మహాభారతం మనకు నేర్పే పాఠాలు

0
2

[dropcap]మ[/dropcap]హాభారతం – విజ్ఞానాన్ని మనిషి పురోగతికి – న్యాయబద్ధమైన, ధర్మబద్దమైన జీవితాన్ని గడపటానికి అనేక విషయాలను చెపుతుంది. తెలుసుకొనేవాడికి తెలుసుకున్నంత. అనేక ధర్మ సూక్ష్మాలు న్యాయసూత్రాలు రాజనీతి సూత్రాలు సామాన్యుల మధ్య ఉండవలసిన అనేక నియమాలను ఎన్నింటినో చెపుతుంది. అందుచేతనే మహా భారతాన్ని ‘పంచమ వేదం’ అని అంటారు. అనేక ధర్మ శాస్త్రాలను అందించేది అని అర్ధం. మహాభారతం నుండి మనం నేర్చుకోవలసిన విషయాలను లెక్క పెట్టి రాయటం అసాద్యమైన పని. అయినప్పటికీ కొన్నింటి నైనా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. మహాభారతంలో ఉండి ప్రపంచంలో లేనిది లేదు. ప్రపంచంలో ఉండి భారతంలో లేనిది లేదు. మహాభారతాన్ని ఒక మత  గ్రంథంంగానో లేదా దేవుళ్ళకు సంబంధించిన గ్రంథంగానో పరిగణించరాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం వేద వ్యాసునిచే రచించబడినప్పటికీ ఆ గ్రంథం నేటి కాలమాన పరిస్థితులకు అన్వయించుకునే  విధంగా ఉంటుంది. కాబట్టి ఎన్నేళ్లు అయినా అందులో వ్యాసుడు చెప్పిన విషయాలు నిత్య  నూతనంగా ఆచరించదగినవిగా ఉంటాయి. అటువంటి అంశాలను కొన్నింటిని తెలుసుకుందాము.

భారతములో గమనించదగ్గ విషయము ఏమిటి అంటే భీష్ముడు సంజయునితో అన్నట్లుగా ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మమూ ఉంటుంది, అలాగే ఎక్కడ ధర్మమూ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. అక్కడే విజయమూ ఉంటుంది. మొట్టమొదటగా చెప్పుకోవలసింది – సంతానం అధికముగా ఉంటే రాజులకైనా మహారాజులకైనా వచ్చే అనర్థాలకు భారతం చక్కటి నిదర్శనం. వందమంది గాంధారి పుత్రులు, అంధులైన తల్లిదండ్రులు, ధృతరాష్ట్రునికి గల అమితమైన పుత్ర వాత్సల్యంతో సమస్యలు! అలాగే దుష్ట సాంగత్యము కూడా – అంటే మేనమామ శకుని కౌరవులను తనకు అనుకూలముగా మలచుకుంటూ పాండవులపై ఈర్హ్య ద్వేషాలను పెంచుతాడు  అలాగే దుర్యోధనునికి ఉన్న రాజ్యకాంక్ష అన్యాయముగా నైనా రాజ్యాన్ని దక్కించు కోవాలన్న తలంపుతో శకుని సలహాతో మాయా జూదానికి సిద్ధపడ్డాడు. అలాగే కురుసభలో ద్రౌపదిని అవమానించటానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ మనం గుర్తించ వలసినది దుర్యోధనుని కుటిలత్వమే కాదు, చేసిన చిన్న సహాయము అయినా వృథా పోదు అన్న విషయం కూడా. ద్రౌపది శ్రీకృష్ణుని వ్రేలికి గాయం అయినప్పుడు తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుని గాయానికి కట్టు కడుతుంది. దానికి ప్రతిఫలంగా శ్రీ కృష్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం సమయములో ద్రౌపదిని  ఆదుకుంటాడు. అంతే కాకుండా స్త్రీలను అవమానిస్తే ఎంత ప్రమాదమో అది కురువంశ నాశనానికి కారణము అయింది కదా.

కురు పాండవుల గురువైన ద్రోణాచార్యుడు అర్జునుడి ఏకాగ్రత నేర్చుకోవటంలో చూపే ఆసక్తిని బట్టి తన స్వంత కుమారుడైన అశ్వత్థామను కూడా కాదని అర్జునుడిని మేటి విలుకాడుగా తీర్చిదిద్దాడు. ద్రోణాచార్యుడు ఏ విధమైన రాగ ద్వేషాలకు లోనుకాకుండా విద్యార్థి ప్రతిభను బట్టి విద్యను నేర్పాడు. అది గురువులకు ఉండవలసిన ప్రథమ లక్షణం. అందుచేతనే నేటికీ ఉత్తమ గురువులకు ఇచ్చే అవార్డును ద్రోణాచార్య అవార్డుగా పిలుస్తారు. కర్ణుడు ఎంతో దానశీలి పరాక్రమవంతుడు అయినా అధర్మ పక్షాన ఉండటం వలన విజయం సాధించలేకపోయాడు. అతనిని నమ్ముకున్న దుర్యోధనుడికి ఏ విధముగానూ జయాన్ని ఏ సందర్భము లోను చేకూర్చలేక పోయినాడు. ఒక ఘోషయాత్ర సమయంలో గానీ ఉత్తర గోగ్రహణంలో కానీ కర్ణుడు విజయం సాధించలేదు కదా, అయినా ఆ కర్ణుణ్ణే నమ్ముకుని దుర్యోధనుడు యుద్ధంలోకి దిగాడు. జయాపజయాల గురించి ఏ విధమైన లెక్క వేయకుండా పని మొదలు పెడితే ఏమవుతుందో సుయోధనుని వద్ద నుండి నేర్చుకోవచ్చు.

పాండవులు అరణ్యవాసం సందర్భముగా ఒక బ్రాహ్మణ యువకుని కాపాడటం కోసము కుంతి తన కుమారుల సామర్థ్యం తెలుసు కాబట్టి బకాసురునికి ఆహారముగా పంపటానికి సిద్ధపడి లోకానికి బకాసురుని పీడను వదిలించింది. అలాగే పాండవులు వారి వారి ఆసక్తులను బట్టి సరదాగా నేర్చుకున్న విద్యలు వారికి అజ్ఞాతవాసం సందర్భంగా ఉపయోగపడ్డాయి. అంటే నేర్చుకున్నది ఏది వృథా కాదు. అభిమన్యుడు నేర్చుకున్న అర్ధజ్ఞానము ఎంత ప్రమాదమో తెలిసింది కదా. అభిమన్యుడు తన స్వశక్తి మీద కాకుండా భీముడు ఇతరుల శక్తి మీద ఆధారపడి తనకున్న అర్ధజ్ఞానముతో పద్మవ్యూహములోకి వెళ్లి హతుడైయున్నాడు.

కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరు శ్రీకృష్ణుని సహాయము అర్థించటానికి వెళతారు. అప్పుడు అర్జునుడు ఆయుధం పట్టను అని చెప్పినా  శ్రీ కృష్ణుని తన పక్షాన ఉండమని తనకు రథ సారథిగా ఉండి తనను నడిపించమని కోరుతాడు. కానీ దుర్యోధనుడు సంఖ్యాబలాన్ని చూసి శ్రీకృష్ణుని సైన్యాన్ని కోరతాడు. ఇది దైవ బలాన్ని మించిన బలము ఏది లేదు అని లోకానికి తెలియజేసే సంఘటన. కౌరవ పక్షాన సర్వ సైన్యాధక్షులుగా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ ఉన్నారు. అందరు మహా యోధానుయోధులే. కానీ వారు విజయాన్ని పొందలేకపోయినారు. కారణం పాండవపక్షాన ఉన్న వ్యూహకర్త శ్రీ కృష్ణపరమాత్ముడే. ఆయుధం పెట్టకపోయినా యుద్ధంలో ప్రతిక్షణం వ్యూహరచన చేస్తూ తనదైన శైలిలో యుద్ధాన్ని నడిపించి పాండవులకు విజయాన్ని అందించాడు. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే భారతము లోని ప్రతి సంఘటన మానవాళికి ఏదో కొత్త విషయాలను బోధిస్తుంది, మార్గదర్శకంగా ఉంటుంది. అన్నిటికన్నా ప్రధానమైనది భారతములో శ్రీకృష్ణుడు బోధించిన గీత.  గీత అర్జునుడికి ఒక్కడికే బోధించినది కాదు సమస్త మానవాళికి వారి సమస్యలను ఎదుర్కోవటానికి సాక్షాత్తు భగవంతుడే బోధించినది. కాబట్టి ఎవరికైనా ఏ రకమైన సమస్య ఎదురైనా దానికి పరిష్కారం కోసం గీతను చదువుకొని పరిష్కారములు పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here