Site icon Sanchika

ప్రపంచ మానవహక్కుల రూపకర్త శ్రీమతి ఎలీనోర్ రూజ్‌వెల్ట్

[dropcap]10[/dropcap]-12-2021 ప్రపంచ మానవ హక్కుల ప్రకటన దినోత్సవం సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

మానవహక్కుల ప్రకటన అనగానే మనకు గుర్తు వచ్చేది మానవతావాది, రచయిత్రి, కాలమిస్ట్, మహిళా, జాతి వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడిన మహిళామూర్తి, ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్త, నాలుగుసార్లు అమెరికా ప్రథమ పౌరురాలిగా విశిష్ట సేవలను అందించిన శ్రీమతి ఎలీనోర్ రూజ్‌వెల్ట్.

ఈమె బడితకర్ర పాలసీని పాటించిన అమెరికా అధ్యక్షుడు థియోడోర్ రూజ్‌వెల్ట్ మేనకోడలు, నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన ఫ్రాంక్లిన్-డిలనో-రూజ్‌వెల్ట్ భార్య.

ఈమె 1884వ సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన న్యూయార్క్ లోని మాన్హాటన్‌లో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు అన్నారెబెక్కాహాల్ రూజ్‌వెల్ట్, ఇలియట్ బుల్లోచ్ రూజ్‌వెల్ట్‌లు. పదేళ్ళ వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. అమ్మమ్మ మేరీ లివింగ్‌స్టన్ ఈమెను పెంచి పెద్ద చేశారు. గార్టన్ పాఠశాలలో చదువుకున్నారు.

లండన్ లోని ఎలెన్స్‌వుడ్ అకాడమీలో చదివారు. మేరీ సౌవెస్ట్రీ దగ్గర ఫ్రెంచి భాషను నేర్చుకున్నారు.

1902 నాటికి 17 ఏళ్ళ వయసులో చదువు పూర్తి చేసి అమెరికాకి తిరిగివచ్చారు. 1905లో ఫ్రాంక్లిన్‌తో ఈమె వివాహం జరిగింది. 1906 నుండి 1916 మధ్య ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చారు.

ఈమె పుట్టింటి కుటుంబం వారికి సమాజసేవంటే మక్కువ. అదే ఈమెకి వారసత్వంగా అబ్బింది. 1917లో మొదటి ప్రపంచయుద్ధం జరిగింది. ఈ సమయంలో క్షతగాత్రులని పరామర్శించి, రక్షించారు. వారికి కావలసిన సేవా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ‘నేవీ మెరైన్ కార్ప్స్ రిలీఫ్ సొసైటీ’కి ఈమె విస్తృతమైన సేవలను అందించారు. ‘రెడ్ క్రాస్ సొసైటీ’లో పని చేశారు.

1921లో ఫ్రాంక్లిన్ పోలియో వ్యాధితో బాధపడడం మొదలయింది. అప్పటి నుండి ఎలీనోర్ రాజకీయాలలో పాల్గొన్నారు. అమెరికాలోని డెమొక్రాటిక్ పార్టీ సభ్యురాలు. న్యూయార్క్ రాష్ట్ర డెమొక్రాటిక్ పార్టీలో క్రియాశీలక పాత్రని నిర్వహించారు.

న్యూయార్క్ నగరంలో బాలిక విద్య కోసం టోడ్ హంటర్ పాఠశాల పని చేసేది. ఈ పాఠశాలలో బోధకురాలిగా పని చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ నాలుగుసార్లు ఎన్నికవడం వెనుక ఈమె కృషి చాలా ఉంది.

ప్రథమ మహిళగా ఆయనని వెన్నంటే ఉన్నారు. తనను దూరంగా ఉంచకూడదని సాధారణ మహిళగానే గుర్తించి కలసి మెలసి ఉండమని అనుచరులతో అనేవారు. వారు తమతో మమేకమై దేశంలోని అన్ని ప్రాంతాలలో కలయదిరిగే ఆమెను అబ్బురంగా చూసేవారు. అందరితో కలిసే విధులను నిర్వహిస్తున్నప్పటికీ గొప్ప మహిళగా చరిత్రను సృష్టించారు.

అన్ని విషయాలను ఫ్రాంక్లిన్‌కు వివరించేవారు. ఆయనకు ‘కళ్ళు, చెవులు, కాళ్ళు’ అయ్యారు. వీల్ ఛెయిర్ లోనే ఉండి పరిపాలన చేసిన ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌కి వెన్నెముకగా నిలిచారు. 1945లో భర్త మరణించిన తరువాత రాజకీయాలలో చురుకుగా పని చేశారు. ‘ఉమెన్ ట్రేడ్ యూనియన్ లీగ్’లో చేరారు.

‘లీగ్ ఆఫ్ ఉమెన్ ఓటర్స్ లెజిస్లేటివ్ అఫైర్స్ కమిటీ’లో సభ్యురాలిగా పని చేశారు.

మహిళా కరస్పాండెంట్ల కోసం వైట్ హౌస్‌లో పత్రికా విలేఖర్లతో సమావేశాలు నిర్వహించేవారు. ఇలా సమావేశాలను నిర్వహించిన ప్రథమ మహిళగా రికార్డును సృష్టించారు. అంతేకాదు. మహిళా విలేఖరులతో మాత్రమే ఈ సమావేశాలను నిర్వహించడం చారిత్రక విశేషం. మహిళల హక్కులు, సమస్యలు, మహిళా ఓటర్లకు సంబంధించిన అంశాలను చర్చించేవారు. వ్యతిరేక వర్గం వారు ఈమెను ఈ విషయాలలో వివాదాస్పదురాలిగా చిత్రీకరించారు. అయినా మడమ తిప్పలేదు, వెనుతిరగలేదు.

మహిళలకు సంబంధించిన అంశాలను వివిధ దిన, వార, మాసపత్రికలకు వ్యాసాలుగా వ్రాశారు. మంచి కాలమిస్ట్‌గా రాణించారు.

ఆఫ్రో అమెరికన్లు, ఆసియన్ అమెరికన్లు, పేదప్రజలు, బాధిత మహిళలు, మైనారిటీల కేసులను విచారించి, న్యాయం కలగజేసేటందుకు గాను న్యాయవాదిగా మారారు. వారి హక్కులను రక్షించేటందుకు చేపట్టవలసిన కార్యక్రమాలను గురించి ఆలోచించారు.

‘ఆల్ఫా కప్పా ఆల్ఫా’ సభ్యురాలిగా పని చేశారు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో హిట్లరు వ్యతిరేకంగా జర్మనీతో భూగర్భ యుద్ధంలో కార్ల్ ఫ్రాంక్ పాల్గొన్నారు. ఇతనికి అవసరమయిన సహాయ సహకారాలను అందించడంలో ప్రముఖ పాత్రను నిర్వహించారు.

యుద్ధ సమయంలో ఐరోపా దేశాలలో చిక్కుకుపోయిన అనేకమంది అధికారులను, వారి కుటుంబాలను అమెరికా తీసుకుని రావడంలో ఈమె పాత్ర ఎనలేనిది.

సైనిక దళాలలో ధైర్యస్థైర్యాలని పెంపొందించే ప్రయత్నాలు చేసి విజయం సాధించారు. దక్షిణ పసిఫిక్ మహాసముద్ర తీరానికి ప్రయాణించారు. ‘సివిల్ డిఫెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్’గా విధులను నిర్వహించారు. ఈ విధంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా ప్రథమ పౌరురాలిగా ఈమె సేవలు శ్లాఘనీయం.

1946లో హ్యారీట్రూమన్ అమెరికా అధ్యక్షులయారు. వీరు ఎలీనోర్‌ను ఐక్యరాజ్యసమితికి తమ దేశ ప్రతినిధిగా నియమించారు.

బలవంతుల చేత పీడింపబడి బాధలు పడుతున్న బలహీనుల సంక్షేమం కోసం విధులను నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారీమె. అయినా వారి హక్కులను రక్షించాలనే తపన ఈమె మనసును తొలుస్తూనే ఉండేది. ఈ ఆలోచనల ఫలితంగా 1948 సెప్టెంబర్ 28వ తేదీన ‘The International Magna Carta’ ప్రకటించబడింది.

ప్రపంచ మానవహక్కుల సమాచార అంశాల ముసాయిదా తయారు చేయడంలో ఈమె నిర్వహించిన పాత్ర అద్వితీయం. విశ్వవ్యాప్తంగా ప్రజల వేదనకు ప్రతీక ఇది. 1948 డిశంబర్ 10వ తేదీన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (జనరల్ అసెంబ్లీ)లో ప్రపంచ మానవహక్కుల ప్రకటన చేయబడింది. అప్పటి నుండి 1953 వరకు ఎలీనోర్ ‘ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమీషన్ అధ్యక్షురాలి’గా పని చేశారు. మానవహక్కుల సంఘానికి తొలి ప్రతినిధిగాను పని చేశారు. ఈ విధంగా మానవహక్కులకూ ఎలీనోర్ రూజ్‌వెల్ట్‌కు అవినాభావ సంబంధం ఏర్పడింది.

ఆనాడు ఆమె రూపొందించిన మానవ హక్కులు ఈనాడు అనేక దేశాలలో స్త్రీలు, అణగారిన బలహీన వర్గాలు, మైనారిటీలను రక్షిస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. ఈ అంశాన్ని కొన్ని దేశాలు తమ తమ రాజ్యాంగాలలో పొందుపరిచాయి.

ఈమె DAR ‘డాటర్స్ ఆఫ్ ది అమెరికన్ రివల్యూషన్’లో సభ్యురాలిగా పని చేశారు. అయితే ఈ సంస్థ ఆఫ్రో అమెరికన్ గాయకుడు మారియన్ ఆండర్సన్ కచ్చేరి చేయడానికి అనుమతిని ఇవ్వలేదు. ఈ విషయం నచ్చని ఎలీనోర్ తన సభ్యత్వానికి రాజీనామా చేసి నిరసన తెలియజేశారు. ఆ తరువాత లింకన్ మెమోరియల్‌లో కచేరీని ఏర్పాటు చేశారు. 75,000 మంది ఈ కచేరీకి హాజరయారు. ఎలీనోర్‌కు గల ప్రజాదరణకు ఇది నిదర్శనం. 1953లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ‘రిపబ్లికన్ పార్టీ’ అభ్యర్థి ఐసెన్ హోవర్ గెలిచారు. తను ‘డెమొక్రాటిక్ పార్టీ వ్యక్తి’ కాబట్టి ‘ఐక్యరాజ్యసమితిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రతినిధి’ పదవికి రాజీనామా చేసి గౌరవాన్ని నిలుపుకున్నారు. ఆమెకి పదవుల కంటే నైతిక విలువలు ముఖ్యమని ఈ రెండు సంఘటనలు తెలియజేశాయి. ఈనాటి రాజకీయ నాయకులు ఇటువంటి నాయకుల జీవితం నుండి చాలా పాఠాలు నేర్చుకోవాలి.

1952 – 1956 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తను తొలినాటి నుండి మద్దతిచ్చి, తన భర్తను 4సార్లు అధ్యక్షుడిగా ఎన్నుకున్న డెమొక్రాటిక్ పార్టీ తరపున పని చేశారు. పై రెండు ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థి అడ్లై స్టీవెన్సన్ గెలుపు కోసం శ్రమించి తన నిబద్ధతను ఋజువు చేసుకున్నారు.

ఆమె పదవికి రాజీనామా చేశారు. కాని స్వచ్ఛందంగా ‘అమెరికన్ అసోసియేషన్’, ‘ఐక్యరాజ్యసమితి అసోసియేషన్స్ ప్రపంచ సమాఖ్య’ల ద్వారా తన దేశానికి సేవలనందించారు. ఈ సేవలు ఈమెను ‘అసోసియేషన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్’ని చేశాయి. 1961లో అమెరికా అధ్యక్షుడు జాన్.ఎఫ్.కెనడీ ఈమెను తిరిగి ఐక్యరాజ్యసమితికి అమెరికా ప్రతినిధిగా నియమించారు. ‘శాంతిదళం యొక్క జాతీయ సలహాదారుల కమిటీ’ సభ్యురాలిగా, మహిళల పరిస్థితులను అధ్యక్షునికి తెలియపరిచే కీలక సంస్థ అధ్యక్షురాలిగా నియమించి గౌరవించారు కెనడీ.

తన కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుని వెళ్ళేందుకుగాను ఈమె ప్రసారమాధ్యమాలను, పత్రికలను ఉపయోగించుకున్న తీరు అనిర్వచనీయం.

1935 నుండి 1963లో మరణించే వరకు (28 సంవత్సరాలు) సిండికేట్ కింగ్ ఫీచర్స్ వార్తా పత్రికలో ‘మైడే’ కాలమ్ నిర్వహించిన గొప్ప కాలమిస్ట్ ఈమె.

రేడియో, టెలివిజన్ ద్వారా ఇంటర్వ్యూలను, ప్రసంగాలను, మానవహక్కుల సమాచారాన్ని అందించారు.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ విండర్స్ వంటి వారితో ఈ షోలు నడిచాయి. ఈమె కుమారుడు ఇలియట్ ఈమెకి అందించిన సహాయసహకారాలు అద్వితీయం.

ఈ విధంగా పసిప్రాయంలో తల్లిదండ్రులను కోల్పోయినా చదువుకుని, విద్యావేత్తగా మారి, ప్రపంచ ప్రజలు ముఖ్యంగా అణగారిన వర్గాల హక్కుల కోసం శ్రమించి అంతర్జాతీయ పార్లమెంటు అయిన ఐక్యరాజ్యసమితిలో ‘విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన’ను సమర్పించి, విశ్వవ్యాప్తంగా ప్రజల మన్ననలను పొందిన ‘ఎలీనోర్ రూజ్‌వెల్ట్’ ధన్యురాలు.

ఈమె పత్రికలలో కాలమిస్ట్‌ గానే కాదు గ్రంథ రచయిత్రిగానూ పేరు పొందారు. 1937లో “This is my STORY’, 1949లో ‘This I Remember’, 1958లో On My Own, 1961లో Autobiography లను వ్రాసి తన అనుభవాలను ప్రపంచానికి అందించారు. ఇవి ఆమె జీవితకాలం నాటి అమెరికా, ప్రపంచదేశాల సమకాలీన చరిత్ర కూడా!

ఈమె 1962 నవంబర్ 7వ తేదీన న్యూయార్క్ నగరంలో మరణించారు. ప్రపంచ దేశాల ప్రజలకు మానవహక్కులు కల్పించడం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన ఈమె శారీరక దారుఢ్యం సన్నగిల్లింది. అప్లాస్టిక్, అనీమియా, క్షయ, గుండెజబ్బులు ఈమె మరణానికి కారణమవడం బాధాకరం.

ప్రపంచ మానవహక్కుల ప్రకటనకి 15వ వార్షికోత్సవ సందర్భంగా (1963 డిశంబర్ 10 నాటికి) 1963 డిశంబర్ 10వ తేదీన భారత తపాలాశాఖ 15 నయాపైసల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది. ఈ స్టాంపు మీద మగ్గం మీద నూలు వడుకుతూ కూర్చున్న ఎలీనోర్ రూజ్‌వెల్ట్ చిత్రం స్పూర్తివంతంగా కనిపిస్తుంది. Universal Declaration Of Human Rights 15th Anniversary – 10 December 1963 అని వ్రాసి ఉంటుంది.

డిశంబర్ 10వ తేదీ మానవహక్కుల ప్రకటన దినోత్సవం సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

Exit mobile version