Site icon Sanchika

భారత ప్రజానీకానికి విశిష్ట సేవలందించిన మాడలిన్ వార్రే స్లేడ్ (మీరాబెన్)

[dropcap]22[/dropcap]-11-2021 మాడలిన్ స్లేడ్ (మీరాబెన్) జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

మనదేశ స్వాతంత్ర్య పోరాటంలో దేశవిదేశాలకి చెందిన పోరాటయోధులు పాల్గొన్నారు. ఒక్క జాతీయ పోరాటంలోనే కాదు, విదేశీయులు వివిధ రంగాలలో సేవలు చేయడం మన భారతీయులకు గర్వకారణం. ఇంగ్లాండ్ నుండి వచ్చి పర్యావరణ పరిరక్షణ కోసం, గ్రామస్వరాజ్యం కోసం, పాడిపంటల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఆశ్రమాలను స్థాపించి సేవలందించి, గాంధీపథంలో మన దేశం నడవడం లేదని బాధపడిన వనితా శిరోమణి ఒకరున్నారు.

ఈమే మీరాబెన్‌గా పేరు పొందిన మాడలిన్ వార్రే స్లేడ్. ఈమె 1892 నవంబర్ 22వ తేదీన ఇంగ్లాండ్ లోని సర్రేలోని రీగేట్‌లో జన్మించారు. తల్లిదండ్రులు ఫ్లోరెన్స్ సాండర్స్, సర్ ఎడ్మండ్ స్లేడ్‍లు. ఎడ్మండ్ ప్లేడ్ రాయల్ నేవీ అధికారి. నావెల్ ఇంటెలిజన్స్‌లో కమాండర్-ఇన్-చీఫ్‌గా పని చేశారు. గొప్ప ప్రకృతి, జంతు ప్రేమికుడు. మాడలిన్ బాల్యమంతా డోర్కింగ్‌కు దగ్గరలో ఉన్న పెద్ద తోటలో గడిచింది. ఈమెకి 16 ఏళ్ళ వయసులో ఎడ్మండ్ ఈస్టిండీస్ స్క్వాడ్రన్ కమాండర్-ఇన్-చీఫ్‌గా నియమితులయ్యారు. కుటుంబం మొత్తం బొంబాయి నగరానికి వచ్చారు. కొంతకాలం తరువాత తమ మాతృదేశానికి వెళ్ళిపోయారు. ఇలా 2 సంవత్సరాలపాటు భారతదేశంలో గడిపారు మాడలిన్.

ఈమెకి లుడ్విగ్‌వాన్ బీథోవెన్ సంగీతమంటే చాలా ఇష్టం. 15 ఏళ్ళ వయసులోనే ఆయన సంగీతాన్ని విన్నారు. రొమైన్ రోలెండ్ గొప్ప రచయిత. బీథోవెన్ గురించి రోలెండ్ వ్రాసిన పుస్తకాలను చదివారు. అలాగే ఆయన బాపూజీ గురించి వ్రాసిన పుస్తకాన్ని కూడా చదివారు. బీథోవెన్ నివసించిన వియన్నా, జర్మనీలను దర్శించారు. ఫ్రాన్స్‌లో రోలెండ్‌ని కలిశారు.

ఈమె పారిస్‌లో ఋగ్వేదాన్ని, భగవద్గీతను చదివారు. మహాత్మాగాంధీ సత్యాహింసలు, సత్యాగ్రహం ఆమెని ఆకర్షించాయి. ఆయన సిద్ధాంతాలను గురించి, స్వాతంత్ర్య పోరాట ఉద్యమాలని గురించి అవగాహన చేసుకున్నారు. భారతదేశ ప్రజల దీనావస్థ కూడా ఆమెకి బోధపడింది.

మహాత్మాగాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఆమె మనసును, ఆకాంక్షలను, ఆశయాలను, త్యాగశీలతను ఆయన అర్థం చేసుకున్నారు. భారతదేశానికి వచ్చి సేవలందించాలనే కోరికని బాపూజీకి తెలియజేశారు. అవకాశం కల్పించమని అభ్యర్థించారు. ఎట్టకేలకు ఆమెకు గాంధీజీ అనుమతి లభించింది.

1925 నవంబర్ 7వ తేదీన అహమ్మదాబాద్ చేరుకున్నారు. ఆమెకి స్వాగతం పలికిన వారిలో మహదేవదేశాయ్, సర్దార్ వల్లభభాయిపటేల్, స్వామి ఆనంద్ వంటి గొప్ప నాయకులున్నారు. వీరు స్వాగతం పలికారంటేనే ఈమె పట్ల గాంధీజీకి గల సదభిప్రాయం మనకు అర్థమవుతుంది. తరువాత 34 సంవత్సరాలు ఈమె మనదేశంలో వివిధ రంగాలలో సేవలను అందించారు.

బాపూజీ ఈమె పేరును మీరాబెన్ (సోదరి మీరా)గా మార్చారు. ఈమె గురుకుల కహంగ్రీకి వెళ్ళి హిందీ భాషని అభ్యసించారు. సబర్మతీ ఆశ్రమంలో అనుసరించవలసిన సాత్విక పద్దతులను గురించి ముందే తెలుసుకున్నారు. కాబట్టి ఆమె ఇబ్బంది పడలేదు. వాటికి విస్తృత ప్రచారం కల్పించారు.

బ్రహ్మచర్య ప్రతిజ్ఞ తీసుకున్నారు. నూలు వడకడం నేర్పించేవారు. కస్తూర్బాకి, బాపూజీకి అత్యంత సన్నిహితురాలయ్యారు.

మహారాష్ట్రలోని వార్ధా నగరంలో సేవాగ్రామ్ ఆశ్రమాన్ని స్థాపించారు. సబర్మతీ ఆశ్రమం రీతిలో ఈ ఆశ్రమ కార్యకలాపాలు కొనసాగాయి.

ఈమె గాంధీజీ పర్యటనలలో ఆయనను అనుసరించేవారు. వారికి నమ్మకస్థురాలయ్యారు.

1931లో లండన్‌లో జరిగిన 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. తిరిగి వస్తూ రోలెండ్‌ను కలిశారు.

1932-33లో జరిగిన శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొన్నారు. భారతదేశంలో పరిణామాలను గురించి ఐరోపా దేశాలు, అమెరికాలోని వారికి వివరాలను అందించేవారు. ఈ కారణంగానూ అరెస్టయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టయ్యారు. ఈమెతో పాటు కస్తూర్బా, మహదేవదేశాయ్‌లు కూడా ఆగాఖాన్ ప్యాలెస్‌లో నిర్బంధించబడ్డారు. అక్కడే కస్తూర్బా, దేశాయ్‌లు మరణించారు.

1946లో వ్యవసాయోత్పత్తిని పెంచే పనిలో సలహా సంప్రదింపుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యారు. ఈమె నియామకం వల్ల ఆ రాష్ట్రానికి మేలు జరిగింది. మూల్‌దాస్‌పూర్‌లో కిసాన్ ఆశ్రమాన్ని స్థాపించారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి ‘శ్వేత విప్లవానికి’ నాంది పలికారు. వ్యవసాయ రంగంలో కూడా ప్రయోగాలను చేపట్టడం జరిగింది. ఈ ఆశ్రమానికి అవసరమయిన భూమిని రైతులు విరాళంగా ఇవ్వడం ముదావహం.

కాశ్మీర్‌లోను, గర్వాల్ హిమాలయాలలోను అడవుల పరిరక్షణను గురించి మైదాన ప్రాంతాలలో వరదల ప్రభావాన్ని గురించి, పరిశోధించి పత్రాలను సమర్పించారు.

1947లో రిషీకేష్ సమీపంలో ‘పశులోక్’ ఆశ్రమాన్ని నిర్మించారు. 1952లో భిలాంగణలో ‘గోపాల్ ఆశ్రమా’న్ని స్థాపించారు. అలాగే ‘బాపుగ్రామ్’నీ స్థాపించారు.

బాపూజీ ఆశయమైన గ్రామ స్వరాజ్య స్థాపన ధ్యేయంగా ఈ ఆశ్రమాలను నడిపించారామె.

1947 డిశంబర్ 18వ తేదీన గాంధీజీని చివరిసారిగా కలిశారు. “నేను ఎక్కడున్నా మీరు మీ పనిలోనే ఉండండి” అని మీరాబెన్‌కి చెప్పారు బాపు.

మనదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు శిక్షని అనుభవించడంతోనే ఈమె భారతదేశ సేవా కార్యక్రమాలు ఆగలేదు. వ్యవసాయం, పశుపోషణ, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ కోసం సలహాలిచ్చి ఆచరించడంలో విశేష సేవలను అందించి రికార్డు సృష్టించారు.

స్వాతంత్ర్యం లభించిన తరువాత రాజకీయ, ఆర్థిక, సాంఘిక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో సంభవించిన మార్పులను ఈమె జీర్ణించుకోలేకపోయారు. బాపూజీ ఆశయమైన గ్రామ స్వరాజ్యానికి తూట్లు పడడం సహించలేక పోయారు.

1959లో ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడ కొంతకాలం ఉన్న తరువాత 1960లో ఆస్ట్రియాకు వెళ్ళారు. అక్కడి గ్రామాలలో పర్యటించారు. అక్కడే తన జీవిత చరమాంకం గడపాలని నిర్ణయించుకున్నారు.

1969లో గాంధీజీ శతజయంతి సందర్భంగా లార్డ్ లూయీస్ మౌంట్‌బాటెన్ ఆమెను ఇంగ్లాండ్‌కు ఆహ్వానించారు. బాపూజీతో ఆమె అనుభవాలని, ఆయన పోరాట పటిమను వివరించమని కోరారు. లండన్ లోని ఆల్బర్ట్ హాల్‌లో బాపూతో తన అనుభవాలను, ఆయన సిద్ధాంతాలను అద్భుతంగా వివరించి ప్రేక్షకులను అలరించారు.

ఈమె వివిధ దేశాల నాయకులను జాతీయ పోరాట సమయంలోను, తరువాత కలిశారు. డేవిడ్ లాయడ్ జార్జి, జనరల్ స్మట్స్, విన్‌స్టన్ చర్చిల్ వంటి వారిని కలిశారు. అమెరికా వెళ్ళి ప్రథమ మహిళ ఎలీనార్ రూజ్‌వెల్ట్‌ను కలిశారు. ప్రపంచ మానవహక్కులను గురించి చర్చించారు.

ఆంగ్లం, ఫ్రెంచ్, జర్మన్, ఈజిప్షియన్, హిందీ భాషలలో ప్రావీణ్యాన్ని సంపాదించారు.

భారత స్వాతంత్ర్య పోరాటం గురించిన ఈమె రచనలు స్ఫూర్తిదాయకంగా ఉండేవి. ఈమె వ్రాసిన అనేక వ్యాసాలు యంగ్ ఇండియా, హరిజన్, ద స్టేట్స్‌మన్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందుస్థాన్ టైమ్స్ మొదలయిన పత్రికలలో ప్రచురించారు.

సుధీర్ కాకర్ ‘మీరా అండ్ ది మహాత్మా’ అనే గ్రంథాన్ని వ్రాశారు.

‘The Spirit’s Pilgrimage’ పేరుతో ఆత్మకథను వ్రాశారు, ‘New and old Gleamings’ ను 1960లో (క్లీనింగ్స్ గెదర్డ్ ఎట్ బాపుస్ ఫీట్)గా ప్రచురించారు. ‘మీరాకు బాపు లేఖలు’ పేరుతో వారిద్దరు వ్రాసుకున్న లేఖలను ప్రచురించారు. వీటి ద్వారా నాటి దేశ, ప్రపంచ కాలమాన పరిస్థితులను, రాజకీయ, ఆర్థిక పరిణామాలను ప్రపంచానికి తెలియజేశారు.

1932లో చదవండి, గ్రహించండి, చట్టం అనే పేరుతో 1932లో ఒక పత్రం వ్రాశారు. “(మన అవమానం) ఒక చెడును ప్రతిఘటించడానికి ఒక గోల్డెన్ రూల్ ఉంది. దీనిలో ధనవంతులు మరియు పేదవారు యువకులు మరియు పెద్దలు అందరూ సహకరించగలరు. మరియు ఆ చెడుతో కళంకితమైన అన్ని వస్తువులనూ పూర్తిగా బహిష్కరించడం. ఈ బ్రిటిష్ రాజును సమర్థించే ఒక్క విషయాన్ని కూడా మనం ముట్టుకోకూడదు. అది అన్నింటి కంటే త్వరగా ఈ వ్యవస్థను అంతం చేస్తుంది. ఆపై అప్పుడు మాత్రమే ప్రస్తుతం మనకున్న అవమానాన్ని మన తలల నుండి ఎత్తి వేయగలం” ఈ పత్రం ద్వారా ఆమె కొన్ని వేల మందిలో స్ఫూర్తిని కలిగించారు.

ఈమె మన భారతదేశానికి వివిధ రంగాలలో అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1981వ సంవత్సరంలో ఈమెకు ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని అందించింది. 1982 జూలై 20వ తేదీన ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని వుడ్స్‌బడెన్‌లో మరణించారు.

వివిధ రంగాలలో ప్రసిద్ధి పొందిన ముగ్గురు ప్రతిభామూర్తులు ప్రపంచ ప్రసిద్ధ అహింసాయోధుడు, సత్యాహింసలనే ఆయుధంగా మాతృదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించిన మహాత్మాగాంధీజీ, సంగీత ప్రపంచాన్ని ఏలిన బీథోవెన్, వీరిద్దరి గొప్పతనాన్ని గ్రంథస్థం చేసిన గొప్పరచయిత రోలెండ్‌తో ఈమె సన్నిహితంగా మెలిగారు. ఆయా రంగాలను అవగాహన చేసుకున్నారు. తను కోరుకున్న రీతిలో జీవవితాన్ని సఫలం గావించుకున్నారు.

వీరి జ్ఞాపకార్థం 1983 ఆగష్టు 9 వ తేదీన (‘INDIA’S Struggle for Freedom , 1st Series) సిరీస్‌లో సెట్‌నెంట్ ఆఫ్ టు స్టాంప్స్ (Se-tenant of Two Stamps) లో ఈమె స్టాంపు విడుదలయింది. 50 పైసల విలువతో విడుదలయిన ఈ స్టాంపు మీద భారతీయ వేషధారణలో మీరాబెన్ కనిపిస్తారు. ఈ Se-tenant లోని రెండవ స్టాంపు మహదేవదేశాయ్‌ది కావడం విశేషం. ఈ విధంగా బాపూకి ఆత్మీయులిద్దరికి ఈ Se-tenant తో నివాళిని అర్పించింది. భారత తపాలాశాఖ.

నవంబర్ 22 వ తేదీ మీరాబెన్ జయంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

Exit mobile version