వ్యావహారిక భాష – సమాజ మనుగడ

2
2

[29 ఆగస్టు శ్రీ గిడుగు రామమూర్తి గారి జయంతి నాడు ‘తెలుగు భాషా దినోత్సవం’ (వ్యావహారిక భాషా దినోత్సవం) జరుపుకుంటున్న సందర్భంగా శ్రీమతి దాసరి శివకుమారి అందిస్తున్న రచన.]

[dropcap]ప్ర[/dropcap]తి సంవత్సరమూ ఆగస్టు 29వ తారీఖున తెలుగు భాషాదినోత్సవంగా అటు కొన్ని సాహిత్య సంఘాల తరఫున, ఇటు ప్రభుత్వ పరంగా కూడా ఘనంగా జరుకుంటున్నారు. కొంతమంది ప్రతిభావంతులకు గిడుగు రామమూర్తి గారి పురస్కారాలు అందజేస్తున్నారు. ఇలా భాషా దినోత్సవం జరుపుకోవటానికి గిడుగు రామమూర్తిగారి అకుంఠిత దీక్ష వున్నది, పోరాట పటిమ వున్నది. శ్రీ గిడుగు వేంకట రామమూర్తి గారు 1863 ఆగస్టు 29న జన్మించారు. వీరు జరిపిన పోరాటం గ్రాంథిక భాషలో కాకుండా, వ్యావహారిక భాషలోనే రచనా కార్యక్రమాలు అమలు జరపాలని. ఈ పోరాటం 1907 నుండి 1940 వరకూ జరిగింది.

ఈనాటి ప్రపంచ మేధావుల అభిప్రాయాలను గమనిస్తే, అభివృద్ధి చెందిన చాలా దేశాలు తమ ప్రాంతీయ భాషల ద్వారానే ప్రగతిని సాధించాయని; ఆయా భాషల వాడకం శుద్ధ గ్రాంథికం కాకుడా వ్యవహారికమైన వాడుక భాష కావటమేనని తెలుస్తుంది.

ఈ సంవత్సర జులై 29న ఢిల్లీ ప్రగతి మైదానంలో జరిగిన అఖిల భారతీయ శిక్షణా సమాగంలో మన ప్రధాని “ఇకపై సామాజిక శాస్త్రం నుండీ, ఇంజనీరింగ్ వరకూ బోధన అంతా మాతృభాషా మాధ్యమంలోనే జరగనుంది” అని ప్రకటించారు. ఈనాటి మాతృభాషలన్నీ వ్యావహారిక భాషలోనే వుంటున్నవి. ఈ సందర్భంగా మరొక్క విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి. మన దేశంలోని ఎంతో మంది చురుకైన విద్యార్ధులు తమ వాడుక భాషకాని ఇంగ్లీషు భాషలో శాస్త్రాలు నేర్చుకోలేక వెనుకబడిపోతున్నారు. మరి కొంతమంది చదువురాని వారుగా మిగిలిపోతున్నారు. అలా మిగిలిపోగూడదంటే మొదటగా మన తెలుగంతా గ్రాంథికంలో కాకుండా వ్యావహారిక భాషలోనే వుండాలి. అందరూ సులభంగా అర్థం చేసుకోగలగాలి, మాట్లాడగలగాలి, వ్రాయగలగాలని, ఎంతో దూరదృష్టితో వ్యావహారిక భాషా ఉద్యమం గిడుగు వారు ప్రారంభించారు. అవి ప్రజలు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిపే రోజులు. మరో పక్క వీరు తెలుగును ప్రజల వాడుక భాషగా తీర్చిదిద్దటానికి ఉద్యమించారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కాని మన రాష్ట్రాలలో మన వాడుక భాషయిన తెలుగును అటు పరిపాలనా భాషగా కాని, ఇటు బోధనా భాషగా కానీ మనం అనుసరించలేకపోతున్నాం.

గిడుగు రామమూర్తి పంతులుగారి ఆశయ సాధన కోసం తెలుగు ప్రజలున్న రాష్ట్రాలలో తెలుగు భాషోద్యమ సమాఖ్యలు కృషి చేస్తున్నాయి. ఏ సమాఖ్యలు ఎంత కృషి చేసినా ముందు తలిదండ్రుల్లో మార్పు రావాలి. ముందుగా వారు ఏ ప్రాంతంలో వున్నా మన వాడుక భాషను తాము మాట్లాడాలి, పిల్లల చేత మాట్లాడించాలి. ఈనాటి మన పిల్లలకు తెలుగంటేనే భయం పట్టుకున్నది. పదోక్లాసు కొచ్చినా పట్టుమని పది వాక్యాలు మన వాడుక భాషలో తప్పుల్లేకుండా వ్రాయలేకపోతున్నారు. చదవలేకపోతున్నారు. వ్యాకరణం అనేది అసలే తెలియకుండా పోతున్నది. ఈ పరిస్థితినంతా ముందే ఊహించిన గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యావహారిక భాషా ఉద్యమం ప్రారంభించారు. ప్రజల్ని వ్యావహారిక భాషకు చేరువ చేయాలని తపించారు. వారి పుట్టిన రోజు సందర్భంగా ఈ వ్యావహారిక భాష అమలు కోసం వారు పడ్డ తపనను మరొక్క సారి గుర్తు చేసుకుందాం.

వీరు ఈ వ్యావహిక భాషా ఉద్యమం ప్రారంభించినప్పుడు –  గురజాడ అప్పారావు గారు, మరి కొద్దిమంది మాత్రమే వీరికి తోడుగా నిలిచారు. కాని  ఈ వ్యవహారిక భాష పనికి రాదని, గ్రాంథిక భాషే శ్రేష్ఠమైనదని ఆంధ్ర సాహిత్య పరిషత్తుతో సహా ప్రభుత్వము వారు కూడా వ్యతిరేకించారు. దానిని తిప్పి కొట్టటానికి వీరు ‘నిజమైన సంప్రదాయము’ అను పేరుతో వ్యాసమొకటి వ్రాసి వావిళ్ల వారిచే అచ్చు వేయించి ఊరూరా పంచి పెట్టారు. అందులోని విషయమేమిటంటే ‘వెనుకటి రోజుల్లోనే విద్యార్థులు చదువుకునే గ్రంథాలన్నీ వ్యావహారిక భాషలనే రచింపబడి వున్నాయ’ని తెలపడం. దానికి, కొన్ని పుస్తకాలను ఉదహరించారు. పరవస్తు చిన్నయ్య సూరి చేసిన ‘నీతిచంద్రిక’ గద్య రచనకు ముందే వ్యావహారిక భాషలోనే ఎన్నో రకాలైన గద్య రచనలు సరళంగా సాగాయని, అలాంటి పుస్తకాలను సేకరించి మరీ వాటి గురించి ప్రచారం చేస్తూ ఊరురా తిరిగి సభలు పెట్టి చెప్పారు. 1919లో ‘తెలుగు పత్రిక’ వెలువరించి దానిలో వ్యావహారిక భాషా వాడుక వలన కలిగే ప్రయోజాలను వివరించేవారు. మొదట వ్యతిరేకించిన మిగతా పత్రికల వారే క్రమంగా తెలుసుకుని వారు కూడా వ్యావహారిక భాషనే అమలు పరుచుకున్నారు. అలా ‘తెలుగు పత్రిక’ ఆనాటి మిగతా పత్రికలకు దిక్సూచి అయింది.

ప్రభుత్వములో కూడా క్రమేణా మార్పు వచ్చినది. సాక్షాత్తు ఆంధ్ర విశ్వవిద్యాలయము వారే వీరి కృషిని గుర్తించి ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించారు.

“ఒక బిడ్డ తన మాతృభాషలో ఒక సంవత్సరం నేర్చుకున్న విద్య పరాయి భాషలో నాలుగేళ్ళూ నేర్చుకుంటాడు” అని ఆ రోజుల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయపడేవారు.

ఆ మాతృభాష వ్యవహారికంగా వుంటే మన పిల్లలు ఎక్కువ మంది విద్యావంతులవుతారని గిడుగు వారి బలమైన వాదన. అలాంటి వాడుక భాష వాడకంలో మన మాండలికాలు వుండాలి. మన మాండలికాలతో పాటు ఇతర ప్రాంతాల మాండలికాలు కూడా కలిపి వ్రాస్తే అంతటా సమభాష, సమభావన వుంటుందని కూడా అభిప్రాయ పడేవారు.

వీరు భాషా కృషితో పాటు సంఘ సంస్కరణల వైపుకు కూడా దృష్టి పెట్టారు. ఆ రోజుల్లో బాలికా వితంతు వివాహానికి తానే స్వయంగా కన్యాదానం చేశారు. ఇంగ్లాండు వెళ్లి బారిస్టరయ్యి తిరిగి వచ్చిన తన శిష్యుడికి ఇంట భోజనం పెట్టిన పాపానికి ఆయన నివాసముండే ‘పర్లాకిమిడి’లో వెలికి గురయ్యారు. పర్లాకిమిడి ప్రాంతంలో ‘సవరలు’ అనే గిరిజనులున్నారు. వారిని చక్కదిద్దటానికి నడుంకట్టారు. వారిలో కూడా అంటరాని వారైని ‘పైడి’ జాతి వారిని తన ఇంటిలో వుంచుకుని తాను వారి సవర భాషను నేర్చుకున్నారు. తర్వాత వారి భాషలోనే వారి కోసం నిఘంటువును తయారు చేసి ప్రచురించారు. వాడుక భాషలో వారికి చదువు చెప్పటానికి స్వంత ఖర్చుతో సవర పాఠశాలలు నెలకొల్పారు. ఆ రోజుల్లో అంటరానివారని – హరిజనుల పాఠశాలలో కెళ్లి అక్కడి విద్యాబోధన పరిశీలించటానికి మిగతావారు వెనకంజ వేస్తే తానే వెళ్లి పరిశీలించి వచ్చేవారు.

మనం ఈనాడు ప్రజాస్వామ్యంతో జీవిస్తున్నాం. మన మనుగడకు వ్యావహారిక భాష ఎంతగానో తోడ్పడుతున్నది. ఇప్పటి రోజుల్లో సంపద సృష్టికి స్థానిక వాడుక భాషల పాత్ర ఎంతో వుందని కే.పి.ఎం.జి., గూగుల్, భారతీయ జనగణన ఆధారాలతో చూడవచ్చని తెలియజేస్తున్నాయి.

గిడుగు రామమూర్తి పంతులు గారు సుదీర్ఘపోరాటం చేసి సాధించి పెట్టిన ప్రజల వాడుక భాషను ఈనాటి ప్రజలు కలగాపులగం చేసేస్తున్నారు. వారు కోరుకున్న ఇంపైన వ్యావహారిక భాషను వాడుకుంటూ, అటు ఉన్నతినీ, ఇటు భాషా విశిష్టతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద వున్నది.

“ఓ హండ్రెడ్ రూపీస్ అప్పివ్వు గురూ” అని తోటి కార్మికుణ్ణి మరో కార్మికుడు అడుగుతున్నాడు. “ఆంటీ, ఈ రోజు కర్రీస్ ఏం చేశారు?” అని పక్కింటి సరోజ అంటున్నది. “వదినా! ఈ వీకెండ్‌లో మా ప్లాట్‌లో డిన్నర్ ఎరేంజ్ చేయాలనుకుంటున్నాను. వచ్చి హెల్ప్ చేస్తావుగా” అని ఓ ఆడపడుచు గారాలు పోతున్నది. ఇంకా ఈనాటి ప్రజలకు సెల్ ఫోనే ప్రపంచమైంది. “amma naku ee varamlo mana intiki ravadaniki kudaradu” అని పుత్రరత్నం ఫోన్‌లో తల్లికి మెసేజ్ పెడుతున్నాడు. దీన్ని ‘తెంగ్లీష్’ అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇద్దరు ఉద్యోగస్థులు, పాత మిత్రులు కలుసుకుంటే వాళ్లు ఇంగ్లీషులోనే మాట్లాడుకోవటం నాగరికత అనుకుంటున్నారు. ఒకసారి క్లాసులో విద్యార్ధుల చేత హిందీ కాంపోజిషన్ వ్రాయిస్తున్నాను. “భారత్ మే బడే బడే సషర్ హై. ఉన్ మే హిమాలయ్ ఊంఛా హై” అని మా శిష్యరత్నం తెలుగులో హిందీ భాషను వ్రాస్తున్నాడు. ఇదేంటని అడిగితే మా అన్నావాళ్లు ఇంగ్లీషు అక్షరాల్లో తెలుగులో ఇట్లాగే వ్రాసి చదువుకుంటారని చెప్పుకొచ్చాడు. ఇలా వీళ్లకు ఏ భాషా సరిగా రాకుండా పోతున్నది. ఇదా – గిడుగు వారు కోరుకున్న వ్యాహారిక భాషా ప్రయోజనం? మన మాతృభాష కాకుండా మిగతా భాషలు కూడా విజ్ఞానాన్ని అలవర్చుకోవటానికి మనం నేర్చుకోవాలి. కాని మన వాడుక భాషను వదిలేయ కూడదు గదా? ఈ రోజుల్లో ఏ ఆఫీసు మీద చూచినా, ఏ సంస్థ మీద చూచినా, ఇంగ్లీషులోనే పేర్లు దర్శనమిస్తున్నాయి. చివరకు షాపుల మీద కూడా అదే ఒరవడి. ప్రభుత్వం నుండి రైతుల కొచ్చే పేపర్ల మీద కూడా ఇంగ్లీషే వుంటున్నది. అందరూ ఇంగ్లీషు వచ్చిన రైతునే వుండరు కదా? ఇంట్లో అప్పుడప్పుడే మాటలోచ్చే పసివాడికి కూడా ఇంగ్లీషు పదాలు నేర్పుతూ వాణ్ణి తీసుకెళ్లి ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో వేసి వాడి నోట్లో, వాడి మెదడులో అంతా ఇంగ్లీషే కూరాలని సతమతమవుతున్నాం. ఆ స్థాయి పిల్లవాడు అది మింగుడు పడక, మింగుడు పడినది జీర్ణం కాక, ఇటు తెలుగు రాక సతమతమవుతున్నాడు.

పెద్ద పెద్ద ఊళ్లల్లోనో దేశాలకో చదువుకోవటానికో ఉద్యోగానికో పోవచ్చు. కాని ఎక్కడున్నా తన మూలాలను తన మాతృభాషను మర్చిపోకూడదు. మన దగ్గర కొన్ని పట్నాలలో, మహాత్మా గాంధీ మార్గ్‌ను M.G. మార్గ్ అంటే తప్ప తెలీదు. రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ స్టేడియమ్‌ను ఆర్.పి.యమ్. స్డేడియమ్ అంటే కాని తెలీటం లేదు. ఈ సంస్కృతి చిన్న పట్నాలకూ, పల్లెలకూ కూడా వ్యాపిస్తున్నది. దేవాలయాల్లో కూడా అభిషేకం టికెట్‌ను AB టికెట్ అని పిలవటం మొదలు పెట్టారు. వ్యావహారిక భాషా ఒరవడి ఇది కాదు గదా! దీంతో మన అభివృద్ధి, మన భాషా కూడా మరుగున పడిపోయే ప్రమాదమున్నది.

ఏ మనిషి అయినా ఒక ఆలోచననైనా ఒక పని నయినా ముందు తన మాతృభాషలోనే ఆలోచించుకుంటాడు. ఆ తర్వాత ఇతర భాష ద్వారా వ్యక్తీకరించగలుగుతాడు. అలా కాక ఆ మనిషికి మాతృభాష కాని, మన వ్యావహారిక భాష కాని అలవడి వుండకపోతే అతని మనుగడ ప్రశ్నార్ధకమే అవుతుంది. తల్లిదండ్రులు ఆస్తిపాస్తులను తమ బిడ్డలకు పంచి ఇచ్చినట్లే తన మాతృభాష వారసత్వం వారికి అందించలేకపోతే పిల్లల ఆలోచనలు కూడా కుంచించుకుపోతాయని గ్రహించుకోవాలని ఈనాటి మేధావులు విశ్లేషిస్తున్నారు.

నిస్సందేహంగా గిడుగు రామమూర్తి గారి కృషి వలనే ఈనాడు అన్ని రంగాలలో ఈ మాత్రమైనా వ్యావహారిక భాష చోటు చోసుకున్నది. ఆ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలి గాని దాన్ని సమూల నాశనం చేసుకోగుడదు. మన వాడుక భాషలో వ్రాసిన వేమన పద్యాలు ప్రజల నాల్కల మీద ఇప్పటికీ నర్తిస్తున్నాయి. అదే నన్నయ వ్రాసిన భారత పద్యాలు ఏ సామాన్యుని నోటికి వస్తున్నాయి?

వీరి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆధునిక భాషా శాస్త్రవేత్తగా, భాషా సంస్కర్తగా, ఉత్తమ అధ్యాపకునిగా ఎంతగానో రాణించారు; మార్గదర్శకులయ్యారు గిడుగు వారు. వారి కలలు సాకారమవ్వాలంటే ప్రజలకు చేరువగా వాడుక భాషే వుండాలి. అప్పుడే మన మేధస్సు కూడా వికసిస్తుంది. గిడుగు రామమూర్తి గారి ఆశయాలు నేరవేర్చే బాధ్యత మనందరి మీదా వున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here