జాతీయోద్యమ, భూదానోద్యమ నాయకురాలు కౌముది టీచర్

1
2

[dropcap]ఆ[/dropcap]మెకి బాల్యం నుండీ చదువు పట్ల మక్కువ. హిందీ నేర్చుకోవడమేగాక వేలాది మందికి హిందీ భాషను నేర్పారు. గాంధేయురాలిగా ఆయన సిద్ధాంతాలను తూచా తప్పకుండా ఆచరించారు. సేవాగ్రామ్, పౌనార్ ఆశ్రమాలలో, భూదానోద్యమ ఆశ్రమాలలో గడిపారు. తన వంటి మీది బంగారాన్ని గాంధీ నిధికి విరాళంగా అందించారు. గాంధేయవాదిగా, అవివాహితగా, ముఖ్యంగా ఒక ఉ పాధ్యాయినిగా ఈమె దేశానికి అందిచిన సేవలు అనుపమానం. ఆమే కౌముది టీచర్.

ఈమె 1917 మే 17 వ తేదీన కేరళ రాష్ట్రంలోని (ఆనాటి తిరువాన్కూర్ లోని) కన్ననూర్‍లో జన్మించారు. రాచకుటుంబానికి చెందిన ఈమె తల్లిదండ్రులు దేవకి కెట్టిలమ్మ, ఎ.కె. రామవర్మ రాజులు.

ఈమె బాల్యంలో చదువు పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. పేదల పట్ల దయార్ద్ర హృదయురాలు.

మెట్రిక్యులేషన్‍లో ఉత్తీర్ణులయ్యారు. తరువాత హిందీ భాషను అభ్యసిస్తే గాని జాతీయ నాయకుల భావాలను అర్థం చేసుకోలేమని గ్రహించారు.

హిందీ సాహిత్యాన్ని అభ్యసిస్తే దేశంలోని అన్ని ప్రాంతాలను గురించి తెలుసుకోవచ్చునని ఆశించారు. హిందీభాషని అభ్యసించారు.

మరికొందరికి హిందీ భాషను పరిచయం చేయాలని ఆకాంక్షించారు. ఈ పనిని చేసేటందుకుగాను మలబార్ లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయినిగా విధులను నిర్వహించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రచారం చేయడంలో ఈమెకి హిందీ ఉపయోగపడింది. ఖాదీ గురించి దేశంలోని వివిధ ప్రాంతాలలో హిందీలోనే ప్రచారం చేశారీమె. ఈమె హిందీ భాషని ప్రాచుర్యంలోకి తీసుకుని రావడం కోసం కేరళలోని అనేక పాఠశాలలో పని చేశారు. కన్నూర్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాల, కల్లియస్సేరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు వాటిలోవి.

గాంధీజీ వార్ధాలో స్థాపించిన సేవాగ్రామ్ ఆశ్రమానికి, పౌనార్ ఆశ్రమానికి తరచుగా వెళ్ళి సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఆశ్రమ జీవితానికి అలవాటు పడి సేవాభావాన్ని సుసంపన్నం చేసుకున్నారు.

భూదానోద్యమ సారథి వినోబా భావేతో పరిచయం ఆమెను భూదానోద్యమ నాయకురాలిలా తయారు చేసింది. తిరువనంతపురంలో భావే స్థాపించిన భూదానోద్యమ ఆశ్రమంలో పనిచేశారు.

బాపూజీ హరిజనాభివృద్ధి కోసం కృషిచేశారు. ‘హరిజన సహాయ సమితి’ కోసం నిధుల సేకరణను ప్రారంభించారాయన. కస్తూర్బాగాంధి నిర్వహించిన సహపంక్తి భోజనాలలోను, ఇతర ఉద్యమాలలోను పాలు పంచుకున్నారు.

ఈమె పదిహేడేళ్ళ వయస్సులో ‘బడగరా’ లో జరిగిన గాంధీజీ సభకు హాజరయ్యారు. ‘హరిజన సహాయ సమితి’ ద్వారా హరిజనులకు సహాయం చేసే నిమిత్తం నిధులను సేకరించే పనిని ఆరంభించారు.

తన ఉపన్యాసం ముగిసిన తరువాత మహిళలను నిధులను అందించమని కోరారు. ఆ సమయంలో కౌముది తను ధరించిన బంగారు నగలను అన్నింటినీ నిధికి విరాళంగా అందించారు. అప్పుడాయన ఆమెను తండ్రి అనుమతితోనే విరాళంగా అందించారా అని ప్రశ్నించారు. మా నాన్నగారు కూడా ఉద్యమంలో భాగమేనని సమాధాన మిచ్చారామె.

ఈ నగలకు బదులుగా ప్రతిఫలంగా బాపూజీ ఆటోగ్రాఫ్‌ని అడగడం ఆశ్చర్యపరుస్తుంది. ఆమె నిరాడంబరత మనకు అర్థమవుతుంది.

ఆమె నగలను విరాళంగా అందించిన విషయాన్ని గురించి బాపుజీ పలుమార్లు ప్రస్తావించారు. యంగ్ ఇండియా పత్రికలో ‘Kaumudi’s renunciation’ అనే శీర్షికతో ఈమె త్యాగాన్ని ప్రశంసించారు. ఆమెకిచ్చిన ఆటోగ్రాఫ్ “తుమ్హారా త్యాగ్ తుమ్హార భూషణ్ హోగా” (నీ త్యాగమే నీకు ఆభరణం) అని వ్రాశారు.

1972 లో పదవీ విరమణ తరువాత భూదానోద్యమ సారథి వినోబాభావే తిరువనంతపురంలో స్థాపించిన భూదానోద్యమ ఆశ్రమంలో పనిచేశారు. వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. జీవితాంతం అవివాహిత గానే జీవించారు.

2009 ఆగష్టు 4 వ తేదీన కడచిరలోని సోదరుడి ఇంట్లో మరణించారు.

కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించి గౌరవించింది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా వారికి నివాళి.

21-11-2022 న విడుదలైన కౌముది టీచర్ ప్రత్యేక తపాలా కవర్

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here