Site icon Sanchika

దక్షిణ భారతదేశపు తొలి మహిళా సూపర్ స్టార్ శ్రీమతి పసుపులేటి కన్నాంబ

[dropcap]మే [/dropcap]7 వ తేదీ శ్రీమతి కన్నాంబ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

దక్షిణ భారతదేశంలో తొలి మహిళా సూపర్ స్టార్, నిర్మాత, గాయని, కనుబొమ్మలతోనే నవరసాలను పలికించగలిగే అద్వితీయ నటీమణి, అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి నటి, ‘The Iconic Women of South Indian Cinema’ శ్రీమతి పసుపులేటి కన్నాంబ.

వీరు 1912లో నాటి మదరాసు ప్రెసిడెన్సీ, నేటి ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో జన్మించారు. తల్లిదండ్రులు లోకాంబ, వెంకటేశ్వరయ్యలు. అయితే ఏలూరులో తాతగారింటిలో పెరిగారు.

5వ తరగతి వరకు అక్కడే చదివారు. వీథి నాటకాలు ఎక్కువగా చూసేవారు. ఇంటికి వచ్చాక నటులను అనుకరిస్తూ సంభాషణలను చెపుతూ, ఇంటిల్లపాదినీ నవ్వించి అలరించేవారు. 17 మంది అన్నదమ్ముల కుటుంబంలో ఒక్క ఆడపిల్లే కావడంతో గారాబం ఎక్కువ. సంగీతాన్నీ అభ్యసించారు.

ఒకసారి హరిశ్చంద్ర నాటక ప్రదర్శనని చూస్తున్నారు కన్నాంబ. చంద్రమతి పాత్రధారి సరిగా నటించడం లేదని ప్రేక్షకులలో నుంచి అరిచారు. అంతటితో ఆగలేదు. స్వయంగా చంద్రమతి పాత్రలో నటించి మెప్పించారు కూడా! అపుడామె వయసు పదహారేళ్ళు.

నావెల్ నాటక సమాజంలో చేరి నాటకాలలో నటించారు. చంద్రమతి పాత్రకు పేరు పొందారు. వీరి నటనా చాతుర్యం దర్శకులు పి. పుల్లయ్యగారికి తెలిసింది. సినిమారంగానికి రమ్మని ఆహ్వానించారు. సినిమా ప్రపంచం మనకు సూటవ్వదు. మాయా ప్రపంచం అని వద్దని వారించారామె తల్లిదండ్రులు. నేను ఎక్కడా తప్పటడుగు వేయను. ఎవరికీ లొంగను. మీరు తలవంచుకునే పరిస్థితి వస్తే నన్ను నేను చంపేసుకుంటాను అని తల్లిదండ్రులకు మాట ఇచ్చారావిడ.

1935లో తన డ్రామా ట్రూప్‌తో సహా కొల్హాపూర్ వెళ్ళి హరిశ్చంద్ర సినిమాలో చంద్రమతి పాత్రలో జీవించారు. చంద్రమతి అంటే కన్నాంబ అనిపించుకున్నారు. ఈ చిత్రంలో వీరు ఆలపించిన శోకరసగీతాలు, సంభాషణలు ప్రేక్షకులను కన్నీటి సముద్రంలో ముంచాయి.

1936లో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ సినిమాలో ద్రౌపదిగా వీరి దీనాలాపన జాలిగొలుపుతుంది.

కడారు నాగభూషణం గారిని వివాహం చేసుకున్నారు. తెలుగు, తమిళ భాషలలో చిత్రాలను నిర్మించారు. సుమతి, పాదుకాపట్టాభిషేకం, సౌదామిని, పేదరైతు, సతీసక్కుబాయి, శ్రీకృష్ణతులాభారం, నాగపంచమి, తులసీ జలంధర, ఉమాసుందరి, మెదలయిన సినిమాలను నిర్మించారు.

‘పల్నాటి యుద్ధం’ సినిమాలో నాయకురాలు నాగమ్మ పాత్రలో అద్వితీయంగా నటించారు. ‘అనార్కలి’ సినిమాలో అక్బర్ భార్య జోధాబాయిగా అసామాన్య నటనను కనపరిచారు. “మనోహర’ సినిమాలో శివాజీ గణేషన్‌కు, రాజమకుటంలో ఎన్టీరామారావుకు తల్లి పాత్రలలో జీవించారు.

‘చండిక’ సినిమాలో పురుష వేషంలో కత్తిని ఝళిపిస్తూ గుర్రపుస్వారి చేసే పాత్రను పండించారు. ఇటువంటి పాత్రలలో వీరి నటన అనితర సాధ్యం.

“పాదుకా పట్టాభిషేకం’లో కైకేయి, ‘లవకుశ’లో కౌసల్య, ‘ఆడ పెత్తనం’లో గడసరి అత్త, ‘మాంగల్యబలం’లో నానమ్మ, ‘తోడికోడళ్ళు’లో గంభీర, కరుణరసపూరిత నటన ఆయా చిత్రాలను సుసంపన్నంచేశాయి. గుణచిత్ర నటిగా పేరు తెచ్చాయి,

1940లో ‘కృష్ణన్ తోధు’ అనే చిత్రంలో తమిళ సినిమాలో అరంగేట్రం చేశారు. తమిళంలోను విలక్షణ పాత్రలలో నటించి, చక్కటి ఉచ్చారణతో తమిళ ప్రేక్షకుల ఆదరణను సంపాదించారు. అశోక్ కుమార్ సినిమాలో విలనీ పాత్రలో మహారాణిగా రాణించారు.

‘కన్నగి’ తమిళచిత్రంలో మహపతివ్రత కన్నగి పాత్రను అద్భుతంగా పోషించారు. రాజనర్తకిగా ఆమె నర్తించిన తీరు అజరామరం. భర్తకి మరణశిక్ష విధించిన రాజును నిలదీసే సన్నివేశాల్లో కన్నాంబ కళ్ళు నిప్పులు కురిపించాయట. ఈమె పాతివ్రత్య మహిమ మధురై పట్టణాన్ని దహించి వేస్తుంది.

ఈ విధంగా తమిళ భాషని నేర్చుకుని తమిళం మాతృభాష అయిన నటీనటుల కంటే స్పష్టంగా నవరసాలొలికిస్తూ సంభాషణలు పలికిన తీరు వీరిని తమిళులకు దగ్గర చేసింది. స్వర్ణయుగపు తమిళ సినిమా ప్రేక్షకులు కన్నాంబను ఈనాటికీ అభిమానిస్తారనడంలో అతిశయౌక్తి లేదు.

కన్నాంబ స్వర్ణయుగ సినిమాలలో అగ్రతారగా వెలుగొందారు. ఇందుకు వీరి స్ఫురరూపం, గంభీరస్వరం, కనుబొమలతోనూ, కళ్ళతోనూ అవలీలగా హావభావాలు పలికించే నైపుణ్యం, ఠీవి తోడయ్యాయి. వీరి శారీరక భాష (Body Language), వీరి నటన అజరామరమయేందుకు దోహదం చేసింది.

వ్యక్తిగా, నటిగా కన్నాంబ ఏనాటికీ ఆదర్శంగా నిలుస్తారు. అత్యుత్తమ క్రమశిక్షణ, పట్టుదల గల వ్యక్తి, తను సినిమా నిర్మాణంలో నష్టపోయినా, సినిమా అవకాశాలు తగ్గినా ఎవరికీ లొంగలేదు, చివరి వరకూ ధీరోదాత్తంగా నిలిచారు.

చిత్తూరు వి నాగయ్య గారు నిర్మించిన ‘భక్త రామదాసు’ వీరి చివరి చిత్రం, ఈ చిత్రంలో నటిస్తూనే మరణించారు. ఈ సినిమాలో వీరి పాత్రకు శ్రీమతి టి. జి. కమలాదేవి డబ్బింగ్ చెప్పారు.

వీరి అపరిమిత దానగుణం, మంచితనం వీరిని పేదవారిగా మార్చాయి. స్వంత స్టూడియో పనివారికి, నిర్మాణ రంగంలో పనిచేసేవారికి నెలచివరి రోజే జీతాలిచ్చేవారు. చాల మందికి ష్యూరిటీలు పెట్టి ఆస్తులు నష్టపోయారు. ముఖ్యంగా కన్నాంబ మరణించిన తరువాత భర్త నాగభూషణం కడు పేదరికాన్ని అనుభవించారు.

చిత్తూరు వి. నాగయ్య గారి జీవితంలానే వీరి జీవితము తరువాత తరాల వారికి గుణపాఠాలను నేర్పింది.

స్వర్ణయుగపు తొలినాటి కధానాయకులు చిత్తూరి వి. నాగయ్య, యం. కె. త్యాగరాజు భాగవతార్, శివాజీగణేషన్, సి.యస్.ఆర్, యం.జి.రామచంద్రన్, యన్టీ రామారావు, ఎ. నాగేశ్వరరావు, మెదలైన వారితో నటించారు.

వీరికి నాట్యం రాదు. అయితే తమిళ చిత్రం ‘అశోక కుమార్ ‘ కోసం ప్రముఖ నాట్యాచార్యులు మీనాక్షి సుందరం పిళ్ళైగారి వద్ద నాట్యాభ్యాసం చేశారు. మీనాక్షి పిళ్ళై గారు కన్నాంబ గురించి అతి త్వరితంగా, తెలివిగా అత్యున్నత ప్రమాణాలతో నాట్యాన్ని అభ్యసించారని కితాబు నివ్వడం ముదావహం.

సుమారుగా 170 చిత్రాలలో కధానాయికగా, గుణచిత్రనటిగా, నవరసాలొలికించిన నటిగా, మహానటిగా, దక్షిణ భారతంలోని తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాలతో పాటు హిందీ చిత్రరంగంలో కూడా ధృవతారగా భాసించారు.

పౌరాణిక చిత్ర నిర్మాతగా పేరు పొందారు. అంతకు ముందు వీరిలాగా సాత్విక, కరుణ, హాస్య, వీర, ధీర, శూర నాయికగా, నటగాయనిగా, నాట్య కళాకారిణిగా ప్రశస్తి పొందినవారు లేరు.

వీరు వైవిధ్యభరితమైన పాటలను అలవోకగా ఆలపించారు. అత్తమామల ఆరడి లేదు, (ముగ్గురు మరాఠీలు)! దేవుడు లేడూ, సత్యం జయించదూ (గృహలక్ష్మి)! ఎవరవయా దేవా నీవెవరవయాదేవా (పల్నాటి యుద్ధం) ఏమే ఓ కోకిల ఏమి పాడెదవు ఎవరే నేర్పినది ఈ ఆట ఈ పాట (చండిక) లో, నవ్వులు రువ్వుతూ పాడగా నేనే రాణినైతే ఏలనే ఈ ధర ఏకధాటిగా అంటూ వీరా వేశంతో గుర్రం మీద కూర్చుని ఠీవిగా, కత్తిఝళిపిస్తూ సినీ పరిశ్రమను ఏలి 1964 మే 7 వ తేదీన స్వర్గానికి పయనమయ్యారు.

వీరి జ్ఞాపకార్ధం “Pioneers of Indian Film Industry” శీర్షికన (1912 – 1964) తపాలా కవరును విడుదల చేసింది. భారత తపాలా శాఖ.

అసలు నటనంటే ఏమిటో డైలాగ్ డెలివరీ ఎలా చెప్తే ఆకట్టుకోవచ్చో మెదటిసారి సినిమాలకు నేర్పింది కన్నాంబ గారనడంలో అతిశయంలేదు.

శ్రీమతి కన్నాంబ గారిది స్వర్ణయుగపు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక శకం – అంతే!

వీరి వర్ధంతి మే 7 వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***   

Image Courtesy: Internet

Exit mobile version