[హిమజ గారు రాసిన అయిదు కవితలను విశ్లేషిస్తున్నారు శ్రీ సందినేని నరేంద్ర.]
హిమజ గారు ప్రచురించిన ‘ఆకాశమల్లె’, ‘సంచీలో దీపం’ అనే కవితా సంపుటుల లోంచి నాకు నచ్చిన కవితలను, ఆవిడ రాసిన మరికొన్ని కవితలను ఇక్కడ విశ్లేషిస్తున్నాను.
1. ఆమె
‘ఆమె’ కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివానునాలో ఆలోచనలు రేకెత్తించింది. ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి ఆమె అని చెబుతాం. ఆమె ఎవరు? ఆమె ఏం చేస్తుంది? అనే విషయం గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. ఒక స్త్రీ మనకు పరిచయం ఉంటే ఆమెను పేరు పెట్టి పిలుస్తాం. ఆమెతో సంభాషిస్తాం. పరిచయం లేని స్త్రీ ఎదురైతే ఆమెను ఎవరు మీరు? అని ప్రశ్నిస్తాం. హిమజ రాసిన కవిత శీర్షిక పేరు ఆమె. ఆమె ఎవరు కావచ్చు అని ఆమెను గురించిన ఆలోచన తరంగాల్లో మునిగి తేలుతాము.
‘ఆమె కథలెన్నో చెబుతుంది
తన కథేంటో ఎప్పుడూ
చెప్పదు
తన కళ్ళలో తన కథని
చదివే వారి కోసం
ఆమె ఎదురు చూస్తుంది.’
కథ తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ. కథ అనగా ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధం. ఎవరైనా లేనిది కల్పించి మాట్లాడితే కతలు చెప్పకు అంటాం. చిన్నపిల్లలను నిద్ర పుచ్చడానికి తల్లిదండ్రులు కథలు చెప్పడం బాగా అలవాటు. ఆమె తన కథను ఎవరికి కూడా విడమర్చి చెప్పదు. ఆమెకు తన హృదిలో రగులుతున్న కథను ఎవరికి చెప్పాలనిపించదు. ఆమెకు తన కథను విప్పి చెప్పడానికి ఇష్టం ఉండదు. ఎందుకో ఆమెకు తన జీవితంలో జరిగిన సంఘటనల యథార్థాన్ని ఆమె తన హృదయంలోనే నిక్షిప్తం చేసుకుంటుంది. ఆమె తన కళ్ళలో రాసిన తన కథని చదివే వారికోసం ఎదురుచూస్తుంది. ఆమె పట్ల ఇష్టం ఉన్నవారే ఆర్తిగా ఆమె కళ్ళలోకి చూస్తారు. ఆమె కళ్ళ భాషను అర్థం చేసుకునే శక్తి వారికి ఉంటుంది. ఆమె కళ్ళ భాషలో రాసిన కథను ప్రేమగా చదివే వారికోసం ఆమె నిరీక్షణ కొనసాగుతుందని చెప్పడం చక్కగా ఉంది.
‘మన మెప్పుడు చూసి ఉండని
అందమైన రంగులతో
సహజాతి సహజంగా
మెరిసిపోయే అపూర్వ
కళాఖండం ఆమె!’
ఆమె అందానికి మారుపేరులా ఉంటుంది. ఆమె అందంగా అలంకరించుకుంటే దివి నుండి భువికి దిగివచ్చిన అప్సరసలను తలపిస్తుంది. మనం ఎప్పుడు చూసి ఉండని అందాలతో ఆమె అలరారుతూ ఉంటుంది. ఆమె అందమైన రంగులతో రంగురంగుల సీతాకోకచిలుకల వలె సహజాతి సహజంగా కనుల విందు చేస్తూ మెరిసిపోతున్నది. ఆమె అందం ఏ కళాకారుడి కుంచెకు అందని అపూర్వ కళాఖండం అని చెప్పడం చక్కగా ఉంది.
‘ఆమె తనకు తానే
ఓ అందమైన కవిత్వం
పగిలిన హృదయాల్లోంచి
అందమైన పదాలు
ఏరుకొని రాసే కలం ఆమె.’
ఆమెలో అపారమైన ప్రేమ పూరితమైన భావాలు దాగి ఉన్నాయి. ప్రేమ నుండే కవిత్వం ఉబికి వస్తుంది. ఆమె తనకు తానే ఓ అందమైన కవిత్వంగా రూపుదిద్దుకుంది. ఆమె వ్యక్తిత్వం కవిత్వం యొక్క చిరునామాగా మారింది. ఆమెలో పొంగిపొరలే భావధారలతో సృజనకు పునాది పడింది. ఆమెలో కవితా పరిమళాలు నిండి ఉన్నాయి. ఆమె అందమైన కవిత్వానికి బీజంగా మారింది. ఆమె హృదయం సున్నితమైనది. రగిలే హృదయాల వేదన నుంచే ఆమె కలం నుండి అందమైన పదాలు సృష్టించడం, ప్రయోగించడం జరిగింది. హృదయ వేదనల నుండి అందమైన పదాలు ఏరుకొని రాసే కలం ఆమె అని చెప్పిన తీరు అద్భుతం.
‘తారలు మాట్లాడుతాయని
మీకు తెలుసా
ప్రతి రాత్రి ఎన్నో
అందమైన కథలని
ఆమె కళ్ళ ద్వారా
వినిపిస్తాయి!!’
రాత్రిపూట ఆకాశంలో వేనవేల నక్షత్రాలు మినుకుమినుకుమంటూ ప్రకాశిస్తాయి. తారలు మాట్లాడుతాయని మీకు తెలుసా అని ప్రశ్నించడం విడ్డూరంగా అనిపిస్తుంది. తారలు ప్రతి రాత్రి పూట ఎన్నో అందమైన కథలను ఆమె కళ్ళ ద్వారా వినిపిస్తాయి. ఆమె కళ్ళలో తారలు కనిపించడం నిజమే అనిపిస్తుంది. తారలు ఆమె నేత్రాల ద్వారా కథలు వినిపించడం వింతగా అనిపిస్తుంది. ఆకాశంలోని నక్షత్రాలు ప్రతి రాత్రి పూట భావుకత నిండిన కథలని ఆమె నేత్రాల ద్వారా ప్రకటింపచేస్తాయి. ఆమె కళ్ళ ద్వారా అందమైన కథలు వినిపిస్తాయని చెప్పడం ప్రతీకగా తోస్తోంది. ఆమెలో చెలరేగే భావావేశాన్ని కవితలో వ్యక్తం చేయడం అద్భుతంగా ఉంది.
2. ఆమె కథ
‘ఆమె కథ’ కవిత ‘ఆకాశమల్లె’ కవితా సంపుటి లోనిది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. ఆమె ఎవరు? ఆమె కథా కమామిషు ఏమిటి? ఆమె కథ ఉనికి ఏమిటి? తెలుసుకోవాలి అనే ఉత్సాహం, ఉబలాటం ఎవరికైనా కలగడం సహజమే.
‘వాళ్ళిద్దరూ
ప్రేమైక జంట.’
వాళ్ళిద్దరు ఎవరు? అతడు, ఆమె జత ఇద్దరు. అతడు, ఆమె జతగా కలిసి ఉంటే వాళ్ళు ఇద్దరు అని చెప్పవచ్చు. అతడు, ఆమె ఎక్కడ ఎలా కలుసుకున్నారు? ఆతడు, ఆమెకు పరిచయం ఎలా అయింది? అతడు, ఆమె ప్రేమ, అనురాగంతో కలిసిమెలిసి ఉంటున్నారు. అతడు, ఆమె అరమెరికలు లేకుండా ఆప్యాయతతో కలిసి ఉన్న జంటను చూసిన వాళ్ల ఇద్దరిని కొందరు ప్రేమికులుగా అంటున్నారు. మరి కొందరు వారి ఇద్దరిని అపూర్వమైన సీతారాముల జంటగా కొనియాడుతున్నారు.
‘వారిది అన్యోన్య దాంపత్యం
అవును మరి –
అతడు అనుమతించిన వనాలలోనే
విరబూసి పరిమళించే పూదోట ఆమె.’
వివాహం చేసుకున్న భార్యాభర్తలు కలిసి చేసే జీవనం దాంపత్యం అంటారు. దాంపత్య జీవితం గడిపే వారిని దంపతులు అంటారు. అతడు, ఆమె భార్యాభర్తలుగా కలిసిమెలిసి ఉంటూ అన్యోన్యతను చాటుతున్నారు. అతడు ఆమె మధ్య శాశ్వత బందం ఏర్పడింది. అతడు,ఆమె పార్వతి పరమేశ్వరుల జంట వలె అన్యోన్య దాంపత్యంతో కలిసిమెలిసి ఉంటున్నారు. అతనికి ఇష్టమైన ప్రదేశాలలోనే ఆమె తిరుగుతూ ఉంటుంది. అతను పెంచిన పూల చెట్లు పుష్పించి పరిమళాలు వెదజల్లుతున్నాయి. అతడు పెట్టిన పువ్వుల తోటలో వికసించిన పుష్పం పరిమళాలతో గుబాలిస్తున్నది ఆమె అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
‘అతడు స్వరపరిచిన బాణీలోనే
రాగ మాధురి ఆలపించే కోకిల ఆమె.’
సంగీతం అనే కళలో ప్రావీణ్యం ఉన్న వారు బాణీలను స్వరపరిచే నిపుణుడు అంటారు.ఆమె పాడే కళలో నిపుణత చూపించుటకు అతను సంగీత దర్శకుడుగా వ్యవరిస్తున్నాడు అని అర్థమవుతున్నది. అతడు స్వరపరిచిన బాణీలోనే ఆమె పాడుతూ రాగ మాధుర్యంతో ఆలపిస్తూ కోకిలను తలపిస్తుంది. వసంత మాసంలో కోకిల కుహూ కుహూ రాగాలు మనసును రంజింపజేస్తాయి. అతని కోరిక మేరకు ఆమె, అతను చెప్పినట్లుగానే ఆలపిస్తూ తన్మయత్వం కలగజేసే కోకిల ఆమె అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘అతని కనుసన్నల సీమలలోనే
నర్తించే కదలికల మయూరి ఆమె.’
అతని కనుల ముందే ఆమె కనబడుతూ నాట్యం చేస్తున్నది. అతని మనో మందిరంలో ఆమె చేసిన నాట్య ముద్రలు కళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఆమె నాట్యం చేస్తున్న తీరు నాట్య భంగిమలు చూసేవారి కనులలో నెమలిని తలపింపజేస్తున్నాయి. నడకలో, నాట్య ప్రదర్శనలో నెమలిలా ఆమె నటన కళ్ళను మిరుమిట్లు గొలిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటాయి.
‘అతడు తూచిన కొలమానాల మేరకు
ప్రసరించే ప్రేమానురాగాలు ఆమెవి.’
కొలుచుటకు ఉపయోగించే యంత్రం, ఏదైనా వస్తువు యొక్క పొడవు వెడల్పులను కొలిచేది కొలమానంగా చెప్పవచ్చు. అతని ఇష్టాఇష్టాల మేరకు నడుచుకుంటూ ఆమె ఎద నుండి ఎల్లవేళలా ప్రేమానురాగాల జల్లులు కురిపిస్తుంది. అతని పట్ల ఇష్టంతో ఆమె ప్రేమను పంచుతూ అనురాగంతో మెలుగుతుంది.
‘ఆమె ప్రపంచమంతా అతనొక్కడే
ఇదంతా..
అనివార్యంగా అనిరతంగా సాగితేనే.’
ఆమె వ్యక్తిత్వం సంతరించుకున్న మనిషి. ఆమెకు ఊహలు, ఆలోచనలు, కలలు, కోరికలు ఉన్నాయి. ఆమెకు తనకు తానే సాటి అని తెలియజేసే ఒక గొప్ప ప్రపంచం ఉంది. ఆమె గిరిగీసుకున్న ప్రపంచంలో మరెవ్వరికీ స్థానం లేదు. అతనికొక్కడికి మాత్రం ఆమె హృదయంలో చోటు కల్పించింది. ఆమె హృదయంలో గుడి కట్టి అతనిని ప్రతిష్ఠించుకున్నది. ఆమె కళ్ళలో అతడు తప్ప మరెవరు కనిపించరు. అతని పట్ల ఆమెలో అవ్యాజమైన ప్రేమ, అనురాగం నిండి ఉన్నాయి. ఆమె లోకంలో అతడు కనిపించే దేవుడులా కొలువై ఉన్నాడు. ఇదంతా అతడు ఆమె పరస్పర అనురాగం కారణంగా ప్రేమ విజయంగా అనివార్యం అని తోస్తుంది. అతడి పట్ల ఆమె ప్రేమలో ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలు లేకుండా సాగుతుండడం వింతగా తోచవచ్చు. అతనికి ఆమె ప్రేమను విజయంగా చెప్పవచ్చు. పరిస్థితులు బిన్నంగా ఉన్నప్పటికీ అతని పట్ల ఆమె ప్రేమ చెరిగిపోలేదు. ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆమెను తెలుసుకోవాలి. చూడాలి అనే కాంక్షతో వారి ప్రేమ సాగుతుంది అని వ్యక్తపరచిన భావం చక్కగా ఉంది.
‘నిజంగా అతడి హృదయ వైశాల్యమెంతో
ఆమె కన్నా బాగా
మరింకెవరికి తెల్సు!’
నిజంగా అతడి పట్ల ఆమె ఎంతో ఇష్టంతో ఉంది. అతని హృదయం యొక్క వైశాల్యం ఎంత గొప్పగా ఉందో ఆమెకు బాగా తెలుసు.ఆమె అతనితో కలిసి మెలిసి జీవిస్తున్నది.ఇంకెవరికి అతని గురించి తెలిసే అవకాశం లేదు.అతని హృదయం యొక్క ఎత్తు పల్లాలు,కొలతలు,వైశాల్యం అన్ని ఆమెకు కొట్టినపిండి అని చెప్పవచ్చు.అతని గురించి లోతైన ఆధ్యయనం చేసింది.అతనిని గాఢంగా ప్రేమించింది. అతని హృదయ స్పందనలు ఆమెకు బాగా తెలుసు. మరి ఇంకెవరికి అతని గురించి తెలిసే అవకాశం ఉండదు అని చెప్పిన భావం చక్కగా ఉంది.
‘జీవితకాలమంతా
అతడిచ్చిన ఓ పదెకరాల పరిధిలోనే
ఆమె బ్రతుకు వ్యవసాయం.’
జీవితకాలం అంతా అతడు తనకు ఇచ్చిన పది ఎకరాల భూమి పరిధిలోనే ఆమె బ్రతుకు వ్యవసాయం సాగుతుంది. అతడు, ఆమె ఇద్దరు కలిసి జీవనం సాగిస్తున్నారు. అతనితో ఆమె జీవితకాలం గడపడం, అన్యోన్యతతో మెలగడం, అతడిచ్చిన చనువు, సహకారం అనేది పది ఎకరాల పరిధిలోనే ఆమె బ్రతుకు వ్యవసాయం సాగుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘ఇది ఒక్క ఆమె కథ కాదు
‘ఎందరో ఆమెల కథ.’
ఈ కవితలోని భావాలు ఇది ఒక్క ఆమె కథ కాదు. ఎందరో ఆమెలాంటి స్త్రీల కథ అని చెప్పిన తీరు చక్కగా ఉంది. సమాజంలో స్త్రీల జీవితాలు అతడు, ఆమె పరిధిలోనే గడుస్తాయి. అతడు, ఆమె చక్కగా అన్యోన్యతతో జీవితాలు పంచుకుంటే జీవితం సుఖమయంగా సాగుతుంది. ‘ఆమె కథ’ ద్వారా పంచుకున్న భావాలు సమాజంలో స్త్రీల జీవితాలు చక్కగా సాగడానికి ఉపయోగపడుతుంది.
3. నాన్నా – అమ్మని పంపించు
‘నాన్నా – అమ్మని పంపించు’ కవిత ‘ఆకాశమల్లె’ సంపుటి లోనిది. ‘నాన్నా – అమ్మని పంపించు’ కవిత ఏమిటని ఆసక్తితో చదివాను. ఆలోచనలు రేకెత్తించింది. నాన్నా అమ్మని పంపించు అని కొడుకు తండ్రికి సందేశం పంపించడం ఏమిటి? అని ఆశ్చర్యం కలిగిస్తుంది. కొడుకు యొక్క సందేశాన్ని కవితగా మలిచారు హిమజ. ‘నాన్నా – అమ్మని పంపించు’ కవితను చదువుతుంటే హృదయం నుండి వేదన పెల్లుబుకుతుంది. అమ్మను తన దగ్గరికి పంపించమని కొడుకు నాన్నను అడిగిన తీరు అబ్బురమనిపిస్తుంది. ఇవ్వాళ సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలకు యథార్థ రూపంగా తోస్తుంది. భారత దేశంలో చదువుకున్న పిల్లలు సరియైన ఉపాధి అవకాశాలు లేక విదేశాలకు వలస వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ బాగా డబ్బు సంపాదించి తమ దేశానికి వచ్చి పెళ్ళి చేసుకుని భార్యను తమ వెంట తీసుకుని విదేశాలకు తిరిగి వెళ్ళిపోతున్నారు. విదేశాలకు వెళ్ళిన భార్యాభర్తలు కాపురం చేసి అక్కడే పిల్లలను కంటున్నారు. విదేశంలో తమ పిల్లల యోగ క్షేమాలు చూసుకోవడానికి అక్కడ మన వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు పిల్లలకు భారతదేశంలో ఉన్న తమ తల్లిదండ్రులు గుర్తుకు రావడం సహజమే. భారతదేశం నుండి అమ్మ వచ్చినట్లయితే నా పిల్లల బాగోగులు చూసుకుంటుంది, ఇంటి పనులు చేస్తుంది అని కొడుకు అమ్మను పంపించమని తండ్రిని కోరడం వాస్తవం అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘నాన్నా.. అమ్మని పంపించు
ఇక్కడేం బాగా లేదు
అక్కడిలా కాదు
అంతా పరుగులమయం
అన్నీ మనమే చేసుకోవాలి
పెట్టుకుంటే నర్సులు ఆయాలు దొరుకుతారనుకో
కానీ.. కాస్ట్లీగా ఛార్జ్ చేస్తారంతే!’
కొడుకు నాన్న అని ప్రేమగా పిలుస్తూ అమ్మని పంపించు అని సందేశం ద్వారా కోరుతున్నాడు. కొడుకు ఉండేది ఉన్న ఊరు కాదు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో ఉంటున్నాడు. పరాయి దేశంలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. ఆ దేశంలో అక్కడ నివసించేవారు, ఎవరికి వారే యమునా తీరే, ఎవరి జీవితాలు వారివి. ఎవరిని ఎవరు పట్టించుకోరు. ఇక్కడేం బాగా లేదు? అని అంటున్నాడు. మనకు తెలియని దేశంలో ఏం బాగుంటుంది. ఎలా బాగుంటుంది. అతడు ఉండేది. ఎక్కడో దూరంగా సప్త సముద్రాల ఆవల గడిపే బతుకు కదా, తెలువని చోటు కదా, అంతా కొత్త కొత్తగా ఉంటుంది. ఆ దేశంలో డాలర్ల కోసం అందరు పరుగులు తీస్తూ జీవనం సాగిస్తారు. మన దేశంలో ఉన్నట్లు కలివిడిగా ఉండటం కనిపించదు. ఎవ్వరి బాగోగులు ఎవరు ఆలోచించరు. ఎవరి జీవితాలు వారివే. పరుగులమయమైన జీవితం. ఆ దేశంలో అంతా చిత్రాతిచిత్రంగా తోస్తుంది. తెలువని ఆ దేశంలో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నాము. అక్కడ ఎవరు సహాయం చేసే వారు కనిపించరు. ఆ దేశంలో అన్ని పనులు ఎవరికి వారే స్వయంగా చేసుకోవాలి. మన దేశంలో ప్రజలు ఒకరితో ఒకరు పరస్పరం కలిసి మెలిసి ఉంటారు. పనులు కూడా ఒకరు మరొకరి సహకారంతో పూర్తి చేస్తారు. ఆ దేశంలో డాలర్ల మాయ కొనసాగుతుంది. ఆ దేశంలో డాలర్లు ఖర్చు పెడితే నర్సులు పనిచేయడానికి లభిస్తారు. నర్సులు పనిచేయడానికి ఎక్కువ డాలర్లు అడుగుతారు. డాలర్లు ఖర్చు చేసి నర్సులను ఆయాలను పెట్టుకోవడం ఎలా అని కొడుకు తన సందేశంలో వాపోతున్నాడు.
‘అంతకంటే ఇండియా నుంచి
ఓ మనిషి వచ్చి
ఆరు నెలలు ఉండిపోవడమే చాలా చీప్
ఆఫ్‌లైన్ మెసేజ్ చూసుకోలేదా నాన్నా!’
భారతదేశం నుండి ఒక మనిషి వచ్చి ఆరు మాసాలు విదేశంలో ఉండి పనిచేయడం చాలా చౌక అని చెబుతున్నాడు. నేను మీకు పంపించిన ఆఫ్‌లైన్ సందేశం చూసుకోలేదా నాన్న అని పలకరిస్తున్నాడు. అమ్మ ఏమీ తీసుకోకుండా అనురాగంతో మమతలు పంచుతూ సేవలు చేస్తుంది. అక్కడ విదేశంలో నా ఇంట్లో రోజు చేయాల్సిన పనుల్ని చేస్తూ ఎంతో నేర్పుగా ఒద్దికగా పనులన్ని చక్కబెట్టుతుంది. అమ్మను పంపించడమే సరి అయినది. కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో అమ్మకంటే భేషయిన వ్యక్తి ఎవరు ఉండరు. అందుకే భారతదేశం నుండి విదేశానికి ఆమ్మను పంపించడమే సరైనది అని నాకు తోస్తున్నది.
‘జవాబివ్వ లేదేం
అమ్మని స్టేట్స్‌కి పంపిస్తే
నీకెలాగా అని ఆలోచిస్తున్నావా?
నీ వ్యాపకాలు నీకెలాగూ
వుండనే వున్నాయి కదా!’
కుమారుడు నాన్నను అడుగుతున్నాడు. ఎందుకు సమాధానం ఇవ్వలేదు? ఏ తండ్రి కూడా కుమారుడు ఇలా అడుగుతాడని ఏనాడు కలలో కూడా ఊహించని సంఘటనగా తోస్తుంది. ఏనాడు ఇలాంటి సంఘటన ఎన్నడూ కూడా ఏ తండ్రికి ఎదురు కాలేదు. ఇవ్వాళ కుమారుడు అడిగిన దానికి సమాధానం చెప్పలేక తండ్రిగా మౌనాన్ని ఆశ్రయించాడు. కుమారుడు అమ్మని నా దగ్గరకు విదేశాలకు పంపిస్తే అమ్మ లేకుండా ఇంట్లో ఎలా గడుస్తుంది. నీకు ఎలాగా అని ఆలోచిస్తున్నావా అని ప్రశ్నించడమే కాకుండా కుమారుడు జవాబు కూడా ఇస్తున్నాడు. అమ్మ నీ వద్ద లేకున్నప్పటికీ నీవు చేసే పనులు వ్యాపకాలతో నీవు తీరిక లేకుండా రోజంతా గడుపుతావు కదా అని తెలియజేయడం చిత్రంగా అనిపిస్తుంది. అమ్మ లేకుండా నాన్న గడిపిన సమయాలు లేవు అని చెప్పవచ్చు. అమ్మానాన్న ఎల్లప్పుడూ ఉండేది ఒకే చోటు ఇల్లు. ఆ ఇల్లు తప్ప అమ్మానాన్నలు వేరే బంధువుల ఇంటికి ఎక్కడికి వెళ్లినట్లు నాకైతే తెలవదు. ఎప్పుడు అమ్మ తోడుగా నాన్న జీవించినంత కాలం కలిసే ఉంటారు. ఇవాళ అమ్మ లేకుండా నాన్న ఉండగలడా అని ఆలోచించడం లేదు. జీవితం ఎంతగా మారిపోయింది అని తనలో తాను మథన పడుతున్నాడు. ఉపాధి పేరిట విదేశాలకు వెళ్లిన కుమారుని తప్పు పట్టలేడు. కుమారుని ఇష్టానుసారం అమ్మని పంపిస్తానని సర్ది చెప్పలేడు.
‘మేమిక్కడికి వచ్చినప్పటి నుంచీ
ఇంటర్నెట్ తో పరిచయం
బాగా పెరిగింది కదా నీకు
ఒక్కసారి నెట్ ఓపెన్ చేస్తే
మేమే కాదు
ప్రపంచమే నీ ఒళ్ళో వాలుతుంది.’
అంతర్జాలాన్ని ఆంగ్లంలో ఇంటర్నెట్ అని అంటారు. అంతర్జాలం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఒక వ్యవస్థ. ఇంటర్నెట్ నెట్‌వర్క్ లను కలిపే నెట్వర్క్. ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు. కుమారుడు ప్రేమగా అంటున్నాడు మేం విదేశాలకు పోయినప్పటి నుండి నాన్న మీకు అంతర్జాలంతో పరిచయం బాగా పెరిగింది. ఒక్కసారి అంతర్జాలం ఓపెన్ చేస్తే విదేశాల్లో ఉన్న నేను మీ కోడలు కనిపిస్తాం. అందరు కనిపిస్తారు. మొత్తం ప్రపంచమంతా నీ ఒళ్ళో వాలుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది. నాన్నా నిన్ను నీవు మరిచిపోయి నీ పనులన్నీ చక్కబెట్టుకుంటావు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘అయినా.. నాన్నా
మా చదువుల
బాధ్యతల్లో పడి అమ్మ
నిన్ను కూడా నిర్లక్ష్యం
చేస్తుందనే వాడివి కదా నువ్వు’ –
కుమారుడు నాన్న గురించి చెబుతున్నాడు. మా చదువుల బాధ్యతల్లో పడి అమ్మ నిన్ను కూడా నిర్లక్ష్యం చేసి సరిగా పట్టించుకోలేదు అనేవాడివి కదా అని అడుగుతున్నాడు. నిజమే, పిల్లలు పెరిగి పెద్దయ్యాక తల్లి సాధారణంగా పిల్లల చదువులు వారి బాగోగుల గురించి శ్రద్ధ వహించవలసిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో తల్లి అలా ప్రవర్తించడం వల్ల తండ్రి పట్ల చూపించాల్సిన అనురాగం కొంచెం తగ్గిందనే భావన కలుగుతుంది. అప్పటి పరిస్థితులకు అనుకూలంగా తల్లి మెలగడంలో తప్పులేదు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘తన ప్రపంచమంతా మేమే అయి
మాకై పరుగులు పెట్టేది కదా అమ్మ
మమ్మల్నే కాదు
మా పిల్లల్ని కూడా
కంటికి రెప్పలా చూసుకుంటుంది అమ్మ.’
తల్లి ప్రేమ ముందు ప్రపంచంలో ఏది సాటి రాదు అంటారు. అమ్మ తన కడుపున పుట్టిన పిల్లలని ప్రేమను పంచి సాకుతుంది. అమ్మ తన పిల్లలను తయారు చేయడం, అన్నం తినిపించడం, పాఠశాలకు పంపించడం, పాఠశాల నుంచి రాగానే వాళ్లకు తినిపించి పడుకునే వరకు వాళ్లను చదివించి తన పిల్లల బాగోగులే తన లోకంగా బతుకుతుంది. అమ్మ మమ్మల్ని అపురూపంగా పెంచింది. మా పిల్లల్ని కూడా అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటుంది అని కుమారుడు చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘నీకు దూరంగా వచ్చినా
ఇక్కడ మా కోసం
బతకడం కన్నా వేరే
ఆనందం ఏముంది అమ్మకి.’
నిన్ను విడిచి నీకు దూరంగా వచ్చినప్పటికి అమ్మ కడుపులో నవ మాసాలు మోసి మమ్ములను కన్నది, మా కోసం బతకడం కన్నా అమ్మకి వేరే ఆనందం ఏముంది? అమ్మ మమ్ములను చూసి ఎంతో ఆనందంతో ఆప్యాయతతో మురిసిపోతుంది. అమ్మ ఎప్పుడు మా సంతోషం కొరకు తహతహలాడుతుంది. అమ్మకి మా పట్ల ధ్యాస తప్ప వేరే ఆలోచన ఏమీ ఉండదు. అమ్మ ఎప్పుడూ మా బాగోగుల గురించి ఆలోచిస్తుంది. అమ్మను మించిన దైవం ఏమున్నది నాన్న అని చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.
‘త్వరగా అమ్మని
పంపించు నాన్నా.’
కుమారుడు త్వరగా అమ్మని నా వద్దకు పంపించు అని వేడుకుంటున్నాడు. త్వరగా అమ్మని పంపిస్తే నా సంగతి ఎవరు చూసుకుంటారు అని మనసులో అనుకుంటున్నాడు. తండ్రి తనలో కలిగే బాధను కుమారునికి చెప్పలేడు. కట్టుకున్న భార్యను సమాధానపరచలేడు. ఏదో తెలియని భావంతో కుంగిపోతున్నాడు. అమ్మని పంపిస్తే తను ఒంటరివాడు అయిపోతున్నట్టు దిగులు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏ తండ్రికి ఎదురు కాకూడదు అనే భావం అతనిలో ఉన్నట్టుగా తోస్తోంది. చక్కటి కవిత అందించినందుకు కవయిత్రి హిమజను అభినందిస్తున్నాను.
4. అమ్మ ఇల్లు
‘అమ్మ ఇల్లు’ కవిత ‘సంచీలో దీపం’ సంపుటి లోనిది. అమ్మ ఇల్లు కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. అమ్మ ఇల్లు గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎవరికైనా కలగడం సహజం అని చెప్పవచ్చు. హిమజ అమ్మ ఇల్లు కవిత్వంలోకి దృష్టిని సారించడం వల్ల ఎన్నో ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు అవగాహనలోకి వస్తాయి.
‘మా అమ్మకి మా ఊరన్నా
మా ఇల్లన్నా ఎంతో ఇష్టం
మా కన్నా మరీ మరీ ఇష్టం
అందుకే ఎప్పుడూ మా ఊళ్లోనే ఉంటుంది.’
మా అమ్మకి మేము పుట్టి పెరిగిన మా ఊరు, మా ఇల్లు అంటే ఎంతో ఇష్టం, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. కడుపున పుట్టిన బిడ్డలమైన మాకన్నా మా అమ్మకి మా ఇల్లు అంటే చెప్పలేనంత ఇష్టం అని చెప్పవచ్చు. ఎల్లప్పుడు అమ్మ మేము పుట్టి పెరిగిన మా ఊరులో మా ఇంట్లోనే ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉంటుంది.
‘నిజమేరా పిల్లలు!
మా కలలు కష్టమూ కన్నీళ్లు
కలగలిపి కట్టుకున్న గూడురా ఇది
అంతకు మించి మిమ్మల్ని
అర చేతులు దించకుండా పెంచుకున్నాను
కంటికి రెప్పలా కాచుకున్నాను
ఇప్పుడిక ఈ చేతుల్లో సత్తువ లేదు
ఇప్పుడీ కాళ్ళు మీకై పరుగులెత్తి పని చెయ్యవు
గుప్పెడు గుండె మాత్రం
మీ ప్రేమకై తపించి పోతుంది.’
పిల్లలూ, నా మనసులోని మాటను చెబుతున్నాను. ఒక్కసారి సావధానంగా వినండి. నా మాటలో ఎలాంటి అతిశయం లేదు. నేను నిజమే పలుకుతున్నాను. నేను మిమ్మల్ని కన్న తల్లిని. నా మాటను మనసారా ఒప్పుకోండి. ఒకప్పుడు పూరి గుడిసెలో నివాసం గడిపినాము. దేవుడి దయ వల్ల ఇల్లు కట్టుకోవాలనే కలను కోరికను నిజం చేసుకున్నాం. ఆ ఇల్లు నిర్మాణం కొరకు దారి పొడుగునా ఎన్నో అడ్డంకులు, కష్టాలు, కన్నీళ్లు ఎదుర్కొన్నాం. రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించి, కష్టాల నావను దాటినం. కన్నీళ్లను ధారపోసినం. మొక్కవోని దీక్ష ఫలించి కట్టుకున్న ఇల్లు, ఎండ, వాన, చలి నుంచి కాపాడుకోవడానికి నిర్మించుకున్నది. అందుకే ఆ ఇల్లు అంత అపురూపమైనది. అలాంటి ఇంటిలో మీరు పిల్లలుగా జన్మించారు. పిల్లలైన మిమ్మల్ని అల్లారుముద్దుగా అనురాగంతో చేతులతో ఎత్తుకొని కిందకు దించకుండా పెంచాను. నా పిల్లలైన మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడాను. పిల్లలూ ఇప్పుడు నాకు ముసలితనం వచ్చింది. ఇప్పుడు ఇక నా చేతుల్లో మునుపటి సత్తువ ఏ కోశానా లేదు. ఇప్పుడు ఈ వయసులో నా కాళ్లు మీ కొరకు పరుగులు పెట్టలేవు. నా కాళ్లు మునుపటిలాగా పనిచేయవు. ఇప్పుడు నాకు మూడో కాలు కూడా వచ్చింది. మూడో కాలు సహాయంతో నడుస్తున్నాను. ఇప్పుడు నా శరీరంలో దాగివున్న గుప్పెడు గుండె మాత్రం నా పిల్లలైన మీ ప్రేమ కోసం తపించిపోతుంది. ఈ వయసులో నాకు కావాల్సింది మీ యొక్క ప్రేమ, అనురాగం మాత్రమే అని అమ్మ తెలియజేసిన తీరు చక్కగా ఉంది.
‘మీ అందమైన బొమ్మరిళ్ళల్లో సోఫా కుషన్ల మధ్య
నేనో దిష్టి బొమ్మలా కనబడే వుంటాను.’
ఒక చిన్న ఇల్లు, అందరు కలిసి ఉమ్మడిగా ఉండే ఇల్లు, బొమ్మలతో కట్టుకున్న ఇల్లు బొమ్మరిల్లు అంటారు. నా పిల్లలైన మీరు జీవితంలో ఊహించనంత ఎత్తుకు ఎదిగినారు. అందమైన అద్భుతమైన బొమ్మరిల్లులాంటి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. మీరు కట్టుకున్న ఇంటిలో చూడ చక్కగా అమర్చుకున్న సోఫా కుషన్లలో నేను ఆసీనురాలైతే ఏం బాగుంటుంది? సోఫా కుషన్లలో నేను కూర్చుంటే మీకు దిష్టి బొమ్మలా కనబడే ఉంటాను. ఆధునికత ఉట్టిపడే కొత్త కొత్తగా నిర్మించిన అందమైన ఇళ్లలో అమ్మ ఎప్పుడు నివాసం ఉండలేదు. కొత్త కొత్త సోఫా కుషన్లలో కూర్చున్న వయసుడిగిన నేను మీకు దిష్టి బొమ్మలా కనబడే వుంటాను అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘పెరిగిన మీ జీవన నాణ్యతా ప్రమాణాల ముందర
నేను మరుగుజ్జులా కుంచించుకు పోయే వుంటాను.’
నా పిల్లలు అయిన మీరు పెరిగి పెద్ద వారు అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఆదాయం, పెరిగిన మార్పుల మూలంగా నాణ్యమైన జీవన ప్రమాణం మేరకు మీరు చక్కటి జీవనం సాగిస్తున్నారు. నా పిల్లల జీవన ప్రమాణాలకు తగ్గట్లుగా నేను ఎదగలేదు. నేను నా పిల్లల ముందర మరుగుజ్జులా చిన్నగా మారిపోయిన స్థితిని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘మీ వేగాన్ని అందుకోలేక
వెయ్యి అడుగులు
వెనుకబడే వుంటాను
అందుకే ఇప్పుడు నేను మనూళ్లో.. మనింట్లోనే..’
నా పిల్లలుగా మీరు ఎదిగి ఎంతో ఉన్నతి సాధించారు. మీరు సాధించిన ప్రగతి యొక్క వేగాన్ని నేను చేరుకోలేకపోయాను. నేను నా పిల్లల కంటే వెయ్యి అడుగుల దూరంలో వెనుకబడి ఉన్నాను. అందుకొరకు నేను అమ్మగా మన ఊరిలో మన ఇంట్లోనే బతుకు గడుపుతున్నాను.
‘నాలాగే కదిలి వదులైన
నా కలల గూడు – నాలుగు గోడలై
నన్ను జాలిగా చూస్తుందే తప్ప
వేళకి కంచంలో ఓ ముద్ద పెట్టదు కదా
అలనాటి ఇంటి ముందరి పందిరిలా
ఈ మునిమాపు వేళ ఎప్పుడు కూలిపోతానో.’
అమ్మ చెబుతుంది నా శరీరం వడలి పోయింది. మునుపటిలా లేదు. నా శరీరం వడలి పోయి కదిలి వదులైంది. నేను కష్టపడి ఏర్పరుచుకున్న నా కలల నివాసమైన ఇల్లు బీటలు వారి నాలుగు గోడలుగా మారి నా వంక జాలిగా చూస్తుంది. నేను వేళకి కంచంలో తినడానికి ఓ ముద్ద పెట్టదు కదా అని వాపోతున్నది. అలనాటి మన ఇంటి ముందు ఉన్న పందిరి పిల్లల ఆటా పాటలతో ఇరుగు పొరుగువారి ముచ్చట్లతో సందడి చేసేది. ఈ సంధ్య చీకట్లు ముసిరికొనే మునిమాపు వేళ నేను ఎప్పుడు కూలిపోతానో అని దిగులు పడుతూ అమ్మ పలికిన మాటలు చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘నా ఇల్లన్న సెంటిమెంటుతో నన్ను
మీ నుంచి దూరంగా తోసెయ్యకండి.’
నిజమే అది అమ్మ ఇల్లు. అమ్మ ఇల్లు అనే నిజాన్ని నిర్భయంగా ఎవరయినా కాదనగలరా? అమ్మ ఇల్లు అయినంత మాత్రాన పిల్లలు నన్ను మీకు దూరంగా ఉంచకండి. ఆప్యాయతతో అనురాగంతో అమ్మ దగ్గరికి రండి. అమ్మ తన పిల్లలతో ప్రేమగా చెబుతూ అమ్మ ఇల్లు అనే సాకు చూపి నన్ను మీ నుండి విడదీసి దూరంగా ఉండవద్దు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘నాకే కాదు ఏ అమ్మకయినా
ఈ సందె అలుపు వేళ తన ఇంటి కన్నా
తన వారి మధ్య బతుకుతూ
రాలి పోవడమే ఇష్టం.’
అమ్మ చెప్పిన అనుభవాలు, అనుభూతులు చివరి వాక్యాలుగా తోస్తున్నది. ప్రపంచంలో నివసించే ఏ అమ్మకైనా ఇల్లు అవసరమే. అమ్మ జీవితపు చివరి క్షణాలు గడుపుతూ చీకటి ముసురుకుంటున్న సందె వేళలో అమ్మ ఇల్లు కన్నా తన పిల్లలు తన వారి మధ్య బతుకు రాలిపోవడమే ఇష్టం అని చెప్పిన తీరు చక్కగా ఉంది. కవయిత్రి హిమజ అమ్మ ఇల్లు కవిత ద్వారా పంచుకున్న మరపురాని అనుభూతులు అద్భుతం.
5. ఋతురాగం
ఋతురాగం కవిత ఏమిటనే ఆసక్తితో చదివాను. రాగం అనగా భారతీయ సంగీతంలో కొన్ని స్వరాల సమూహం. రాగం అనగా స్వర వర్ణములచే అలంకరింపబడి, జనుల చిత్తమును ఆనందింప జేయునట్టి ధ్వని. రాగం సృష్టి సంగీత ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుకగా భావిస్తారు. రాగాలకు సంబంధించిన మూలభావాలు సామవేదంలో ఉన్నట్లు సంగీత కోవిదులు చెపుతారు. ఋతు రాగం కవిత ఏమిటి అనే ఆలోచనా తరంగాల్లో మనలను తేలియాడజేస్తున్నారు. ఋతువులు ఇవి ఆరు. 1) వసంతం 2) గ్రీష్మం 3) వర్ష 4) శరత్తు 5) హేమంతం 6) శిశిరం. ఋతువులు రాగం పలికిస్తాయి. వసంతంలో చెట్లు చిగురిస్తాయి. శిశిరంలో చల్లదనాన్ని పంచుతాయి.
‘ప్రియతమా…
నువ్వు నాకు శిశిరంలా తోస్తావు.’
ప్రియతమా అని మనకు ఇష్టమైన వ్యక్తిని సంబోధిస్తూ మాట్లాడుతాం .ప్రియతమా అని అతన్ని ప్రేమతో స్నేహంతో పలకరిస్తుంది. శిశిరం అనే ఋతువు చల్లదనాన్ని ఇస్తుంది. ప్రియతమా నువ్వు నాకు శిశిరం అనే ఋతువులా చల్లగా తోస్తావు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘నువ్వు నా వైపు చూసిన ప్రతి సారీ
నేనో పండుటాకులా రాలిపోతాను.’
ఆమెకు అతని చూపుల్లో ఎంతో ప్రేమ పూర్వకంగా లీనమైపోతుంది. నువ్వు నా వైపు చూసిన ప్రతి సారి నేనో పండుటాకులా రాలిపోతాను అని వ్యక్తం చేయడం అతని పట్ల గల ఆసక్తిని తెలియజేస్తుంది. చెట్టు మీద ఉన్న పండుటాకు వీచే గాలి తాకిడికి నేల మీదకి రాలి పోవడం సహజం. ప్రేమానురాగాలు పొంగిపొర్లే నీవంటే నాకు ఎంతో ఇష్టం. అందుకే ప్రేమతో నువ్వు నా వైపు నీ చూపులు సారించిన ప్రతి సారి చెట్టు మీద ఉన్న పండుటాకు తొడిమ వీడి నేల పై రాలినట్లుగా రాలి పోతాను అని చెప్పిన తీరు అద్భుతం.
‘నీ కళ్ళల్లో మేఘాలను చూసిన ప్రతి సారీ
నాలోని ఋతువులు మారిపోతాయి.’
నా ప్రియమైన స్నేహితుడివి నీవు. నా కళ్ళల్లో మేఘాలను చూడడం ఏమిటి? అతన్ని చూసిన తర్వాత ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కురవాలి. కవయిత్రి హిమజ నీ కళ్ళల్లో మేఘాలను చూసిన ప్రతి సారి నాలోని ఋతువులు మారి పోతాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘వేసవి వేడిమి మరిచి పోయి
తొలి తొలి చినుకుల కోసం
నా హృదయం ఎదురు చూస్తుంది.’
వేసవి కాలంలో ఎండ వేడిమి తీవ్రంగా ఉంటుంది. భరించలేనంత ఉక్క పోత. గాలి ఆడదు. ప్రాణం అంతా అతలాకుతలం అవుతుంది. అలాంటి వేళలో ప్రియతమా నిన్ను చూస్తే నాలో ఏవో గొప్ప అనుభూతులు. వేసవి వేడిమి మరిచి పోయి తొలి తొలి చినుకుల కోసం నా హృదయం ఎదురు చూస్తుంది అని చెప్పిన భావం అద్భుతం.
చక్కటి, ఆర్ద్రమైన కవితలు అందించినందుకు కవయిత్రి హిమజను అభినందిస్తున్నాను.