Site icon Sanchika

అభంగ్‌‌లను రచించిన తొలి మహిళ ముక్తాబాయి

[dropcap]అ[/dropcap]భంగ్‌లను సృజించిన తొలి కవయిత్రి ముక్తాబాయికి నివాళిగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

క్షేత్రయ్య మువ్వ గోపాల పదాలు, భక్తరామదాసు కీర్తనలు మన ప్రాంతాలని సుసంపన్నం చేసినట్లు – మరాఠా ప్రాంతంలో అభంగ్‍లు భక్తి భావాన్ని పెంపొందింపజేశాయి. మనందరికి జ్ఞానేశ్వర్, సంత్ నామదేవ్, సంత్ తుకారాం వంటి వారు తెలుసు.

కాని జ్ఞానేశ్వర్ శిష్యురాలు, సోదరి/సంత్ నామదేవ్ గురువు ముక్తాబాయి గురించి చాల తక్కువ మందికి తెలుసు. 13వ శతాబ్దిలోనే ‘అభంగ్‌’లను సృజించిన ముక్తాబాయి మరాఠీలో తొలి కవయిత్రి.

వీరు 1279లో మహారాష్ట్ర (నాటి మరాఠా) ప్రాంతంలోని ‘అలండి’ సమీపంలోని ‘సిద్ధబెట్’లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రుక్మిణి, విఠల్ గోవింద కులకర్ణిలు. ముక్తాబాయికి ముగ్గురు సోదరులు. అందరూ ‘సంత్’లుగా పేరు పొందినవారు కావడం గమనార్హం. సంత్ అంటే ‘సాధువు’ అని అర్థం.

వీరు ‘వర్కరీ’ సాంప్రదాయ భక్తులు. వర్కరీ అంటే వైష్ణవ హిందూ మతం యొక్క భక్తి సాంప్రదాయ ఉద్యమం. వీరు విఠలుని (పాండురంగని) భక్తులు. విఠలుడంటే కృష్ణుని రూపమని భావిస్తారు. కొన్ని చోట్ల రుక్మిణీదేవితో కలిసి, మరికొన్ని చోట్ల రుక్మిణీ, సత్యభామలతో కలిపి పూజించే ఆచారముంది. ఈనాటికి ఆ పద్ధతులను పాటిస్తున్నారు.

వీరు తమ భజనలను అభంగ్ రూపంలో సృజించి ఆలపిస్తారు. నామదేవ్, తుకారాంల అభంగ్‌లు మరాఠీ భాషలో విస్తృత ప్రజాదరణను పొందాయి.

అయితే వీరందరి కంటే ముందే ‘తొలి వర్కరీ సాధువు జ్ఞానేశ్వర్’ తన సోదరులు నివృత్తినాథ్, సోపాందేవ్‌తో పాటు సోదరి ముక్తాబాయిని శిష్యులుగా తయారు చేసి వర్కరీ సాంప్రదాయ భక్తులుగా మార్చారు.

13వ శతాబ్దంలో మొదలయిన అభంగ్ రచన ఆధునిక యుగంలోనూ కొనసాగుతూ వచ్చింది. ఈ అభంగ్‌లు బ్రహ్మచర్యం, సమానత్వం, హిందూ గ్రంథాల పఠనం, క్షమ, సరళత, కరుణ, అహింస, ప్రేమ, వినయం వంటి లక్షణాలను అనుసరించమని చెపుతాయి.

ముక్తాబాయి తల్లిదండ్రులు బ్రాహ్మణుల చేత వెలి వేయబడ్డారు. అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నారు. ముక్తా ఆమె సోదరులు ‘భిక్ష’ తోనే బ్రతికారు. తరువాత వీరి భక్తి తత్పరతను గమనించి ‘శుద్ధిపత్ర’ ప్రకారం ధర్మం, తెలివితేటలు, జ్ఞానం వంటి లక్షణాలతో సుసంపన్నమయిన వారి బహిష్కరణను రద్దుచేసి తమలో కలుపుకున్నారు.

సోదరుడు సంత్ జ్ఞానేశ్వర్ బోధనలు వీరిని ప్రభావితం చేశాయి. ఆయన మనస్సులోని సాహిత్య, ఆధ్యాత్మిక భావనలను అవగాహన చేసుకున్నారు. అయినప్పటికీ ముక్తాబాయి బ్రాహ్మణ పద్ధతుల ద్వారా అణచివేతకు గురయిన ప్రజల కోసం కృషిచేశారు, ప్రార్థించారు. వారిలో ఆధ్యాత్మికతను సుసంపన్నం చేసి, విముక్తులవడం కోసం ఉద్యమాలని చేపట్టారు.

మతము, ఆధ్యాత్మిక ధనం పూజారుల చేతులలో బందీగా ఉండడాన్ని సహించలేకపోయారు. సామాన్య స్త్రీలు, గ్రామీణ ప్రజలు, అట్టడుగు వర్గాల వారితో మమైకమయ్యారు. ప్రకృతి మాతను ఆరాధించి, ప్రేమించారు. గుత్తాధిపతుల చేతుల్లో మగ్గుతున్న మతాన్ని, ఆధ్యాత్మిక భావనలని సామాన్య ప్రజలకు అందేట్లుగా దిశానిర్దేశం చేశారు.

“మనసుకు మించిన సరిహద్దులేదు, చీకటి లేని చోట నేను నివసిస్తున్నాను. భగవంతుని ఆత్మ నా ఆత్మలో నివశిస్తుంది. ఆయన నా హృదయానికి ఏకైక ఇల్లు” అని బోధించారు. స్వీయ సాక్షాత్కారమే మార్గమని దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగతంగా ఎవరికి వారు స్వీయ ఆధ్యాత్మికతను సాధించాలని బోధించారు.

వీరు మొత్తం 41 అభంగ్‌లను వ్రాశారు. రాసిలో తక్కువయినా వాసిలో మిన్న. ఇవి వీరి ఆలోచనలని, యోగశక్తిని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మసౌందర్యాన్ని తమలో నిక్షిప్తం చేసుకున్నాయి. వీరి రచనలలో ‘తాతిచే అభంగ్’, ‘చాంగ్‌దేవ్‌కు సలహా’ ప్రజలలోకి చొచ్చుకొని వెళ్ళాయి. వీరి అభంగ్‌లు ‘క్లాసిక్’లు.

‘చాంగ్‌దేవ్’ ముక్తాబాయిని గురువుగా స్వీకరించారు. ‘వేదాల ఆధ్యాత్మికత – తత్వసార్’ని వ్రాయమని ముక్తాబాయి చాంగ్‌దేవ్‌కి ప్రేరణ కలిగించారు. ఈ విధంగా తన శిష్యులకే గాక, వేలాదిమంది భక్తులను ఉత్తేజ పరిచారు. ముక్తాబాయి ‘చాంగ్‌దేవ్ మహరాజ్ యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శి’ అని నమ్ముతారు. మరాఠీ మహిళా కవులలో ఒక రోల్ మోడల్‌గా వీరు ఉండడం చాలా ముదావహం.

20 ఏళ్ళ వయసులోనే 1299వ సంవత్సరంలో వీరు మరణించారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రజలు ఈనాటికీ వీరిని ‘గ్రామదేవత’గా పూజిస్తారు.

వీరి జ్ఞాపకార్థం ది.30.5.2003వ తేదీన 5.00 రూపాయల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

ఈ స్టాంపు మీద ఆమె నిలువెత్తు చిత్రం పసుపురంగు ముద్రలో ఇమిడింది. ఎరుపు రంగు చీరలో అభయముద్రలో దర్శనమిస్తుంది. తలమీద గ్రామదేవతల మాదిరిగానే కిరీటంతో వెలుగుతూ మెరుస్తున్న ముక్తాబాయి చిత్రం శోభాయమానంగా దర్శనమిస్తుంది.

అభంగ్‌లు వెలయించిన తొలి మహిళ ముక్తాబాయికి ఈ నివాళి.

***                                                         

Image Courtesy: Internet

Exit mobile version