Site icon Sanchika

శృతి తప్పిన ఓ తల్లి జీవన రాగానికి తోడైన కూతురి దీన రాగం వెరసి ‘మౌనరాగం’ కథ

[dropcap]జీ[/dropcap]వితం బాల్యం నుండి వృద్ధాప్యం వరకూ అనేక మార్పులను చవిచూస్తూ సమస్యలను ఎదుర్కొంటూ చివరకు ఏదో రూపంలో ముగింపు పలుకుతుంది. అయితే జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమార్యం, దాటి వృద్ధాప్యం వరకూ ఎంత మంది చేరుకుంటారు? అన్నది ప్రశ్నార్థకమే! అందుచేత వృద్ధాప్యాన్ని అనుభవించిన వాళ్ళని, వాళ్ళు కన్నపిల్లల్ని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అయితే వృద్ధాప్యం అనుభవించిన వాళ్లంతా ఆరోగ్యంగానూ, సంతోషంగానూ, పిల్లలకు ఇబ్బందులు సృస్టించకుండాను (కావాలని కాదు సుమండీ) వెళ్లిపోయారని చెప్పడానికి కూడా లేదు. చాలా శాతం మంది వివిధ సమస్యలతో, అనారోగ్య కారణాలతో కాలం చేసినవారే కనిపిస్తుంటారు. కారణాలు ఏమైనా వృద్ధాప్యానికి చేరుకోవడం అనేది ఎంత ఆనందకరమో, కొంతమంది విషయంలో అంతకుమించిన దుఃఖమయమూ, బాధాకరమూ కూడాను. సంవత్సరాల తరబడి మంచాలకే అంకితమైపోయి, సర్వం అక్కడే కానిచ్చుకుంటూ, తాము బాధపడటమే కాకుండా, పిల్లలలను, బంధువులను లేదా ఇతర సంరక్షకులను ఇబ్బంది పెట్టి (ఇబ్బంది పెట్టాలని కాదు) ఎదుటివారు విసుక్కునేలా, అసహ్యించుకునే స్థాయికి కూడా తీసుకుపోతారు. ఎందుకంటే వారి అనారోగ్య సమస్యలు అలాంటివి.

ఇకపోతే మరికొంతమంది ఆరోగ్యంగా కొంతవరకూ లాగానే వుంటారు, తమ పనులు తాము చేసుకుంటారు, కానీ జ్ఞాపకశక్తిని కోల్పోతారు. చెప్పకుండా తలుపు తీసుకుని, గమ్యం లేని చోటుకు వెళ్లిపోతుంటారు. భోజనం చేసినా చేయలేదంటారు. బ్రష్ చేసుకోకపోయినా, చేసేసుకున్నామని చెబుతారు, సందర్భంలేని పరాకు మాటలు మాట్లాడుతుంటారు. ముందు చెప్పుకున్నవారికంటే, ఇలాంటి వారివల్ల ప్రమాదం ఎక్కువ. సంరక్షకులు విసుక్కోవడానికి కూడా ఇలాంటి వారివల్ల అవకాశాలు ఎక్కువ. క్రమంగా మనుష్యులను గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. వింతచేష్టలు, వింత మాటలు ఎక్కువ అవుతుంటాయి. ఇలాంటి తల్లిదండ్రులను భరించడం, ఎంత ప్రేమించే కూతుళ్ళకైనా, కుమారులకైనా కత్తిమీద సాములాంటిది. పరిస్థితిని అర్ధం చేసుకుని, ప్రేమించి తల్లిదండ్రులకు సేవలు చేసే పిల్లలు సమాజంలో అతి కొద్ది మంది మాత్రమే మనకు కనిపిస్తారు. ఇలాంటి వృద్ధాప్యపు లక్షణాలు ‘అల్జీమర్స్’ అనే సమస్యలో కనిపిస్తుంటాయి. ఇది ఈ మధ్యకాలంలో బాగా, అందరి నోటా వినిపిస్తున్న అనారోగ్య సమస్య. అదిగో అలాంటి సమస్యను ఆధారంగా చేసుకుని రచయిత్రి శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ కొప్పిశెట్టి, చక్కని, చిక్కని, చిన్న కథను అల్లారు. ఇది చదివితే కథ అనిపించదు, ఎక్కడో జరిగిన హృదయ విదారక గాథ అని అనిపిస్తుంది!

శ్రీమతి ఝాన్సీ ఇలాంటి కథలు రాయడంలో దిట్ట. సమాజంపై చక్కని అవగాహన, స్వీయ అనుభవాలు ఆవిడ కలం చేత చిందులు వేయిస్తాయి. సరదాగానో, ఉబుసుపోక చదువుకునే కథలుగానో, ఆవిడ కథలు వుండవు. ఎక్కడో ఎవరి జీవితంలో నుండో, కథా వస్తువును తీసుకున్న భావనే శ్రీమతి కొప్పిశెట్టి కథల్లో కనిపిస్తుంది. అది రచయిత్రిలోని గొప్పతనంగా భావించకతప్పదు. ఊహాగానాలు, పగటికలలు, పనికిరాని ప్రేమలు ఈ రచయిత్రి కథల్లో అసలు కనిపించవు. అతికొద్ది కాలంలోనే మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకోవడానికి, అనేక అవార్డులు పొందడానికి కారణం ఆమె చేసిన మంచి రచనలే.

ఇంతకూ కథ విషయానికొస్తే – కథ మొత్తం చెప్పడం భావ్యం కాదు గానీ కథలోనే ముఖ్య సారాంశం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక తల్లి కూతురు, కూతురి సంసారం. ఆ కూతురు తల్లిని అమితంగా ప్రేమిస్తుంది. తల్లి వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా సకల సేవలు చేస్తుంది. ఒక ప్రక్క ఎదుగుతున్న పిల్లలు, మరోప్రక్క బాధ్యత గల ఉద్యోగం వంటి తప్పనిసరి బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే తల్లికి ‘అల్జీమర్స్’ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇక్కడ పూర్తి సమయం తల్లికి కేటాయించలేని పరిస్థితి, తప్పనిసరి బాధ్యతలతో సతమతమవుతున్న నేపథ్యంలో, బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితుల సలహా మేరకు ఇష్టం లేకపోయినా తల్లిని మంచి సదుపాయాలున్న ‘వృద్దాశ్రమం’లో చేరుస్తుంది. తల్లి అది స్వంత ఇల్లుగానే భావిస్తుంటుంది. లేని పెంపుడు కుక్క బయటికి వెళ్లినట్టుగా భావించి వెతకడానికి రమ్మని కేర్ టేకర్‌ను ప్రాధేయపడింది. కేర్ టేకర్ మాటలతో సర్దిచెప్పి మూడ్ మార్చే ప్రయత్నం చేస్తుంటుంది. ఇక కూతురు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తల్లిని వృద్ధాశ్రమంలో చేర్చడం ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితిలో పెట్టినందుకు కూడా బాధపడుతుంది. నిత్యం తల్లి కూర్చునే కుర్చీ చూసినా, పెంపుడు కుక్కను చూసినా, తల్లి మాటలూ, తల్లి చేష్టలు, ఆవిడ పరాకు మాటలూ గుర్తుకు వచ్చి కూతురు మనసు వికలం అయిపోతుంది. తల్లిని చూడాలనే కోరిక అధికమౌతుంది. వృద్ధాశ్రమం వాళ్ళు పిలవకపోయినా, వెళ్లి తల్లిని చూసి రావాలని నిర్ణయించుకుంటుంది. తీరా అక్కడికి వెళ్ళాక, తల్లి ప్రవర్తనకు భంగపడిన మానసిక పరిస్థితి చదువరిని కంటతడి పెట్టిస్తుంది. బహుశః ఈ కథ రాసిన రచయిత్రి కళ్ళు సైతం చెమర్చి వుంటాయనడం అతిశయోక్తి కాదేమో! అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే కథ చదవక తప్పదు. అయినా ఎందుకు, రచయిత్రి రాసిన కథ చివరి పంక్తి చదివితే పాఠకులకు కథ పూర్తిగా అర్థం అయిపోతుంది. అదేమిటంటే, “రాణి (కూతురు) మనసంతా దేవినట్టయి కళ్ల నీళ్లు కక్కుకుంటూ తనను గుర్తించని అమ్మ (మణమ్మ) వంక నిస్త్రాణంగా చూస్తుండి పోయింది” ఈ కథ చదువుతుంటే, కన్నీళ్ల పర్యంతం కావడమే కాదు, వృద్దాప్యం రాకముందే, జీవితం చాలించడం మంచిదనిపిస్తుంది. అయినా అది మన చేతిలో లేదుగా?

శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ కొప్పిశెట్టి ఇటీవల ప్రచురించిన ‘చీకటివెన్నెల’ కథల సంపుటిలోని కథ ఇది. మీరూ చదివి చూడండి మరి! పుస్తకం వివరాలకు మీరు సంప్రదించవలసిన మొబైల్ నం 9866059615. (ప్రచురణకర్త మొబైల్ 9848787284).

Exit mobile version