Site icon Sanchika

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన రెండవ విదేశీ మహిళ – నెల్లీ సేన్‌గుప్తా

[dropcap]జ[/dropcap]నవరి 12వ తేదీ నెల్లీ సేన్‌గుప్తా జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

భారత స్వాతంత్ర్య పోరాటంలో స్వదేశీయులతో పాటు విదేశీయులు పాల్గొన్నారు. స్త్రీ, పురుష భేదం లేకుండా తమ సర్వం త్యాగం చేసిన త్యాగధనులు ఉన్నారు. వీరందరి సేవ, త్యాగాలతో భరతమాత పునీత అయింది.

అటువంటి గొప్ప స్వాతంత్ర పోరాట యోధులలో ఇంగ్లండ్‌లో పుట్టి, మన దేశాన్ని మెట్టిన మహిళామూర్తి శ్రీమతి నెల్లీ సేన్‌గుప్తా. మెట్టిన దేశం కోసం వివిధ ఉద్యమాలలో పాల్గొని, పోరాటాలు చేసి, జైలు పాలయ్యారు ఆమె. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆమెను వరించింది. ఆమే ‘నీ ఎడిత్ ఎలెన్ గ్రే’గా ఇంగ్లండ్‌లో పుట్టి పెళ్ళి తరువాత శ్రీమతి ‘నెల్లీ సేన్‌గుప్తా’గా పేరు గాంచిన గొప్ప మహిళ.

ఈమె 1886 జనవరి 12వ తేదీన ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జిలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు ఎడిత్ హెన్రిట్టా గ్రే, ఫ్రెడరిక్ గ్రేలు. కేంబ్రిడ్జిలోనే విద్యాభ్యాసం చేశారు. 1904లో సీనియర్ కేంబ్రిడ్జిలో ఉత్తీర్ణులయ్యారు.

ఆనాటి బెంగాల్ ఫ్రావిన్స్ (నేటి బంగ్లాదేశ్ లోని) చిట్టగాంగ్‌లో గొప్ప న్యాయవాది జాత్రా మోహన్‌దాస్ గుప్తా. ఆయన కుమారుడు జతీంద్ర మోహన్ సేన్ ఎడిత్ ఎలిన్ గ్రేతో కలిసి చదివారు.

డేనింగ్ లోని ఎలిన్ గ్రే ఇంట్లో నివాసం ఉండేవారు. వీరిద్దరు పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే ఈమె తల్లిదండ్రులు ఒక భారతీయునితో ప్రేమను అంగీకరించలేదు. అయినప్పటికీ 1909లో వీరిద్దరు వివాహం చేసుకుని భారతదేశంలోని కలకత్తాని చేరుకున్నారు. అప్పటి నుండి ఈమె నెల్లీ జతీంద్ర మోహన్ సేన్‌గుప్తాగా మారారు.

ఈమె మామగారు జాత్రా మోహన్, జతీంద్రలు సామాజిక కార్యకర్తలు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభిస్తే గాని ప్రజలకు సుఖశాంతులు లభించవని అర్థం చేసుకున్నారు. కార్మికులు, శ్రామికులు, సామాన్య ప్రజల బాధలని ఈ కుటుంబం వారు అర్థం చేసుకున్నారు. అందరితో కలసి మెలసి ఉండేవారు.

1910లో భర్తతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా శాఖలో పని చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొన్నారు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో పని చేస్తున్న భర్తకు ప్రేరణగా నిలిచారు అన్ని విధాల అండదండగా నిలిచారు. సంక్షేమ కార్యక్రమాలకు చేయూతను అందించారు.

చాంద్‌పూర్‌లోని తేయాకు తోటలలో పని చేసే కార్మికులను బ్రిటిష్ పోలీసులు హింసించారు. ఈ సమయంలో వారికి జతీంద్ర సాయం చేశారు. నెల్లీ ఈ విషయంలో భర్తకు అండగా ఉండి కార్మికుల కోసం కృషి చేశారు. ఈ కార్మికులకు అనుకూలంగా బెంగాల్, అస్సాం ప్రాంతాలకు చెందిన రైల్వే ఉద్యోగులు, ఆ ప్రాంతాల స్టీమర్‌లలో పని చేసే కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెకు ఈ దంపతులు మద్దతు పలికారు.

ఇటువంటి అనేక సంఘటనలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్మికుల తరపున పోరాటం చేశారు. న్యాయ సహాయం చేశారు ఈ దంపతులు.

గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి మన దేశానికి వచ్చిన తరువాత స్వాతంత్ర్యోద్యమాన్ని తన అహింసాయుత పద్ధతిలో కొనసాగించారు. ఈ గాంధీ మార్గాన్ని వేలాది మంది నాయకులు అనుసరించారు. లక్షలాది మంది కార్యకర్తలు ఉద్యమాలలో పాల్గొన్నారు.

1921లో తొలి సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రకటించారు. ఈ ఉద్యమంలో భాగంగా కలకత్తా నగరంలో నెల్లీ దంపతులు పాల్గొన్నారు. జిల్లా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈమె విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమంలో కూడా పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ఖద్దరు అమ్మేవారు.

1930లో మళ్ళీ సహాయనిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు బాపూజీ, గాంధీజీ పిలుపును అందుకుని ఢిల్లీ, అమృతసర్‌లలో ఉద్యమానికి మద్దతుగా సభలలో పాల్గొన్నారు. ఈ సభలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉపన్యసించినందుకుగాను జతీంద్రను అరెస్టు చేసి రాంచీ జైలులో బంధించారు. 1933లో ఈ జైలులోనే మరణించారాయన.

1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో కూడా ఈమె పాల్గొన్నారు. శ్రీమతి సరోజినీ నాయుడు, శ్రీమతి అనీ బీసెంట్‌లను స్పూర్తిగా తీసుకున్నారు ఈమె.

1933లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీ మదన్ మోహన్ మాలవ్యా ఎన్నికయ్యారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులని అరెస్టు చేశారు. అప్పుడు కలకత్తా కాంగ్రెస్ సమావేశం కోసం శ్రీమతి నెల్లీ సేన్‌గుప్తా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికయిన రెండవ విదేశీ మహిళ మరియు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలయిన మూడవ మహిళగా చరిత్ర సృష్టించారు.

1933, 1936 సంవత్సరాలలో కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ ఆల్డర్ మ్యాన్‌గా ఎన్నికయ్యారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందు ప్రావిన్సెస్‌లో ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. 1940, 1946 సంవత్సరాలలో బెంగాల్ శాసనసభలో సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

1947 భారతదేశ స్వాతంత్ర్య ప్రకటన ఈమెకు సంతోషాన్ని కలిగించింది. అయితే దేశ విభజన ఈమెను మానసికంగా కృంగదీసింది. ఈమె అత్తవారిల్లున్న చిట్టగాంగ్ తూర్పు పాకిస్థానుకు వెళ్ళింది.

ఆనాటి భారత ప్రధాని స్వర్గీయ జనహర్ లాల్ నెహ్రూ పాకిస్థాన్ లోని హిందూ మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేయమని ఈమెను కోరారు. ఈమె 1954లో తూర్పు పాకిస్థాన్ అసెంబ్లీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మైనారిటీ బోర్డు సభ్యులుగా పని చేశారు. అక్కడి హిందువుల సంక్షేమం కోసం కృషి చేశారు. క్రియాశీలక కార్యకర్తగా అనేక బాధ్యతలను నిర్వహించారు.

ఇవన్నీ గమనించిన పాకిస్థాన్‌లో ప్రభుత్వం ఈమెను ఇబ్బందులకు గురి చేసింది. పాకిస్థాన్ అస్థిరత ఏర్పడింది. అల్లకల్లోల పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఈమెను గృహనిర్బంధంలో ఉంచింది.

పశ్చిమ పాకిస్థాన్ ప్రభుత్వం తూర్పు పాకిస్థాన్ ప్రజలను హింసల పాల్జేసింది. వేలాదిమంది ప్రజలు కాందిశీకులుగా భారత్ భూభాగంలోకి వచ్చారు. భారత ప్రధాని పాకిస్థాన్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో భారత సైన్యం గెలిచింది. తత్ఫలితంగా తూర్పు పాకిస్థాన్ ‘బంగ్లాదేశ్’ అనే నూతన దేశంగా ఆవిర్భవించింది. స్వర్గీయ షేక్ ముజీబూర్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.

ముజిబుర్ రెహమాన్ తూర్పు పాకిస్థాన్‌లో నివాసముండి తమ ప్రాంత ప్రజల కోసం కృషి చేసిన శ్రీమతి నెల్లీ సేన్‌గుప్తా బాగోగులను గురించి ఆరా తీశారు. ఆమెకు అన్ని విధాలుగా తమ సహాయసహకారాలను అందించారు.

1933లోనే భర్త చనిపోయినప్పటికే స్వదేశానికి వెళ్ళకుండా భారత దేశంలోనే నివాసముండడం, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడాన్ని గమనిస్తే ఈమెకి భర్త పట్ల ప్రేమ, మనదేశం పట్ల గల గౌరవం అర్థమవుతాయి.

1970లో ఆమెకు నడుము విరిగింది. భారత స్వాతంత్ర్యోద్యమంలో అందించిన సేవలకు, త్యాగానికి ప్రతిగా ఆమె బాధ్యతలను స్వీకరించవలసిన అవసరాన్ని గురించి ఆమెకు వైద్యసౌకర్యాలను కల్పించాలని పూనుకున్నారు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి. ఈమె తూర్పు పాకిస్థాన్‌లోని హిందూ మైనారిటీల సంక్షేమం కోసం చేసిన కృషిని గుర్తుంచుకున్నారు ఇందిర. ఆమెను మన దేశానికి పిలిపించి శస్త్రచికిత్సని చేయించారు. భారత ప్రభుత్వం వారు మెరుగయిన వైద్యాన్ని అందించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. 1973 అక్టోబర్ 23వ తేదీన కలకత్తాలో మరణించారు. భారత ప్రభుత్వం అధికార లాంఛనాలతో గౌరవించింది.

1973లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో ఈమెని గౌరవించారు.

ఈమె జ్ఞాపకార్థం 1985 జూలై 22వ తేదీన నెల్లీ సేన్, జతీంద్ర మోహన్ సేన్‌గుప్తా దంపతుల చిత్రాలతో ఒక స్టాంపును విడుదల చేసింది తపాలాశాఖ. దీని విలువ యాభై పైసలు. నెల్లీ బెంగాలీ మహిళ వస్త్రధారణలో కనువిందు చేస్తారు.

జనవరి 12 వ తేదీ ఈమె జయంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

Exit mobile version