాక్షించాలి. కానీ ఆవిడ విద్యలదేవి ప్రాంగణంలో అడుగుపెట్టదు.

ఆ బాధ్యతను కూడా సరస్వతిదేవి స్వీకరించింది కాబోలు! వెంకటేశ్వర్లు గ్రంథరచనకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగడానికి వరం ఇచ్చింది. అదెలా అంటే..

పిఠాపురం రాజా వారి కళాశాలలో అసిస్టెంట్ టీచర్‌గా ఉద్యోగం రూపాన. కొంతకాలానికి రావలసిన ప్రమోషన్ ఇవ్వాలంటే B.A. డిగ్రీ సరిపోదు, PG చేయాలని కాలేజీలకు రూలు వచ్చింది. అందువలన వెంకటేశ్వర్లు M.A. చదవాల్సి వచ్చింది. సరిగ్గా అప్పుడే ‘వేణీసంహార’ అనే మరో (భారత కథ) నాటకానికి రూపం వచ్చింది. పాండవపత్ని ద్రౌపదిని మయసభలో దుర్యోధనుడు కొప్పుపట్టి లాగి అవమానించినందుకు ప్రతీక తీర్చుకున్నాకనే ఆమె కురులు ముడివేస్తానని భీముడు ప్రతిజ్ఞ పట్టడం.. ఆ కథాంశమే ‘వేణీసంహార’ నాటకం!

భారత కథలు చదివిన వారిలో కూడా ఇలాంటి ఆవేశం రోషం బాధ కలగడం సహజం కాబోలు.

అందుకే చాలామంది రచయితలు పురాణ గాథలను అనేక విధాలుగా స్వంత భావాలను కొత్త ఆలోచనలనూ చేర్చుతూ మెరుగులు దిద్దుతూ మూలకథ చెడకుండా గ్రంధాలు రాశారు. వారు ధన్యులు.

వేణీసంహారను సంస్కృతంలో భట్టనారాయణ కవి రాశారు. దీన్ని తెలుగులోకి తర్జూమా చేస్తూ పరీక్షల విషయమే మరిచిపోయేంతగా లీనమై పోయారు వెంకటేశ్వర్లు.

అటు వున్నత విద్య, ఇటు గ్రంథరచన చేయాలనే తపనా.. వెంకటేశ్వర్లుగారికి ఏమాత్రమూ ఇబ్బందిగా తోచలేదు.. ఇష్టం అయినది కష్టంగా అనిపించదేమో! బెనారస్ యూనివర్సిటీ పరీక్షకి సాహిత్యం మెయిన్ గ్రూప్‍గా తీసుకుని చదవడం మొదలుపెట్టారు. రెండు ప్రయత్నాలూ విజయవంతంగా సాగాయి. ‘వేణీ సంహార’ నాటకంగా రూపుదిద్దుకుంది. అదే సమయంలో వేణీ సంహారను పీ.జీ. విద్యార్థులకు డ్రామా టెస్ట్ బుక్‌గా యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ గ్రంథం అనేకసార్లు ముద్రించబడింది. 5 సంవత్సరాలపాటు నిరాటంకంగా కొనసాగడం వలన వెంకటేశ్వర్లుగారు తన ఇద్దరు కుమార్తెల వివాహాలు జరిపించడానికి కారణం ‘ఆ సరస్వతీ కటాక్షమే కాబోలు..’ అని అనుకున్నారు!

M.A. పరీక్షలు రాసి ప్రమోషన్లు వచ్చి ఉద్యోగధర్మం నిర్వరిస్తూనే గ్రంథరచనా చేశారు. సంస్కృతంలో ఒక M.A., తెలుగులో మరో M.A., లిటరేచర్‌లో ఇంకో M.A., మూడు సబ్జెక్ట్స్ లోనూ చేశారు. అందువలన గ్రంథ రచన మరింత మెరుగు పడి కొన్ని గ్రంథాలను ఇంగ్లీషులోకి అనువాదం చేయడం జరిగింది. రిటైర్ అయ్యాక తీరిక సమయం లభించి 150 గ్రంథాల వరకూ రాయడానికి కారణం అయినది.

అందులో ‘మహాఋషుల చరిత్ర’ 9 భాగాలు రాయడం రికార్డ్. అంతవరకూ ఎవరూ తలపెట్టని రచన అది. కొన్ని సంస్కృత గ్రంధాలనుంచి తెలుగు గ్రంథాలనుంచి సేకరించి వచనంలో రాశారు (ఇంగ్లీషులో కూడా వచ్చాయి).

బులుసు వెంకటేశ్వర్లు గారు వారి జీవితంలో రెండు ముఖ్య సంఘటనలు తనకు ఎనలేని సంతృప్తిని కలిగించాయి అని చెప్పేవారు. మహాభారతం, శ్రీ భాగవతం, రామాయణం గ్రంథాలను సంస్కృతం నుంచి తెలుగులో రాసినప్పుడు వాటిని ముగ్గురు ప్రముఖులు ఆవిష్కరించడం. వారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ పీవీ నరసింహారావుగారు, విశ్వనాధ సత్యనారాయణ గారు, శ్రీ దివాకర్ల వెంకటావధాని గారు!

తరువాత ‘మహర్షుల చరిత్ర’ ను T.T.D వారు సర్వహక్కులతో ప్రచురించడం! వీటిని(తెలుగు) తిరుమల తిరుపతి దేవస్థానం వారు సర్వహక్కులతో 20 ఏళ్లపాటు ప్రచురించారు.

ఇక వెంకటేశ్వర్లుగారు ‘యోగవాశిష్ఠం’ అనే గ్రంథ రచనపై దృష్టి మళ్లించారు. రాముడు కైక కోరిక మీద అడవులకు వెళ్ళినపుడు దశరథుడు వయసు మళ్ళిన వృద్ధాప్యం వల్లనూ, మానసిక విచారంతోనూ మరణించాడు. ఆ సమయంలో తండ్రి దగ్గిర లేకపోయినందుకు దుఃఖించిన శ్రీరామునికి కులగురువు వశిష్ఠుడు చావు పుట్టుకలు సహజమేనని ఎన్నో ఉదంతాలు చెప్పి ఊరడించాడు. అదే ‘యోగవాశిష్ఠం’!

1944లో ప్రారంభించిన వారి సాహితీ సేవ 1989 వరకూ కొనసాగుతూనేవుంది. అందుకు గుర్తింపుగా శ్రీ బులుసు వెంకటేశ్వర్లుగారికి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషీ గారి అధ్యక్షతన భాగ్యనగరంలో ‘కల్చరల్ రినైజెన్స్ ఆఫ్ ఇండియా’ రజతోత్సవ సందర్భంగా చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో ‘ఆర్షసాహితీ బ్రహ్మ’ బిరుదు ప్రదానంతో పాటు ఘనంగా సన్మానం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరిగి కాకినాడ వచ్చిన రెండు నెలలకు కొద్దిపాటి నలత కలిగింది.

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు బులుసు వారికి కులదైవం. ఆ స్వామికి భక్తుడు ఈ వెంకటేశ్వర్లు. అందుకేనేమో మొదట ‘మహర్షుల చరిత్ర’ను తన దగ్గిరకు చేర్చుకున్నాడు ఆ తిరుమలేశుడు. జీవితకాలం కుటుంబానికి ఆర్థిక లోటు రాకుండా చేసాడు. చివరికి భక్తుని తనలో లీనం చేసుకున్నాడు. ఆ రోజు మే నెల 6వ తేదీ శనివారం 1989వ సంవత్సరం. కుటుంబానికి తీరని లోటు.. సహజమే!

అప్పటి రోజుల్లో పిఠాపురం రాజా వారి కాలేజీ (ఇప్పుడు పీ.ఆర్. కాలేజీ) అంటే మెరుగైన విద్యకు వేదిక. ఎందరో ప్రముఖ డాక్టర్లు, రాజకీయ నాయకులూ, సినీ రచయితలు, నటులు, మెరిట్ విద్యార్థులు, ఆయన సంతానం, శ్రీ బులుసు వెంకటేశ్వర్లుకు స్టూడెంట్స్. అప్పటి ఆంధ్రప్రదేశ్‌కి అన్ని జిల్లాలకు ముఖ్య పట్టణం కనుక మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, పాలిటెక్నీక్ కాలేజీ కాకినాడలోనే మొదటిసారిగా ప్రారంభించారు. నాకు గుర్తు వున్నన్నంత వరకూ V.B. రాజేంద్ర ప్రసాద్, నటులు హరనాధ్, కృష్ణంరాజు, సినీ రచయిత ఆకెళ్ళ కాకినాడలో చదివారు. ఇంకా చాలామంది చదివినా చెప్పరు.. రాజకీయ కారణాలు. నువ్వేమి చేసావ్ అని అడుగుతారని భయం!

సాహిత్యాభిమానులకు ఒక ప్రేరణగా.. శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారు, అని గర్వముగా చెప్పుకుంటాం ఆయన విద్యార్థులం. ఇప్పటికి వారి పేరు చెబితే “అవును నాకు తెలుసు” అనేవారు ఎందరో!

ఇందరి మనస్సులో నిలిచిపోయిన వారి జీవితం ధన్యం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here