[dropcap]31[/dropcap]-05-2022 దువ్వూరి సుబ్బమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
ఆమె స్వాతంత్ర్యోద్యమంలో జైలుకి వెళ్ళిన తొలి తెలుగు మహిళ. కాంగ్రెస్ వారి సంపూర్ణ స్వరాజ్య లక్ష్యాన్ని సమర్థిస్తూ సమావేశాలలో ఉపన్యసించిన గొప్ప వక్త. బాలికల కోసం ఉచిత విద్య, భోజన వసతులలో విద్యాలయాన్ని స్థాపించిన మహిళా విద్యకు మార్గదర్శి.
జైలు శిక్ష విధించిన కలెక్టర్ క్షమించమని కోరితే వదిలి పెడతామన్నారు ఒకసారి. ‘నా కాలి గోరు కూడా ఆ పని చేయదు’ అని నిర్భయంగా జవాబిచ్చిన ఆత్మగౌరవం కలిగిన మహిళామూర్తి. స్వాతంత్ర్య పోరాట వీరులను దాచిపెట్టి పోలీసు వారి నుండి కాపాడేవారు. కొన్నిసార్లు గూఢచారిణిగా పోలీసు బలగాలలో కలిసిపోయి ఆ రహస్యాలను కాంగ్రెస్ నాయకులకు చేరవేసిన ధైర్యశాలి. తన స్వర గాంభీర్యంతోనే ఉద్యమాన్ని నడిపిన ధైర్యశాలి ఆమె. ఆమే ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధురాలయిన దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ.
ఈమె 1880వ సంవత్సరంలో నాటి మదరాసు ప్రెసిడెన్సీ (నేటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మల్లాది వెంకటరమణమ్మ, సుబ్బావధాన్లు. సనాతన సంప్రదాయ పద్ధతులలో కుమార్తెను పెంచారు.
ఈమెకు బాల్యంలోనే దువ్వూరి వెంకయ్యతో బాల్యవివాహం జరిగింది. కాని దురదృష్టవశాత్తు బాల వితంతువుగా మారింది. భర్త మరణంతో కుంగిపోయింది. అప్పుడు స్వాతంత్ర్య సమరం ఉధృతంగా సాగుతున్న రోజులు. తనకి ఎలాగూ పిల్లలు లేరు. తన జీవిత గమ్యం ఏమిటని ఆలోచించారామె. దేశ ప్రజలనే పిల్లలుగా భావించి, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనాలనే ఆశయాన్ని సంకల్పంగా తీసుకున్నారు. పెద్దగా అక్షరజ్ఞానం లేదు. ముందుగా చదువుకోవాలని నిర్ణయించుకున్నారు.
తిరుపతి వేంకట కవులలో ఒకరయిన శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు ఆమెకు బంధువు. ఆయన నివసిస్తున్న కడియం గ్రామానికి వెళ్ళి శిష్యరికం చేశారు. తెలుగు, సంస్కృత భాషలలో పండితురాలయ్యారు. తద్వారా గొప్ప వక్తగా మారగలిగారు. తరువాతి కాలంలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో అద్భుతమైన ఉపన్యాసాలిచ్చి ప్రజలను ఉత్తేజపరిచి, ఉత్సాహ పరచడానికి ఈమె వకృత్వ ప్రతిభ ఉపయోగపడింది. ముఖ్యంగా ఇతిహాసాలలోని ముఖ్య సూక్తులను దేశభక్తితో సమ్మిళితం చేసి తన ఉపన్యాసాలకు ప్రజలను ఆకర్షించడం ఈమెకి వెన్నతో పెట్టిన విద్య.
గాంధీజీ తాడేపల్లి గూడెంను దర్శించినప్పుడు ఆహ్వాన సంఘం వారు కోరిన విధంగా సుబ్బమ్మ గారు గాంధీజీకి హారతి ఇచ్చి ఆహ్వానించేందుకు పూనుకున్నారు. రాజమండ్రి విద్యార్థినులను తీసుకుని వచ్చి బాపూజీని గౌరవించారు.
ఈమె స్వరం చాలా గంభీరంగా, మైకు లేకపోయినా చాలా దూరం వినిపించేది. పాటలు పాడినా, సూక్తులు వల్లించినా పసిపిల్లలకు కూడా అర్థమయ్యేరీతిలో వీనుల విందు కలిగించేవి. ఈమె గురించి భారత జాతీయ కాంగ్రెస్ నాయకులకి తెలిసింది. ఈమె ఉపన్యాసాలు పోరాటంలో అస్త్రాలు అవుతాయని భావించారు.
గాంధీజీ సత్యాహింసలు, సత్యాగ్రహాయుధం ఈమెని అమితంగా ఆకర్షించాయి. గాంధీయుగంలోని అన్ని ఉద్యమాలలోను ఈమె నిర్వహించిన పాత్ర అద్వితీయం. భారతదేశంలోని అనేక ప్రాంతాలను పర్యటించి తన ఉపన్యాసఝరితో ప్రజలను ఉర్రూతలూగించారు. బాపూజీ అభిమానాన్ని చూరగొన్నారు.
1921లో భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యం లక్ష్యంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కాకినాడ సమావేశంలో ఈమె ప్రసంగం ఎక్కువ మందిని ఆకట్టుకుంది. 1921లోనే ఆంధ్రా కాంగ్రెస్ మహిళా విభాగాన్ని ప్రారంభించారు. అప్పట్లోనే తమిళులు తమ పట్ల చూపిస్తున్న వివక్షతను ఆమె గ్రహించారు. అందుచేతనే మద్రాసు నుండి ఆంధ్రను వేరుచేయాలని ఆకాంక్షించారు. ఈ దిశగా ప్రచారాన్ని చేశారు.
గాంధీజీ పిలుపును అందుకుని శాసనోల్లంఘనోద్యమం, వ్యష్టి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం మొదలయిన అన్ని ఉద్యమాలలోను పాల్గొన్నారు.
జైలు శిక్షను అనుభవించారు. 16 సంవత్సరాలపాటు A.I.C.C సభ్యురాలిగా పనిచేశారు. 1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఈమెను ‘దేశబాంధవి’ అనే పిలుపుతో గౌరవించారు. అప్పటి నుండి ‘దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ’గా పేరుపొందారు.
నిజమైన గాంధేయురాలిగా, నిరాడంబరంగా జీవించారు. ఖద్దరు వస్త్రాలనే ధరించారు. విదేశీ వస్తు బహిష్కరణోద్యమములో పాలు పంచుకున్నారు. చేనేత వస్త్రాలను ఊరూరా తిరిగి అమ్మేవారు.
అన్ని రంగాలలోను మహిళల వెనకబాటుతనానికి ముఖ్యకారణం చదువుకోకపోవడం అని గ్రహించారు. స్త్రీ విద్య అభివృద్ధి కోసం తన వంతుగా రాజమండ్రిలో సనాతన స్త్రీ విద్యాలయం పేరుతో బాలికా పాఠశాలను స్థాపించారు. ఈ పాఠశాలలో ఉచిత విద్యను అందించారు. అంతే కాదు ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కూడా కల్పించారు. ఇది బాపూజీ ఆశయాల మేరకు నడిపిన జాతీయ విద్యాలయం.
పొనకా కనకమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ మొదలైన వారితో కలిసి పనిచేశారు. పరస్పరం అభిప్రాయాలు తెలుసుకునేవారు. స్వాతంత్ర్య పోరాటంలో మహిళల భాగస్వామ్యాన్ని సుసంపన్నం చేయడానికి, స్త్రీ విద్యాభివృద్ధికి చేపట్టవలసిన కార్యక్రమాలను గురించి చర్చించుకునేవారు.
‘భరతఖండంబు చక్కని పాడియావు’ పద్యాన్ని తన ఉపన్యాసాలలో ప్రజలు దేశభక్తితో ఉప్పొంగేరీతిని గానం చేసేవారు. దేశభక్తి గీతాలను అలాగే పాడి పిల్లలచేత పాడించేవారు.
బ్రిటిష్ అధికారులను, పోలీసులను తన సింహగర్జన వంటి స్వరంతో అరిచి, కోప్పడి భయభ్రాంతులను చేయడం విశేషం.
స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో ఆమె ఆనందం పట్టలేకపోయారు. తన చుట్టుప్రక్కల వారందరికీ మిఠాయిలను పంచి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ విధంగా సంఘసేవకురాలిగా, మహిళావిద్య ఉద్యమకారిణిగా, సాతంత్ర పోరాట యోధురాలిగా పేరు పొందిన ఈమె కడు పేదరికాన్ని అనుభవించారు. ఎటువంటి పదవులనూ, అధికారాన్ని అందుకోలేదు.
చివరి రోజుల్లో కడియం గ్రామంలో ఒక గదిలో నివాసముండేవారు. 1954లో నాటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఈమెను పరామర్శించారు. వారి బంధువయిన రామచంద్రాచార్యులు ఒక కుర్చీని వేయించి ప్రకాశంగారిని కూర్చుండబెట్టారు. అంటే ఆమె ఇంట్లో కనీసం కుర్చీ కూడా లేనంత దీనావస్థను అనుభవించారన్నమాట.
1964 మే 31వ తేదీన మరణించారు.
ఈమె జ్ఞాపకార్థం ది.2021 మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవరును విడుదల చేసి గౌరవించింది భారత తపాలాశాఖ, ఈ కవర్ మీద సుబ్బమ్మ గారి విగ్రహం చిత్రాన్ని ముద్రించారు.
మే 31 వ తేదీ ఈమె వర్థంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet