మన అష్టాదశ పురాణాలు

0
2

[dropcap]మ[/dropcap]నకు వేదాంతపరమైన విషయాలు మంచి చెడు చెప్పటానికి అష్టాదశ(18) పురాణాలు ఉన్నాయి. వీటిని వ్యాసమహర్షి రచించాడని, రచించిన తానూ వక్తగా కాకుండా ఆ విషయాలను నైమిశారణ్యములో శౌనకుడు మొదలైన మునులు దీర్ఘ సత్రయాగము చేస్తున్నప్పుడు వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడి కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని అని పురాణాలు చెపుతున్నాయి. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, వైశంపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. “పురాణ” శబ్దానికి “పూర్వ కాల కధా విశేషము” అన్న అర్థము కూడ ఉన్నది. ఈ పురాణాలు మధ్య యుగములో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన కొంత పరివర్తనం చెందాయి. క్రీస్తు పూర్వము ఐదవ శతాబ్దము నాటికే ఈ పురాణ వాఙ్మయము ప్రస్తుతము లభిస్తున్న రూపు సంతరించుకొంది. ఆదికాలములో ఇది వేదం అధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని కాల క్రమములో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యముగా రూపుదిద్దుకున్నాదని కొంతమంది విమర్శకుల ఊహ.

సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరామ వేళలలో ఇష్ట కథా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేవతల కథలను ఇలా చెబుతూ ఉండవచ్చును. అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్ది వరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును.

పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతములోని పన్నెండవ స్కందము చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్దం వెలువడింది. ఆ శబ్దంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకార శబ్దం ఆవిర్భవించింది. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ ‘అ’కార, ‘ఉ’కార ‘మ’కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూః భువః సువః అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తన కుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి. వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమర్షణునికి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి వారలకు అందించారు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.

భాగవతంలో పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి. అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలన), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము) వంశానుచరితము, (సూర్య, చంద్ర వంశస్తుల కథనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పది పురాణ లక్షణాలు. కొంతమంది ఇలా పది లక్షణాలు ఉన్నవి మహాపురాణాలు అని, ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకరిస్తున్నారు. ఇప్పడు పురాణాలలో మనము చెప్పుకొనే అష్టాదశ పురాణాలు (18) వాటి పేర్లు వాటి గురించి చాలా క్లుప్తముగా, వాటిలో శ్లోకాల సంఖ్య మొదలైన సమాచారం తెలుసుకుందాము. ఈ పురాణాలలో పెద్దది పద్మ పురాణము చిన్నది మార్కండేయ పురాణము (శ్లోకాల సంఖ్యా పరముగా).

  1. మత్స్య పురాణము:- మత్స్య రూపములో ఉన్నశ్రీ మహావిష్ణువు – మనువు అనే రాజు చెప్పిన ఈ పురాణములో కాశీ క్షేత్ర ప్రాశస్త్యము, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనము, ధర్మము అంటే ఏమిటో ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలు ఏమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. దీనిలో 14,000 శ్లోకాలు ఉంటాయి.
  2. కూర్మ పురాణము:- కూర్మావతారము దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణములో విష్ణుమూర్తి ఖగోళ శాస్త్రము గురించి అంటే విశ్వము గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన ఉంటుంది. దీనిలో 17,000 శ్లోకాలు ఉన్నాయి.
  3. వామన పురాణము:- ఈ పురాణాన్ని పులస్త్య మహర్షి నారద మహామునికి చెపుతాడు ఈ పురాణములో శివపార్వతుల కళ్యాణం, గణేశ, కార్తికేయుల జన్మ వృత్తాంతము; ఋతువుల గురించి వర్ణనలు ఉంటాయి దీనిలో 14,000 శ్లోకాలు ఉంటాయి. ఈ పురాణము బ్రహ్మదేవుని రచన అని కూడా చెపుతారు.
  4. వరాహ పురాణము:- విష్ణువు వరాహవాతారము దాల్చినప్పుడు భూదేవికి తన జన్మ వృత్తాంతాన్ని ఉపాసనా విధానాన్ని, ధర్మ శాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్నవివిధ పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణములో ఉంటాయి. ఇందులో 24,000 శ్లోకాలు ఉంటాయి.
  5. గరుడ పురాణము:- జనన మరణాలు అంటే ఏమిటి , మరణము తర్వాత జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది మొదలైన అంశాలతో పాటు గరుడి జన్మ వృత్తాంతాన్ని కూడ గరుడుని వివిధ సందేహాల పై వివరణ విష్ణువు ఈ పురాణములో ఇస్తాడు. అందుచేతనే ఎవరైన చనిపోయినాక వారి బంధువులు ఆత్మీయులకు ఉపశమనము కోసము గరుడ పురాణము చదువుతారు. అంటే మిగతా సమయాల్లో చదవకూడదు అని నియమము ఏమి లేదు. ఈ పురాణములో 19,000 శ్లోకాలు ఉన్నాయి.
  6. వాయు పురాణము:- ఈశ్వరుని మహత్యము, భూగోళ, సౌర మండల వర్ణనలను వాయు దేవుడు ఈ పురాణములో వివరిస్తాడు. ఈ పురాణములో 24,000 శ్లోకాలు ఉంటాయి. ఈ పురాణాన్ని శివ పురాణము అని కూడా అంటారు.
  7. అగ్నిపురాణము:- వశిష్ఠునికి అగ్నిదేవుడు చెప్పినది ఈ పురాణము. వ్యాకరణము, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిష్య శాస్త్రము, భూగోళ, ఖగోళ శాస్త్ర రహస్యాలను ఈ పురాణము ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో 16,000 శ్లోకాలు ఉంటాయి.
  8. స్కాంద పురాణము:- స్కందుడు చెప్పిన పురాణము కాబట్టి దీనిని స్కాందపురాణము అంటారు. కాశీఖండము, కేదారఖండము, కుమారిల ఖండము, రేవాఖండము, తదితర ఖండాలుగా ఈ పురాణము ఉంటుంది. రామేశ్వర క్షేత్ర మహిమ, పూరి జగన్నాధ ఆలయముతో సహా అనేక పుణ్యక్షేత్రాల వర్ణనలు ఇందులో ఉంటాయి. ఈ పురాణములో 80,000 శ్లోకాల దాకా ఉన్నాయి.
  9. లింగ పురాణము:- ఈ పురాణములో లింగరూప శివ మహిమలతో పాటు వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష్య, భూగోళాల గురించి సమాచారం ఉంటుంది. దీనిలో 11,000 శ్లోకాలు ఉంటాయి.
  10. నారద పురాణము:- నారదుడు బ్రహ్మ మానస పుత్రులైన సనక సనంద,సనాతన, సంపత్కుమారులకు చెప్పిన ఈ పురాణములో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఉంటాయి. ఈ పురాణములో 24,000 శ్లోకాలు ఉంటాయి.
  11. పద్మ పురాణము:- ఈ పురాణములో మధు కైటభుల వధ, రావి చెట్టు మహిమ, పద్మ గంధీ దివ్య గాథ , గంగా మహత్యము, గీతాసారము నిత్యపూజా విధానాల గురించి ఉంటుంది. దీనిలో 55,000 శ్లోకాలు ఉంటాయి.
  12. విష్ణు పురాణము:- పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణములో విష్ణుమూర్తి అవతార వర్ణన ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతము 63,000 శ్లోకాలలో వివరింప బడింది.
  13. మార్కండేయ పురాణము:- ఈ పురాణమును పక్షులు క్రొష్టి (జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయ మహర్షి రచించెను. ఇది పురాణాల్లో కల్ల చిన్నది. దీనిలో 9,000 శ్లోకాలు ఉంటాయి.
  14. బ్రహ్మ పురాణము:-బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణములో వర్ణ ధర్మాలు, స్వర్గ నరకాల వివరణ ఉంటుంది. దీనిలో 10,000 శ్లోకాలు ఉంటాయి.
  15. భాగవత పురాణము:- శుక మహర్షి పరీక్షిత్తునకు ఉపదేశించిన ఈ పురాణములో 18,000 శ్లోకాలు ఉంటాయి. విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననము,లీలల గురించి మృత్యువుకు సమీపంలో ఉన్న పరీక్షిత్తు మహారాజుకు చెపుతాడు. మొదట్లో వేదం వ్యాసుడు శుక మహర్షికి భోదిస్తే ఆ తరువాత అయన పరీక్షిత్తు మహారాజుకు బోధించి ఆయనకు మోక్ష ప్రాప్తి కలుగ జేస్తాడు.
  16. బ్రహ్మాండ పురాణము:- బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణములో రాధ కృష్ణులు, పరుశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రము, ఖగోళ విజ్ఞానము గురించిన వివరణ ఉంటుంది.
  17. భవిష్య పురాణము:- సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణములో అగ్నిసూర్య ఉపాసన విధులతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించి వివరణ ఉంటుంది.
  18. బ్రహ్మ వైవర్త పురాణము:-వశిష్ఠ మహర్షి అంబరీషునికి ఉపదేశించిన ఈ పురాణములో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో గోలోక ప్రశంస, భోజన నియమాలు, రోగ నివృత్తి సాధనాలు తులసీ,సాలగ్రామ మహత్యము ఉంటాయి.

ఇవీ సంక్షిప్తంగా మన అష్టాదశ పురాణాల వివరాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here