కానన్ దేవి

5
2

[dropcap]17[/dropcap]-07-2022న శ్రీమతి కానన్ దేవి వర్థంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఒక తండ్రి లేని కుమార్తె తల్లి ఇద్దరు తోబుట్టువులతో మురికివాడలలో నివసిస్తూ, బాలనటగాయనిగా, నేపథ్యగాయనిగా, నటీమణిగా, నిర్మాత్రిగా, సామాజికవేత్తగా, అయిన సెలెబ్రిటీ ఆమె.

ఆమె నిబద్ధత, పట్టుదల, ధృఢసంకల్పం ఎనలేనివి. భారతీయ చలన చిత్రసీమలో స్వర్ణయుగం నాటి నటగాయని, బెంగాలీ చిత్రసీమలో తొలినటి, బెంగాలీ పరిశ్రమలో సూపర్ హిట్ చిత్రాలు ఎక్కువ. హిందీ నటిగా కొన్ని అపజయాలు, విజయాలను మూటగట్టుకుంది. కాని హిందీ సినిమాని వీడి మాతృభాషామ తల్లి సినిమాలలో ఒదిగిన గొప్ప వ్యక్తి.

వివిధ సంగీత ప్రక్రియలలో నిష్ణాతులైన సంగీత గురువుల శిష్యరికం గాయనిగా అందలాన్ని ఎక్కించింది. విదేశీ సినీ ప్రముఖుల నుండి నేర్చుకున్న అంశాలు స్వంత చిత్ర నిర్మాణాన్ని చేపట్టేందుకు దారి చూపాయి. బాల్యంలోని పేదరికం సామాజికవేత్తను చేసింది. ఆమె బెంగాలీ అందాల తార కానన్ దేవి.

ఈమె 1916 ఏప్రిల్ 22వ తేదీన నాటి బెంగాల్ ప్రెసిడెన్సీ నేటి పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో జన్మించారు. రతన్ చంద్రదాస్, రాజోబాలాదాస్ ఈమె తల్లిదండ్రులు.

బాల్యంలో ఈమె తండ్రి మరణించారు. ఆమె తల్లి, కుమార్తెలు ముగ్గురూ ఈమెతో సహా బంధువుల ఇంట్లో పనిమనుషులుగా జీవనం సాగించారు.

వీరి కుటుంబానికి సన్నిహితుడు వీరిని పైకి తీసుకురావాలనుకున్నాడు. పదేళ్ళ లేలేత వయస్సులోనే ఆ తులసి బెనర్జీ – కానన్ బాలా పేరుతో ఈమెను మదన్ థియేటర్స్ సినిమాలకి పరిచయం చేశారు. ఈ థియేటర్స్ వారు నిర్మించిన జయదేవ్, శంకరాచార్య, రిషిర్ ప్రేమ్, జోరేబరత్, విష్ణుమాయ, ప్రహ్లాద్ చిత్రాలలో బాలనటిగా నటించింది. ఇవన్నీ (మూకీ) నిశ్శబ్ద చిత్రాలు. ఈ సినిమాలన్నీ 1926 నుండి 1930 దశాబ్దంలో నటించినవే! ఈ సినిమాలలో ఈమె తన పాటలు తానే పాడుకున్న బాల నట గాయని కూడా! ఈ కొన్ని సినిమాలలో బాలుడి పాత్రలలో నటించింది. తొలి సినిమా జయదేవ్‌లో ఈమెకి లభించిన ప్రతిఫలం 5-00 రూపాయలు మాత్రమే.

ఈమె వివిధ సంగీత ప్రక్రియలలో శిక్షణను పొందారు. లక్నోకి చెందిన ఉస్తాద్ అల్లారఖా దగ్గర హిందుస్థానీ సంగీతాన్ని, అనాది దస్తీదార్ వద్ద రవీంద్ర సం‍గీత్‍ని అభ్యసించారు. ఈమె రాయ్‌చంద్ బోరల్ దగ్గర వివిధ భారతీయ సంగీత ప్రక్రియలతో పాటు పాశ్చాత్య సంగీత ప్రక్రియలను నేర్చుకున్నారు. భీష్మదేవ్ ఛటర్జీ వద్ద కూడా శిక్షణ తీసుకున్నారు. మెగాఫోన్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు.

మన్మయీ గరల్స్ స్కూల్, బసబ్దత్త, కృష్ణసుధామ, విద్యావతి, ముక్తి, మా, విద్యావతి (బెంగాల్, హిందీ), సతి, జవానీ కీ రీత్, అభినేత్రి, లగాన్, శేష్ ఉత్తర్, ఖూనీ కౌన్, ఇంద్ర, శ్రీకాంత్ ఓ, ఛార్ దర్వేష్, తుమ్ ఔర్ మై, జవాబ్, విద్యాపతి, స్ట్రీట్ సింగర్, కృష్ణలీల, అరేబియన్ నైట్స్, ఫైస్లా మొదలయిన చిత్రాలలో ప్రముఖ పాత్రలలో అద్భుతంగా జీవించి రాణించారు. సినిమాలలో పాటలు పాడడానికి కాజీ నజ్రుల్ ఇస్లాం, విషమబేబ్ ఛటోపాధ్యాయ, జ్ఞాన్‌దత్తా, బినోడే బెహారీలు ఈమె కందించిన శిక్షణ అద్భుతమైనది.

ఈమె బాలనటిగా పాడటమే కాదు. కథానాయికగా పలు సినిమాలలో పాటలు పాడారు. మన్మోయీ గర్ల్స్ స్కూల్, విద్యాపతి, ముక్తి, జవానీ కీ రీత్, లగాన్, తుమ్ ఔర్ మై, కృష్ణలీల, అనన్య, దర్పచూర్ణ, ఆశా మొదలయిన చిత్రాలలో పాటలు పాడారు. బెంగాలీ, హిందీ చిత్రాలలో తన పాటలు తనే పాడుకుని నటగాయినిగా మెలోడీ క్వీన్‌గా చరిత్రను సృషించారామె.

ప్రముఖ గాయకుడు కె.యల్. సైగల్‌తో కలిసి ‘స్ట్రీట్ సింగర్’ సినిమాలో “లచ్మీమూరత్ దరస్ దిఖా”, “సుకూన్ దిల్ కో మైనర్ గుల్-ఓ-సమర్ మేనహీ” పాటలను ఆలపించారు. ఈ పాటలు ఈనాటికీ ప్రేక్షకశ్రోతల హృదయాలను అలరిస్తూనే ఉన్నాయి. తరువాత ఆయనతో కలిసి బొంబాయి వెళ్ళి హిందీ సినిమాలో అడుగుపెట్టారు. ఆ రోజుల్లో పి.సి.బారువా చిత్రం ‘జవాబ్’ సూపర్ హిట్ చిత్రం. ఈ సినిమాలో “ఏ చంద్ చుప్ నా జానా”, “యే దునియా తూఫాన్

మెయిల్” వంటి పాటలు ఈమెకు గాయనిగా పేరు తెచ్చాయి.

ఈమె కచేరీలు కూడా చేసేవారు. లండన్ లోని ఇండియా హౌస్‌లో 1947 ఆగష్టు 15వ తేదీన ఈమె చివరి కచేరీ చేశారు. అక్కడి హైకమిషనర్ శ్రీ కృష్ణ మీనన్ ఆహ్వనం మేరకు ఈ కచేరీ చేసి అక్కడి భారతీయులను అలరించారు.

ఈమె ఇచ్చిన మాటకు మడమ తిప్పని మహిళామణి, బెంగాలీ చిత్రనిర్మాణ సంస్థ ఈమెకు గొప్ప పేరు తెచ్చిన ‘మన్మయీ గరల్స్ స్కూల్’ నిర్మించిన రాధా ఫిల్మ్ కంపెనీతో ఈమెకు ఒప్పందం ఉంది. దీనిని గౌరవించి ‘దేవదాసు’ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నారు. సినిమా పరిశ్రమ పరిణామగతిని గురించి అభ్యసించడం కోసం పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. ప్రముఖులయిన క్లార్క్ గేబుల్, స్పెన్సర్ ట్రేసీ, రాబర్ట్ ట్రేలర్ మొదలయిన వారిని కలిశారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన మెలకువలను గురించి తెలుసుకున్నారు.

భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత తన స్వంత చిత్రాలను శ్రీమతి బ్యానర్లో నిర్మించారు, అభయ శ్రీకాంత, ఆశా, నబా బిధాన్, అనన్య, దర్పచూర్ల వంటి సినిమాలను నిర్మించారు, దేవకీబోస్ సృష్టించిన అద్భుత చిత్రరాజం ‘విద్యాపతి’లో తన అద్భుతమైన నటనతో నాయిక పాత్రను చిరంజీవిగా చేశారు. ‘మోర్ అంగ్నా మే ఆయే ఆలీ” పాట ఈ నాటికీ సూపర్ హిట్‌గా నిలిచింది.

ఒక అధునాతన గొప్ప సమాజం నుండి బయటపడి తనకు నచ్చిన రీతిలో జీవించిన మహిళగా ‘ముక్తి’ సినిమాని తన నటనతో సుసంపన్నం చేశారు.

ఈమె నటించిన సపేరా, జవానీ కీరీత్, హర్కత్ మొదలయిన హిందీ సినిమాలలో పహాడీ సన్యాల్, పృథ్వీరాజ్ కుమార్, నజ్ముల్ హుస్సేన్ మొదలయిన ప్రముఖ నటుల సరసన నటించారు. ఇవన్నీ పెద్దగా విజయం సాధించలేదు.

‘జవాబ్’ సినిమా తరువాత విడుదలయిన హాస్పిటల్, చందర్ శేఖర్, ఫైస్లా వంటి హిందీ చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. ఈ అపజయాల కారణంగా ఈమె హిందీ చిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించారు. అయితే బెంగాలీ చిత్రాలలో నటించి, సినిమాలను నిర్మించి ఆ పరిశ్రమను సుసంపన్నం చేశారు. మొత్తం 7 హిందీ సినిమాలలో నటించారు.

ఈమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులను చవి చూశారు. బెంగాల్ లోని ప్రముఖ విద్యావేత్త, బ్రహ్మసమాజ సభ్యులు అశోక్ మైత్రాతో వివాహం జరిగింది. అయితే బ్రహ్మసామాజికులు సినిమాల పట్ల విముఖులు. కాబట్టి కానన్ దేవిని నటన మానమని ఒత్తిడి చేశారు. ఈ వివాహం ఈ విధంగా విఫలమైంది.

ఈమె విదేశాల నుండి తిరిగి వచ్చిన తరువాత బెంగాల్ గవర్నర్ హరిదాస్ భట్టాచార్య ADC తో వివాహం జరిగింది. వీరిద్దరూ కలిసి 1966 వరకు అనేక బెంగాలీ చిత్రాలను నిర్మించారు.

1966 తరువాత సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు.

ఆ తరువాత వివిధ స్వచ్చంద సంస్థల ద్వారా ప్రజలకు పలురంగాలలో సేవలను అందించారు. నిరుపేద నటీమణులకు సహాయం చేయడానికి ‘మహిళా శిల్పి సమితి’ ని ఏర్పాటు చేశారీమె.

తన మంచితనంతో కూడిన వ్యక్తిత్వం వల్ల బాపూజీ, నెహ్రూ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటి గొప్ప నాయకుల అభిమానాన్ని పొందగలిగారు. 1992 జులై 17వ తేదీన అనారోగ్యంతో కలకత్తాలో మరణించారు.

‘శబరే అమీనామి’ అనే పేరుతో తన స్వీయ కథను గ్రంథస్థం చేశారు. “నేను ప్రతి ఒక్కరికీ నీ గౌరవం ఇస్తున్నాను” అని ఈ శీర్షిక అర్థం.

ఈమె ప్రతిభకు గుర్తింపుగా పలు పురస్కారాలను అందుకున్నారు. 1942లో BFJA (Bengal Film Journalists Association)వారు ఉత్తమనటి పురస్కారాన్ని అందించారు. ‘శేష్ ఉత్తర్’ చిత్రానికి గాను ఈ పురస్కారాన్ని ఈమె పొందారు. భారత ప్రభుత్వం 1968లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1976లో భారత చలనచిత్ర పరిశ్రమకు విస్తృత సేవలను అందించిన వారికిచ్చే దాదాసా హెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఈమెకు అందించి గౌరవించారు.

గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన గీతాలు ‘రవీంద్ర సంగీత్’ను అభ్యసించి, నైటింగేల్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు పొందిన ఈమె ఆలపించిన రవీంద్రుని గీతాలు భారతదేశమంతా మారుమ్రోగాయి.

ఈమె ‘అనన్య’ చిత్రానికి దర్శకురాలు కూడా!

2011 ఫిబ్రవరి 13వ తేదీన 5 రూపాయల విలువతో ఈమె జ్ఞాపకార్థం స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

‘Legendary Heroines of India’ శీర్షికతో విడుదలయిన 6 స్టాంపులలో ఈమె స్టాంపు ఒకటి ఉండడం బెంగాలీ సినిమాకి ఆమె చేసిన సేవలను గుర్తించడమే కారణం అని చెప్పొచ్చు.

జులై 17 ఈమె వర్థంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here