[dropcap]ఫ్రా[/dropcap]న్స్‌లో పుట్టి, ఫ్రెంచి పుదుచ్చేరికి చేరి, శ్రీ అరబిందోకి శిష్యురాలిగా మారారామె. అరవిందుని ఆధ్యాత్మిక ప్రపంచానికి వారసురాలయ్యారు. ఆయన సిద్ధాంతాలకు విస్తృత ప్రచారం కల్పించారు. ఆయన చేత ‘ద మదర్’ (తల్లి) అని పిలిపించుకున్నారు. పుదుచ్చేరి భారతకేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తరువాత కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేశారు. ఇక్కడే జీవితాన్ని ముగించారు. ఈమే రాచెల్ మిర్రా అల్ఫాస్సా.
ఈమె 1878 ఫిబ్రవరి 21 వ తేదీన పారిస్‌లో జన్మించారు. వీరు స్వతహాగా ఈజిప్టు యూదు కుటుంబానికి చెందినవారు. తల్లిదండ్రులు మా థిల్డే ఇస్మాలన్, మోయిస్ మారిస్ అల్ఫాస్సాలు. ఈమెకి తల్లిదండ్రులు పెట్టిన పేరు రాచెల్ మిర్రా అల్ఫాస్సా.
ఈమెకి బాల్య నుండి కళలు, సంగీతం, టెన్నిస్ వంటి ఆటల పట్ల మక్కువ ఎక్కువ. ఈమె తండ్రి పుస్తక ప్రియుడు. ఆయన చాలా పుస్తకాలను సేకరించి, తన స్వంత గ్రంథాలయంలో అమర్చారు. తండ్రి సేకరించిన పుస్తకాలను చదివారామె. ఇవన్నీ ఈమె ఫ్రెంచి సాహిత్యాన్ని ఔపోసన పట్టేటందుకు ఉపయోగపడ్డాయి. ఆమె తల్లి నుండి కొన్ని విషయాలలో ప్రేరణను పొందారు.
1893లో విద్యాభ్యాసం ముగిసిన తరువాత కళలను అభ్యసించడం కోసం అకాడెమి జూలియన్‌లో చేరారు. అక్కడి మాజీ విద్యార్థి హెన్రీ మోరిస్సెట్‌తో ఈమె వివాహం జరిగింది. సుమారు పదేళ్ళపాటు కళాకారులుగా పని చేశారు. అనేక చిత్రాలను సృజించారు. ఈ కాలంలో తనకి ఎదురయిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆలోచనలలో మునిగి తేలేవారు.
స్వామి వివేకానంద వ్రాసిన రాజయోగం, ఫ్రెంచ్ భాష లోని భగవద్గీతని చదివారు. జీవిత సారాన్ని అధ్యయనం చెయ్యాలనుకున్నారు. ఇంకా వివిధ గ్రంథాలను చదవాలని జిజ్ఞాసను పెంచుకున్నారు.
కాస్మిక్ ఉద్యమం ఈమెను అమితంగా ఆకర్షించింది. ఉద్యమనేత మాక్స్ థియోన్, ఆయన భార్య మేరి వేర్ లను అల్జీరియాలో కలిశారు. ఆ తరువాత పారిస్‌లో కొంతకాలం ఒంటరి జీవితాన్ని గడిపారు. 1911లో తత్వవేత్త, రచయిత, మాజీ సైనికుడు పాల్ రిచర్డ్‌ను ద్వితీయ వివాహం చేసుకున్నారు.
వీరిద్దరూ కలసి 1914లో భారతదేశానికి వచ్చారు. పుదుచ్చేరిలో శ్రీ అరబిందోను కలిశారు. తను ఆధ్యాత్మిక ఆలోచనలలో మునిగితేలుతున్నప్పుడు తన కలలలో కనిపించిన ఆధ్యాత్మిక వేత్తను ఆయనలో దర్శించారు.
స్వతహాగా రచయిత అయిన రిచర్డ్ అరబిందో యొక్క యోగా గురించిన విశేషాలని జర్నల్‌ను ముద్రించాలని నిర్ణయించుకున్నారు. దీనిని ఆంగ్లం, ఫ్రెంచి భాషలలో ద్విభాషా పత్రికగా సుమారు ఆరు సంవత్సరాలకు పైగా ముద్రించారు.
ఈలోగా ప్రపంచదేశాలలో అనేక మార్పులు సంభవించాయి. మొదటి ప్రపంచయుద్ధం మొదలయింది. ఈ సమయంలో పాండిచ్చేరిలోని భారతీయ విప్లవకారులని, స్వాతంత్య్ర సమర యోధులని తమకు అప్పగించాలని బ్రిటిష్ వారు కోరారు. బ్రిటిష్ వారి చేతికి దొరకడం ఇష్టంలేక ఇద్దరూ తిరిగి పారిస్ వెళ్ళిపోయారు.
ఆ తరువాత జపాన్ దేశానికి వెళ్ళారు. నాలుగు సంవత్సరాల తరువాత తిరిగి పుదుచ్చేరికి చేరారు. మిర్రా, రిచర్డ్‌ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ సమయంలో రిచర్డ్ ఇంగ్లండ్ చేరుకుని మరో వివాహం చేసుకున్నారు.
మిర్రా పుదుచ్చేరి లోనే నివసించడం మొదలు పెట్టారు. కొంతకాలం ఆమె ఆధ్యాత్మిక జీవితానుభవాలను పరిశీలించిన తరువాత మిర్రాను తల్లి (ద మదర్) అని పిలవడం మొదలు పెట్టారు. 1924 తరువాత ఈమె ఆధ్యాత్మిక సమాజ కార్యకలాపాలను బహుజాగ్రత్తగా నిర్వహించారు. 1930 నాటికి అధికార పూర్వకంగా ఆమెకి ఆశ్రమం మొక్క బాధ్యతలను అప్పగించారు శ్రీ అరబిందో. రోజు రోజుకి ఆశ్రమవాసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
1937 నాటికి 150 మంది సభ్యులు ఆశ్రమంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు వారందరికీ సౌకర్యాలను సమకూర్చవలసిన అవసరం ఏర్పడింది.
మదర్ హైదరాబాద్ నవాబును సంప్రదించారు. దివాన్ హైదర్ అలీ నిధులను సమకూర్చారు. మదర్ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం జరిగింది. ఈ భవనానికి గోల్కొండ నవాబుల పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేసేందుకు గాను ‘గోల్కొండే’ అని పేరు పెట్టారు.
అమెరికా అధ్యక్షుడు వుడ్రోవిల్సన్ కుమార్తెకు ఈ ఆశ్రమం బాగా నచ్చింది. ఈమె ఇక్కడకు వచ్చి అక్కడి ఆధ్యాత్మిక పరిస్థితులకు అబ్బురపడి జీవితాంతం ఆశ్రమంలో ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఈలోగా 1939లో మానవాళిని అణుబాంబు ద్వారా నాశనం చేసిన రెండవ ప్రపంచ యుద్ధం మొదలయింది. ఈ సమయంలో మదర్ బ్రిటిష్ మిత్రరాజ్యాలకు సహాయం చేయడానికి నిర్ణయించారు. వైస్రాయ్ సహాయనిధికి ధనాన్ని సమకూర్చారు.
1943లో ‘శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్’కు శ్రీకారం చుట్టి వినూత్న పద్ధతులలో విద్యనందించే ఏర్పాట్లు చేశారు. 1950లో అరబిందో మరణం తరువాత మదర్ ఆశ్రమ బాధ్యతలను పూర్తిగా స్వీకరించారు.
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది, కాని పుదుచ్చేరి మాత్రం ఫ్రెంచి వారి ఆధిపత్యంలోనే కొనసాగింది.
1954 ఆగష్టు 15న ఫ్రాన్స్ పుదుచ్చేరికి స్వాతంత్రాన్ని ప్రకటించింది. పుదుచ్చేరి భారతదేశంలో భాగమయింది. భారత ప్రభుత్వం పుదుచ్చేరిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. ‘మదర్’కు ప్రత్యేకంగా ఫ్రెంచి, భారత పౌరసత్వాలు కల్పించ బడ్డాయి.
భారతప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ, తన కుమార్తె ఇందిరతో సహా ఆశ్రమాన్ని సందర్శించారు. మదర్‌తో వీరికి సన్నిహితసంబంధాలు ఏర్పడ్డాయి. అంతేకాదు రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి, నందినీ శతపతి (ఒరిస్సా ముఖ్యమంత్రిణి), దలైలామా వంటి వారు ఎందరో ఈమె ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సందర్శించారు. ఈమె చేస్తున్న పనులకు తమ మద్దతు నందించారు.
1964 లో (సిటీ ఆఫ్ ది డాన్) ఆరోవిల్ అనే విశ్వనగర నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఈ నగరం అన్ని మతాలకు, జాతుల వారికి, స్త్రీ పురుష తేడా లేకుండా అందరూ శాంతియుతంగా జీవించాలనే ఆశయంతో నిర్మించబడింది. అంతేకాదు. ఒక నగరంలో ప్రజలు జీవించడానికి అవసరమయిన సమస్త సౌకర్యాలను సమకూర్చే ఏర్పాట్లను సమకూర్చారు. ఈ నగరానికి ఇప్పటికీ అనేక మంది దేశీయులతో పాటు విదేశీయులు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆమె ఆరోవిల్లి నగరశిల్పిగా విశ్వ ఆధ్యాత్మిక గురువుగా పేరు పొందారు. 1973 నవంబర్ 17వ తేదీన పాండిచ్చేరిలో మరణించారు. ఆమె భౌతికంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళినా, ఆమె సృజించిన ఆధ్యాత్మిక సంపద పుదుచ్చేరిని సుసంపన్నంగా నిలిపింది.
1914లో ఆమె భారతదేశానికి వచ్చినప్పుడు “From the first time I Came to INDIA – I felt that INDIA is my true Country, the Country of my Soul and spirit” అని చెప్పుకున్నారు.
ఈమె జీవితానుభవాలను శిష్యుడయిన సత్ప్రేమ్ 13 సంపుటాలలో గ్రంథస్థం చేశారు. వ్రేఖేమ్ ఆమె జీవిత చరిత్రను ‘తల్లి – తన జీవితకథ’ పేరుతో చేశారు.
ఈమె 1949 నుండి ది బులెటిన్ అనే త్రైమాసిక పత్రికను నడిపారు.
ఈమె జ్ఞాపకార్థం 1978 ఫిబ్రవరి 21వ తేదీన 25 పైసల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.
దివ్యత్వంతో మెరిసిపోతూ కనిపిస్తారు ఆమె ఈ స్టాంపుమీద. భారతదేశానికి సేవలందించిన విదేశీ ప్రముఖులకు స్టాంపులను విడుదల చేసి నివాళిని అర్పించింది భారతప్రభుత్వం – తపాలాశాఖ ద్వారా.
***
Image Courtesy: Internet