ప్రముఖ హిందీ రచయిత్రి క్రాంతి త్రివేది

1
2

[dropcap]సె[/dropcap]ప్టెంబర్ 28 ప్రముఖ హిందీ రచయిత్రి క్రాంతి త్రివేది జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఆమె ప్రముఖ హిందీ కవయిత్రి, కథా నవలా రచయిత్రి, వ్యాస రచయిత్రి, బాల సాహిత్య సృష్టికర్త. తన రచనలలో భారతీయ ఐతిహాసిక, పౌరాణిక స్త్రీ పాత్రలను, సాంఘిక స్త్రీల సమస్యలను గురించి చర్చించారు. ముఖ్యంగా హిందీ భాషా ప్రచారంలో ఈమె నవలలు ప్రముఖ పాత్రను నిర్వహించాయి. మహిళల సమస్యలను సాహిత్యంలో చొప్పించాయి. మధ్య ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి కుమార్తె ఆమె. ఆమే క్రాంతి త్రివేది.

ఈమె నాటి (సెంట్రల్ ఫ్రావిన్సెస్) నేటి ఛత్తీస్‌గడ్ లోని రాయ్‌పూర్‌లో 1930 సెప్టెంబర్ 28 వ తేదీన జన్మించారు. ఈమె తండ్రి మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ రవిశంకర్ శుక్లా, తల్లి శ్రీమతి భవానీదేవి. ఈ దంపతులు సామాజిక సేవకులు, స్వాతంత్ర్య పోరాటయోధులు.

వీరి కుమార్తె అయిన క్రాంతి తండ్రి శ్రీ రవిశంకర్ శుక్లా జీవిత చరిత్రను గ్రంథస్థం చేసి జాతికి అందించారు. గొప్ప రచయిత్రిగా పేరు పొందిన ఈమె హిందీ భాషలోని వివిధ సాహితీ ప్రక్రియలలో సాహితీ సృజన చేశారు, కవితలు, బాలసాహిత్యం, కథా-నవలా సాహిత్యం అనితరసాధ్యంగా, అపురూపంగా వెలయించారు. ఈమె వ్యాసాలు వైవిధ్యభరితంగా ఉండి పాఠకులకు స్పూర్తినిస్తాయి.

ఈమె రచనలు అన్నీ సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యే రీతిగా సరళమైన హిందీ సదాలతో సమ్మిళతమయి ఉంటాయి. పాఠకులకి ఆసక్తిని కలిగించడం కోసం అనేక వైవిధ్యభరిత విషయాలను ఎంపిక చేసుకునేవారు. సందర్భోచిత ఔచిత్యం, మంచి మలుపులు, మెరుపులు, జీవితానుభవాలు ఈమె రచనలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

ఈమె రచనలలో కుల వివక్షత, మూఢాచారాల వలన మహిళలకి ఎదురయ్యే సమస్యలను గురించిన విషయాలు దర్శనమిస్తాయి. తూర్పు, పశ్చిమ దేశాల సంస్కృతులను అనుసరించే క్రమంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణలను అవగాహన చేసుకున్నారామె. వాటి పరిష్కారాలను గురించి

ఆలోచించేవారు. ఈ విషయాలను తన రచనలలో పొందుపరచి పాఠకులకి అందించిన మానసిక విశ్లేషకురాలు ఆమె.

ఈమె రచనలు ముఖ్యంగా కథలు సప్తహిక్ హిందుస్థాన్, ధర్మయుగ్, కాదంబిని, నవనీత్, సారిక వంటి హిందీ పత్రికలలో ప్రచురితమయ్యాయి.

ఫూలోన్ కో- క్యా హో గయా వంటి కథలు చాలా ప్రాచుర్యం పొందడం విశేషం.

ఫూలోన్ కో-క్యా హో గయా వంటి కథ అంతర్జాలం యొక్క అభివ్యక్తి కార్యక్రమంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మిక్కిలి ప్రజాదరణ పొందింది కూడా.

తన తండ్రి జీవిత చరిత్రను ‘మై ఔర్ మేరా సమయ్’ నవలగా వెలువరించారు. ఇంకా ఈమె వ్రాసిన అశేషం, ఆగం, షాగు పక్షి, కృష్ణపక్షం, ఉత్తరాధికారి, భూమిజ, గంగాదత్, అమృతఘాట్, తపస్విని, చిర కళ్యాణి, బహే సౌ గంగా, మొహభంగ్, బన్ బండ్ అమృత్, ఆథ్వన్‌జన, వంటి రచనలు హిందీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి.

ఈ నవలలో స్త్రీల సమస్యలకు సంబంధించిన అంశాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు. ఈ సమస్యలతో పాటు సమాంతరంగా ఈ నవలలలో కుల వివక్ష, విభిన్న సంస్కృతుల పరిథిలో ఇమడలేక మానసిక సంఘర్షణకు లోనయి వేదనను అనుభవించే పాత్రలు మనని ఆనాటి సమాజ పరిస్థితులను తెలియజేస్తాయి.

అశేషం నవలలో స్వాతంత్రోద్యమంలో వివిధ వర్గాలు ముఖ్యంగా జమీందారీ కుటుంబాలు నిర్వహించిన పాత్రను వివరించారు.

చిర్ కళ్యాణి నవలను హిందూపురాణాలలోని స్త్రీ పాత్రల వివరణలతో వ్రాశారు. ఆయా పాత్రలు ఆయా గ్రంథాలకు ఆయువుపట్టని నిరూపించే రీతిని వ్రాశారు. వారి మానసిక విశ్లేషణని తన గ్రంథంలో విశ్లేషించారు.

ఈమె బాలసాహిత్యాన్ని కూడా సృజించారు. పత్తే కి నవ్, మిథీ బోలి, పీలీ హవేలి, కుట్ కుట్చుహా, నన్డే జూసూస్ మొదలయివి బాలల కోసం వ్రాశారు. సహజంగానే సరళమైన భాషలో భావాలను వెలువరించే వారు క్రాంతి. పిల్లల కోసం మరింత సరళమైన పదాలనుపయోగించి లలితంగా, బాలల మనసులను హాత్తుకునేలా, సందేశాత్మకంగా అందించారు.

ఈమె తన జీవిత కాలంలో సుమారు 40 గ్రంథాలను వెలువరించారు. కొన్ని అముద్రితరచనలు ఈమె మరణానంతరం ముద్రితమయ్యాయి. ‘లతా ఔర్ వృక్ష్‌’ని 2010 లో ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంవారు ముద్రించారు. ‘ముస్కురాతి లడకీ’ని ఉత్తర ప్రదేశ్ గవర్నర్ కార్యాలయం వారు ముద్రించారు.

కాగా ‘అతిశిక్షణ’ అనే కవితా సంపుటిని కూడా ఈమె అందించారు. సున్నితమైన భావాలతో కూడిన భావకవితా సంకలనంగా పేరు పొందింది.

ఈమె తన రచనలలో రెండు అంశాలకు ప్రాధాన్యతను కల్పించారు. హిందీ భాషా ప్రచారం కోసం, మహిళల సమస్యలను వివరించి పరిష్కార మార్గాలను సూచించి దిశా నిర్దేశం చేయడం కోసం తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించారు. విజయం సాధించారు.

ఈమె రచనలు హిందీ సాహితీ చరిత్రలోను, మహిళా సమస్యలను విశ్లేషించడంలోను మైలురాళ్ళుగా నిలుస్తాయని సాహితీ విశ్లేషకుల ఉవాచ.

ఈమెకు 2002 లో ‘హిందీ సేవి సమ్మాన్’, ఉత్తర ప్రదేశ్ హిందీ సంస్థాన్ వారి ‘పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పురస్కార్’, మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారి ‘నారీ లేఖన్ పురస్కార్’ లభించాయి.

యునెస్కో వారు ‘రాష్ట్రీయ హిందీ సేవా మిలీనియం సమ్మాన్’ పురస్కారంతో గౌరవించారు.

ఈమె 2009 అక్టోబర్ 26వ తేదీన న్యూఢిల్లీలో మరణించారు.

ఈమె గౌరవార్థం 2010 అక్టోబర్ 25వ తేదీన 5.00 రూపాయల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది. స్టాంపు మిద క్రాంతి త్రివేది చిత్రం మనోహరంగా దర్శనమిస్తుంది.

స్టాంపు ఎడమవైపున భారతీయ మహిళ చిత్రాన్ని నలుపుగ తెలుపు రంగులలో భారతీయ మహిళ అస్తిత్వానికి దర్పణంలా కనిపిస్తుంది.

ఈమె జయంతి సెప్టెంబర్ 28వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here