సరస్వతీ పుత్ర పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు

0
2

[box type=’note’ fontsize=’16’] మార్చి 28వ తేదీన శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీమతి భారతుల శ్రీవాణి.  [/box]

[dropcap]ఎ[/dropcap]వని పదమ్ములు శివతాండ వలయాధి రూపమ్ములు; ఎవని భావమ్ములు సుందర శివలాస్య రూపమ్ములు

అతడు పుట్టపర్తి సూరి అభినవ కవితా మురారి; అతని చతుర్ముఖతకు విస్మితులు కాని విజ్ఞులేరి!!

ఎవరు వ్రాస్తే పదాలు శివతండవంలా ఉంటాయో, ఎవరి భావం శివుని సుందర లాస్యంలా ఉంటుందో వారే శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు. వీరు కవిగా, పండితునిగా, అవధానిగా, విమర్శకునిగా, వ్యాఖ్యాతగా, వక్తగా, అనువాదకునిగా, వాగ్గేయకారునిగా ఒకటేమిటి అనేక సాహిత్య ప్రక్రియలలో వారు పోషించని పాత్ర లేదు. తెలుగు సాహితీ జగత్తుకు ఒక తారాజువ్వ లాంటి వారు.

జీవిత విశేషాలు:

పుట్టపర్తి నారాయణాచార్యులు లక్ష్మిదేవి, శ్రీనివాసాచార్యులు అనే పుణ్య దంపతులకు 1917 మార్చి 28న అనంతపురం వద్ద గల చియ్యేడు అనే గ్రామంలో జన్మించారు. శ్రీనివాసాచార్యులు సంస్కృత ఆంధ్ర పండితులు. పుట్టపర్తిలో వీరి పూర్వీకులు నివసించడం చేత పుట్టపర్తి వీరి ఇంటి పేరైనది. చిన్నతనంలోనే రామాయణ, భాగవత, భారత ఇతిహాసాలను ఔపోసన పట్టారు. పెనుగొండలో చదువుకున్నారు. అక్కడే ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులైన పక్కా హనుమంతాచార్యుల వద్ద సంగీతం అభ్యసించారు. రంజకం మహాలక్ష్మమ్మ అనే దేవదాసి వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. నాటకాలంటే చెవి కోసుకొనే వారు. ఎన్నో నాటకాలలో స్త్రీ పాత్రలు వేశారు.

తను వ్రాసిన కావ్యమే పరీక్షగా:

విజయనగర రాజుల వేసవి రాజధాని అయిన పెనుగొండ దీనావస్థను గాంచి 12 సంవత్సరాల చిరు ప్రాయంలోనే ‘పెనుగొండ లక్ష్మి’ అనే పద్య కావ్యం వ్రాశారు. విచిత్రం ఏమిటంటే 37 ఏళ్ల వయస్సులో విద్వాన్ పరీక్షలో అదే కావ్యం వారికి పరీక్షలో వచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే అందులో వారు ఫెయిల్ అయ్యారు. కారణం ఏమిటంటే నాలుగు మార్కులకు అడిగిన ప్రశ్నకు నలభై పేజీలు జవాబు వ్రాయడంతో సమయం మించి పోయి వేరే ప్రశ్నలకు సమాధానమివ్వలేక పోయారట. తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వరా ప్రాచ్య కళాశాలకు వెళ్లినప్పుడు ప్రిన్సిపల్ శ్రీ కపిస్థలం కృష్ణమాచార్యులు పెనుగొండ లక్ష్మి కావ్యం లోని పద్యాలను విని సర్టిఫికేట్ లేకున్నా ఏ కోర్సులో కావాలంటే ఆ కోర్సులో చేరడానికి అవకాశం కల్పించారట.

ఆదర్శ దాంపత్యం :

1935లో ప్రొద్దుటూరు వాస్తవ్యురాలైన కనకమ్మ గారితో వివాహమయింది. ధన్నవాడ రాఘవాచార్యులు అనే సంస్కృత పండితులు కనకమ్మ గారి తాతగారు. వీరు గజారోహణం పొందారు. పండిత వంశమే కావడం చేత కనకమ్మ గారు కూడా కొన్ని రచనలు చేశారు. స్త్రీ మనో భావాలపై కవితలు వ్రాశారు. కానీ భర్త గొప్ప కవి కావడం చేత వారి పాండిత్యం ముందు తనెంత అని తలచి ఆమె రచనలు అన్నీ దాచి పెట్టారు. ఒక రోజు ట్రంకులో పెట్టిన భార్య రచనలు చూసి మెచ్చుకొని స్వయంగా వారే వెళ్లి అచ్చు వేయించారు. గాంధీజీ మహా ప్రస్థానం, ఆగ్నివీణ దంపతులిద్దరూ కలిసి వ్రాశారు. భర్త ఆశువుగా చెబుతూ ఉంటే అందమైన దస్తూరితో కనకమ్మ గారు వ్రాసేవారు.

సరస్వతీ పుత్రగా :

నిత్యం అష్టాక్షరీ మంత్రం జపించేవారు. కోటాను కోట్ల జపం చేసినా భగవంతుని దర్శించుకోలేక పోతున్నానని మథనపడేవారు. కొన్నాళ్ళు స్మశానం వద్ద కాపురం పెట్టారట. సంసారంపై విరక్తి కలిగి దేశాటనకు బయలుదేరారు. అనేక పుణ్య క్షేత్రాలను దర్శించారు. అక్కడి నుండి హరిద్వార్, ఋషీకేశ్ లకు వెళ్ళారు. హిమాలయాలలో తిరుగుతుండగా స్వామి శివానంద సరస్వతి ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమంలోనే కొంతకాలం ఉన్నారు. శివానంద స్వామి అనేక పరీక్షలు చేసి కర్తవ్య బోధ చేసి ‘సరస్వతీ పుత్ర’ అని బిరుదాంకితులను చేశారు. పుట్టపర్తి గారికి అనేక బిరుదులున్నా శివానందుల వారిచ్చిన సరస్వతీ పుత్ర అనే బిరుదును అత్యంత ఇష్టంగా భావించేవారు. తిరుపతిలో జరిగిన అష్టావధానంలో కంచి కామ కోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర స్వామి గారు ఈ బిరుదుకు నిజమైన అర్హునిగా వీరిని నిర్ణయించి దుశ్శాలువతో సత్కరించి మంగళా శాసనం చేశారు.

గొప్ప వక్తగా :

కాశీలో పండిట్ మదన్ మోహన్ మాలవ్య కుమారుడగు గోవింద మాలవ్య అధ్యక్షతన జరిగిన సభలో సంస్కృతంలో ఉపన్యసించి శ్రోతల మన్ననలు పొందారు. అలంపురంలో జరిగిన ఒక సాహిత్య సభకు సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. అందులో చాలామంది గొప్ప విద్వాంసుల ఉపన్యాసాలు ఉండటం చేత కేవలం అరగంట సేపు మాత్రమే అధ్యకులు పుట్టపర్తి గారికి సమయం కేటాయించాల్సి వచ్చింది. పుట్టపర్తి గారు ఉపన్యాసాన్ని అర్ధాంతరంగా ముగించగా రాధాకృష్ణ గారే ఉపన్యాసాన్ని కొనసాగించమని కోరారు. మధ్యాహ్నం 1.30 కి ప్రారంభమైన వీరి ఉపన్యాసం సాయంత్రం 4.30 వరకూ కొనసాగించారు.

బహు భాషా కోవిదుడిగా :

పెనుగొండ ఉన్నత పాఠశాలలో చదువు తున్నప్పుడు పెనుగొండ సబ్ కలెక్టర్ సతీమణి శ్రీమతి వి.జె. పిట్ వద్ద ఆంగ్లభాషను అభ్యసించారు. మిల్టన్, వర్డ్స్ వర్త్ ల రచనల ప్రభావం వీరిపై పడింది. లీవ్స్ ఇన్ ది విండ్ అనే పద్య సంకలనం, ది హీరో అనే ఆంగ్ల రచనలు చేశారు. పెనుగొండ వద్ద ఉన్నందున కన్నడ, వైష్ణవ మతంలో ఉన్నందున తమిళ బాషలు అబ్బినవి. తిరుపతి సంస్కృత కళాశాల అధ్యాపకులు డి.టి. తాతాచార్యుల వద్ద సంస్కృత వ్యాకరణంలోని మెళుకువలు నేర్చుకున్నారు. పాండిచ్చేరి లోని అరబిందో ఆశ్రమంలో ఉండి ఫ్రెంచి, గ్రీకు, లాటిన్, రష్యన్, పర్షియన్ వంటి విదేశీ భాషలను అధ్యయనం చేశారు. అరవిందుల రచనలను తెలుగులోనికి అనువదించారు. రాళ్ళపల్లి అనంత కృష్ణమాచార్యుల వద్ద శిష్యరికం చేసి పాళి, తుళు, వ్రజ భాష, పైశాచి, మాగధి మొదలగు ప్రాచీన ప్రాకృత బాషలను అభ్యసించారు. హిందీ, ఉర్దూ, మలయాళం ఇలా ఎన్నో బాషలలో వీరికి మంచి పట్టు ఉంది. మరాఠీ, గుజరాతీ నేర్చుకొని సంత్ గురువుల సాహిత్యాన్ని చదివారు. ట్రావెన్‌కోర్ లెక్సికాన్ సంస్థ వారు ద్రావిడ భాషలపై అధ్యయనం చేయడానికి ఎవరు అర్హులు అని విచారించగా ప్రముఖ మలయాళ కవి పండిట్ సురానంద్ కన్హన్ పిళ్ళై గారు దీనికి వజ్ర సమానులు ఒకరున్నారని వారు పుట్టపర్తి వారని తెలిపారు. పుట్టపర్తి గారిని పరిశోధనకు ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తుంటే పిళ్ళై గారు ‘వజ్రం కొనుగోలుదారుని వెతుక్కుంటూ వెళ్ళదని, వజ్రం విలువ తెలిసికొని వాళ్ళే వజ్రం దగ్గరికి వెళ్లాలి’ అని వారికి సూచించారట.

ఆత్మ విశ్వాసం :

అనంతపురం లో గంటి జోగి సోమయాజుల అధ్యక్షతన మూడు రోజులు సాహిత్య సమావేశం ఏర్పాటు చేశారు. కదిరిలో పుట్టపర్తి గారికి సన్మాన కార్యక్రమం ఉండటం వల్ల మొదటి రెండు రోజులు ఈ సమావేశాలలో పాల్గొన లేక పోయారు. కానీ ఈ సభ అధ్యక్షులు పుట్టపర్తి వారిని ఉద్దేశించి ‘వారికి 14 భాషలు వస్తాయని గొప్పగా చెబుతారు. ఆయనకు తెలుగు తప్ప మరేదీ రాదు’ అని వ్యంగ్యంగా అన్నారట. ఈ విషయం తెలిసిన పుట్టపర్తి గారు మరుసటి రోజు సభకు హాజరై ‘అవును నేను గొప్ప పండితుణ్ణే. అయినా నేను వినయశీలిని. నా కవిత్వాన్ని రెచ్చ గొడితే మాత్రం భయంకరుణ్ణౌతా. నాకు అహంకారం ఉంది. అందులో న్యాయం ఉంది. 14 భాషల్లో ఆశువుగా కవిత్వం చెబుతా. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే వచ్చి పరీక్షించుకోండి.’ అని సవాలు విసిరారు.

శివ తాండవం :

ఏమానందము భూమీతలమున! శివ తాండవ మట! శివ లాస్యంబట!

అలలై, బంగరు కలలై, పగడపుబులుఁ గులవలెమ బ్బులు విరిసిన యవి శివ తాండవ మట! శివ లాస్యంబట!

అంటూ ప్రొద్దుటూరులోని అగస్తేశ్వరాలయంలో మండల దీక్షా కాలంలో శివ తాండవ ఖండ కావ్యాన్ని వ్రాశారు. ‘ఆధునిక సారస్వతమున ఇటువంటి గేయకృతి ఇంకొకటి లేదు’ అని తల్లావజ్ఝల శివ శంకర శాస్త్రి అన్నారు. చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో శివతాండవ నృత్యం చూసి ఈ రచన చేశారు. న్యూరో పొయిట్రీ అని పిలవబడ్డ ఇది రగడ వృత్తంలో కొనసాగుతుంది.

తకఝుం తకఝుం తక దిరి కిట నా దమ్ము లతో లో కమ్ముల వేలుపు నెమ్మిక నిలబడి

నృత్యమాడు నెగ లయానుగతిఁ గ మ్రముగా శ్రుతిఁబ ట్టుటకో! గొంతులు నవదరించును త్కటభృంగమ్ములు

సాహిత్యంతో పాటు సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం వంటి శాస్త్రాలలో పట్టు ఉన్నప్పుడే ఇలాంటి పద రచన చేయగలుగుతారని స్పష్టమౌతోంది. ‘శివ తాండవం విన్నప్పుడు తుంగభద్రా ప్రవాహంలో కొట్టుకు పోతున్నట్లనిపిస్తోంది’ అని రాళ్ళపల్లి అనంత కృష్ణమాచార్యులు అన్నారు.

కులుకు నీలపుగండ్ల దళుకు జూపులు బూయ ఘలు ఘల్లు మని కాళ్ళ జిలిపి గజ్జెలు మ్రోయ

ఆడెనమ్మా ! శివుడు పాడెనమ్మా ! భవుడు

చురుకైనటువంటి నీలి కళ్లల్లో చక్కటి కాంతులు విరబూస్తుండగా కాలి చిరు గజ్జెలు మ్రోగుతుండగా శివుడు నాట్యం చేస్తున్నాడని చెప్పడం అందంగా, సుకుమారంగా, గంభీరంగా ఉంటుంది.

శివ కేశవ అభేదం :

శేష శైల శిఖరాధిప వాసినః కింకరాః పరమ వైష్ణవావయమ్

తత్తథాపి శశి ఖండ శేఖరే శాంకరీ మహసి లీయతే మనః

‘వేంకటేశ్వరుని భక్తుడినై, పరమ వైష్ణవుణ్ణి అయినా నా మనస్సు శివుని యందే లీనమవుతోంది’, అని శివ కర్ణామృతంలో వారు స్వయంగా చెప్పుకున్నారు. శ్రీకృష్ణ దేవరాయల యొక్క రాజగురువు అయిన తిరుమల తాతాచార్యుల వంశానికి చెందిన వారు. రామానుజాచార్యుల విశిష్టాద్వైతాన్ని పాటించినా వీరు శివకేశవుల మధ్య అభేదాన్ని పాటించారు.

పండితుల ప్రశంస :

సాధారణంగా ఒక కవి మరొక కవి పాండిత్యాన్ని మెచ్చుకోరు. కానీ కవి సామ్రాట్‌గా పేరొందిన విశ్వనాథ సత్యనారాయణ గారు విజయవాడలో జరిగిన ఒక సభలో పుట్టపర్తి గారి శివ తాండవం విని ఆనంద పరవశుడై భుజాలకెత్తుకొని నృత్యం చేశారు. ఆ శివుడు ఆడితే చూడాలి ఈ ఆచార్యులు పాడితే వినాలి అని శ్రోతలు అనుకోనేవారు. ఆకాశవాణిలో వారి శివ తాండవ గానానికి పాఠకులు మంత్ర మగ్ధులయ్యేవారు. వాల్తేరు సభలో పంచాగ్నుల ఆదినారాయణ శాస్తి గారు ఆచార్యులకు సాష్టాంగనమస్కారం చేశారు. మహాభారత విమర్శనం గురించి డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు గారు వివరిస్తూ ‘ఈ గ్రంథం ఆచార్యుల వారి ప్రసన్న ధారా మధురమైన శైలికి నిలయం’ అని ప్రశంశించారు. పుట్టపర్తి వారు వేదాలపైన, వేదాంతం పైన లోతైన అధ్యయనం చేశారు. ఒకసారి శృంగేరి మఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యా తీర్థ స్వామి వారు కడపలో పుట్టపర్తి గారి బ్రహ్మ సూత్రాలపై వ్యాఖ్యానం విని సత్కరించి ఆశీస్సులు అందజేశారు.

వివిధ సాహిత్య రూపాలు :

మేఘదూతం, జనప్రియ రామాయణం వంటి గేయ కావ్యాలు, శ్రీనివాస ప్రబంధం, షాజీ, సిపాయి పితూరీ వంటి పద్య కావ్యాలు, పండరీ భాగవతము వంటి ద్విపద కావ్యం, నవలలు, నాటికలు అనువాదాలు ఇలా ఎన్నో సాహిత్య ప్రక్రియలలో వందల రచన చేశారు. వందల పాటలు వ్రాసి వాటిని స్వర పరచారు. జ్ఞానపీఠ్ అవార్డ్ పొందవలసిన అర్హతలు ఉన్నవారు. కొన్ని అవార్డులు వస్తే ఆ అవార్డ్‌కే గొప్పతనం తప్ప ఇటువంటి మహాకవులకు కాదు.

అవార్డులు :

కేంద్ర ప్రభుత్వంతో పద్మశ్రీ బిరుదును 1972లో పొందారు. శ్రీ వేంకటేశ్వర, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. 1968లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడుగా, 1975లో జనప్రియ రామాయణం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. 1988లో భారతీయ భాషా సంస్థాన్ అవార్డు అందుకున్నారు. 1990 తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే అన్నమాచార్య జయంతి సందర్భంగా బంగారు పతకం పొందారు.

కడపలో శ్రీ రామకృష్ణ హై స్కూల్ లో తెలుగు పండిట్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. 1990 సెప్టెంబర్ 1న కడపలో మోచంపేటలో నిర్వాణ షట్కము విని స్వగృహంలో శిష్యునికి చివరి సందేశంగా ‘భాగవతం, భక్తుడు, భగవంతుడు ఒక్కటేరా’ అని అన్నారట. శ్రీనివాసా అంటూ ఆ మహాకవి శివైక్యం చెందారు. ఆచార్య తిరుమల రామచంద్ర ‘పుట్టపర్తి గారు తెలుగు సాహిత్యంలో భక్త కవిగా నిలిచి పోతారు’ అని ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here