[జనరేటివ్ ఎ.ఐ. రోబోల గురించి ఈ రచనలో వివరిస్తున్నారు శ్రీమతి ఆర్. లక్ష్మి.]
జనరేటివ్ ఎ.ఐ. రోబోలు:
[dropcap]ఇ[/dropcap]వి భాషల నమూనాలను ఆధారంగా తీసుకుని తయారుచేయబడినవి. ఆ కారణంగా చక్కటి సందర్భోచితమైన సంభాషణలను చేయగలవు.
హ్యుమనాయిడ్ సోషియల్ రోబో ‘ఎల్లిక్’ తనను వినియోగించే మానవులతో 1000కి పైగా చర్యలకు ప్రతిచర్య నెరపగలదు. కాఫీ, టీల నుంచి స్నేహం వరకు ఈ రోబో తన విధులను చక్కగా నిర్వర్తించగలదు.
యూరప్, అమెరికాలలో జరిగిన ఒక విస్తృతమైన సర్వేలో వైద్యులలో 70% మంది సోషల్ రోబోలు చక్కగా స్నేహాన్ని నెరపగలవని, ఒంటరితనాన్ని పోగొట్టగలవని, మీదు మిక్కిలి రోగుల మానసిక ఆరోగ్యాన్ని సైతం గణనీయంగా మెరుగుపరచగలుగుతున్నాయని అభిప్రాయపడతున్నట్లు తేలింది. ఈ రోబోలు ‘కంపానియన్ రోబోస్’గా కూడా వ్యవహరించబడుతున్నాయి. కారణం వీటి సమక్షంలో ఒంటరితనం, ఒత్తిడి వంటివి కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. కారణం ఇవి వారి ఇష్టుల స్వరాలను అనుకరించగలవు. పాత స్నేహితుల వలె మాట్లాడి దిగులును పోగొట్టి ఉల్లాసాన్ని కలిగించగలుగుతున్నాయి.
పాత తరం రోబోల కంటే ఆధునీకరించబడుతూ వస్తున్న క్రొత్త రోబోలు వాటిలోని కృత్రిమ మేధ కార్యక్రమాల అమరికల కారణంగా మానవులతో ఇంకా బలమైన సామాజిక బంధాలను ఏర్పరుచుకోగలవు. మారుతున్న సామాజిక పరిస్థితులు, క్షీణిస్తున్న మానవ సంబంధాలు, ఒడిదుడుకులకు గురవుతున్న కుటుంబ వ్యవస్థ – ఇవన్నీ మనిషిని ఏకాకిని చేస్తున్నాయి.
అభివృద్ధి పరుగు పందెంలో డబ్బుతో సమకూరగల భోగభాగ్యాలూ, సాంకేతిక పరిజ్ఞానంతో, అమరగల సకల సదుపాయాలూ – అన్నీ – సమకూర్చుకోగలినప్పటికీ – మానవ సమాజంలో పసిపిల్లలు, వృద్ధులు వంటివారికి వ్యక్తిగత సంరక్షణ పెద్ద సమస్యగా మారిపోయింది. వారికి నిర్బంధపు ఏకాంతం తప్పటం లేదు. ఆ కారణంగా పెరిగే పిల్లల్లో, వృద్ధుల్లో, రోగుల్లో, అనేక మానసిక సమస్యలూ తలెత్తుతున్నాయి. అటువంటి చోట్ల ఈ సోషల్ రోబోలు తమదైన రీతిలో వారి సంరక్షణ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నాయి.
అదీ గాక ఇవి చక్కటి ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శిస్తున్నాయి. మొన్న U. N. సమితిలో పాల్గొన్న A.I. రోబోల పానెల్ లోని రోబోలు తాము మనుషుల కంటే మిన్నగా ప్రపంచాన్ని నడపగలమని చెప్పాయి. హన్సన్ రోబోటిక్స్ వారి ‘సోఫియా’ మనుషుల కంటే ఎక్కువ సామర్థ్యంతో, మరింత మెరుగైన ఫలితాలనిచ్చే విధంగా నాయకత్వాన్ని నెరపగలమని ధీమాగా చెప్పింది. విపరీతమైన వేగంతో వృద్ధి చెందుతున్న కృత్రిమ వేధతో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది.
‘అమెకా’ అయితే ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం శక్తి అబ్బురపరుస్తోందని A.I. అందించే వివక్షారహితమైన సమాచారాన్ని తమ తెలివితేటలు, సృజనాత్మకతతో మేళవించి మానవులు చక్కటి నిర్ణయాలను తీసుకోవాల్నై సూచించింది. ‘కృత్రిమ మేధ’ రంగంలోని వడి, వేగాన్ని చూస్తుంటే సామాన్యులు సైతం రోబోలతో కలిసి మెలగవలసి వచ్చే సమయం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది.