నిత్యాన్నదాత డొక్కా సీతమ్మ

7
4

[dropcap]ఏ[/dropcap]ప్రిల్ 28న శ్రీమతి డొక్కా సీతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

అన్నం పరబ్రహ్మ స్వరూపమని మనందరికీ తెలుసు. ఆకలిగొన్న వారికి అన్నం పెడితే పుణ్యం అంటారు. పుణ్యమని కాదు – వారు అన్నం తిని తృప్తి పడుతుంటే మనకి కలిగే సంతోషం అంతా ఇంతా కాదు.

తిరుమల శ్రీవారి నిలయంలో ప్రతిరోజూ వేలాది మందికి నిత్యాన్నదానం జరుగుతుందంటే అది దేవుని ప్రసాదం. కాని మామూలు వ్యక్తులు వందలాది మందికి నిత్యం భోజనం పెట్టడం సామాన్యమయిన విషయం కాదు – నిస్వార్థపరులు, నిరాడంబరులు అయిన గొప్పవారికే ఇది సాధ్యం. సమస్త సౌకర్యాలను నిముషాల్లో సమకూర్చుకోగలిగిన ఈ రోజుల్లో ఇది సులువే!

కాని సుమారు నూట డెబ్బైయేళ్ళ క్రితం ఒక సాధారణ మహిళ ఒక గ్రామంలో, ఆధునిక రవాణా సౌకర్యాలు లేని రోజులలో, ప్రకృతి విపత్తులు ఎన్ని ఎదురయినా ఎదురీది ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టి ఆదరించేవారు. చివరికి రవి అస్తమించని ఇంగ్లాండ్ చక్రవర్తి తన పట్టాభిషేకానికి రమ్మని ఆహ్వానించినా అన్నదానానికి ఆటంకం కలుగుతుందని వెళ్ళని మహిళామూర్తి. ఆమే ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ.

ఈమె 1841 అక్టోబర్‌లో నాటి మదరాసు ప్రెస్సిడెన్సీలో (నేటి ఆంధ్రప్రదేశ్ లోని) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో జన్మించారు, తల్లిదండ్రులు అనిపిండి నరసమ్మ, భవానీశంకరంగార్లు. భవానీశంకరం దానానికి మారుపేరు. ఆయనని వారి గ్రామంలో ‘బువ్వన్నా’ అని పిలిచేవారు. తండ్రి సంస్కారాన్ని పుణికి పుచ్చుకున్నారు సీతమ్మ. తల్లి ఆమె బాల్యంలోనే మరణించారు.

అందుచేత ఆమె తమ ఇంటికి వచ్చిన అతిథులనీ మర్యాద మన్ననలతో గౌరవించి ఆదరించేవారు. చక్కటి భోజనంతో అతిథులని అలరించేవారు. పెద్దగా చదువుకోలేదు. కాని కథలు, పద్యాలు, గాథలు వంటి వాటిని అభ్యసనం చేశారు.

ఒకసారి లంకలగన్నవరం గ్రామానికి చెందిన ధనవంతుడు డొక్కా జోగన్నపంతులు సీతమ్మ గారింటికి అపరాహ్నవేళ భోజనానికి వెళ్ళారు. సీతమ్మ అణుకువ, ఆప్యాయత, భోజనం వడ్డించిన తీరు ఆయనని అమితంగా ఆకర్షించింది. అయనకి కూడా నలుగురికీ అన్నం పెట్టి ఆదరించాలనే కోరిక.

సీతమ్మ వంటి మంచితనం, అణుకువ, ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు, ఆప్యాయతను చూపించే గుణం జోగన్నగారికి నచ్చాయి.

‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్నట్లు అనిపిండి సీతమ్మ డొక్కా వారింటి కోడలై డొక్కా సీతమ్మగా మారింది. భార్యాభర్తలు ఇద్దరూ అన్నదానమంటే మక్కువగలవారే! ఈ దంపతులు కుల, మత, భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా నిత్యాన్నదానాన్ని నిర్వహించేవారు.

ఆ రోజుల్లో ఇప్పటిలా ఆధునిక రవాణా సౌకర్యాలు లేవు. గోదావరీ తీర ప్రాంతాలలో ఇప్పటికీ పడవ ప్రయాణం సాధారణ విషయమే! వీరి గ్రామమైన లంకలగన్నవరం నుండి అవతలి తీరాలకి, గ్రామాలకి పడవలు ఎక్కువ నడిచేవి. పడవల రవాణాకి ఈ ఊరు నెలవు. కాబట్టే చాలమంది ప్రయాణీకులు సీతమ్మ గారింటికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు.

కొన్నిసార్లు వరదలు సంభవించినప్పుడు ప్రయాణీకులకు పడవలుండేవి కావు. వారు సీతమ్మ గారి చేతి భోజనం తిని కాలం గడిపేవారు. అనావృష్టిలో కూడా నదిలో నీరు పడవ నడపడానికి సరిపడా లేకపోయేది. అప్పుడూ ప్రయాణీకులకు ఆమె వండి వడ్డించేవారు.

అర్థ రాత్రిపూట గజదొంగలు కూడా తమ పని పూర్తిచేసుకుని ఈమె చేతి అన్నం సుష్టుగా తిని వెళ్ళేవారట. కొంతమంది ఆమెని చూసి పశ్చాత్తాపపడి దొంగతనం మానినవారూ ఉండడం విశేషం.

కొంతమంది రాచవంశీకులు ప్రత్యక్షంగా వీరింటికి రావడానికి మొహమాటపడి మారువేషాలలో వచ్చి భోజనం చేసి సంతృప్తి పడేవారు.

ఒకసారి అంతర్వేది నరసింహుని దర్శించుకోవాలని అక్కడకు బయలుదేరారు. గోదారితీరాన పల్లకిని ఆపారు బోయీలు. పడవ కోసం ఎదురుచూస్తున్నారు సీతమ్మ. ఇంతలో పడవలో నుంచి సంభాషణ వినిపించింది. ‘అమ్మా ఆకలేస్తుంది’ అని ఏడుస్తున్న కొడుకుతో “కొద్ది సేపు ఓర్చుకో నాన్నా! మనం సీతమ్మ గారింటికి వెళ్దాం. ఆ అమ్మ అన్నం పెడ్తుంది” అనే మాటలు పూర్తికాగానే తిరిగి లంకలగన్నవరం చేరుకున్నారు. ఆ పిల్లవాడు, ఇతరులు వచ్చేటప్పటికి వంటచేసి ఉంచారు.

ప్రభుత్వాధికారులు, బ్రిటిష్ అధికారులు, ఆంధ్ర ప్రాంతంలోని అన్ని ప్రాంతాల వారు ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి భుజించిన వారే! ఆమె వంటా వార్పులకు రాత్రింబవళ్ళ తేడాయే లేదు, మరి ఆమెకి అంత ఓపికనిచ్చాడు భగవంతుడు. భర్త సహకారమూ సంపూర్తిగా లభించడం ఆమెకే కాదు. వారి అతిథుల అదృష్టం కూడా!

కొండలయినా కూర్చుని తింటే కరిగి పోతాయంటారు. వీరు కూర్చుని తినలేదు. అందరికీ పెట్టారు. ఆస్తి కరిగి పోయింది. చేతిలో ధనం ఖర్చయిపోయింది. అప్పుడు జోగన్న గారు మనకే తినడానికి లేదు. ఎక్కడి నుంచి తెస్తాం? అన్నదానాన్ని ఆపమన్నారట. కాని ఆమె అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడన్నారట. తరువాత వారికి పొలంలో దొరికిన లంకె బిందెలోని సంపదతో నిత్యాన్నదానాన్ని కొనసాగించారట.

ఆమె అన్నదానంతోనే సరిపెట్టలేదు. పేదల వివాహాలకి, ఇతర కార్యక్రమాలకి ధనసాయం చేసేవారు. ఆ ప్రాంతాలలో ప్రకృతి విపత్తులు సంభవింనప్పుడు పేదవారికి పలువిధాల సాయపడేవారు ఈ దంపతులు.

ఆంధ్రప్రాంతాన్నే కాదు, అలా అలా వీరి ఖ్యాతి బ్రిటిష్ ఇండియా ఎల్లలు దాటింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధిపతి 7వ ఎడ్వర్డ్‌కు సీతమ్మగారి అన్నదాన గొప్పతనం తెలిసింది. తమ సామ్రాజ్యమంతటిలోను ఈమెను మించిన దానశీలి లేదని ఆయన నమ్మారు. తన పట్టాభిషేక మహోత్సవానికి ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వాన పత్రాన్ని పంపించారు. అయితే ఆమె సముద్రం దాటని, ఓడనెక్కని సంప్రదాయబద్ధురాలని అర్థం చేసుకున్నారు. కనీసం ఆమె చిత్రాన్ని పంపమని కలెక్టర్ గారికి వర్తమానం పంపారు. దీనిని బట్టి ఖండాతరాలకి వ్యాపించిన ఈమె ఖ్యాతిని గురించి చెప్పనవసరం లేదు కదా!

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఆమె దగ్గరకు ఫోటోగ్రాఫర్‌ని తీసుకుని వెళ్ళారు. చక్రవర్తి గారి ఆకాంక్షను తెలియజేశారు. కాని ఆమె “నేను సన్మానాలు, ఫోటోలు, అభినందనల కోసం అన్నదానం చేయలేదు. విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నా అనుకుని పెట్టాను అంతే!” అన్నారు.

అయితే “అమ్మా! మీ ఫోటో పంపించకపోతే నా ఉద్యోగం పోతుంది” అన్నారు కలెక్టర్. అందుకా మహాతల్లి “సరే! నీ ఉద్యోగం పోతుందంటే ఫోటో తీయించుకుంటాను. అయితే ఒక షరతు” అన్నారట. “ఏమిటమ్మా” అనడిగితే “నువ్వు అన్నం తినాలి” అని అన్నం పెట్టి పంపిన గొప్ప మహిళామూర్తి ఆమె.

ఎడ్వర్డ్ చక్రవర్తి తన సింహాసనం పక్కన ఆమె ఫోటో ఉంచి, నమస్కారం చేసి, ఆ తరువాత పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించుకున్నారు.

ఇంత గొప్ప ఖ్యాతిని పొందిన ఆ అపర అన్నపూర్ణమ్మ 1909 ఏప్రిల్ 28 న పరమపదించారు.

అందరూ ‘అన్నమో రామచంద్రా’ అంటుంటే గోదావరి వాసులు, సీతమ్మ గారిని గురించి తెలిసినవారు ‘అన్నమో సీతమ్మా!’ అనుకునే వారట.

ఈమె జీవిత చరిత్రను కొంతకాలం పాఠ్యాంశంగా పిల్లల మనసులను దోచుకుంది. గొప్పదనాన్ని గురువులు విద్యార్ధుల మనస్సులను హత్తుకునేట్లు బోధించేవారు.

1959లో శ్రీ మిర్తిపాటి సీతారామాంజనేయులు ‘నిరతాన్నాధాత్రి శ్రీ డొక్కా సీతమ్మ’ గ్రంధాన్ని వ్రాశారు.

గోదావరి నది మీద నిర్మించబడేన ఆక్విడెక్ట్‌కి ‘డొక్కా సీతమ్మ ఆక్విడెక్ట్’ అని పేరు పెట్టి ఆమెను ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకునేట్లు చేశారు.

2015 మే 15 వ తేదీన ‘తూర్పు గోదావరి జిల్లా న్యూమిజ్‌మాటిక్ అండ్ ఫిలాటెలిక్ సొసైటీ’ పోస్టల్ శాఖ ఒక ప్రత్యేక కవర్‌ను విడుదల చేసి గౌరవించింది.

కవర్ మీదు కుడివైపు పై భాగంలోని క్యాన్సిలేషన్ ముద్రలో అన్నం వడ్డిస్తున్న సీతమ్మగారు గుండ్రటి చట్రంలో కనిపిస్తారు. ఎడమవైపున సింహాసనం వంటి కుర్చీలో శ్వేతవస్త్రాలలో మిలమిల మెరిసి పోతూ కనిపిస్తారు సీతమ్మ గారు. శ్రీమతి డొక్కా సీతమ్మగారు(అన్నపూర్ణ) అని తెలుగులో ఇంగ్లీషులో వ్రాసి ఉంది. ఆమె ఫోటో పై భాగంలో ‘Decennial Anniversary of Numismatic and Philatelic Society of East Godavari – NPSEG-2005-2015 అని ఇంగ్లీష్‌లో పాటు హిందీలో కూడా వ్రాసి ఉంది. ఫోటో క్రింద Smt. Dokka Seethamma (Annapurna)’ అని హిందీ ఇంగ్లీషులలో వ్రాసి ఉంది.

ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్టాంపుల సేకర్తల అసోసియేషన్ వారు తమ ఆడపడుచుకు పోస్టల్ శాఖ ద్వారా ప్రత్యేక కవరును విడుదలచేసి మిగిలిన జిల్లాల వారికి ఆదర్శంగా నిలిచారు.

ఆమె

“కీర్తి ఇంగ్లాండ్‌కు గోదారి వరదలా పయనించినా

ఎడ్వర్డ్ చక్రవర్తి ఎన్ని సార్లు రారమ్మని –

పిలిపించినా — ఊహు॥

బ్రిటిష్ చక్రవర్తి సింహాసన దరి చేరిన చిత్రపటానికి

రవి అస్తమించని సామ్రాజ్యాధిపతి వందనం చేసే

అదే నిను గన్న భరతమాతకు వరం

కోనసీమ సీతమ్మా–! నీకిదే వందనం -!!”

ఏప్రిల్ 28వ తేది ఈమె వర్థంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here