క్వీన్ ఆఫ్ ఇండియన్ రివల్యూషన్… మేడమ్ భికాజీ రుస్తుంజీ కామా

12
2

[dropcap]ఆ[/dropcap]గష్టు 13 మేడమ్ భికాజీ రుస్తుంజీ కామా వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఆమె ధనిక పార్సీ కుటుంబంలో జన్మించిన ధనిక మహిళ. బ్రిటిష్ వారికి అణిగి మణిగి ఉండే కుటుంబపు కోడలు. దేశం కోసం అన్ని బంధాలనూ వదులుకుంది. విదేశాలకు వైద్య చికిత్స నిమిత్తం వెళ్ళింది. సుమారు 35 సంవత్సరాల పాటు విదేశాలలో ఉండి భారత స్వాతంత్ర పోరాటాన్ని నడిపింది. అటు మితవాదులు, ఇటు అతివాదులు, మరోవైపు విప్లవాత్మక హింసావాదులతోను కలిసి పని చేసింది. బాంబుల తయారీలో శిక్షణనిచ్చింది. విదేశాలలోనే పత్రికలను ముద్రించి మాతృదేశానికి పంపింది. ఆమే మేడమ్ భికాజీ రుస్తుంజీ కామా.

ఈమె 1861 సెప్టెంబర్ 24వ తేదీన బొంబాయిలో (నాటి బొంబాయి ప్రెసిడెన్సీ) నేటి మహారాష్ట్రలో జన్మించారు. తల్లి జియాబాయి, తండ్రి సొరాబ్జీ ప్రేమ్‌జీ పటేల్. తండ్రి పార్సీ కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు.

అలెగ్జాండ్రా నేటివ్ గర్ల్స్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్‌లో ఆంగ్ల విద్యను అభ్యసించారు. 1857 నాటి ప్రథమ స్వాతంత్ర్య పోరాటయోధుల వీర, ధీర గాథలను బాల్యంలోనే చదివారు. దేశభక్తితో ఆమె హృదయం నిండిపోయింది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనాలని మనసు ఉవ్విళ్ళూరింది. తల్లిదండ్రులు కుమార్తె ఆశయాన్ని గమనించారు.

బ్రిటిష్ వారికి అనుకూలుడయిన ప్రముఖ న్యాయవాది, ధనవంతుడు అయిన రుస్తుంజీ కామా కిచ్చి వివాహం చేశారు. బ్రిటిష్ వారికి అనుబంధంగా ఉన్న కుటుంబంలో ఇమడలేకపోయారు. దేశభక్తురాలయిన కామాకు భర్తతో అభిప్రాయబేధాలు వచ్చాయి.

అప్పట్లో ప్లేగు వ్యాధి ప్రపంచాన్ని కుదిపేసేది. ఊర్లు ఊర్లు తుడిచి పెట్టుకుని పోయేవి. 1896లో బొంబాయిలో భయంకరమైన కరువు తాండవించింది. ఆ తరువాత బుబోనిక్ ప్లేగ్ వ్యాధి విజృంభించింది. బొంబాయి గ్రాంట్ మెడికల్ కాలేజి గ్రూపుతో కలిసి ప్లేగు వ్యాధి బాధితులకు సేవలందించేటందుకు ఉపక్రమించారు. అక్కడి ప్రజలు ఆమెను ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అని ప్రస్తుతించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని తన ఋణం తీర్చుకోమని చెప్పేవారు. చివరకు ప్లేగ్ ఆమెనూ వదలలేదు. వైద్య చికిత్స నిమిత్తం లండన్ వెళ్ళారు. వ్యాధి తగ్గుముఖం పట్టాక ఇంటికి వస్తుందని తల్లిదండ్రులు ఆశించారు. కాని ఆమె రాలేదు. అక్కడే ఉండి భారత స్వాతంత్ర్య పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నారు.

ఆమె లండన్‌లో ఉన్నపుడు ఆ దేశ ప్రజలకు గల స్వేచ్ఛను గమనించారు. దాదాబాయ్ నౌరోజీ వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. అపుడు భారతదేశాన్ని బ్రిటిష్ వారు దోపిడీ చేసిన విధానాన్ని, భారతీయుల ఆర్థిక వెనకబాటుతనాన్ని గురించి తెలుసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం జరిపి మాతృభూమి ఋణం తీర్చుకోవాలనుకున్నారు. బ్రిటన్ పార్లమెంటుకి పోటీచేసిన నౌరోజీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు.

తను గమనించిన విషయాలను గురించి విస్తృత ప్రచారం చేశారు. లండన్ లోని హైడ్‌పార్క్, కాక్స్‌టన్ హాల్ వంటి ప్రదేశాలలో జరిగిన సమావేశాలలో ప్రసంగించారు. ఈ కార్యక్రమాలకు శ్యామ్‌జీ కృష్ణవర్మ, సర్దార్‌సింగ్ రాణా, వి.డి.సావర్కర్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, జవహర్ లాల్ నెహ్రూ వంటి మితవాద, అతివాద నాయకులందరూ హాజరయ్యేవారు.

బ్రిటన్ ప్రభుత్వం ఈమె మీద దేశద్రోహ అభియోగం మోపింది. ఆమెను భారతదేశంలోకి రాకూడదని ఆంక్షలు విధించింది.

జర్మనీ, హాలెండ్, అమెరికా, స్కాట్లండ్, ఫ్రాన్స్ మొదలయిన దేశాలలో పర్యటించారు. ఆ దేశాలలోని భారతీయుల కోసం సమావేశాలు నిర్వహించారు. భారతీయులు పడుతున్న బాధలను వివరించి బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో బందీ అయిన భారతమాతను దాస్యవిముక్తురాలను చేయాలని ఉద్రేకంగా పిలుపునిచ్చారు.

1907 ఆగష్టు 22 తేదీన జర్మనీలోని స్ట‍ట్‌గార్డ్‌లో ‘రెండవ అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశం’ జరిగింది. ఆ సమావేశానికి సుమారు 1000 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంలో ఒక అద్భుతమైన, చారిత్రక సంఘటన జరిగింది. హఠాత్తుగా ఒక మహిళ లేచి నిలబడి భారతీయస్వాతంత్ర్య పతాకాన్ని ఎగురవేశారు. అక్కడితో ఆగలేదు. “ఇది భారత స్వాతంత్ర్యోద్యమ పతాకం. దీనికి వందనం చేయండి” అని ఉచ్చస్వరంతో అడిగారు. ప్రతినిధులందరూ లేచి నిలబడి పతాకవందనం చేశారు. ఒక దేశ స్వాతంత్ర్య పతాకను విదేశాలలో ఎగుర వేయడం మాటలు కాదు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ మహిళే భికాజీ రుస్తుంజీ కామా!

ఇక్కడ ఈ పతాకం గురించి చెప్పుకోవాలి. మన పింగళి వెంకయ్య గారు తయారు చేసిన పతాకానికి దీనికి తేడా ఉంది. స్వాతంత్ర్యోద్యమ పతాకాన్ని విప్లవయోధుడు వి.డి సావర్కార్ తయారు చేశారు. ముచ్చటైన మూడు రంగుల జెండాయే ఇది కూడా! ఈ జెండా ఆకుపచ్చ, కాషాయం, ఎరుపు రంగులతో రూపొందించబడింది. ఎరుపు రంగు బలానికి, కాషాయం విజయానికి, ఆకుపచ్చ ధైర్యోత్సాహాలకి గుర్తులు. ఆనాడు భారతదేశంలో 8 సంస్థానాలుండేవి. వాటికి ప్రతీకలుగా ఎనిమిది తామర పుష్పాలు దాని మీద కన్పిస్తాయి. మధ్యలో ఉన్న కాషాయరంగు మీద దేవ నాగరలిపిలో ‘వందేమాతరం’ అని వ్రాసి ఉంటుంది. హిందూ, ముస్లిం విస్వాసాలను తెలిపే సూర్య చంద్ర చిహ్నాలు కనిపిస్తాయి.

సమావేశం తరువాత మళ్ళీ ఫ్రాన్స్ దేశానికి తరలి వెళ్ళారు కామా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటుంది. ఫ్రాన్స్, బ్రిటన్ శత్రుదేశాలు. కాబట్టి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ‘కామా’కి ఆశ్రయం ఇచ్చింది ఫ్రాన్స్. ఐతే 1914-1918 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్, బ్రిటన్ ఏక పక్షమయారు. అపుడు మేడమ్ కామాని నిర్బంధించాలనుకుంది ఫ్రాన్స్. ఈమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

అజ్ఞాతంలో ఉన్న కామా చాలా విప్లవ కార్యక్రమాలను నిర్వహించారు. దేశ విదేశాల విప్లవ యోధులను కలిసి చర్చలు జరిపారు. బాంబులను తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారు.

డబ్బు, ఆయుధాలని వారి ద్వారా మన దేశానికి పంపారు. బోల్షివిక్ పార్టీ నాయకులు (వ్లాదిమిర్ ఇలిచ్ లియనోవ్) లెనిన్ కూడా కామాని కలిసి చర్చలు జరిపేవారు. రష్యా లెనిన్ చేతికి వచ్చాక రష్యా దేశానికి రమ్మని ఆమెను ఆహ్వానించారు. అయితే ఆమె ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆమె పత్రికలను కూడా నిర్వహించారు. ‘వందేమాతరం’ పేరుతో విప్లవ పత్రికనీ నడిపారు. ఈ పత్రికని స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లో ముద్రించారు. వాటి కాపీలను అతి రహస్యంగా మన దేశానికి పంపేవారు.

ప్రముఖ విప్లవ వీరుడు మదన్‌లాల్ థింగ్రా పేరు మీద ‘మదన్ తల్వార్’ పత్రికని నడిపారు. మదన్ లాల్ థింగ్రా విలియంహట్ కర్జన్ విల్లీని హత్య చేసిన గొప్ప విప్లవ వీరుడు. వీరి పేరు మీదగా పత్రికను జర్మనీలోని బెర్లిన్ నుంచి ప్రచురించారు. ఈ పత్రికలను భారత ఫ్రెంచి కాలనీ పాండిచ్చేరి ద్వారా భారత దేశానికి తరలించారు. వీటిని ఇంగ్లాండ్, భారత దేశాలలో నిషేధించారు.

ఇంకా భారత స్వాతంత్ర్య పోరాటం-1857కి సంబంధించిన గ్రంథాన్ని పోలెండ్‌లో ముద్రించారు. వాటికి కవర్ పేజీగా డాంటే రచించిన ‘డాన్ క్విక్జోట్’ గ్రంథపు అట్టలను పొందుపరిచారు. రహస్యంగా ఈ ప్రతులను మన దేశానికి తరలించిన తెలివైన, దేశభక్తురాలైన గొప్ప మహిళగా ఈ విషయం ఋజువు చేస్తుంది గదా!

దాదాభాయ్ నౌరోజీ సెక్రటరీగా పని చేసిన సమయంలో ‘భారత జాతీయ కాంగ్రెస్’ తరపున పని చేశారు.

ఈమె ఇంగ్లాండ్ లో ‘ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ’ని (IHRS) స్థాపించారు. ఇంగ్లాండ్ నుండి బహిష్కరణకు గురయిన తరువాత IHRS కు అనుబంధంగా ‘పారిస్ ఇండియన్ సొసైటీ’ని స్థాపించారు. ఈ సంస్థల ద్వారా స్వాతంత్రోద్యమాన్ని నడిపించారు.

మహిళలను గురించి, వారి హక్కుల గురించి కూడా ఈమెకు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి.

1910లో ఈజిప్టులో పర్యటించారు. అపుడు కైరో సమావేశంలో మాట్లాడారు. “ఈజిప్టులో మిగిలిన సగం ఎక్కడ ఉంది? నేను సగం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషులను మాత్రమే చూస్తున్నాను. తల్లులు, సోదరీమణులు ఎక్కడున్నారు? ఊయలలూపే చేతులు వ్యక్తులను కూడా తయారు చేస్తారని మీరు మర్చిపోకూడదు” అని ప్రశ్నించారు.

స్వాతంత్ర్యపోరాటంలో మహిళలు కూడా ముఖ్యమైన పాత్ర నిర్వహించాలని చెప్పేవారు. ముందు మన మహిళల గురించి కాదు. మన భారతమాత విముక్తి గురించి శ్రద్ధ పెట్టండి అని చెప్పారు.

“భారతదేశం స్వతంత్ర దేశంగా ఉన్నప్పుడు మహిళలకు ఓటు హక్కే కాకుండా అన్ని హక్కులూ వాటంతట అవే వస్తాయి” అని చెప్పేవారు.

సుదీర్ఘకాలం పోరాటం తరువాత ఫ్రెంచి ప్రభుత్వం 1914లో ఈమెను అరెస్టు చేసింది. ప్రవాస జైలు జీవితానికి పంపించింది. 1917 నవంబర్‌లో అనారోగ్యం పాలవడం వల్ల విడుదల చేశారు. వారానికి ఒకసారి పోలీసులను కలవాలని షరతు విధించారు. మొదటి ప్రపంచ ముగిసిన తరువాత పారిస్ లోని తన ఇంటికి చేరారామె.

1935 వరకు అలాగే గడిపారు. పక్షవాతానికి గురయ్యారు. భారత దేశానికి రావడానికి అనుమతిని కోరారు. దేశద్రోహ కార్యకలాపాలకు దూరంగా నిబంధన విధించారు. దానికి అంగీకరించారు. సర్ కోవాస్జీ జహంగీర్ ఈ విషయమంతా చూసుకున్నారు. 1935 నవంబర్‌లో జహంగీర్‌తో కలిసి మాతృదేశానికి చేరుకున్నారు. .

1936 ఆగష్టు 13 వ తేదీన పార్సీ జనరల్ హాస్పటల్‌లో మరణించారు.

ఈ విధంగా విదేశంలో అంతర్జాతీయ సమావేశంలో పతాకావిష్కరణ చేసిన ధైర్యశాలి, బాంబుల తయారీలో శిక్షణను ఇచ్చిన నేర్పరి, విప్లవ కరపత్రాలు, సమాచారపత్రాలు, పత్రికలను ముద్రించి స్వదేశానికి పంపిన ధీరోధాత్రి మేడమ్ కామా.

ఈమె జ్ఞాపకార్థం 1962 జనవరి 26 వ తేదీన 15 నయా పైసల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. పార్సీ వనిత శైలి, వేషధారణలో దర్శనమిస్తారు మేడమ్ కామా.

మేడమ్ కామా వర్ధంతి ఆగష్టు 13 వ తేదీ సందర్భంగా ఈ వ్యాసం.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here